శాసనాలు.. నాటి పాలనకు తార్కాణాలు
శాతవాహనుల తదనంతరం 9వ శతాబ్దం ప్రారంభంలో రాష్ట్రకూటుల సేనానులుగా తమ రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన కాకతీయులు చిన్నాభిన్నమైన తెలుగు జాతిని ఏకంచేసి దాదాపు 3 శతాబ్దాలపాటు పాలించారు. తెలంగాణ చరిత్రలోనేగాక యావత్ భారత చరిత్రలోనే కాకతీయులు గణనీయమైన పాత్రను పోషించారు. ఏకచ్ఛత్రాధిపత్యంగా తెలంగాణను పాలించిన ఘనత కాకతీయులకు మాత్రమే దక్కుతుంది. పరమత సహనం పాటించి మతాతీత పాలనను అందించిన కాకతీయుల కాలంలో సాహిత్య, సంగీత, నృత్య శిల్పాది కళలు విలసిల్లి తెలంగాణ ఖ్యాతి నలుదిక్కులాప్రసరించింది.
- కాకతీయుల చరిత్ర తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు 1) శాసన ఆధారాలు, 2) సాహిత్య ఆధారాలు
- కాకతీయుల కాలంలో జారీ చేసిన శాసనాలు ఎక్కువ భాగం సంస్కృతంలోను, తక్కువ భాగం తెలుగులోను ఉన్నాయి.
మాగల్లు శాసనం
- కాకతీయులకు సంబంధించి అత్యంత ప్రాచీన ఆధారం
- క్రీ.శ. 956కు చెందినది
- జారీ చేసినది -దానార్ణవుడు
- తొలి కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులు
- రాష్ట్ర కూట 3వ కృష్ణుడి సేనాని అయిన కాకర్త్య గుండ్యన తూర్పు చాళుక్యరాజైన దానార్ణవుడికి సాయంగా వెళ్లి 2వ
అమ్మరాజును తొలగించి వేంగీని అక్రమించడానికి సాయపడ్డాడు. - దానార్ణవుడు తనకు సాయం చేసిన కాకర్త్య గుండ్యనను సత్కరించి అతని కోరిక మేరకు దొమ్మన శర్మ అనే బ్రాహ్మణుడికి
మాగల్లు గ్రామాన్ని దానం చేసి మాగల్లు శాసనాన్ని వేయించారు. - మొదటిసారిగా కాకతీయుల గురించి ప్రస్తావించిన శాసనం.
- ఈ శాసనం నలుగురు కాకతీయ వంశ సభ్యులను గురించి ప్రస్తావించింది. వారిలో చివరి వ్యక్తి కాకర్త్య గుండ్యన .
శనిగరం శాసనం
- సామంతులుగా కాకతీయుల చివరి శాసనం. క్రీ.శ.1149 కాలం నాటిది
- జారీ చేసినది రెండో ప్రోలరాజు .
- 2వ ప్రోలరాజు కుమారుడు రుద్రదేవుడు కాకతి సామ్రాజ్య నిజ వ్యవస్థాపకుడు
అనుమకొండ శాసనం
- ఈ శాసనాన్ని జారీచేసింది – రుద్రదేవుడు
- దీన్ని కీ.శ.1163లో రుద్రదేవుడు వేయించాడు.
- రుద్రదేవుడి విజయాలను, రుద్రదేవుడి సైనిక విజయాలను తెలుపుతుంది.
- ఈ శాసనం కాకతీయులు స్వతంత్రులైనట్లు తెలియజేస్తుంది.
బయ్యారం చెరువు శాసనం
- కాకతీయులకు సంబంధించి 2వ ముఖ్య ఆధారం.
- గణపతి దేవుడి చెల్లె మైలాంబ జారీ చేసినది.
- క్రీ.శ. 1250 కాలానికి చెందినది.
- కాకతీయుల వంశ వృక్షం గురించి తెలుపుతుంది.
- ఈ శాసనం పేర్కొన్న వంశ వృక్షంలో ఆద్యుడైన వెన్నభూపతి వంశస్థులే కాకతీయులయ్యారని పేర్కొన్నది.
- ఈ శాసనం కాకతీయులను శూద్ర వంశానికి చెందిన దుర్జయులుగా పేర్కొన్నది.
కాజీపేట శాసనం
- జారీ చేసినది మొదటి బేతరాజు
- కాకతీయుల తొలి చరిత్రను తెలుపుతుంది.
- ఈ శాసనం ప్రకారం కాకతీయ రాజుల్లో ప్రథముడు మొదటి బేతరాజు.
- ఈ శాసనం మొదటి బేతరాజు విజయాలను తెలుపుతుంది.
కాజీపేట దుర్గ శాసనం
- జారీచేసినది దుర్గరాజు
- మొదటి ప్రోలరాజు విజయాలను తెలుపుతుంది.
మోటుపల్లి అభయ శాసనం
- జారీచేసింది గణపతి దేవుడు.
- కాకతీయుల కాలం నాటి వర్తక వ్యాపారాల గురించి తెలుపుతుంది.
- ఈ శాసనం మోటుపల్లి వర్తక వ్యాపారాలను గురించి తెలుపుతుంది.
- రుద్రమదేవి పాలనా కాలంలో మార్కోపోలో మోటుపల్లిని దర్శించాడు.
జన్నిగదేవుని దుర్గ శాసనం
- ఈ శాసనాన్ని రుద్రమదేవి సేనాని కాయస్థ జన్నిగదేవుడు వేయించాడు.
- ఈ శాసనం రుద్రమదేవి పట్టాభిషేకాన్ని తెలియజేస్తుంది.
మల్కాపురం శాసనం
- జారీచేసింది – రుద్రమదేవి
- గోళకీ మఠానికి చెందిన శైవ గురువుల గురించి వివరాలను అందిస్తుంది.
- రాజగురువు విశ్వేశ్వర శంభు నిర్మించిన శుద్ధ శైవమఠాన్ని గురించిన వివరాలను పేర్కొన్నది
- మెటర్నిటీ/ ప్రసూతి వైద్యశాలలను ప్రస్తావించినది.
- దేవాలయ నిర్వహణను గురించి తెలుపుతుంది.
చందుపట్ల శాసనం
- జారీచేసినది రుద్రమదేవి బంటు పువ్వులముమ్మడి
- రాణి రుద్రమదేవి హత్య విషయాలను తెలియజేస్తుంది. రుద్రమదేవి అంబదేవుని తిరుగుబాటును అణచివేసే ప్రయత్నంలోప్రాణాలు కోల్పోయిందని, ఆమెకు పుణ్యం కలగాలని స్థానిక సోమనాథుని గుడికి పువ్వులముమ్మడి భూదానం చేసినట్లుతెలుపుతుంది.
త్రిపురాంతక శాసనం
- ఈ శాసనాన్ని అంబదేవుడు 1291లో జారీ చేశారు. అంబదేవుడి విజయాలను వివరిస్తుంది .
బీదర్ కోట శాసనం
- జారీ చేసినది రేచర్ల ప్రసాదిత్యుడు
- రుద్రమదేవి సింహాసనం అధిష్టించడానికి సహకరించిన ఆమె సేనానియే రేచర్ల ప్రసాదిత్యుడు. ఈ శాసనం రాణిరుద్రమదేవిని రాయగజకేసరి అని పేర్కొన్నది.
తేరాల శాసనం
- జారీ చేసినది ప్రతాపరుద్రుడు. ఈ శాసనం రాయగజకేసరి ముద్ర ఉన్న నాణేలను ప్రతాపరుద్రుడు ముద్రించినట్లుతెలుపుతుంది.
సలకలవీడు శాసనం
- ప్రతాపరుద్రుడు 1317లో జారీచేశాడు
- పాండ్యుల మీద తన విజయానికి గుర్తుగా శ్రీరంగనాథ దేవస్వామికి సలకలవీడు గ్రామాన్ని దానం చేసినట్లు తెలుపుతుంది.
- ఈ శాసనంలో అనేక రకాల పన్నులను గురించి పేర్కొన్నారు.
మట్టెవాడ శాసనం
- జారీ చేసినది గణపతిదేవుడు
- ఈ శాసనం భిన్న వాణిజ్య వస్తువులపై విధించే సుంకాలను పేర్కొన్నది.
విలాస తామ్ర శాసనం
- జారీ చేసినది ప్రోలయ నాయకుడు
- కాకతీయుల కాలంనాటి మహమ్మదీయ దండయాత్రలను వర్ణిస్తుంది.
- కాకతీయుల పతనాన్ని తెలుపుతుంది.
- కాకతీయుల్లో చివరి వాడైన ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుపుతుంది.
కలువచేరు శాసనం
- 1423లో దీన్ని అనితల్లి జారీ చేసింది.
- వరంగల్పై తురుష్కులు 8 సార్లు దండయాత్ర చేశారని తెలుపుతుంది.
- ఈ శాసనం కాకతీయులు ముస్లింల చేతిలో పరాజయం పొంది అంతరించారని పేర్కొంది.
- ఈ శాసనం ప్రోలయ వేమారెడ్డిని పంటవంశోద్భవుడు అని పేర్కొంది.
ప్రతాపరుద్ర యశోభూషణం
- విద్యానాథుడు సంస్కృత భాషలో రాసిన అలంకార శాస్త్ర గ్రంథం.
- దీనికి మరోపేరు ప్రతాప రుద్రీయం
- విద్యానాథుడు ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి.
- శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామాల్లోని శివలింగాల వల్ల ఆంధ్రదేశానికి త్రిలింగదేశమని పేరువచ్చిందని విద్యానాథుడు తన ప్రతాపరుద్రీయం అనే గ్రంథంలో వర్ణించాడు.
- ఈ గ్రంథం ద్వారా కాకతీయుల రాజ చిహ్నం, వారి జాతి, రుద్రమదేవితో గణపతిదేవుడు, ప్రతాపరుద్రుల సంబంధం తెలుస్తుంది.
- కాకతీయుల కేంద్ర ప్రభుత్వ స్వభావం, సైనిక వ్యవస్థ గురించి వివరాలను పేర్కొంది.
- గణపతి దేవుడి తర్వాత రాణిగా సింహాసనాన్ని అధిష్టించిన రుద్రమదేవి రుద్రదేవ మహారాజు అనే పురుష నామం ధరించడాన్ని తెలియజేస్తుంది.
- కాకతి అనే దేవతను పూజించడం వల్ల వీరు కాకతీయులైనట్లు ఈ గ్రంథం పేర్కొన్నది.
క్రీడాభిరామం
- దీన్ని వినుకొండ వల్లభరాయుడు రచించాడు.
- సంస్కృతంలోని త్రిపురాంతకుని ప్రేమాభిరామం ఆధారంగా రచించారు.
- ఇది ఒక వీధి నాటకం.
- వరంగల్ పట్టణాన్ని, ప్రజల జీవన విధానాన్ని వర్ణిస్తుంది.
- కాకతీయుల కాలంనాటి నగర జీవితం, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను వివరిస్తుంది.
- ‘అష్టాదశ ప్రజ’ అని 18 కుల సంఘాలను పేర్కొన్నది.
- కాకతీయుల కాలంలో మాచలదేవి చిత్రలేఖనంలో ప్రసిద్ధి చెందిన స్త్రీ అని, ఆమె చిత్రశాలను నిర్మించినట్లు తెలుపుతుంది.
పండితారాధ్య చరిత్ర
- పాల్కురికి సోమనాథుడు తెలుగు భాషలో రాసిన ద్విపద గ్రంథం ఇది.
- శైవ గురువు అయిన పండితారాధ్యుడి జీవిత చరిత్ర.
- ఈ గ్రంథం ద్వారా కాకతీయుల కాలంనాటి శైవమత వ్యాప్తి, నాటి మత పరిస్థితులను తెలుసుకోవచ్చు.
శివయోగసారం
- దీన్ని కొలను గణపతి దేవుడు రచించాడు.
- గణపతి దేవుడి కాలం నుంచి కాకతీయుల కొలువులో ఉన్న ఇందులూరి నాయకుల చరిత్ర.
నీతిసారం
- రుద్రదేవుడు రాజనీతిపై రాసిన సంస్కృత గ్రంథం.
- కాకతీయుల కాలంనాటి రాజనీతి సుంకాలు, విదేశీ వర్తకుల పట్ల ఉదారత, వాణిజ్యంలో మౌలిక అంశాలతోపాటు ఆనాటి ఆర్థిక పరిస్థితులను ఈ గ్రంథం తెలియజేస్తుంది.
నీతి శాస్త్ర ముక్తావళి
- బద్దెన నీతిశాస్త్రంపై రచించిన తెలుగు గ్రంథం.
- ఈ గ్రంథం రాజనీతిని, రాజధర్మ స్వరూపాన్ని వివరిస్తుంది.
నృత్య
- జాయపసేనాని రచించిన నృత్యశాస్త్ర లక్షణ గ్రంథం.
- ఇది కాకతీయుల కాలంనాటి భిన్న నృత్య, నాట్య శైలిల గురించి తెలుపుతుంది.
- ఈ గ్రంథం ద్వారానే కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన పేరిణీ నృత్యం గురించి తెలుస్తుంది
ప్రతాప చరిత్ర
- దీన్ని ఏకామ్రనాథుడు రచించాడు.
- అష్టాదశ ప్రజ అనే 18 కుల సంఘాలను పేర్కొన్నది.
- ఓరుగల్లుపై తురుష్కులు 8 సార్లు దండెత్తారని తెలుపుతుంది.
సిద్ధేశ్వర చరిత్ర
- కాసె సర్వప్ప రచించాడు.
- కాకతీయుల జన్మస్థలం కందారపురం అని తెలుపుతుంది. తొలి కాకతీయులు జైన మతంతో సంబంధం ఉన్నట్లు పేర్కొంది.
పల్నాటి వీరచరిత్ర
- శ్రీనాథుడు పల్నాటి యుద్ధాన్ని కథావస్తువుగా తీసుకొని రచించాడు.
- ఇది రుద్రదేవుడి పాలనా కాలంలో ఆంధ్రప్రాంతంలో నెలకొని ఉన్న రాజకీయ, సామాజిక, పరిస్థితులను తెలియజేస్తుంది.
వెలుగోటి వారి వంశావళి
- రేచర్ల వెలమల చరిత్రను తెలుపుతుంది.
- రుద్రమదేవి కాలంలో జరిగిన తిరుగుబాటును అణచిన రేచర్ల ప్రసాదిత్యుడు కాకతీయ రాజ్యస్థాపనాచార్య, రాయ పితామహాంక అనే బిరుదులు పొందినట్లు తెలుపుతుంది.
ఫతూష్ ఉస్-కఝాయిని
- అమీర్ఖుస్రూ రచించిన ఈ గ్రంథం ప్రతాపరుద్రుడు 1309లో మాలిక్కపూర్ చేతిలో ఓడిపోయి, సంధి చేసుకొని ప్రతి సంవత్సరం ఢిల్లీకి కప్పం చెల్లించడానికి అంగీకరించినట్లు తెలియజేస్తుంది.
ముఖ్య శాసనాలు
1) మాగల్లు శాసనం
2) అనుమకొండ శాసనం
3) బయ్యారం చెరువు శాసనం
4) కాజీపేట శాసనం
5) కాజీపేట దుర్గ శాసనం
6) శనిగరం శాసనం
7) మోటుపల్లి అభయ శాసనం
8) జన్నిగదేవుని దుర్గ శాసనం
9) మల్కాపురం శాసనం
10) చందుపట్ల శాసనం
11) బీదర్కోట శాసనం
12) తేరాల శాసనం
13) సలకలవీడు శాసనం
14) విలాస తామ్ర శాసనం
15) కలువచేరు శాసనం
సాహిత్య ఆధారాలు
1) ప్రతాపరుద్ర యశోభూషణం
2) క్రీడాభిరామం
3) పండితారాధ్య చరిత్ర
4) నీతిసారం
5) శివయోగసారం
6) నీతి శాస్త్ర ముక్తావళి
7) నృత్యరత్నావళి
8) ప్రతాపచరిత్ర
9) సిద్ధ్దేశ్వర చరిత్ర
10) పల్నాటి వీర చరిత్ర
11) వెలుగోటి వారి వంశావళి
12) ఫతూహ్ ఉస్-కఝాయిని
13) ఫతూహ్-ఉస్- సలాటిన్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు