‘దగాపడ్డ తెలంగాణ’ ఏ సదస్సులో ఆవిష్కరించారు? (గ్రూప్స్ ప్రత్యేకం)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా.. (తెలంగాణ హిస్టరీ)
# 1973 -1987 మధ్యకాలంలో ప్రముఖ తెలంగాణ వాది మాజీ కౌన్సిలర్ ఈవీ పద్మనాభం ‘ఫ్లాష్ అండ్ ఫెలోమెన్’ అనే పత్రిక ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రజల దృష్టికి తెచ్చేవాడు.
# ఈ పత్రికను ఖైరతాబాద్‌లోని టీ ప్రభాకర్ గారి నాట్యకళా ప్రెస్ లో ప్రచురించేవారు. పద్మనాభం ద్వారా ప్రభావితమైన టీ ప్రభాకర్ తన ప్రింటింగ్ ప్రెస్ కి వచ్చే చాలామంది మిత్రులతో ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ తదితరులతో సంప్రదించి ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్’ను ప్రారంభించారు.
# తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే కార్యాచరణలో భాగంగా ప్రముఖ తెలంగాణ మేధావులతో 1988, జూలై 14న తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు.
#ఈ ట్రస్ట్ లో సభ్యులుగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, కేశవరావు జాదవ్, పీ హరినాథ్, డా. ఏ వినాయక్ రెడ్డి, టీ ప్రభాకర్ రావు ఉన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్రంలోని ప్రాంతీయ అసమానతలపై పరిశోధన, అధ్యయనం దీనికి సంబంధించిన ప్రచురణలను ట్రస్ట్ లక్ష్యాలుగా ప్రకటించారు.
# తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషిచేస్తూ ఆందోళనకారులు, ఉద్యమకారులకు అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని ‘మా తెలంగాణ పత్రిక’ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పత్రిక సంపాదక వర్గంలో ఆనందరావు తోట, హరినాథ్, లక్ష్మణ్, తిప్పారెడ్డి ఉండగా, ఎడిటర్‌గా ప్రభాకర్ వ్యవహరించారు. ఈ ‘మా తెలంగాణ పత్రిక’ ఆవిష్కరణ సభ 1989, ఆగస్ట్ 13న కాచిగూడలోని బసంత్ టాకీస్ లో నిర్వహించారు.
తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (టీఎల్‌ఎస్వో)
# మా తెలంగాణ పత్రిక మొత్తం నాలుగు సంచికలు, మూడు అనుబంధాలు ప్రచురించింది. మా తెలంగాణ పత్రిక ప్రత్యేక సంచికలో ఒకటి 1989లో కల్వకుర్తిలో ఎన్టీఆర్ ఎన్నిక సందర్భంగా, రెండోది 1997లో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం సందర్భంగా, మూడోది 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రచురించింది.
# ఈ ట్రస్ట్ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ప్రచురించిన సాహిత్యం ప్రభావంతో ఉస్మానియా యూనివర్సిటీలో ‘తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్’ 1990-91లో ఏర్పడ్డాయి.
# 1992, ఓయూలో కొత్తిరెడ్డి మనోహర్ రెడ్డి ఈ సంస్థను ప్రారంభించారు.
# తెలంగాణ ప్రాంతంలోని విద్య, ఉద్యోగ అవకాశాలు స్థానికేతరుల పాలవుతున్నాయని భావించిన విద్యార్థులు టీఎల్ఎస్వోలో చేరి పోరాటానికి సిద్ధమయ్యారు.
# ఉదయం పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న సామిడి జగన్ రెడ్డి ఈ సంస్థలో చురుగ్గా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ‘కాకతి’ పేరుతో ఒక చిన్న పుస్తకం వెలువరించారు. అంతేకాకుండా చిన్న రాష్ట్రాల ఆవశ్యకతపై తెలుగు, ఇంగ్లిష్‌లో వ్యాసాలున్న సంచికను జగన్ సంపాదకత్వంలో టీఎల్‌ఎస్వో ప్రచురించింది.
# ఎంఏ తెలుగు సిలబస్‌లో ఆధునిక తెలంగాణ సాహిత్యంలో భాగంగా ప్రఖ్యాత రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన ‘ప్రజల మనిషి’ అనే నవలను తప్పనిసరిగా చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించి విజయం సాధించారు.
# నల్లగొండ జలసాధన సమితి ఫ్లోరైడ్ సమస్యపై హైదరాబాద్‌కు 200 కి.మీ. పాదయాత్ర నిర్వహించింది. దుశ్చర్ల సత్యనారాయణ నాయకత్వంలో పాదయాత్ర ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్న సందర్భంగా 1992, ఆగస్ట్ 27న ఆర్ట్ కాలేజీలో టీఎల్‌ఎస్వో సమావేశం నిర్వహించింది. నల్లగొండ జిల్లాను సోమాలియాగా మార్చవద్దని, శ్రీశైలం ఎడమగట్టు కాలువను తక్షణమే పూర్తిచేయాలని వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
# దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న తెలంగాణను కూడా చిన్న రాష్ట్రంగా పరిగణించి ఏర్పాటు చేయాలని జాతీయ పార్టీల దృష్టికి తెచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి టీఎల్‌ఎస్వో బృందం 1993, ఫిబ్రవరి 15న హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది.
# ఈ బృందంలో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, టీఎల్‌ఎస్వో నాయకులు సామిడి జగన్, కే సుధాకర్ రెడ్డి, జేఎన్యూకు చెందిన తెలంగాణ విద్యార్థులు ఉన్నారు.
# 1993, ఏప్రిల్ 4, 5 తేదీల్లో టీఎల్‌ఎస్వో ఉస్మానియా యూనివర్సిటీలో చిన్న రాష్ట్రాల సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు మాజీ కేంద్రమంత్రి, జనతాదళ్ ఎంపీ జార్జ్ ఫెర్నాండెజ్ హాజరై ప్రసంగించారు.
# తెలంగాణలోని ఎయిడెడ్ కాలేజీల్లో ఉన్న బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీచేయడానికి ఆంధ్రా ప్రాంతం వారిని తెలంగాణకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా 1994లో మనోహర్ రెడ్డి నిరాహార దీక్ష చేయడంతో తలొగ్గిన ప్రభుత్వం బదిలీలను నిలిపివేసింది.
సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్
# రాష్ట్రంలోని సినిమా, వార్తాపత్రికలు, ఇతర మీడియా సంస్థలు తెలంగాణేతరుల చేతుల్లో ఉండటం వల్ల వారు తెలంగాణ పట్ల కొంత వ్యతిరేకంగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి, ప్రపంచానికికి వాస్తవాలను అందించడానికి ప్రజా సంఘాల నాయకులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో 1997లో ‘సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్’ను స్థాపించారు.
# తెలంగాణ సమస్యలపై చర్చించడానికి 1997, జూలైలో రెండు రోజుల సదస్సు రాపోలు ఆనంద భాస్కర్ నేతృత్వంలో హైదరాబాద్‌లో జరిగింది. ఈ సదస్సు అనంతరం రాపోలు ఆనందభాస్కర్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ ప్రగతి వేదిక’ 1997, జూలై 13న ఏర్పడింది.
# ఈ వేదిక బతుకమ్మ పండుగ కాలాన్ని తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవాలుగా ప్రకటించి పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. తరువాతి కాలంలో తెలంగాణ ఐక్యవేదిక ఆవిర్భవించడంతో తెలంగాణ ప్రగతి వేదిక అందులో ఒక భాగస్వామి సంస్థగా పనిచేసింది.
ఫోరం ఫర్ ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్
# 1997, జనవరి 19న హైదరాబాద్ పుత్లీబౌలిలోని వివేకవర్ధిని కాలేజీ పక్కన ఉన్న అశోక టాకీస్‌లో ‘తెలంగాణ సంస్కృతి-వివక్ష’పై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమం జరిగింది. ఈ సభ నిర్వాహకులు పాశం యాదగిరి. పోలీసుల ద్వారా హత్యకు గురైన గులాం రసూల్ స్మారకార్థం ప్రతి ఏటా సభ నిర్వహించాలనే ఉద్దేశంతో ‘ఫోరం ఫర్ ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్స్’ సంస్థను తెలంగాణ జర్నలిస్టులు ఏర్పాటు చేసుకున్నారు.
# హైదరాబాద్‌లో జరిగిన తొలి తెలంగాణ మీటింగ్ ఇదే. ఈ సదస్సు కరపత్రం మొదటి వాక్యమే ‘స్వతంత్ర గడ్డపై పరాయి బిడ్డలుగా బతుకుతున్న సోదరుల ఆత్మగౌరవ ఉద్యమం’ అని పేర్కొన్నారు.
# గాదె ఇన్నయ్య తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన గణాంకాలతో ముద్రించిన ‘దగాపడ్డ తెలంగాణ’ తొలి సంచికను ఈ సదస్సులోనే ఆవిష్కరించారు.
# 1997-2000 మధ్యకాలంలో వేలాదిమందిని ప్రభావితం చేసి తెలంగాణ సోయిని కలిగించిన ప్రొ. జయశంకర్ రచించిన పుస్తకం ‘తెలంగాణలో ఏ జరుగుతుంది?’ కూడా ఈ సదస్సులోనే ఆవిష్కరించారు. గద్దర్ తొలిసారిగా ఈ సదస్సులోనే ‘అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా’ పాట పాడారు.
# భువనగిరిలో తెలంగాణ సదస్సు 1997, మార్చి 8న నిర్వహించాలనే నిర్ణయం కూడా ఈ సదస్సులోనే తీసుకున్నారు.
భువనగిరి సభ
# 1997, మార్చి 8, 9 తేదీల్లో తెలంగాణ ప్రాంత ప్రజల బాధలను ప్రపంచానికి తెలియజెప్పడానికి భువనగిరిలో నిర్వహించారు. ఈ సభా ప్రాంగణానికి ‘నిజాం వ్యతిరేక పోరాటాల అమరవీరుల ప్రాంగణం’గా పేరుపెట్టారు. ఈ సభకు ‘దగా పడ్డ తెలంగాణ’గా పేరుపెట్టారు.
# రచయితలు, కవులు, కళకారులు, అధ్యాపకులు, జర్నలిస్టులు కలిసి ‘సాహితీ మిత్ర మండలి’గా ఏర్పడి ఈ సభను నిర్వహించారు. ఈ సభను కాళోజీ నారాయణ రావు ప్రారంభించారు.
# ఈ సమావేశంలో భాషా సాహిత్యం, రాజకీయ, ఆర్థిక రంగాల్లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై చర్చించారు. ఈ సభలో ప్రొఫెసర్ జయశంకర్ ‘విద్య, వైద్య రంగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై’, ప్రొఫెసర్ జాదవ్ ‘తెలంగాణ వనరులపై’, ప్రొఫెసర్ శ్రీనివాస్ ‘వలసీకరణ, ఉద్యోగాలపై’, గద్దర్, వెంకటేశ్వర్లు ‘తెలంగాణ ఉద్యమం-అవగాహనపై’, నందిని సిధారెడ్డి ‘భాషా సంస్కృతి, మీడియా పై’, ప్రొఫెసర్ గంటా చక్రపాణి ‘సాంఘిక సంక్షేమ రంగంపై’, డా. ముత్తయ్య ‘రిజర్వేషన్లు, వర్గీకరణపై’, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన రావు ‘ఆదివాసీ సమస్యలపై’ ప్రసంగించారు.
# ఈ సమావేశంలోనే బహుజన రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడు కేజీ సత్యమూర్తి తమ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. గొల్లకుర్మ డోలు దెబ్బ నాయకురాలు బెల్లి లలిత పాటలు ఈ సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సదస్సులో చేసిన తీర్మానాలను బహిరంగ సభలో ప్రజలు ఆమోదించారు.
మాదిరి ప్రశ్నలు
1. ‘ఫ్లాష్ అండ్ ఫెలోమెన్’ అనే పత్రిక ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రజల దృష్టికి తెచ్చినది?
1) టీ ప్రభాకర్ 2) ఈవీ పద్మనాభం
3) కేశవరావు జాదవ్ 4) పీ హరినాథ్
2. ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1988, జూలై 14
2) 1988, జూన్ 14
3) 1988, ఆగస్ట్ 14
4) 1988, మే 14
3. ఎవరి ఆధ్వర్యంలో ‘తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్’ ఏర్పడింది?
1) శ్రీధర్ రెడ్డి 2) మనోహర్ రెడ్డి
3) మల్లికార్జున్ 4) వెంకట్రామి రెడ్డి
4. కింది సంస్థల్లో ‘బతుకమ్మ పండుగ కాలాన్ని తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవాలు’గా ప్రకటించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు?
1) తెలంగాణ ప్రగతి వేదిక
2) తెలంగాణ స్టడీస్ సెంటర్
3) ఫోరం ఫర్ ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్
4) పైవన్నీ
5. ఏ సదస్సు కరపత్రం మొదటి వాక్యం ‘సొంత గడ్డపై పరాయి బిడ్డలుగా బతుకుతున్న సోదరుల ఆత్మగౌరవ ఉద్యమం’ అని పేర్కొన్నారు?
1) తెలంగాణ లిబరేషన్ స్టూడంట్స్ ఆర్గనైజేషన్
2) తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్
3) ఫోరం ఫర్ ఫ్రీడం ఫర్ ఎక్స్ప్రెషన్
4) తెలంగాణ ప్రగతి వేదిక
6. కింది వాటిలో సరైనవి?
1) 1997, మార్చి 8, 9 తేదీల్లో భువనగిరిలో సభను నిర్వహించారు
2) ఈ సదస్సు ప్రాంగణానికి ‘నిజాం వ్యతిరేక పోరాటాల అమరవీరుల ప్రాంగంణ’గా పేరుపెట్టారు
3) ఈ సభకు ‘దగాపడ్డ తెలంగాణ’గా పేరుపెట్టారు 4) పైవన్నీ
7. ఎవరి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ‘తెలంగాణ జనసభ’ ఏర్పడింది?
1) గాదె ఇన్నయ్య
2) ఆకుల భూమయ్య
3) గద్దర్ 4) బియ్యాల జనార్దనరావు
8. కింది వాటిలో సరైనవి?
1) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘మా తెలంగాణ పత్రిక’ను ప్రారంభించారు
2) తెలంగాణ జనసభ ఆధ్వర్యంలో ‘జన తెలంగాణ’ మాస పత్రికను ప్రారంభించారు
3) 1 4) 1, 2
9. ఏ సదస్సులో గద్దర్ తొలిసారిగా ‘అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా’ పాట పాడారు?
1) ఫోరం ఫర్ ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్
2) తెలంగాణ ప్రగతి వేదిక
3) భువనగిరి సభ
4) తెలంగాణ మహాసభ
10. ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి జ్ఞాపకార్థం ‘ఫోరం ఫర్ ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్’ సదస్సు నిర్వహించారు?
1) పాశం యాదగిరి, జహంగీర్
2) పాశం యాదగిరి, గులాం రసూల్
3) గద్దర్, గులాం రసూల్
4) గద్దర్, బెల్లి లలిత
11. 1997, జూలై 13న ఎవరి ఆధ్వర్యంలో ‘తెలంగాణ ప్రగతి వేదిక’ ఏర్పడింది?
1) ఆకుల భూమయ్య
2) పాశం యాదగిరి
3) రాపోలు ఆనంద భాస్కర్
4) కాళోజీ నారాయణ రావు
12. ఎంఏ తెలుగులో వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన ‘ప్రజల మనిషి’ నవలను చేర్చాలని డిమాండ్ చేసి విజయం సాధించింది?
1) తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్
2) తెలంగాణ స్టడీస్ సెంటర్
3) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్
4) ఓయూ ఫోరం
13. కింది వాటిలో సరైనవి?
1) TLSO 1993, ఏప్రిల్ 4, 5 తేదీల్లో ఓయూలో చిన్న రాష్ట్రాల సదస్సును నిర్వహించింది
2) ఈ సదస్సుకు కేంద్ర మాజీ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ హాజరై ప్రసంగించారు
3) 1 4) 1, 2
సమాధానాలు
1-2, 2-1, 3-2, 4-1, 5-3, 6-4, 7-2, 8-4, 9-1, 10-2, 11-3, 12-1, 13-4.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు