ప్రపంచ శీతోష్ణస్థితి శాస్త్రవేత్తల్లో గొప్పవాడు?
శీతోష్ణస్థితి
– దేశంలోని వర్షపాతం ప్రాథమికంగా పర్వతీయ వర్షపాత రకానికి చెందినది (Orographic of Rainfall).
– ఉత్తర భారతదేశంలో పశ్చిమంగా వెళ్లేకొద్ది వర్షం తగ్గిపోతుంది. కోల్‌కతా 119 సెం.మీ., పాట్నా 105 సెం.మీ., అలహాబాద్ 76 సెం.మీ., ఢిల్లీ 56 సెం.మీ. వర్షం నమోదవుతుంది. పవనాలు తీసుకెళ్లే తేమ శాతం తగ్గుతూ ఉండటమే దీనికి కారణం.
– దక్షిణ భారత దేశంలో అంతర్భాగాలకు వెళ్లే కొద్దీ వర్షం తగ్గిపోతుంది. ఈ అంతర్భాగాలు పర్వత వర్షాచ్ఛాయ ప్రాంతాలు.
– వర్షపాత దినాలు (Rainy Days) సంవత్సరానికి సగటున 40 నుంచి 45 మాత్రమే ఉంటాయి.
-ఈ వర్షపాత దినాలు ఈశాన్య ప్రాంతంలో 180 ఉండగా, రాజస్థాన్‌లో 20 మాత్రమే ఉంటాయి.
– భారతదేశ వర్షపాతంలో అనిశ్చితత్వం (Uncertainity) ఎక్కువ. అందువల్లే దేశ వ్యవ సాయాన్ని రుతుపవనాలతో చేసే జూదం (Gambling with Monsoon) అంటారు.
– భారత్‌లో సగటు వర్షపాతం, వార్షికంగా 118.7 సెం.మీ. ప్రపంచ వర్షపాతంలో 4 శాతం వర్షపాతాన్ని మనం పొందుతున్నాం.
– కోరమండల్ తీరం మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతంలాగా చలికాలంలో వర్షపాతాన్ని పొందుతుంది. దీన్ని ఉష్ణమండల మధ్యధరా ప్రాంతంగా చెప్పవచ్చు.
వర్షపాత వ్యత్యాస సూచిక (Variability of Rainfall)
– సగటున కురిసే వర్షపాతానికి నిర్దిష్ట సంవత్సరంలో కురిసిన వర్షపాతానికి మధ్యగల తేడా.
-వర్షపాత వ్యత్యాస సూచిక ఆధారంగా నాలుగు ప్రాంతాలుగా విభజించారు.
1) 15 శాతం కన్నా తక్కువ వర్షపాత వ్యత్యాసం గల ప్రాంతాలు- మలబార్ తీరం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం
2) 15 శాతం నుంచి 30 శాతం వర్షపాత వ్యత్యాసంగల ప్రాంతాలు- రాజస్థాన్, గుజరాత్, దక్కన్ పీఠభూమి అంతర్భాగాలు మినహాయించి మిగిలిన ప్రాంతాలు
3) 30 శాతం నుంచి 60 శాతం వర్షపాత వ్యత్యాసం గల ప్రాంతాలు- థార్ ఎడారిలోని మరుస్థలి ప్రాంతం మినహా థార్ ఎడారి, దక్కన్ పీఠభూమి అంతర్భాగం, పశ్చిమ మధ్యప్రదేశ్
4) 60 శాతం కంటే ఎక్కువ వర్షపాత వ్యత్యాసం గల ప్రాంతాలు- థార్ ఎడారిలోని మరుస్థలి ప్రాంతం
-ఒకరోజులో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతం అమినీ దీవి (లక్షదీవులు) 116.8 సెం.మీ.. ఇది 2004 మే 5న నమోదయ్యింది.
– ఒక రోజులో అత్యధిక వర్షపాతం నమోదైన నగరం ముంబై 94.4 సె.మీ. (2005).
రుతుపవనాల ఆవిర్భావం (Origin of Monsoon)
-భారత్, ఆఫ్రికా మధ్య అరేబియా సముద్రంలో సంచరించే అరబ్బు వర్తకులు రుతుపవనాల విధానాన్ని గుర్తించి వాటికి మౌసమ్ అని పేరు పెట్టారు. మౌసమ్ అనే అరబిక్ పదం నుంచి వచ్చినదే మాన్సూన్.
-ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లెమేట్ చేంజ్ (IPCC) ప్రకారం సముద్ర భాగాలు, భూభాగాలు విభిన్నంగా వేడెక్కి చల్లబడటం వల్ల, అయన, ఉపఅయన రేఖా ప్రాంతాల్లో వ్యతిక్రమించే ఉపరితల పవనాలను ‘రుతుపవనాలు’ అంటారు.
-రుతుపవనాలను మొదటగా గుర్తించింది హిప్పాలస్ అని భావించవచ్చు.
-మధ్యయుగంలో వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన అరబ్బులు రుతుపవనాలను విరివిగా వినియోగించి నౌకాయానం చేశారు.
– రుతుపవనాల పుట్టుకను వివరించే సిద్ధాంతాలు
1) తాప సిద్ధాంతం-హేలి (Thermal Concept by- Halley)
-1687లో ఇంగ్లండ్‌కు చెందిన ఎడ్మండ్ హేలి తాప సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. హేలి తోకచుక్కకు ఆ పేరు ఈయన గౌరవార్థం పెట్టారు.
-ఈయన ప్రకారం భూమి, నీరు విభిన్నంగా వేడెక్కి చల్లబడటం వల్ల ఏర్పడే భూ పవనాలు, రుతుపవనాలు పెద్ద ఎత్తున సంభవించి రుతుపవనాలు ఏర్పడుతాయి.
– మే, జూన్ నెలలో సూర్యుడు కర్కట రేఖ వద్ద నిట్టనిలువుగా ప్రకాశించడం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సైబీరియాలోను, పాకిస్థాన్‌లోని పెషావర్ వద్ద అల్పపీడన కేంద్రాలు నమోదవుతాయి.
-ఇదే సమయానికి దక్షిణార్ధగోళంలోని హిందూ మహాసముద్రంలో శీతాకాలం కావడం వల్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యి అధిక పీడనం నమోదవుతుంది.
-పీడన ప్రవణతను (Pressure Gradient) అనుసరించి పవనాలు హిందూ మహాసముద్రం నుంచి భారత భూభాగంవైపునకు పురోగమిస్తాయి.
– డిసెంబర్ నెలలో దీనికి పూర్తి భిన్నంగా దక్షిణార్ధగోళంలో అల్పపీడనం, ఉత్తరార్ధగోళంలో అధిక పీడనం ఏర్పడి తిరోగమన రతుపవనాలు ఏర్పడ్డాయి. ఆస్ట్రేలియా ఖండానికి వాయవ్య రుతుపవనాలుగా తాకుతాయి.
– పీడన మేఖలలు స్థిరంగా ఉండకపోవడం, ప్రతి రుతుపవనాలను పరిగణనలోకి తీసుకోకపోవడం ఈ సిద్ధాంతంలోని ప్రధాన లోపాలు. కొరియాలిస్ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు.
2) చలన సిద్ధాంతం – ఫ్లోన్ (Dynamic Concept by Flohn)
-ప్రపంచ శీతోష్ణ స్థితి శాస్త్రవేత్తల్లో గొప్పవాడుగా గుర్తింపు పొందిన ఫ్లోన్ అంతర అయనరేఖా అభిసరణ స్థానం (ITCZ), కొరియాలిస్ ప్రభావం ఆధారంగా రుతుపవ నాల విధానాన్ని విశదీకరించాడు.
-ఈశాన్య వ్యాపార పవనాలు, ఆగ్నేయ వ్యాపార పవనాలు కలుసుకునే భూమధ్యరేఖా ప్రాంతపు అల్పపీడన ప్రాంతాన్ని అంతర అయనరేఖా అభిసరణ ప్రాంతం (Inter Tropical Convergence Zone-ITCZ) అంటారు.
– ఈ ఐటీసీజడ్ ఉనికి సూర్యుడి గమనం మీద ఆధాపడుతుంది. సూర్యుని నిట్టనిలువు కిరణాలు పడే చోట ఐటీసీజడ్ కేంద్రీకృతం అవుతుంది.
– జూన్ నెలలో ఈ ఐటీసీజడ్ కర్కట రేఖ వద్ద కేంద్రీకృతం కావడంవల్ల దక్షిణార్ధగోళంలోని ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్యరేఖను దాటి కర్కట రేఖ వైపునకు పురోగమిస్తాయి.
-ఈ పురోగమన సమయంలో కొరియాలిస్ ప్రభావం వల్ల కుడివైపునకు వంగి భారతదేశానికి నైరుతి దిశ నుంచి వీయడం వల్ల వీటిని నైరుతి రుతుపవనాలుగా గుర్తిస్తారు.
– అంటే నైరుతి రుతుపవనాల పూర్వంరూపం ఆగ్నేయ వ్యాపార పవనాలు (South-east-Trade Winds).
-డిసెంబర్ నెలలో ITCZ మకర రేఖ వద్ద కేంద్రీకృతం కావడం వల్ల ఈశాన్య వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటి కొరియాలిస్ ప్రభావం వల్ల ఎడమవైపునకు వంగి వాయవ్య రుతుపవనాలుగా ఆస్ట్రేలియాను తాకుతాయి.
3) భారత రుతుపవన ముందస్తు అంచనా నమూనా (Indian Monsoon Forecast Model)
-భారత్‌లో రుతుపవనాలపై పరిశోధనలు చేసిన ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త పుణెకు చెందిన ‘వసంత గోవరికర్’. ఇతన్ని ‘భారత రుతుపవన అంచనా నమూనా పితామడు’ అంటారు.
4) వాయు సంబంధ సిద్ధాంతం (Aerological Concept of Monsoon)
-దీన్ని ప్రతిపాదించినది షెర్హగ్ (1948)
-ఈయన ప్రకారం వాతావరణంలోని అన్ని దశల్లో పవనాల దిశలో మార్పునకు, వాతావరణంలో ఘర్షణ పొర (Friction Layer) పైన గాలిలోని ఉష్ణోగ్రతల మార్పునకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది.
5) జెట్ స్ట్రీమ్ సిద్ధాంతం
-దీన్ని ప్రతిపాదించినది ఎంటీ యిన్.
– ట్రోపో ఆవరణ పైభాగంలో ఏర్పడిన జెట్ స్ట్రీమ్ సాధారణంగా గంటకు 100-300 కి.మీ. వేగం కలిగి ఉంటుంది.
-ఇది వేసవిలో ఉత్తరానికి జరిగిన నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడానికి తోడ్పడుతుంది.
అదేవిధంగా శీతాకాలంలో దక్షిణానికి జరిగి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించడానికి సహకరిస్తుంది.
6) టిబెట్ హీట్ ఇంజిన్ సిద్ధాంతం
-నెల్లూరు జిల్లాకు చెందిన పీ కోటేశ్వరం ప్రసిద్ధి చెందిన వాతావరణ శాస్త్రవేత్త. ఈయన అభిప్రాయం ప్రకారం టిబెట్ పీఠభూమిలో నమోదయ్యే ఉష్ణోగ్రతలే రుతుపవనాల పురోగమనానికి కారణం.
– టిబెట్ పీఠభూమి పర్వతాంతర పీఠభూమి (Inter Mountain Plateau) 1000 కి.మీ. వెడల్పు, 2000 కి.మీ. పొడవుతో సగటు 4,500 మీ. ఎత్తు, 2.5 మిలియన్ల చ.కి.మీ. విస్తీర్ణం ఉంది.
-టిబెట్ పీఠభూమి సమతలంగా ఉండటం, సజాతీయంగా ఉండటం, ఎత్తులో ఉండటం వల్ల పరిసర ప్రాంతాల కన్నా అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేస్తూ అత్యల్ప పీడనాన్ని నమోదు చేస్తుంది. దీనివల్ల గాలులు వేగంగా, ఊర్థంగా వీస్తాయి.
-ఈ ఖాళీ ప్రదేశాన్ని భర్తీ చేయడానికి నైరుతి రుతుపవనాలు పురోగమిస్తాయి. ఈ విధంగా టిబెట్ పీఠభూమి రుతుపవనాల రాకకు ఉష్ణయంత్రం (Heat Engine)గా పనిచేస్తుంది.
రుతుపవనాల ముఖ్య స్వభావం (Nature of Monsoon)
– వేసవి, శీతాకాలాల్లో పరస్పర విరుద్ధ (తడి, పొడి) లక్షణాలు గల వాయురాశులను కలిగి పరస్పర విరుద్ధ దిశల్లో వీస్తాయి. ఉదా: నైరుతి (సౌత్-వెస్ట్), ఈశాన్య (నార్త్-ఈస్ట్)
-అకస్మాత్తుగా భూ భాగంలోకి ప్రవేశిస్తాయి.
-నెమ్మదిగా క్రమపద్ధతిలో దేశవ్యాప్తంగా వ్యాపిస్తాయి, నెమ్మదిగా క్రమపద్ధతిలో తిరోగమిస్తాయి.
– అనిశ్చిత స్వభావాన్ని కలిగి ఉంటాయి.
– రుతుపవనాలు ప్రాథమికంగా వాయువులతో కూడిన వ్యవస్థ, దీనిలో గాలుల దిశ రుతువుల ప్రకారం మారుతుంది.
– వేసవి కాలంలో రుతుపవనాలు సముద్రం నుంచి భూమిపైకి వీస్తాయి.
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు