ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం-పరిణామాలు తెలంగాణ ఉద్యమ చరిత్ర
ఎస్సార్సీ సిఫారసులపై అసెంబ్లీలో చర్చ
# ఫజల్ అలీ నివేదికపై హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల 1955, నవంబర్ 25న అసెంబ్లీలో చర్చ పెడుతూ ‘విశాలాంధ్ర ఏర్పడితే ఆంధ్రులు హైదరాబాద్కు పూర్వపు విజేతల వలే రాబోవటం లేదని, ప్రజల ప్రయోజనాలకు భంగం కలగదనీ’ ఆయన అన్నారు.
# ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతున్నా భారత ప్రభుత్వం బలవంతంగా విశాలాంధ్ర ఏర్పరిస్తే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని తెలంగాణ నుంచి ఎన్నికైన 14 మంది ఎమ్మెల్యేలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
# శాసనసభలో తీర్మానంపై చెన్నారెడ్డి దాదాపు 45 నిమిషాలు ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని వివరిస్తూ ప్రసంగించారు. తెలంగాణ, ఆంధ్ర విలీణం వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు కలుగవని చెన్నారెడ్డి అన్నారు. రక్షణల విషయం ప్రస్తావిస్తూ వాటిలో తనకు నమ్మకం లేదని, వాటిని అమలు జరపడం సాధ్యం కాదన్నారు.
# రాయలసీమ, సర్కార్ల మధ్య జరిగిన శ్రీబాగ్ ఒడంబడికను ప్రస్తావించి ఆంధ్రకు కర్నూలు రాజధాని కావడం ఒక్క ఓటు మెజారిటీతో జరిగిందన్నారు. లక్సెట్టిపేట శాసన సభ్యుడు కే రాజమల్లు మాట్లాడుతూ ‘సూరి భగవంతం ఉస్మానియా విశ్వవిద్యాలయ వీసీ అయ్యాక 10-15 మంది ఆంధ్రా లెక్చరర్లను నియమించారన్నారు.
# ఎనిమిది రోజుల చర్చ తర్వాత ఓటింగ్ లేకుండానే అసెంబ్లీ వాయిదాపడింది. చర్చలో పాల్గొన్న 147 మంది సభ్యుల్లో 103 మంది విశాలాంధ్రను, 29 మంది తెలంగాణను సమర్థించారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల్లో విశాలాంధ్రకు అనుకూలమంగా 59 మంది, ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా 25 మంది మాట్లాడారు. పీడీఎఫ్ నుంచి తెలంగాణలో ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ప్రజాభిప్రాయానికి భిన్నంగా వారి వారి పార్టీల అభిప్రాయాలను వివరించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో రామానంద తీర్థ, బూర్గుల అనుయాయులు విశాలాంధ్రను సమర్థించారు.
# ‘ఆంధ్ర-తెలంగాణ బలవంతపు విలీనీకరణ ఆ రెండింటి మధ్య నిరంతర పోరాటానికి తప్పక దారితీయగలదని జేవీ నర్సింగరావు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
విశాలాంధ్ర మహాసభ
# జనాభా ప్రాతిపదికపై ఆస్తులు, ఉద్యోగులను, అభివృద్ధి ప్రణాళికలను కేటాయింపులు చేసుకోవడం ద్వారా ఆంధ్రులు దోపిడీ చేయగలరన్న తెలంగాణవారి అభిప్రాయాన్ని తొలగించవచ్చునని సూచించారు.
ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ
# విశాలాంధ్రలో చేరడంవల్ల ఏవో కష్టనష్టాలు సంభవిస్తాయని అనుమానాలు, భయాలు పెట్టుకోవద్దు. తెలంగాణ ప్రజల అభివృద్ధి విషయంలో ఏ విధమైన అశ్రద్ధ ఉండదు.
# బెజవాడ గోపాల రెడ్డి: ఒక ప్రాంతం ప్రజలపై రాజకీయాధికారం చెలాయిద్దామని గాని, సుందరమైన హైదరాబాద్ నగరాన్ని ఆక్రమించుకుందామన్న ఆశవల్ల గానీ ఈ సంకల్పం కలుగలేదు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమనేది ప్రత్యేక బాధ్యతగా భావిస్తామని ఆ ప్రాంతంలోని ప్రజలకు ఈ సభ (ఆంధ్ర శాసనసభ) హామీ ఇవ్వగోరుతున్నాను.
# జనాభా ప్రాతిపదికపై ఉద్యోగులు, విద్యాబోధన, నీటిపారుదల సౌకర్యాలు, అభివృద్ధి మొదలైన వాటిలో ఆ ప్రాంతం ప్రజలకు అధిక ప్రాముఖ్యం కేటాయింపులు ఇవ్వడమవుతుందని హామీ ఇస్తున్నాం. నవంబర్ 25న ఆంధ్ర అసెంబీలో తీర్మానం ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి సభలో అన్నారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా అమోదించింది. ఆంధ్ర అసెంబ్లీలో 1956, ఫిబ్రవరి 1న రెండోసారి విశాలాంధ్ర తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రవేశపెడుతూ విశాలాంధ్ర తక్షణం కోరుతున్నామంటే భూభాగంపై దురాశ కాదు, ఆంధ్రప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణ వారి మిగులు ధనాన్ని వినియోగించుకోవాలని కాదు, తెలంగాణవారు ఈవిధంగా భయపడటానికి ఆధారాలే లేవు.
# వారి హక్కులకు భంగం రానివ్వమని మన ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామీ కూడా ఇచ్చారు. వారు వెనుకబడి ఉండటం ఆంధ్ర ప్రజలకు సంతోషకరమా? విశాలాంధ్ర ఏర్పాటైతే, గోదావరి నదీ జలాలు పూర్తి వినియోగవకాశాలు కలుగుతాయి. అనేక నదీలోయ పథకాలు అమలుపర్చవచ్చు. 1956, ఫిబ్రవరి 20న రెండు ప్రాంతాల నేతలు ఢిల్లీలో ప్రధాని కేంద్ర హోంమంత్రి, థేబర్ తదితర పెద్దల సమక్షంలో కుదుర్చుకున్న పెద్దమనుషుల ఒప్పందంలో ఈ హామీలను, రక్షణలను పొందుపర్చారు.
పెద్దమనుషుల ఒప్పందం
# న్యూఢిల్లీలోని హైదరాబాద్ అతిథిగృహంలో 1956, ఫిబ్రవరి 20న జరిగిన సమావేశంలో రెండు ప్రాంతాల నేతలు సమావేశమయ్యారు. వీరు చర్చించుకున్నదే పెద్దమనుషుల ఒప్పందం. ఆంధ్ర నుంచి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న, తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి, జేవీ నర్సింగరావు, మరి చెన్నారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ఏకీకరణవల్ల ఉత్పన్నమైన దిగువ అంశాలు చర్చకు వచ్చి కింది నిర్ణయాలు తీసుకున్నారు.
1) రాష్ట్రానికి చెందిన కేంద్రీయ, సాధారణ పరిపాలనల వ్యయాన్ని ఉభయ ప్రాంతాలు నిష్పత్తి ప్రకారం భరించాలి. తెలంగాణ నుంచి లభించే ఆదాయంలోని మిగులును తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలి. ఈ ఏర్పాట్లు ఐదేండ్ల తర్వాత సమీక్షకు వస్తుంది. శాసనసభలోని తెలంగాణ సభ్యులు కోరినట్లయితే ఈ ఏర్పాటును మరో ఐదేండ్లు పొడిగించవచ్చు.
2) శాసన సభలోని తెలంగాణ సభ్యులు నిర్ణయించిన మేరకు తెలంగాణలో మద్య నిషేధాన్ని అమలు పరచాలి.
3) తెలంగాణలో ఉన్న విద్యా సౌకర్యాలు ఇక్కడి విద్యార్థులకు లాభపడేలా ఇంకా అభివృద్ధి పరచాలి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న సాంకేతిక విద్యా సంస్థలతో సహా అన్ని కాలేజీల్లోనూ ప్రవేశాలు తెలంగాణ విద్యార్థులకే పరిమితం చేయాలి. లేదా రాష్ట్రం మొత్తంమీద ఉండే ప్రదేశాల్లో మూడోవంతు ప్రవేశాలు తెలంగాణ విద్యార్థులకు వారికి ప్రయోజనకరమైన కోర్సులకుగాను అందించాలి.
4) ఏకీకరణవల్ల తప్పనిసరి అయినప్పుడు ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్ ఉభయ ప్రాంతాల నుంచి నిష్పత్తి ప్రకారం జరగాలి.
5) ఇకముందు ఉద్యోగులను చేర్చుకోవడం ఉభయ ప్రాంతాల జనాభా ప్రాతిపదికనై ఉంటుంది.
6) తెలంగాణ ప్రాంతంలోని ప్రస్తుత పరిపాలన, న్యాయ వ్యవస్థల్లో ఉర్దూభాషకు గల స్థానాన్ని ఐదేండ్ల కాలం కొనసాగించాలి. అనంతరం ప్రాంతీయ మండలి పరిస్థితిని సమీక్షించి సవరించవచ్చు. ఉద్యోగాల్లో చేర్చుకోవడం విషయంలో మాత్రం తెలుగు భాష తెలిసి ఉండాలని నిబంధన విధించరాదు. కానీ ఉద్యోగులు నియామకం తర్వాత రెండేండ్లలోగా నిర్ణీతమైన తెలుగు పరీక్షలో వారు ఉత్తీర్ణులు కావాలి.
7) తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను నిర్ణీత ప్రకారమే పొందడానికి నివాస నిబంధల్ని ఉంచాలి.
ఉదాహరణ: తెలంగాణ ప్రాంతంలో 12 ఏండ్ల నివాసం.
8) తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూముల అమ్మకం ప్రాంతీయ మండలి ఆధీనంలో ఉండాలి.
9) తెలంగాణ ప్రాంతపు అవసరాలు ఆవశ్యకతల దృష్ట్యా సర్వతోముఖాభివృద్ధి సాధించుకునేందుకు ఒక ప్రాంతీయ మండలి ఏర్పాటు కావాలి.
10) ప్రాంతీయ మండలిలో దిగువ పేర్కొన్న ప్రకారం 20 మంది సభ్యులుంటారు. తెలంగాణ తొమ్మిది జిల్లాలకు ప్రాతినిథ్యం వహించే 9 మది తెలంగాణ శాసన సభ్యులు, తెలంగాణ జిల్లాల నుంచి విడివిడిగా శాసన సభ్యులు ఎన్నుకోవాలి. శాసనసభ నుంచి గాని పార్లమెంట్ నుంచి గాని ఆరుగురు సభ్యులు శాసనసభలోని తెలంగాణ ప్రతినిధులు వీరిని ఎన్నుకుంటారు.
n తెలంగాణ ప్రాంత మంత్రులందరూ ప్రాంతీయ మండలి సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని ఎవరు తెలంగాణవారైతే వారు ప్రాంతీయ మండలి అధ్యక్షులుగా ఉంటారు. ఇతర క్యాబినెట్ మంత్రుల్ని కూడా సమావేశాలకు ఆహ్వానించవచ్చు.
11) ప్రాంతీయ మండలి చట్టబద్ధమైన సంస్థగా ఉంటుంది. పైన పేర్కొన్న వివిధాంశాల విషయాలు పరిశీలించి నిర్ణయించే అధికారం దానికి ఉంటుంది.
చివరి క్షణాల్లో బూర్గుల తెలంగాణం
# 1956, ఫిబ్రవరిలో (పెద్దమనుషుల ఒప్పందానికి కొద్దిరోజుల ముందు) బూర్గుల కాంగ్రెస్ అధ్యక్షునికి రాసిన లేఖలో ‘భార్గవ, తాను తెలంగాణలో పర్యటించినప్పుడు తెలంగాణ కోసం ఆందోళన నగరాల్లోనే కాక పల్లెల్లో కూడా తీవ్రంగా ఉన్నదని పేర్కొన్నారు. ‘మెజారిటీ ప్రజలు తెలంగాణకు మొగ్గుచూపుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఎవరికి ఎటువంటి నష్టాన్ని కలిగించదు’ అన్నారు.
# విశాలాంధ్ర వాదులు, భావోద్వేగవాదులు కొంత బాధపడుతుండవచ్చు. కానీ దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు రావు. ఇందుకు భిన్నంగా తప్పనిసరిగా తెలంగాణను ఆంధ్రలో కలిపితే తెలంగాణకు కడుపుమంటగాను, ఆంధ్రులకు అప్రయోజనంగానూ ఉంటుందని బూర్గుల లేఖలో అభిప్రాయపడినారు.
# తెలంగాణ నాయకులు రక్షణలతో సంతృప్తి చెందేటట్లు, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వదులుకునేటట్లు హోంమంత్రి గోవింద్ వల్లభ్ పంత్, కాంగ్రెస్ అధ్యక్షుడు థేబర్ ద్వారా ఆంధ్ర నేతలు చేస్తున్న ఒత్తిడి ఫలించింది. తెలంగాణ నేతలతో లాబీయింగ్ నెరిపిన బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు మొదలైనవారు విశాలంధ్ర మహాసభ వంటి సంస్థలు తెలంగాణకు ఇస్తాయన్న రక్షణలు ఇలా ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు