హిమాలయాల రాణి అని దేన్ని పిలుస్తారు?
భారతదేశం- అత్యంత పురాతనమైన పీఠభూములు
అత్యంత నవీన ముడత పర్వతాలు, అంతకన్నా నవీనమైన నిక్షేపణ మైదానాలు, అవశిష్ట పర్వతాలు, పరిశిష్ట పర్వతాలు, తీర మైదానాలు, ఉష్ణమండల, సమశీతోష్ణ మండల ఎడారులతో ఉప ఖండం అని పిలవడానికి కావాల్సిన భౌగోళిక విశిష్టతను కలిగి ఉంది.
CSO(Central Statistics Office)-1950 అంచ నాల ప్రకారం మొత్తం భారతదేశ విస్తీర్ణంలో భూస్వ రూపాలు 4 రకాలు. అవి.
పర్వతాలు – 10.7 శాతం
కొండలు – 18.6 శాతం
పీఠభూములు – 27.7 శాతం
మైదానాలు – 43.0 శాతం
మొత్తం 100 శాతంగా ఉన్నాయి.
హిమాలయాలు (The Himalayas)
# పుట్టుకరీత్యా ఆల్పైన్ కాలానికి చెందిన అత్యంత నవీన ముడత పర్వతాలు (Young Fold Mountains) హిమాలయాలు.
# హిమాలయాలు అంటే ‘మంచు నిలయాలు’ (A bode of Snow) అని అర్థం.
# 3050 మీటర్ల సగటు ఎత్తులో 2500 కిలోమీటర్ల పొడవు, 160 నుంచి 400 కిలోమీటర్ల మధ్య వెడల్పు కలిగిన పర్వతాలు.
# ఇవి అర్ధచంద్రాకారం లేదా కొడవలి లేదా చాపం ఆకారంలో ఉండి ప్రపంచంలో అత్యంత ఎత్తుగల పర్వత శ్రేణులను కలిగి ఉన్నాయి.
# హిమాలయాల పుట్టుక (Original of Himalayas): ‘క్రెటేషియన్ యుగం’ చివరి దశలో ప్రారంభమైన హిమాలయాల ఆవిర్భావం ఇప్పటికి కూడా కొనసాగుతుంది.
# ప్రస్తుతం 5 నుంచి 10 సెం.మీ.ల చొప్పున ప్రతి సంవత్సరం ఎత్తు పెరుగుతున్నాయి.
# హిమాలయ ముడత పర్వతాల పుట్టుకను వివరించే ‘ఆల్ఫ్రైడ్ వెజినర్’ ప్రతిపాదిత ఖండచలన సిద్ధాంతం, సముద్ర భూతల విస్తరణను నాందిగా చేసుకుని మోర్గాన్, హెస్…. ప్రతిపాదించిన ‘పలక విరూపక సిద్ధాంతం (Plate Tectonic Theory) హిమాల యాల పుట్టుకను వివరిస్తున్నాయి.
# ఉష్ణసంవహన ప్రవాహం (Convection Currents) కారణంగా గోండ్వానా భూభాగం నుంచి విడివడిన భారత ద్వీపకల్ప భాగం ఉత్తరవైపుగా కదలడం ప్రారంభించింది. ఇలా ఉత్తరంగా చొచ్చుకువస్తూ యురేషియన్ పలకను ఢీ కొట్టడం ప్రారంభించింది.
#పై రెండు పలకల మధ్యగల టెథిస్ భూ అభినతి (Geo syncline) నుంచి హిమాలయాలు దశల వారీగా ఆవిర్భవించాయి.
మొదటి దశ
#ద్వీపకల్ప భాగం యురేషియా పలక కిందకు చొచ్చుకు వెళ్లి టెథిస్ నిక్షేపాలను పైకి నెట్టడంతో ఈ దశ ప్రారంభమైంది.
#6.5 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మొదటి ఉన్నతిలో మొదటగా ట్రాన్స్ హిమాలయాలు, ప్రధాన హిమాలయాలుగా ఆవిర్భవించాయి. క్రెటేషియన్ చివరి దశకు, ఇయోసీస్ ప్రారంభ దశకు మధ్య ఏర్పడ్డాయి.
రెండవ దశ
# 4.5 కోట్ల సంవత్సరాల క్రితం ఇయోసిస్కు, మయోసీన్ యుగానికి మధ్యకాలంలో జరిగిన రెండవ ఒత్తిడి వల్ల హిమాచల్ శ్రేణులు ఏర్పడ్డాయి.
మూడవ దశ
# 1.4 కోట్ల సంవత్సరాల క్రితం మధ్య మయోసీన్, మధ్య ప్లిస్టోసీన్ యుగాల మధ్య ఏర్పడ్డాయి. ఈ దశలో శివాలిక్ పర్వతాలు ఏర్పడ్డాయి. ఈ ఎత్తయిన ఉన్నతుల మధ్య భ్రంశాలు (Faults) కూడా ఏర్పడి లోతైన లోయ నిర్మాణంగా ఉండి ఈ పర్వతాలను విభజిస్తున్నాయి.
భారతదేశ భౌగోళిక విభజన 6 విభాగాలుగా ఉంది. అవి..
విభాగాలు విస్తీర్ణం విస్తీర్ణతా శాతం
ఉత్తరాన పర్వతాలు
లేదా హిమాలయాలు 5,78,000 km2 17.9%
హిమాలయాలు
బృహత్తర మైదానాలు 5,50,000 km2 17.1%
థార్ ఎడారి 1, 75,000 km2 5.4%
ద్వీపకల్ప పీఠభూమి 15, 77, 000km2 48.9%
తీరమైదానాలు 3, 35, 000 km2 10.4%
ద్వీప సముదాయాలు 8, 300 km2 0.3%
హిమాలయ పర్వతాల భౌగోళిక విభజన
#హిమాలయ పర్వతాలను ప్రధానంగా 4 భాగాలుగా విభజించారు. అవి.
ట్రాన్స్ హిమాలయాలు
హిమాద్రి హిమాలయాలు
హిమాచల్ హిమాలయాలు
శివాలిక్ కొండలు
ట్రాన్స్ హిమాలయాలు
# వీటిని టిబెట్, టెథిస్ హిమాలయాలు అని కూడా పిలుస్తారు.
#తజకిస్థాన్ దేశంలోని పామీర్ ముడి కేంద్రంగా విస్తరించిన పర్వతాలను ట్రాన్స్ హిమాలయాలు అంటారు.
# ట్రాన్స్ హిమాలయాలు అంటే హిమాలయాలకు ఉత్తరం వైపున విస్తరించినవి అని అర్థం.
# ఇవి 1000 కిలోమీటర్ల పొడవు, 225 కిలోమీటర్ల గరిష్ట వెడల్పు కలిగి ఉన్నాయి.
#పామీర్ ముడిని ప్రపంచ పైకప్పు (Roof of the World) అంటారు. ముడి అంటే కొన్ని పర్వత శ్రేణులు కలిసే ప్రాంతం అని అర్థం.
#పామీర్ ముడికి పశ్చిమంగా హిందూకుష్ పర్వతాలు, నైరుతి దిశలో సులేమాన్ పర్వతాలు, తూర్పువైపున టైన్షాన్, కున్లున్ పర్వతాలు, దక్షిణాన భారత భూభాగంలోని కారకోరం, లద్దాఖ్, జస్కార్, కైలాస్ మొదలైన పర్వతాలు ఉన్నాయి.
# హిందూకుష్ పర్వతాలు అఫ్గానిస్థాన్‌లో ఉన్నాయి. వీటిలో ఐదు సింహాల లోయగా పిలిచే ‘పంజ్‌షిర్ లోయ’ ఉంది. ఈ లోయ గుండా కాబూల్ ఉపనది పంజ్‌షిర్ నది ప్రవహిస్తుంది.
# సింధూ నదికి పశ్చిమ భాగాన, సమాంతరంగా విస్తరించిన పర్వతాలు ‘సులేమాన్ పర్వతాలు’. ఇందులో కైబర్ కనుమ (Khyber Pass) ఉంది.
#సులేమాన్ పర్వతాలకు దక్షిణంగా విస్తరించిన శ్రేణి ‘కిర్త్హర్ శ్రేణి (తోబకాకర్ శ్రేణి)’. వీటిలో ‘బోలాన్ కనుమ’ (Bolan Pass) ఉంది.
ట్రాన్స్ హిమాలయ పర్వతాల విస్తరణ
# భారత్- కారకోరం, లద్దాఖ్, జస్కార్ పర్వతాలు
# పాకిస్థాన్- సులేమాన్, కిర్త్హర్ పర్వతాలు
#టిబెట్- కునులున్, కైలాస్ పర్వతాలు
# పాకిస్థాన్, అఫ్గానిస్థాన్- హిందూకుష్, హిందూరాజ్ పర్వతాలు
# చైనా- టైన్షాన్ పర్వతాలు
# కారకోరమ్ పర్వతశ్రేణి- వీటికి లద్దాఖ్‌లో ‘కృష్ణగిరులు’, ‘ఉన్నత ఆసియా వెన్నెముక’ అని కూడా పేరు ఉంది.
#టర్కిష్ భాషలో కారకోరమ్ అంటే ‘బ్లాక్ గ్రావెల్’ అని అర్థం.
# ఇవి పామీర్ నుంచి ష్యోక్ నది వరకు 600 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి.
వీటిలో ఉన్న శిఖరాలు
# K2 లేదా గాడ్విన్ ఆస్టిన్ శిఖరం. దీని ఎత్తు 8611 మీటర్లు. కారకోరమ్లో గుర్తించిన రెండవ శిఖరం కాబట్టి K2 అని పేరు పెట్టారు.
# దీన్ని గుర్తించింది టీసీ మౌంట్ గోమరి. ఆ తర్వాత హిమాలయాలను విస్తృతంగా సర్వే చేసిన ‘గాడ్విన్ ఆస్టిన్’ పేరు పెట్టారు. దీన్ని హిమాలయాల రాణి (Queen of Himalayas), పర్వతాల పర్వతం (The Mountain of Mountain) అని కూడా పిలుస్తారు.
# ఈ శిఖరాన్ని భారత్‌లో కృష్ణగిరి, చైనాలో కోగీరు, పాకిస్థాన్‌లో చోగొరి అని పిలుస్తారు.
#భారత్‌లో ఎత్తయిన, ప్రపంచంలో రెండవ ఎత్తయిన శిఖరం K2. ఇది ‘షక్స్గమ్లోయ’లో ఉంది.
#గ్యాషీర్ బం శిఖరం- దీన్ని K5 లేదా హీడెన్ శిఖరం అంటారు. దీనికి దక్షిణం వైపున సియాచిన్ హిమానీ నదం ఉంది. దీని ఎత్తు 8080 మీటర్లు.
# మాషెర్ బం శిఖరం- దీనిని K1 అని కూడా పిలుస్తారు.
# కారకోరమ్ శ్రేణుల్లో మొదట సర్వే చేసి గుర్తించడం వల్ల దీనికి K1 అని పేరు పెట్టారు.
# వీటిపై ఉన్న హిమానీ నదాలు- కారకోరమ్ శ్రేణులను హిమానీ నదాల పెంపక క్షేత్రం అని కూడా అంటారు.
# సియాచిన్ హిమానీనదం- కారకోరమ్లో అత్యంత పొడవైన నది (76కి.మీ). ఇక్కడ కరిగే నీరు నుబ్రానదిగా ప్రవహిస్తుంది. నుబ్రానది ష్యోక్ నదికి ఉపనది.
#‘ఇందిరా కాల్’ దీనిలోనే ఉంది. కారకోరమ్ కనుమ ఈ సియాచిన్‌కు తూర్పు వైపు ఉంది.
# బొల్లోరా హిమానీనదం- కారకోరమ్లో రెండో పొడవవైన హిమానీనదం (63 కి.మీ)
# బాయాఫో హిమానీనదం
# హిస్సార్ హిమానీనదం
#రిమో హిమానీనదం
# బతూర హిమానీనదం
కారకోరమ్ శ్రేణిల్లో కనుమలు
#కిలిక్ కనుమ (కిలిక్ దావన్)- ఇది భారత్‌కు ఉత్తరాన గల చిట్టచివరి ప్రాంతం.
#పాక్ ఆక్రమిత ప్రాంతంలోని (పీవోకే) ‘గిల్గిట్- బాల్టిస్థాన్’ ప్రాంతాన్ని చైనాలోని జిన్ జి యాంగ్‌లోని కష్గర్ (కషి) పట్టణాన్ని కలుపుతుంది.
# ఖుంజెరబ్ కనుమ- కిలిక్ కనుమకు తూర్పున పాక్ ఆక్రమిత కశ్మీర్లో కలదు.
# ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఉన్న అంతర్జాతీయ సరిహద్దు గల కనుమ (4693 మీటర్లు)
# అఘిల్ కనుమ- K2 శిఖరానికి అత్యంత సమీపంలో ఉంది.
# కారకోరమ్ కనుమ- సియాచిన్ హిమానీనదానికి ఈశాన్య దిక్కున ఉంది. భారత్, చైనాను కలుపుతుంది.
# జ్యోంగ్లా కనుమ- భారత్‌లో అతి ఎత్తయిన కనుమ (5686 మీటర్లు)
# సియాలా కనుమ- చైనా, భారత్‌కు సరిహద్దులో సియాచిన్ హిమానీనదానికి వాయవ్య దిశలో ఉంది.
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్
9966330068
- Tags
- competitive exams
- TSPSC
- upsc
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు