‘చోలిస్థాన్’ అని ఏ ఎడారిని పిలుస్తారు? ( గ్రూప్స్ ప్రత్యేకం)
గతవారం తరువాయి..
– ఇండియన్ జాగ్రఫీ
థార్ ఎడారి: ఇది భారత వాయవ్య ప్రాంతంలో ఉన్న అతిపెద్ద ఎడారి.
– 3.20 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న థార్ ఎడారి 85 శాతం భారత్‌లో, 15 శాతం పాకిస్థాన్‌లో ఉంది.
– పాకిస్థాన్‌లో దీనిని ‘చోలిస్థాన్’ అనే పేరుతో పిలుస్తారు?
– 60 శాతం థార్ ఎడారి రాజస్థాన్‌లో, మిగిలిన భాగం గుజరాత్ (రాణ్ ఆఫ్ కచ్ ఎడారి), పంజాబ్, హర్యానాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ సాధారణ వర్షపాతం 25 సెం.మీ. కన్నా తక్కువ.
– ఇక్కడ ప్రధానంగా ఏర్పడే ఇసుక దిబ్బల ఆకారాలను బార్కన్ (నెలవంక ఆకారం), సైఫ్ (అరేబియా కత్తిమొన ఆకారం)లుగా పిలుస్తారు. కదిలే ఇసుక దిబ్బలు, పవనాల నిక్షేపణ వల్ల ఏర్పడతాయి.
– థార్ ఎడారి విస్తరించిన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ (పెద్దపట్టణం), జైసల్మేర్, బర్మేర్, బికనీర్, నాగౌర్.
-ఎడారిలో ఏర్పడే తాత్కాలిక ఉప్పునీటి సరస్సులను ‘ప్లాయా’ అంటారు. ఇక్కడి శిలా పీఠభూములను హమాడాలు అంటారు.
– మరుస్థలి ప్రాంతంలోని జై సల్మేర్ ప్రాంతంలో వేసవి ఉష్ణోగ్రతలు 51 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు చేరుకుంటాయి.
3) గంగా మైదానాలు (Gangetic Plains):
యమునా, తీస్తా నదుల మధ్యభాగంలో 1400 కి.మీ.ల పొడవున, 300 కి.మీ.ల వెడల్పున, అత్యధిక మందంలో విస్తరించిన మైదానాలు.
– 40 శాతం మైదానం ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే విస్తరించి ఉంది.
– ఇది నైరుతి నుంచి ఆగ్నేయానికి వాలి ఉంది. గంగా, దీని ఉపనదుల పరీవాహక ప్రాంతంలో విస్తరించిన వరద మైదానం (Flood Plain).
-గంగా మైదానాన్ని మూడు భాగాలుగా విభజించారు.
ఎ) ఎగువ గంగా మైదానం: గంగా, యమునా అంతర్వేది, రోహిల్‌ఖండ్ మైదానాలు ఇక్కడ ప్రధానమైనది.
-దీని పొడవు 550 కి.మీ., 380 కి.మీ. వెడల్పు, విస్తీర్ణం 1.490 L K.M2
– శివాలిక్ శ్రేణులు దాటిన తర్వాత ఏర్పడిన మొదటి రోహిల్‌ఖండ్ మైదానం.
-ఇది గంగా, యమున, రామ్‌గంగా, కాళి, శారద నదులతో ఏర్పడింది.
-ఇక్కడ యమున, చంబల్ నదీ ప్రాంతంలో ‘కందర భూములు’ ఖాదర్, బంగర్ మైదానాల మధ్య ఏర్పడ్డాయి. ఇవి ప్రధానంగా అవనాళిక క్రమక్షయం వల్ల ఏర్పడ్డాయి.
బి) మధ్యగంగా మైదానాలు: ఇది తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఏర్పడి ఉంది.
– దీని విస్తీర్ణం 1.45 L K.M2లు గోమతి, గాగ్రా, గండక్, సోన్ నదులతో ఏర్పడింది.
– గాగ్రా నది పశ్చిమ భాగాన గల మైదానాలను అవద్ మైదానాలు అంటారు. అయోధ్య, లక్నో పట్టణాలు ఈ మైదానంలోనే ఉన్నాయి.
-ఈ మైదానాల్లో గంగా-ఘగ్గర్ దోబ్, ఘగ్గర్- గండక్ దోబ్, గండక్- కోసి దోబ్లు ఉన్నాయి.
– గంగానదికి దక్షిణ దిశలో సోన్ నదికి తూర్పున గల మైదానం మగధ (బీహార్) మైదానంలో ఉంది.
సి) దిగువ మైదానం: దీని విస్తీర్ణం 0.80 L K.M2 కలిగి పశ్చిమ బెంగాల్లో ఏర్పడి ఉంది.
-ఈ మైదానంలోని ప్రధాన నగరం కోల్‌కతా. ఇక్కడ ప్రధానంగా దామోదర్, అజమ్, మయూరాక్షి వంటి నదులు ప్రవహిస్తున్నాయి.
– ఈ మైదానంలో ఉన్న సుందర్బన్ డెల్టా మడ అడవులతో కూడిన చిత్తడి ప్రాంతం. ఇది ఒక డిజిటల్ డెల్టా.
-రాజ్‌మహల్ కొండలు ఈశాన్యంగా విస్తరించడంవల్ల ఈ మైదానం వెడల్పు తక్కువగా ఉన్నది.
4) బ్రహ్మపుత్ర మైదానాలు
– ఇవి బ్రహ్మపుత్ర నది పరీవాహక ప్రాంతంలో ఏర్పడిన మైదానాలు. ఇక్కడ వరదల వల్ల క్రమక్షయం అధికంగా ఉంటుంది.
– ఈ ప్రాంతంలో ఎర నేలలతో సాదియా నుంచి ధూబ్రి మధ్యలో బ్రహ్మపుత్ర మైదానాలు 720 కి.మీ. పొడవున ఏర్పడి ఉన్నాయి.
-పశ్చిమవైపు తప్ప మిగిలిన మూడువైపులా పర్వతాలతో ఆవరించి ఉంది. ఉత్తరాన హిమాలయాలు, తూర్పున పాట్కాయ్, నాగకర్ కొండలు, దక్షిణాన గారో, ఖాసి, జయంతియ కొండలు ఉన్నాయి.
– పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగాన తీస్తా, సకోష్ ప్రవాహాలు ఉన్నాయి. ఇక్కడే జలదపారా నేషనల్ పార్క్ ఉంది.
-ఈ మైదానం ఈశాన్యం నుంచి నైరుతి వైపునకు వాలి ఉంది.
-ఈ మైదానంలోని అవశిష్ట పర్వతాలు మికిర్, రెంగ్మ పర్వతాలు.
-ఇవి తేయాకు, జనపనార పంటలకు ప్రసిద్ధి. ఇది చమురు నిల్వలు ప్రధానంగా లభిస్తున్న మైదానం కూడా.
– భారతదేశంలో పెద్ద నదీ ఆధార ద్వీపం (Riverine Island) అయిన మజులీ బ్రహ్మపుత్రా నదిలో ఉంది.
భారతదేశ బృహత్ మైదానం ప్రాధాన్యత
– అత్యధిక వ్యవసాయ ఉత్పాదకత కలిగిన ప్రాంతం. గోధుమ, చెరకు, జనుము, వరి అత్యధికంగా పండే ప్రాంతాలు ఇవే. దీని సమతల వాలు నీటి పారుదలకు అత్యంత అనుకూలంగా ఉంది.
-ప్రతి సంవత్సరం వరదల వల్ల వచ్చే మృత్తికల వల్ల భూములు ఎప్పటికప్పుడు సారవంతమవుతున్నాయి. అత్యధిక అంతర్భూజాలాన్ని కలిగి ఉన్నాయి.
– బ్రహ్మపుత్ర మైదానంలోని అవక్షేప శిలలు ముడి చమురు, సహజ వాయువులను కలిగి ఉన్నాయి.
-దేశ జనాభాలో 40 శాతం మంది ఈ మైదానంలోనే నివసిస్తున్నారు. దేశంలో అతి పురాతన నాగరికతలు ఇక్కడే అభివృద్ధి చెందాయి.
-ఈ మైదానాలు జల రవాణాకు అనుకూలంగా ఉన్నాయి.
3) ద్వీపకల్ప పీఠభూమి (Peninsular Plateau)
-ఇది ప్రీకాంబ్రియన్ యుగంలో ఏర్పడిన అగ్నిపర్వత పీఠభూమి.
– భారత దేశ దక్షిణ భాగాన గోండ్వానాలో భాగమైనటువంటి 350 కోట్ల సంవత్సరాల నాటి పురాతన శిలలతో నిర్మితమైన దేశంలోని అతిపెద్ద భౌతిక విభాగం.
– సుమారుగా 16 L K.M22 విస్తీర్ణం గల ఈ భూభాగం ప్రీకాంబ్రియన్ కాలంలో సముద్ర ట్టం కన్నా పైకి నెట్టబడింది. దేశ భూభాగంలో సగభాగం ఉంటుంది.
-ఇది దేశంలో అత్యంత పురాతన భూభాగం. అలాగే అగ్నిశిలలతో, రూపాంతర శిలలతో నిర్మితమైన అత్యంత స్థిరత్వంగల భూభాగం.
– ఈ ప్రాంతం పర్వత నిర్మాణ ప్రక్రియకు గురికాలేదు. అందువల్ల ఈ ప్రాంతంలో ప్రకృతి విపత్తుల ప్రమాదం పెద్దగా ఉండదు. కానీ అక్కడక్కడ గళిత శిలా విన్యాసం (Garben), భ్రంశోద్ధిత శిలా విన్యాసం (Horst) వల్ల పగులు లోయలు (Rift Valleys), ఖండ పర్వత నిర్మాణాలను పోలిన స్వరూపాలు ఏర్పడుతాయి. అలాగే నదుల క్రమక్షయం వల్ల అవిశిష్ట పీఠభూములు, పెనిప్లేన్ మైదానాలు ఏర్పడ్డాయి.
– ఈ పీఠభూమి ఆర్కియన్, ధర్వార్, కడప, వింధ్యన్, దక్కన్ ట్రాప్స్, టెర్షియరీ కాలానికి చెందిన శిలలతో నిర్మితమై ఉంది.
– దీని సగటు ఎత్తు సరాసరి 900 మీ. నుంచి 600 మీ. కలిగి త్రిభుజాకారంలో ఉంది. ఫలితంగా ఇది పడమర నుంచి తూర్పునకు వాలు కలిగి ఉంది.
– ఈ పీఠభూమికి ఉత్తరాన ఢిల్లీ ఉన్నతి, తూర్పున రాజ్‌మహల్ కొండలు, తూర్పు కనుమలు, ఈశాన్య కొనసాగింపుగా షిల్లాంగ్, కర్బి, అంగ్లాంగ్ పీఠభూమి, పడమర గిర్ కొండలు, దక్షిణాన కార్డమమ్ కొండలు సరిహద్దుగా ఉన్నాయి.
-ద్వీపకల్ప భారతదేశాన్ని లేదా పీఠభూమిని నర్మదా నది సరిహద్దుగా రెండు భాగాలుగా విభజించవచ్చు.
1) మధ్య ఉన్నత ప్రాంతాలు లేదా మాల్వా పీఠభూమి
2) దక్కన్ పీఠభూమి
మధ్య ఉన్నత భూములు (Central High Lands)
– నదికి నర్మదా నదికి ఎగువన గల పీఠభూమి భాగాన్ని మధ్య ఉన్నత భూములుగా పిలుస్తారు.
– ఆరావళి పర్వతాలు, మాల్వా పీఠభూమిని కలిపి ఉత్తరానగల మధ్య ఉన్నత భూములుగా గుర్తిస్తారు.
ఎ) ఆరావళి పర్వతాలు
– ఆరావళి అంటే శిఖరాల వరుస (Link of Peaks) అని అర్థం.
-ఇది ప్రీకాంబ్రియన్ (ఆర్కియన్) యుగంలో రూపాంతర ప్రాప్తి శిలలతో (Metamorphic Rocks) ఏర్పడ్డ ప్రాచీన ముడత పర్వతాలు (Older Folded Mountain). వీటి శిలలు దేశంలోనే అత్యంత ప్రాచీననమైన శిలలు.
– నైరుతి నుంచి ఈశాన్యానికి, పాలంపూర్ (గుజరాత్) నుంచి రాజస్థాన్, హర్యానా మీదుగా ఢిల్లీ వరకు 695 కి.మీ. పొడవుగల పర్వతాలు.
-ఆరావళి పర్వతాల వయస్సును 3 బిలియన్ సంవత్సరాలుగా గుర్తించారు.
– ఆరావళి పర్వతాలను నాలుగు భాగాలు విభజించారు.
1) ఈశాన్య ఆరావళి శ్రేణులు (అల్వార్ శ్రేణులు)– ఇవి ఉత్తరాన ఢిల్లీ అంచు వరకు గల కొండలు
– ప్రసిద్ధి చెందిన రాగి గనుల ప్రాంతం ఖేత్రి ఇక్కడే ఉంది.
-సాంబార్, రామ్‌గర్ సరస్సులు ఇక్కడే ఉన్నాయి.
2) మధ్య ఆరావళి శ్రేణులు- సాంబార్ సరస్సు నుంచి భారత్ పీఠభూమి వరకుగల శ్రేణులు.
– మర్వార్ కొండలు దీనిలో భాగమే. దీనినే జోధ్‌పూర్ ప్రాంతం అని అంటారు.
-ఇది అర్ధశుష్క ప్రాంతం.
3) మేవార్, ఖోరట్ పీఠభూమి ప్రాంతం- ఆరావళి పర్వతాల ఆగ్నేయ భాగాన బనాస్ నది పరీవాహక ప్రాంతంలో చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన మేవార్ (మేవాడ్) ఉంది. దీనిలో ఉదయ్‌పూర్ పట్టణం ఉంది.
-కుంభల్‌ఘర్, గోగుండ మధ్యగల ఎత్తయిన శిలా ఉపరితలాన్ని ఖోరట్ పీఠభూమి అంటారు. ఇది ఆరావళి శ్రేణుల్లో ఎత్తయిన టేబుల్ ల్యాండ్ (1225 మీ.). వీటిలో ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ ఉంది. దీని పొడవు 36 కి.మీ..
4) అబు కొండలు– దక్షిణాన గల కొండలు. వీటిలో ఆరావళి శ్రేణుల్లో ఎత్తయిన గురుశిఖర్ (సిరోహి జిల్లా, 1722 మీ.) ఉంది.
-రాజస్థాన్ రాష్ట్రంలోని ఏకైక వేసవి విడిది ‘మౌంట్ అబు’ ఇక్కడే ఉంది. ఇక్కడే దిల్వారా జైన మందిరం ఉంది. ఆరావళిలో అత్యధికంగా ఇక్కడే వర్షం కురుస్తుంది. నక్కీ సరస్సు ఈ కొండల్లో ఉంది.
– ఆరావళి పర్వతాల పశ్చిమ వాలుల నుంచి లూని, దాని ఉపనదులు, తూర్పు వాలుల నుంచి బనాస్ నది, దక్షిణం నుంచి సబర్మతి ప్రవహిస్తుంది.
ఆరావళిలోని కనుమలు
1) గోరన్ఘాట్ కనుమ- ఇది ఉదయ్‌పూర్, సిరోహిలను కలుపుతుంది.
2) హల్దిఘాట్ కనుమ- పాళి, రాజసమద్ జిల్లాలను కలుపుతుంది.
3) దౌసూరి కనుమ
4) పిప్లిఘాట్ కనుమ
5) బార్ఘాట్ కనుమ
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు