సమర్థ పాలకులు-గిరి దుర్గాల అధిపతులు
కాకతీయ సామ్రాజ్య పతనానంతరం నేటి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో వెలసిన రాజ్యమే రేచర్ల వెలమ రాజుల రాజ్యం. కాపయనాయుని మరణానంతరం తెలంగాణలోని ముసునూరు రాజ్యాన్ని ఆక్రమించి మొత్తం తెలంగాణాకు పరిపాలనాధిపతులయ్యారు. సుమారు 150 సంవత్సరాలు రాచకొండ, దేవరకొండలను రాజధానిగా చేసుకొని సుపరిపాలన చేస్త్తూ ఆంధ్రదేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. వీరికాలంలో నిరంతరం యుద్ధాలు జరిగినప్పటికీ వీరి సమర్థవంతమైన పరిపాలన ఫలితంగా రాజ్యం ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెంది, సాంస్కృతిక రంగంలో ముందంజ వేశారు.
రాచకొండ – దేవరకొండ వెలమలు (క్రీ.శ. 1324-1375)
– రేచర్ల వెలమ రాజుల చరిత్ర తెలుసుకోవడానికి అనేక ఆధారాలున్నాయి. వీరి పరిపాలన కాలంలో వేయించిన రాచకొండ, దేవరకొండ, భువనగిరి, ఐనవోలు, గార్ల, దేవులమ్మనాగారం బెల్లంకొండ, ఉమామహేశ్వరం, ఓరుగల్లు, సింహాచలం, శ్రీకూర్మం మొదలైన ప్రదేశాల్లోని శాసనాలు, వారి కాలంనాటి సాహిత్యం-సంగీత రత్నాకరం, రసార్ణవ సుధాకరం, మదన విలాస బాణం, భోగిని దండకం, హరిశ్చంద్రో పాఖ్యానం, సింహాసన ద్వాత్రింశిక, వెలుగోటి వారి వంశావళి మొదలైన అనేక సాహిత్య ఆధారాలున్నాయి.
రాజకీయ చరిత్ర
రేచర్ల వెలమ రాజులు మొదటి కాకతీయులకు సామంతులుగా పనిచేశారు. ఆనాటి రైతు బృందాల్లో ప్రబలమైన వెలమ కులానికి చెందిన బేతాళనాయుడు అనే వ్యక్తి రేచర్ల వంశ స్థాపకుడు. ఇతని జన్మస్థలం నేటి నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం ప్రాంతంలోని ఆమనగల్లు
– ఆకాలంలో రేచర్ల వెలమలు కాకతీయ సామంతులుగా ఆమనగల్లు పిల్లలమర్రిని పాలించేవారు. కాకతీయుల కాలంలో పాలనా వ్యవహారాల్లో ప్రముఖ పాత్రను రేచర్ల వెలమ రాజులు పోషించారు. బేతాళనాయుడుకి దామానాయుడు, ప్రసాదిత్య నాయుడు, రుద్రనాయుడు అనే ముగ్గురు కుమారులు. వీరంతా కాకతీయుల కాలంలో సేనాధిపతులుగా పనిచేశారు. రేచర్ల వెలమల చరిత్ర వీరితోనే ప్రారంభమైందని చెప్పవచ్చును.
– ఎర దాచమనాయుని కుమారుడైన మొదటి సింగమనాయుడు రేచర్ల వెలమల రాజ్య స్థాపకుడు. ఇతడు తన తండ్రితోపాటు కంచి దండయాత్రలో, కాకతీయ ప్రతాపరుద్రుని ఆజ్ఞపై 1320 కంపిలి యుద్ధంలో, 1323లో కాకతీయులకు జూనాఖాన్తో జరిగిన చివరి యుద్ధంలో పాల్గొన్నాడు. ఈ యుద్ధంలో కొంతమంది కాకతీయ సేనానులు మరణిం చగా సింగమనాయుడు బతికి బయట పడ్డాడు. తర్వాత ముసునూరు ప్రోలయ నాయకుడు, కాపయ నాయకునితో కలిసి విమోచనోద్యమంలో పాల్గొన్నాడు. ఇతను స్థాపించుకున్న రాజ్యానికి రేచర్ల వెలమ రాజ్యమని పేరు. బహమనీలతో కాపయ నాయకుడు పోరాడే సమయంలో మొదటి సింగమ నాయుడు విజృభించాడు. కృష్ణా నదీ తీరంలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలను జయించాడు. 1361లో అతడు మరణించే నాటికి కందూరు చోళులు పాలించిన ప్రాంత మంతా రేచర్ల వెలమరాజ్య ఆధీనంలోకి వచ్చింది.
-మొదటి అనపోతానాయుడు, మొదటి మదానాయుడు వీరింద్దరు సింగమనాయుడి కుమారులు. అనపోతనాయుడు తన తండ్రి మరణానికి కారణమైన సోమ వంశస్థులను, వారికి తోడుగా వచ్చిన రెడ్డి రాజులను హతమార్చాడు. ఇతని కాలంలోనే వెలమలకు, రెండ్లకు సంఘర్షణ మొదలైంది. 1367-68 మధ్య కాలంలో భీమ వరం దగ్గర జరిగిన యుద్ధంలో కాపయ నాయున్ని హతమార్చి ఓరుగల్లును స్వాధీనం చేసుకున్నాడు. ఈ విజయాలతో రేచర్ల వెలమల రాజ్యం తెలంగాణలో ఉత్తరాన గోదావరి నుంచి దక్షిణాన శ్రీశైలం వరకు విస్తరించింది. బహమనీ సుల్తానులతో మైత్రి కొనసాగించి రాజ్యవిస్తరణను కొనసాగించారు. పరిపాలనా సౌలభ్యంకోసం రాజ్యం ఆగ్నేయ సరిహద్దు రక్షణ దృష్ట్యా దేవరకొండ రాజ్యాన్ని స్థాపించి తన సోదరుడైన మొదటి మాదానాయుడ్ని దేవరకొండ పాలకునిగా నియమించాడు. ఇలా వెలమ రాజ్యం రాచకొండ, దేవరకొండ రాజ్యాలుగా విభజించబడ్డాయి.
-అనపోతనాయుడి మరణానంతరం అతని పెద్ద కుమారుడు రెండవ సింగమనాయుడు రాచకొండ సింహాసనం అధిష్ఠించాడు. ఇతనికి సర్వజ్ఞ సింగమ భూపాలుడు, కుమార సింగమ నాయుడు అనే పేర్లు ఉన్నాయి. ఇతని కాలంలో విజయనగర రాజులతో తీవ్రస్థాయిలో యుద్ధాలు జరిగాయి. వెలమలకు సాయంగా బహమనీ సుల్తాన్లు విజయనగర సామ్రాజ్యంలోని కొత్త కొండను ముట్టడించి సాళువరాయ దేవుడిని వధించడంతో వెలమలు విజయం సాధించారు. కుమార సింగమ నాయుడు దేవరకొండ పాలకుడైన పెదవేదగిరితోకలిసి కళింగపై దండెత్తి రెడ్డిరాజుల ఆధీనంలో ఉన్న గోదావరి ప్రాంతాన్ని ఆక్రమించినట్లు సింహాచల శాసనం తెలుపుతుంది. పానగల్లు దుర్గం కొంత కాలం బుక్కరాయల ఆధీనంలో ఉన్నట్లు 1397లో వేసిన అక్కడి శాసనం వల్ల తెలుస్తుంది.
-కుమార సింగమ భూపాలుడి మరణం తర్వాత అతని కుమారుడు రెండ అనపోతా నాయుడు రాచకొండ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని కాలంలో రెడ్డిరాజ్యం కొండవీడు, రాజమహేంద్రవరం రాజ్యాలుగా విడిపోయింది. బహమనీలతో ఘర్షణ మొదలైంది. పానగల్లు యుద్ధంలో వెలమలకు, రెడ్లకు మధ్య సంఘర్షణ తీవ్రతరమైంది. ఈ యుద్ధం తర్వాత కొండవీడు రాజ్యం ఆంధ్రదేశ రాజకీయ చరిత్ర నుంచి అదృశ్యమైపోయింది. రెండవ అనపోతా నాయుడు మరణానంతరం అతని తమ్ముడు మదానాయుడు తర్వాత అతని కుమారులు సర్వజ్ఞ సింగమ నాయుడు రాచకొండ పాలకులయ్యారు.
– ఈయన కాలంలో బహమనీలు దాడిచేసి ఆక్రమించిన రాజ్యాన్ని మళ్లీ విజయనగర రాజుల సహాయంతో వశపరచుకున్నారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో 1475 నాటికి తెలంగాణ మొత్తం బహమనీల వశం అయింది. దీంతో రేచర్ల వెలమ రాజ్యం అంతరించింది.
ప్రాక్టీస్ బిట్స్
1. గొప్ప విద్వాంసుడు, కవిపోషకుడైన సర్వజ్ఞ సింగమ నాయుడు కాలంలో తెలంగాణలో అనేక మంది కవులున్నారు. వారిలో ముఖ్యులు?
1) బమ్మెర పోతన 2) గౌరన,
3) కొరవి గోపరాజు 4) బైరవ కవి
ఎ) 1, 3, 4 బి) 1, 2,
సి) 1, 2, 3, 4 డి) పై ఎవరూకాదు
2. వెలమ నాయకుల పరిపాలనా విధానం కాకతీయుల పరిపాలనా విధానాన్ని పోలి ఉంది. వైధిక ధర్మరక్షణ, ప్రజాశ్రేయస్సే లక్ష్యాలుగా పాలించిన వీరు ఏ గ్రంథంలో వివరించిన పద్ధతుల ప్రకారం రాజ్య పరిపాలన కొనసాగించారు?
ఎ) వ్రతఖండ కల్పతరువు
బి) వెలుగోటివారి వంశావళి
సి) రసార్ణవ సుధాకరం
డి) పైవేవీకాదు
3. రేచర్ల వెలమ రాజ్యంలో రాజులకు ఎవరు సహాయ సహకారాలు అందించేవారు?
ఎ) ప్రధాన మంత్రులు బి) పురోహితులు
సి) సేనాధిపతులు డి) పై వారందరూ
4. ప్రభువులు తమతోపాటు ఎవరిని యుద్ధాలకు తీసుకెళ్ళేవారు?
ఎ) దేవారికులు బి) పురోహితులు
సి) మంత్రులు డి) పై అందరూ
5. రాజ్య పరిపాలనలో యువరాజుకు ప్రత్యేక స్థానం ఉండేది. రాజుకు సంతానం లేకపోయినా, కుమారులు చిన్నవారైనప్పుడు ఎవరు రాజ్యపాలన చేసేవారు?
ఎ) సోదరులు బి) సమీప బంధువులు
సి) దూరపు బంధువులు
డి) ఎ, బి
6. పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని వేటిగా విభజించారు?
ఎ) సీమలు బి) మండలాలు
సి) గ్రామాలు డి) పైవన్నీ
7. ప్రతి సీమకు అధిపతిగా రాజవంశస్థులను మాత్రమే నియమించేవారు. వారితోపాటు తప్పని సరిగా కింది వాటిలో ఏవి ఉండేవి?
1) పట్టణం 2) దుర్గం
3) నాయంకరాలు 4) మండలాలు
ఎ) 1, 2, బి) 1, 2, 3
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 4
8. సీమలను మండలాలుగా విభజించారు. తమ తమ ప్రాంతాల్లో పన్ను వసూలు చేయడం సైనిక రక్షణ ఏర్పాటు, ప్రజాఉపయోగ కార్యక్రమాలు చేపట్టడం మొదలైనవి ఎవరి విధులుగా ఉండేవి?
ఎ) దుర్గాధిపతులు బి) సామంతరాజులు
సి) మండలాధీశులు డి) పైవారందరూ
9. వెలమ నాయకులు తమ రాజ్యంలో అనేక శత్రుదుర్భేద్య గిరి దుర్గాలను నిర్మించారు.
వాటిలో ముఖ్యమైనవి?
1) దేవరకొండ 2) అనంతగిరి
3) ఆమనగల్లు 4) ఉర్లుకొండ
5) ఉండ్రుకొండ
ఎ) 1, 2, 3 బి) 2, 4, 5
సి) 1, 3, 5 డి) 1, 2, 3, 4, 5
10. దుర్గాల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు, ఆయుధగారాలను నిర్మించేవారు. యుద్ధ సమయంలో ఆహార ధాన్యాలను నిల్వ ఉంచటం కోసం ప్రత్యేకంగా వేటిని నిర్మించారు?
ఎ) గారిగా బి) పాతరలు
సి) పెట్టెలు డి) పైవేవీకాదు
11. బ్రాహ్మణ అగ్రహారాలకు, దేవమాన్యాలకు పన్ను మినహాయింపు ఉండేది. వృత్తి పన్నులు, వ్యాపార సుంకాలు ఇతర ఆదాయాలుగా ఉండేవి. వీరి ప్రధాన ఆదాయమైన భూమి శిస్తును ఎంతశాతం వసూలు చేసేవారు?
ఎ) 1/3 బి) 1/6
సి) 1/4 డి) 1/8
12. ముస్లింల దండయాత్రల వల్ల ఈ కాలంలో ప్రవేశించిన సాంఘిక దురాచారాలేవి?
ఎ) సతీసహగమనం బి) బాల్యవివాహాలు
సి) ఎ, బి డి) పైవేవీకాదు
13. వెలమ రాజుల కాలంలో వ్యవసాయం రాజ్యంలోని ప్రజలకు ప్రధాన వృత్తిగా ఉండేది. అదే ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆదాయం. ఈ కాలంలో భూయాజమాన్యం 4 రకాలుగా ఉండేది? అవిఏవి?
1) రైతుల భూములు 2) గ్రామ భూమి
3) దేవాలయాలు, మఠాలు, ధర్మసంస్థల, వృత్తిమాన్యాలు, ఆగ్రహార భూములు
4) రాజులు- వారి సామంతుల భూములు
ఎ) 1, 2, 3, 4 బి) 3, 4
సి) 2, 3, 4 డి) 1, 2, 4
14. వెలమ రాజుల కాలంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి నీటిపారుదల సౌకర్యాలను అభివృద్ధి చేశారు. వీరి కాలంలో తవ్వించిన చెరువులు ఏవి?
ఎ) రాయ సమ్రుదం
బి) అనపోత సముద్రం
సి) నాగ సముద్రం డి) పైవన్నీ
15. రాజ్యంలో ఎన్ని రకాల వ్యవసాయ భూములు ఉండేవి? అవి ఏవి?
ఎ) 2- తరి, మెట్ట
బి) 3- మెట్ట, తరి, తోట
సి) 1- తోట డి) పైవేవీ కాదు
16. తీర్పులు చెప్పడానికి ధర్మాసనాలు ఉండేవి. దివ్య పరీక్షల ద్వారా నేరారోపణ చేసి. ఎలాంటి కఠిన పరీక్షలు విధించేవారు?
1) అంగవిచ్ఛేదనం
2) గానుగలో తల ఆడించడం
3) గుండెలపై పెద్ద బండలను ఎత్తడం
4) గడ్డిని శరీరానికి చుట్టి నిప్పు అంటించడం
5) ఎండలో నిలబెట్టి పొగ దండలు వేయడం
ఎ) 1, 2, 4 బి) 1, 2, 3, 4, 5
సి) 2, 3, 5 డి) 3, 4, 5
17. ముఖ్య పంట అయిన వరిలో నాడు ఏ రకాలు ఎక్కువగా పండించే వారు?
ఎ) కలిమ, శాలి బి) శిరాముఖి
సి) పతంగహోయన డి) పైవన్నీ
18. రేచర్ల వెలమ నాయకుల రాజ్యంలో ఆనాడు ఉన్న ప్రధాన పరిశ్రమలు ఏవి?
ఎ) వస్త్ర పరిశ్రమ బి) అద్దకపు పరిశ్రమ
సి) గాజు పరిశ్రమ డి) పైవన్నీ
19. విదేశీ వ్యాపారాలను బలిజలు, వైశ్యులు చేసేవారు సుగంధ ద్రవ్యాలు పట్టుబట్టల దిగుమతి చేసుకునే వారు. వీరి కాలంలో కృష్ణా తీరంలో ఉన్న ప్రధాన నౌక కేంద్రం ఏది?
ఎ) వాడపల్లి బి) మోటుపల్లి
సి) రాజ మహేంద్రవరం
డి) పైవేవీకాదు
20. రాజుల ఆస్థానంలో సంస్కృత భాషకు విశేష ఆదరణ లభించింది. మొదటి అనపోతా నాయుని ఆస్థానంలో నాగనాథుడు అనే సంస్కృత కవి ఉండేవాడు. ఇతడు సంస్కృతంలో రచించిన నాటకం ఏది?
ఎ) మదనవిలాస బాణం
బి) అనపోత నాటకీయం
సి) రసార్ణవ సుధాకరం డి) ఎ, బి
సమాధానాలు
1-సి 2-ఎ 3-డి 4-డి 5-డి 6-డి 7-సి 8-డి 9-డి 10-బి 11-బి 12-సి 13-ఎ 14-డి 15-బి 16-బి
17-డి 18-డి 19-ఎ 20-డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు