భారత్‌లో తరచూ భూకంపాలు సంభవించే రాష్ట్రం?
భూకంప ఛాయ మండలం ( Shadow Zone)
# భూకంప నాభికి నేరుగా ఎదురుగా (వ్యతిరేక దిశలో) ఉన్న భూభాగానికి (ఇది మొత్తం భూభాగంలో సుమారు సగభాగం ఉంటుంది) P, S తరంగాలు నేరుగా చేరలేవు. ఈ భాగాన్నే భూకంప ఛాయ మండలం అంటారు.
భూకంప నాభి (Focus)
# భూకంపాలు ఏర్పడిన స్థానాన్ని భూకంపన కేంద్రం లేదా భూకంప నాభి అని అంటారు. లేదా భూకంపం ఉద్భవించే అంతర్భౌమ బిందువుగా పిలుస్తారు.
అభికేంద్రం (Epicenter)
# భూకంప నాభికి ఊర్ధంగా ఉపరితలంపై గల కేంద్రాన్ని అభికేంద్రం లేదా అధికేంద్రం అంటారు. అత్యధిక శాతం భూకంపాలు స్వల్ప ప్రకంపనలు మాత్రమే. పెను భూకంపాలు సాధారణంగా చిన్నచిన్న ప్రకంపనలతో మొదలై ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విధ్వంసకర అఘాతాల రూపం దాలుస్తాయి. చివరకు పరాఘాతంగా పిలిచే క్రమంలో తగ్గుముఖం పట్టే కంపనాలుగా మారి అంతమవుతాయి.
భూకంప రకాలు
# నాభి లోతు ఆధారంగా భూకంపాలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి
1. గాథ భూకంపాలు
2. మాధ్యమిక భూకంపాలు
3. అగాథ భూకంపాలు
గాథ భూకంపాలు
# ఇవి ఉపరితలం నుంచి 0-60 కి.మీ వరకు వ్యాపించి ఉంటాయి. ఈ భూకంపాలు చాలా తరచుగా సంభవిస్తాయి. నాభి భూ ఉపరితలానికి సమీపంలో ఉండటంవల్ల తీవ్ర విధ్వంసం సృష్టిస్తాయి.
మాధ్యమిక భూకంపాలు
# ఇవి 60 కి.మీ నుంచి 300 కి.మీ లోతు వరకు వ్యాపించి ఉంటాయి.
అగాథ భూకంపాలు
# ఇవి 300 కి.మీ నుంచి 700 కి.మీ లోతు వరకు వ్యాపించి ఉంటాయి.
భూ చలనాలు
# భూ కంపాల వల్ల వచ్చే భూచలనాలు పలు రకాల విధ్వంసకర ప్రభావాలను కలిగి ఉంటాయి. అందులో కొన్ని ప్రధానమైన ప్రభావాలు.
# భూకదలిక (Ground Shaking) నేల గుండా ప్రకంపన తరంగాలు ప్రయాణించడం వల్ల నేల వెనుకకు, ముందుకు చలిస్తుంది.
# మృత్తికా భంగాలు (Soil Failures) భూకదలికల వల్ల నేల ద్రవీకరించడం, భూపాతాలు వంటివి ఏర్పడతాయి. ఉపరితల భ్రంశ (Surface Fault Ruptures) పగుళ్లు, నిలువు చీలికలు మొదలైనవి.
# వేలా తరంగాలు (Tsunami) జలాశయ ఉపరితలంపై వచ్చే అతిపెద్ద తరంగాలు తీర ప్రాంతాల్లో భారీ నష్టానికి కారణమవుతాయి.
భూకంపాల లక్షణాలు
# భూ కంపాలు స్వతఃసిద్ధంగా సంభవిస్తాయి. అది సహజ లక్షణం. భూకంపాలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఆకస్మికంగా సంవత్సరంలో ఎప్పుడైనా సంభవిస్తాయి.
# వరదలు, చక్రవాతాలు (తుఫాన్లు) ఇతర ప్రధాన ఆకస్మిక విపత్తులకు దారితీసే వైపరీత్యాలు హెచ్చరిక వ్యవధిని కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి ముందుస్తు చర్యలు తీసుకోవడానికి, నివారించుకోవడానికి వాటి బారి నుంచి ప్రజలను రక్షించడానికి కొంత అవకాశం ఉంటుంది.
# భూకంపాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండా వస్తాయి. వాటిని ముందుగా ఊహించడానికి, నివారించడానికి అవకాశం లేదు. అయినప్పటికీ దాని వల్ల సంభవించే విధ్వంసాన్ని మనం తగ్గించవచ్చు.
# భూప్రకంపనలు విభిన్న పౌనఃపున్యాలు వేగాల్లో సంభవిస్తాయి. భూకంపం వాస్తవ పగుళ్ల ప్రక్రియ కొద్ది సెకన్ల పాటు మాత్రమే ఉంటుంది. భారీ భూకంపం అయితే ఒక నిమిషం పాటు ఉంటుంది.
# పెను భూకంపాలు సాధారణంగా రెండు విరూపకారక పలకలు కలిసే కూడలి వద్ద సంభవిస్తాయి. ఉదా: ఇండియన్ పలకం, యూరేషియన్ పలకం కిందకు వెళ్లే హిమాలయ పర్వతశ్రేణి వెంబడి తీవ్ర భూకంపాలు ఏర్పడుతుంటాయి. ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన భూకంపాల్లో కొన్ని భారత్‌లో సంభవించడానికి ఇదే కారణం.
భూకంపాలను కొలవడం
# భూకంపాలను వాటి పరిమాణం, తీవ్రతను బట్టి రెండు పద్ధతుల్లో కొలుస్తారు.
రిక్టర్స్కేల్
# భూకంప సమయంలో బహిర్గతమైన మొత్తం శక్తిని తెలుసుకోవడానికి 1935లో అమెరికాకు చెందిన డాక్టర్ చార్లెస్ ఫ్రాన్సిస్ రిక్టర్ అనే శాస్త్రవేత్త ఒక స్కేలును రూపొందించాడు. రిక్టర్ భూకంప తరంగ దైర్ఘ్యం ఆధారంగా ఒక పట్టికను రూపొందించి, భూకంప తీవ్రతను 0 నుంచి 9 వరకు 10 వర్గాలుగా విభజించాడు.
# ట్రైనైట్రో టోల్విన్ అనే రసాయన పదార్థం విడుదల చేసే శక్తితో భూకంప శక్తిని తులనం చేసి, దాని ఆధారంగా ఈ విభజన చేశాడు. దీన్ని సంవర్గ మానాల రూపంలో తెలిపాడు. ఈ స్కేలుపై ఒక అంకె 10 రెట్లు హెచ్చు శక్తికి సంకేతమవుతుంది. సాధారణంగా భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుతో తెలుపుతారు.
# భూకంప పరిమాణం లేదా దానివల్ల విడుదలైన శక్తి మొత్తాన్ని సిస్మోగ్రాఫ్‌ను ఉపయోగించి నిర్ధారిస్తారు.
# రిక్టర్ స్కేల్‌పై 7.5 పరిమాణం ఉన్న భూకంపం 6.5 పరిమాణం ఉన్న భూకంపం కంటే 30 రెట్లు అధిక శక్తిని విడుదల చేస్తుంది.
# ఇప్పటి వరకు రిక్టర్ స్కేల్‌పై నమోదైన అతిపెద్ద భూకంప పరిమాణం 9.25. మొదటిది 1960లో చిలీలో సంభవించగా, రెండోది అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో 1965లో నమోదైంది.
# ఇటీవల కాలంలో రిక్టర్ స్కేల్‌పై 9.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించిన భూకంపం జపాన్‌లోని పుకుషిమాలో 9.0 గా నమోదైంది.
రిక్టర్ స్కేల్ పట్టిక
క్ర.సంఖ్య ద్రవ్యరాశికి TNT సమాన శక్తి విడుదల చేయగలిగే శక్తి
1 600గ్రాములు చెట్టు బెరడు ఊడగలిగే శక్తి
2. 200 కిలోలు చిన్న కట్టడం పగిలేటంత శక్తి
3. 600 కిలోలు చిన్న క్వారీలో శిలలు పగిలేటంత శక్తి
4. 30,000 కిలోలు (30MT ) పెద్ద క్వారీలో శిలలు పగిలేటంత శక్తి
5. 600 మెట్రిక్ టన్నులు చిన్న అణుబాంబులో ఉండే శక్తి
6. 20 కిలో టన్నులు పెద్ద అణుబాంబు శక్తి
7. 20,000 కిలో టన్నులు 30 హైడ్రోజన్ బాంబుల శక్తి
8. 60,000 కిలో టన్నులు 900 హైడ్రోజన్ బాంబుల శక్తి
9. 20,000,000 కిలో టన్నులు 27,000 హైడ్రోజన్ బాంబుల శక్తి
మెర్కలీ స్కేలు
ఇది భూకంప తీవ్రతను, భూకంపం సంభవించిన చోట దాని ప్రభావాన్ని కొలుస్తుంది. దీన్ని 1902లో ఇటలీకి చెందిన మెర్కలీ రూపొందించారు. అందుకే ఈ స్కేలును మెర్కలీ స్కేలు అంటారు. అనంతరం ఆధునిక కాలానికి అనుగుణంగా దీన్ని ఆధునీకరించడంతో మోడిఫైడ్ మెర్కలీ స్కేలు అంటున్నారు. ఇది ప్రజల మీద, నిర్మాణాల మీద, భూఉపరితలం మీద, భూకంప ప్రభావ తీవ్రతను తెలియజేస్తుంది.
1. భూకంపం ఏ సమయంలో సంభవించవచ్చు?
1) ఉదయం 2) మధ్యరాత్రి
3) మధ్యాహ్నం 4) పైవన్నీ
2. రివైజ్ చేసిన సిస్మిక్ జోన్ల ప్రకారం తెలంగాణ, ఏపీలో ఎక్కువ భూకంపాలకు లోనయ్యే ప్రాంతంగా గుర్తించినది?
1) నల్లగొండ 2) గుంటూరు
3) ఒంగోలు 4) కరీంనగర్
3. భారత్‌లో ఉన్న అయిదు సిస్మిక్ జోన్లలో ఏది ఎక్కువ వాతావరణ మార్పులకు గురవుతుంది?
1) 5 వ జోన్ 2) 4వ జోన్
3) 2వ జోన్ 4) 3వ జోన్
4. భూకంపాల వల్ల పరిణామాల్లో సమ్మిళితమైనది?
1) ఇండోనేషియా 2) జపాన్
3) చైనా 4) భారత్
5. రింగ్ ఆఫ్ ఫైర్ (మంటల ఛట్రం) ఏ సాగరానికి సంబంధించినది?
1) అట్లాంటిక్ 2) పసిఫిక్
3) ఇండియన్ 4) అంటార్కిటిక్
6. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్లాండర్ట్ భూకంపాలు సంభవించడానికి వీలున్న ప్రాంతాలను ఎన్ని మండలాలుగా విభజించింది?
1) 5 2) 6 3) 7 4) 8
7. 2012 ఏప్రిల్ 11న ఏ దేశంలో భారీ భూకంపం సంభవించి తూర్పు తీర ప్రాంతంలోని 28 దేశాల్లో సునామీ హెచ్చరికలకు దారితీసింది?
1) బ్రూనై 2) మలేషియా
3) ఇండోనేషియా 4) ఫిలిప్పీన్స్
8. భూకంపంలో నుంచి వదిలేవి?
1) కంపనాలు 2) ప్రకంపనాలు
3) కంపనాలు, ప్రకంపనాలు
4) ప్రకంపనాలు, మంటలు
9. కింది ఏ దేశంలో దాదాపుగా భూకంపాలు సంభవించవు?
1) చిలీ 2) పాకిస్థాన్
3) న్యూజిలాండ్ 4) ఆస్ట్రేలియా
10. భారత రాష్ట్రాల విస్తృత వైపరీత్య వివరణను ప్రతిబింబించేది ఒకే దస్తావేజు పల్నెరెబిలిటీ అట్లాసు. దీన్ని తయారుచేసింది ఎవరు?
1) భవన నిర్మాణ సామగ్రి, టెక్నాలజీని పెంపొందించే కౌన్సిల్ (బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్)
2) భారత వాతావరణ శాఖ ( ఇండియా మెటిరోలాజికల్ డిపార్ట్మెంట్
3) విపత్తు నిర్వహణ సంస్థ (డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్)
4) యునెస్కో
11. భూకంపాలు, అగ్నిపర్వతాలు దేనితో సహసంబంధాన్ని కలిగి ఉంటాయి?
1) ముడత, భ్రంశం చెందిన ప్రాంతం
2) అగాథ సముద్ర మైదానం
3) పీఠభూమి ప్రాంతం
4) సముద్ర ప్రాంతం
12. ‘నిఫే’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
1) భూకంపాలు
2) భూమి అంతర్భాగం
3) భూపటలం
4) మహాసముద్రం అడుగు భాగం
13. భూకంప తీవ్రతను కొలిచే సాధనం?
1) రిక్టర్ స్కేల్ 2) హైడ్రోమీటర్
3) బారోమీటర్ 4) ఏదీకాదు
14. భారత్‌లోని ఏ రాష్ట్రంలో భూకంపాలు ఎక్కువ సంభవించే అవకాశాలు ఉన్నాయి?
1) న్యూఢిల్లీ 2) ఆంధ్రప్రదేశ్
3) గుజరాత్ 4) కేరళ
15. ఏ రోజున భూప్రకంపనలు భారత్‌లోని పలు తూర్పుతీర ప్రాంతాల్లో సంభవించాయి?
1) 11-04-2012
2) 13-04-2012
3) 09-04-2012
4) 08-04-2012
16. భారత్‌లో తరచూ భూకంపాలు సంభవించే రాష్ట్రం?
1) అస్సాం 2) బీహార్
3) మేఘాలయ 4) మహారాష్ట్ర
17. భూకంపం దేనికి దారితీస్తుంది?
1) భూకంప కదలికకు
2) భూపాతానికి
3) ఉపరితల పగులు 4) పైవన్నీ
18. కింది వాటిలో సరైనది?
1) భూకంపం అమాంతంగా జరిగే విపత్తు
2) భూకంపాన్ని ముందే ఊహించవచ్చు
3) భూకంపం 25 నిమిషాలు ఉంటుంది
4) భూకంపం రాత్రిపూట సంభవిస్తుంది
19. సిడర్ తుఫాన్ బంగ్లాదేశ్‌కు తీవ్ర నష్టం కలిగించిన సంవత్సరం?
1) 15-11-2007
2) 15-11-2008
3) 12-10-2006
4) 12-10-2008
20. ఏపీలో పెనుతుఫాను సంభవించి భారీ సంఖ్యలో ప్రాణ నష్టం ఏ సంవత్సరంలో జరిగింది?
1) 15-11-1977
2) 15-11-1978
3) 15-11-1976
4) 15-11-1975
21. తుఫానుల అవాంఛనీయ ప్రభావం?
1) అవస్థాపన నష్టం
2) దూర ప్రసారాల నష్టం
3) విద్యుత్ ఆటంకం 4) పైవన్నీ
22. ఆసియాలో నివసించే 4 బిలియన్ల జనాభాలో ఎంత శాతం తీరప్రాంతం దగ్గర నివసిస్తున్నారు?
1) 7 శాతం 2) 6 శాతం
3) 5 శాతం 4) 4 శాతం
23. తుఫాను అంటే ఏమిటి?
1) ఉత్తరార్థగోళంలో సవ్య (ప్రదక్షిణ) గాలులతో కూడిన అల్పపీడన వ్యవస్థ
2) ఉత్తరార్థగోళంలో అపసవ్య (అప్రదక్షిణ) గాలులతో కూడిన అధిక పీడన వ్యవస్థ
3) ఉత్తరార్థగోళంలో అపసవ్య గాలులతో కూడిన అల్పపీడన వ్యవస్థ
4) ఉత్తరార్థగోళంలో సవ్య గాలులతో కూడిన అధిక పీడన వ్యవస్థ
24. సైక్లోస్’ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది?
1) చైనీస్ 2) లాటిన్
3) ఫ్రెంచి 4) గ్రీక్
25. ‘సైక్లోన్’ అనే పదం సైక్లోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. ‘సైక్లోస్’ పదానికి అర్థం ఏమిటి?
1) తుఫాన్ 2) పాము చుట్ట
3) ప్రకటన 4) కింది విభాగం
26. గాలివాన (హరికేన్)?
1) ప్రకృతి విపత్తు
2) మానవ ప్రేరిత విపత్తు
3) సునామీ
4) భూమి విరిగిపడటం
సమాధానాలు
1-4, 2-3, 3-1, 4-4, 5-2, 6-1, 7-3, 8-3, 9-4, 10-1, 11-1, 12-2, 13-1, 14-3, 15-1, 16-1,
17-4, 18-1, 19-1, 20-1, 21-4, 22-1, 23-3, 24-4, 25-2, 26-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు