Governor’s discretion | గవర్నర్ విచక్షణాధికారాలు
-గ్రూప్-1 జనరల్ ఎస్సే
రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ పాత్ర అతిప్రధానమైనది. రాష్ర్టాధినేతగా గవర్నర్ నిర్వహించే విధులు, అధికారాలు అత్యంత విశేషమైనవి. అందువల్ల గవర్నర్ అధికారాలపై, రాజ్యాంగపరంగా గవర్నర్ స్థానంపై అవగాహన కలిగి ఉండటం పోటీపరీక్షలు రాసే అభ్యర్థులకు అత్యంత ముఖ్యం. అందులో భాగంగానే గవర్నర్ అధికారాలు, నియామకం వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నిపుణ పాఠకుల కోసం ప్రత్యేక వ్యాసం..
ఇటీవలి కాలంలో అత్యంత వివాదాస్పదమైన అంశాల్లో అతిముఖ్యమైనవి గవర్నర్ అధికారాలు. అందులోనూ గవర్నర్ విచక్షణాధికారాల గురించి మరింత లోతుగా చర్చ జరిగింది. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత కొత్త ముఖ్యమంత్రిని నియమించేటప్పుడు ఎవరిని నియమించాలో గవర్నర్ నిర్ణయించాలి. ఆ తరువాత జల్లికట్టు ఉద్యమ సమయంలో కేంద్రానికి, రాష్ర్టానికి మధ్య అనుసంధానకర్తగా గవర్నర్ వ్యవహరించాడు. శశికళ, పన్నీర్ సెల్వానికి మధ్య జరిగిన అధికార కుమ్ములాటలో, చివరికి పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠం ఎక్కినంతవరకు గవర్నర్ పోషించిన పాత్రపై ఎన్నో విమర్శలూ, ఎన్నో వివాదాంశాలూ ఉన్నాయి. ఆ తరువాత పోషించిన పాత్రపై ఎన్నో విమర్శలు, వివాదాంశాలు ఉన్నాయి. అనంతరం పళనిస్వామి ఎంపిక రాజ్యాంగబద్ధంగా లేదని ప్రధానప్రతిపక్షం డీఎంకే గవర్నర్‌కి ఫిర్యాదు చేయడం, ఆ ఎంపికపై గవర్నర్ కేంద్రానికి ఒక నివేదిక పంపడం ఎంతో ఉత్కంఠను సైతం రేకెత్తించాయి.
-అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు అక్షింతలు వేయడం, గవర్నర్ అధికారాలపై తీవ్ర చర్చ జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఉన్న గవర్నర్లను రాజీనామా చేయమనడం, వారి ఎంపిక, తొలగింపు పై తీవ్రమైన చర్చ కూడా నడుస్తున్నది.
గవర్నర్ అంటే..
-ఒక రాష్ట్ర రాజ్యాంగాధినేత, రాజ్యాంగ పరంగా ఆ రాష్ట్ర పెద్ద ఇతనే. రాష్ర్టానికి మొదటి పౌరుడు.
-కేంద్రంలో రాష్ట్రపతిలా రాష్ట్రంలో రాజ్యాంగరీత్యా గవర్నర్ కార్యనిర్వాహణ అధిపతి.
-ప్రకరణ 153 ప్రకారం ప్రతి రాష్ర్టానికి ఒక గవర్నర్ ఉంటారు.
కేంద్రం-గవర్నర్ మధ్య సంబంధాలు..
-గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం నియమించినా.. రాజ్యాంగ పరంగా గవర్నర్ ఒక స్వతంత్ర సంస్థే…!
-ఇది తనకుతానుగా స్వతంత్రంగా వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఒక సబార్డినేట్ ఆఫీస్‌గా ఉండకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలన్నింటిని పాటించాల్సిన అవసరం గవర్నర్‌కు లేదని అర్థం.
-కేంద్రంలో రాష్ట్రపతిలాగా రాష్ట్రంలో గవర్నర్ నామమాత్రపు రాజ్యాధినేతగా, రాజ్యాంగపరంగా అత్యున్నత స్థానాన్ని ఆక్రమిస్తాడు.
గవర్నర్ నియామకం
-రాజ్యాంగంలోని ప్రకరణ 153 నుంచి 167 వరకు ఉన్న 15 ప్రకరణలు గవర్నర్ నియామకం, అర్హతలు, తొలగింపు, అధికార విధుల గురించి పేర్కొంటున్నాయి.
-ప్రకరణ 155 ప్రకారం రాజ్యాంగం నిర్ణయించిన అర్హతలున్న ఏ వ్యక్తినైనా రాష్ట్రపతి తన ముద్రద్వారా గవర్నర్‌ని నియమించవచ్చు.
-ఈ నియమాన్ని అనుసరించి రాష్ట్రపతి గవర్నర్‌ను నియమించాలి. కానీ, అన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కేంద్రానికి చేదోడువాడుగా ఉండే, కేంద్ర ఆదేశానుసారం పనిచేసే వ్యక్తులనే గవర్నర్‌గా నియామకాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు తమిళనాడు గవర్నర్.. బీజేపీ నాయకుడే కాకుండా ఎంపీగా కూడా పనిచేశారు. అదేవిధంగా వివిధ రాష్ర్టాల గవర్నర్లు గతంలో బీజేపీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసినవారే.
-అంటే గవర్నర్ పదవి ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది.
ప్రమాణ స్వీకారం
-ప్రకరణ 159 ప్రకారం గవర్నర్‌గా నియమితులైన వారితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
అర్హతలు
-రాజ్యాంగం ప్రకారం అధికరణ 155లో గవర్నర్ నియామకం, అధికరణ 157లో అతని అర్హతల గురించి వివరించారు. అవి…
1. భారత పౌరుడై ఉండాలి
2. కనీసం 35 ఏండ్లు నిండి ఉండాలి
3. న్యాయస్థానంలో దివాళాకోరుగా ప్రకటించబడి, ఎటువంటి నేరారోపణలు రుజువై ఉండరాదు.
-పై రాజ్యాంగపరమైన నియమాలే కాకుండా ఎన్నో ఏండ్ల నుంచి మరికొన్ని సాంప్రదాయబద్ధమైన నియమాలు సైతం అమల్లో ఉన్నాయి.
-ఏ రాష్ట్రం నుంచి అతను నివాస ధ్రువీకరణ కలిగి ఉంటాడో ఆ రాష్ర్టానికి గవర్నర్‌గా నియమించవద్దు.
-ఏ రాష్ర్టానికి గవర్నర్‌ను నియమిస్తారో ఆ సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించి నియమించాలి.
-పార్లమెంటు ఉభయసభల్లోగానీ, రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్‌లోగానీ సభ్యుడై ఉండకూడదు.
-గవర్నర్‌గా నియమించబడటానికి కనీసం రెండేండ్ల ముందు క్రియాశీల రాజకీయాల్లో ఉండకూడదు.
-లాభదాయక పదవుల్లో ఉండరాదు.
-హరగోవింద్ వర్సెస్ రఘుకల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ గవర్నర్ పోస్టు లాభదాయక పదవుల్లోకి రాదని వ్యాఖ్యానించింది.
-గవర్నర్ నియామకంలో ఆర్ఎస్ సర్కారియా కమిషన్ కొన్ని సూచనలు, సాంప్రదాయాలను సూచించింది. అయితే వీటి పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు.
జీతం
-గవర్నర్ జీతం, సౌకర్యాలు పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం గవర్నర్ జీతం రూ. 1,10,000
-పదవీ కాలం : రాష్ట్రపతికి నమ్మకం ఉన్నంతవరకు గవర్నర్ పదవిలో ఉంటాడు. రాజ్యాంగం ప్రకారం విశ్వాసం అంటే ఏమిటో నిర్వచించలేదు.
-గవర్నర్‌ను తొలగించడానికి ఎలాంటి నియమాలు, ప్రక్రియను రాజ్యాంగం పేర్కొనలేదు.
-తొలగింపు: ప్రకరణ 156 (1) ప్రకారం రాష్ట్రపతి ఇష్టం మేరకు గవర్నర్ పదవిలో కొనసాగుతాడు. రాష్ట్రపతి ఎప్పుడు భావిస్తే అప్పుడు గవర్నర్‌ను తొలగించవచ్చు. గవర్నర్‌కి ఎలాంటి కచ్చితమైన పదవీకాలం లేదు. ప్రధానమంత్రి ఆదేశానుసారం రాష్ట్రపతి గవర్నర్‌ను ఎప్పుడైనా తొలగించవచ్చు. ఇందులో అభిశంసన వంటి ప్రక్రియ ఏదీ ఉండదు.
-ఒక రాష్ట్ర గవర్నర్‌ను మరో రాష్ర్టానికి బదిలీ చేయవచ్చు.
-గవర్నర్‌ను మళ్లీ మళ్లీ ఎన్ని సార్లయినా పునర్నియామకం చేయవచ్చు.
-1956లో చేసిన 7వ రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని సందర్భాల్లో ఒకే గవర్నర్‌ను ఒకటికంటే ఎక్కువ రాష్ర్టాలకు ఇన్చార్జిగా కూడా నియమించవచ్చు. ఈ నిబంధనను ప్రకరణ 153లో చేర్చారు.
ఉదా: గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు తమిళనాడు, మహారాష్ట్రకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కూడా ఇన్చార్జి గవర్నర్‌గా పనిచేస్తున్నారు.
-బీపీ సింఘాల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసు (2010)లో గవర్నర్ ప్రవర్తన సరిగా లేకున్నా, ఏవైనా అవకతవకలకు పాల్పడినా, అవి రుజువైతే అతన్ని పదవి నుంచి తొలగించాలని సుప్రీంకోర్చు తీర్పునిచ్చింది.
గవర్నర్ విధులు
-రాష్ట్రంలో గవర్నర్ విధులు కేంద్రంలో రాష్ట్రపతి విధుల్లాగే ఉంటాయి. అవి
-కార్యనిర్వాహక విధులు
-శాసన నిర్మాణ విధులు
-న్యాయ విధులు
-ఆర్థిక విధులు
-కానీ రాష్ట్రపతిలాగా గవర్నర్ డిప్లొమాటిక్, మిలిటరీ, అత్యవసర అధికారాలను కలిగి ఉండలేడు.
ఆర్డినెన్స్ అధికారాలు
-ప్రకరణ 213 (1) ప్రకారం రాష్ట్రంలోని రెండు సభలు లేదా ఏదో ఒక సభ సమావేశాల్లో లేనప్పుడు ఏదైనా ఒక విషయంపై అత్యవసరంగా చట్టం కావాలంటే ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు.
-ఒకవేళ అది కేంద్ర ప్రభుత్వాధికారులకు, సమాఖ్య అధికారులకు సంబంధించినవైతే అది రాష్ట్రపతికి నివేదించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
మంత్రిమండలితో గవర్నర్ సంబంధం
-ముఖ్యమంత్రి అధ్యక్షత వహించే మంత్రిమండలి గవర్నర్‌కి సలహాలు, సూచనలు ఇస్తుంది.
-మంత్రిమండలి సూచనలను గవర్నర్ తప్పకుండా పాటించాలి. (విచక్షణాధికారం ఉపయోగించే సందర్భంలో తప్ప)
-మొత్తం మంత్రిమండలి కింది సభకు (అసెంబ్లీకి) జవాబుదారీ వహిస్తుంది. ఒక్కొక్కరు (మంత్రులు) వ్యక్తిగతంగా గవర్నర్‌కి విశ్వాసంగా ఉంటారు.
-విచక్షణాధికారాలను ఉపయోగించేటప్పుడు గవర్నర్ ఎవరి సలహాలను పాటించాల్సిన అవసరం లేదు.
-తమిళనాడులో ముఖ్యమంత్రి అభ్యర్థిని నియమించటంలో గవర్నర్ ఆలస్యం చేశారని, కేంద్ర ఆదేశాలకనుగుణంగా పనిచేశారని సరైన సమయంలో అందుబాటులో లేకుండా తప్పించుకున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం గవర్నర్ పనిచేశారని సుప్రీంకోర్టు సైతం ఆక్షేపించింది. కానీ పైవన్నీ రాజ్యాంగానుసారం సరైనవే. గవర్నర్ విచక్షణాధికారం ఒక సమగ్ర చట్టం చేసి రాజ్యాంగంలో పొందుపరిస్తే తప్ప ఏది సరైనదో ఏది కాదో నిర్ణయించలేం.
శాసన నిర్మాణాధికారాలు
-ప్రకరణ 154 ప్రకారం గవర్నరే రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికారి.
1. అసెంబ్లీకి ఒక ఆంగ్లో ఇండియన్‌ను, కౌన్సిల్‌కి 1/6 వంతు మందిని నియమిస్తారు.
2. సభను సమావేశపర్చడం, ప్రొరోగ్ చేయడం (అసెంబ్లీ సమావేశాలు ముగిసినట్టు ప్రకటించడం) లేదా అసెంబ్లీని రద్దు చేయవచ్చు. (మళ్లీ ఎన్నికలు జరగాలి)
3. గవర్నర్ సంతకం లేనంతవరకు ఏ బిల్లు చట్టరూపం దాల్చదు.
4. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లేదా రాష్ట్రపతి సలహా మేరకు రాష్ట్ర అసెంబ్లీని రద్దుపర్చవచ్చు.
5. గవర్నర్ అనుమతి లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే వీలు లేదు.
-ఏదైనా ఆర్థిక, ఫైనాన్స్ బిల్లులను ప్రవేశపెట్టాలన్నా కచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందే.
-ఒక బిల్లు తన వద్దకు చేరినప్పుడు దాన్ని ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, తిరిగి పంపవచ్చు లేదా రాష్ట్రపతి సలహా కోసం ఆ బిల్లును రాష్ట్రపతికి కూడా పంపవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు