పెరుగుతున్న జనాభా పెను సవాలు..
ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న వర్తమాన సమస్యల్లో ప్రధానమైనది అధిక జనాభా. ఒక దేశ జనాభా పెరుగుదల అభిలషణీయమైన స్థాయిలో కంటే తక్కువగా ఉంటే అది దేశాభివృద్ధికి సూచికగా పరిగణించవచ్చు. అందుకే ప్రఖ్యాత జనాభా శాస్త్రవేత్త ఎడ్విన్ కానన్ భూమి మీద పుట్టే ప్రతి బిడ్డ అభివృద్ధి కారకం అవుతుందని పేర్కొన్నాడు.
అభివృద్ధి నిరోధకంగా జనాభా సమస్య
-దేశ జనాభా అభిలషణీయ స్థాయికంటే ఎక్కువగా పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం అవుతుంది. నేడు ప్రపంచ జనాభాలో 54 శాతం నగరాల్లోనే నివసిస్తున్నదని, 2050 నాటికి మూడింట రెండొంతుల జనావళికి నగరాలే ఆవాసం కానున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 2045 నాటికి 600 కోట్ల మందికి పైగా పట్టణవాసులే ఉంటారని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉపాధి కోసం అధికంగా పట్టణాలకు వలస పోవటం మూలంగా పర్యావరణం, వాతావరణ కాలుష్యం, ఆర్థిక, ఆహారభద్రత సమస్యలు, ఆహార ధాన్యాల కొరత, గృహవసతి, మౌలిక సదుపాయాల సమస్యలు, మురికి వాడల పెరుగుదల, ఇంధన సంక్షోభం, పేదరికం, నిరుద్యోగం, రవాణా, ఉపాధి, విద్య, ఆరోగ్యం, రక్షిత మంచినీటి కొరత లాంటివి అనునిత్యం మనం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం అధిక జనాభా. ఇప్పటికే కోటి మందికిపైగా ప్రజలతో కిక్కిరిసిన మెగాసిటీలు ప్రపంచంలో 28 ఉండగా, 2030 నాటికి వీటి సంఖ్య 41కి చేరుతుందని అంచనా. ఇప్పటికే అత్యధిక జనాభా గల మెగా సిటీల తొలి ఐదింటిలో రెండు భారత్లో ఉన్నాయి.
ఒకచోట అధికం మరోచోట అల్పం
-ప్రపంచ జనాభా ప్రణాళిక-2012 ప్రకారం 2028 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించనుందని నివేదికల్లో పేర్కొన్నది. ప్రపంచంలో కొన్ని దేశాలు అత్యధిక జనాభాతో అల్లాడిపోతుంటే, మరికొన్ని దేశాలు అల్పజనాభాతో కుంగిపోతున్నాయి. రాబోయే పదేండ్లలో ప్రపంచ దేశాల్లో తొలిసారిగా వంద కోట్ల జనాభా చేరుకోవడానికి ఇరవై లక్షల ఏండ్లు పడితే, ప్రస్తుతం 12 ఏండ్లే పడుతున్నది. నిరంతరం పెరుగుతున్న జనాభా ప్రపంచానికి పెను సవాలుగా మారడంతో భారత్ భయాందోళనలకు గురవుతున్నది. జనాభావృద్ధి రేటుకు మౌలిక సౌకర్యాలకు మధ్య అందనంత అగాథముంది. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న జనాభా వలన కలిగే దుష్ఫలితాలను ప్రపంచ మానవాళికి తెలపడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని 1987, జూలై 11ని ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్వహించుకోవడానికి తీర్మానించింది. 1989 నుంచి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు.
ప్రపంచ జనాభాలో మైలురాళ్లు
భారత్కు జనాభాయే బలం, బలహీనత
-భౌగోళికంగా ప్రపంచ దేశాల్లో భారత్ ఏడో పెద్ద దేశంగా, ప్రపంచ భూభాగంలో 2.4 శాతాన్ని కలిగి ఉన్నది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల చైనా తర్వాత భారత్ ద్వితీయ స్థానంలో ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 121 కోట్లు. ప్రపంచ జనాభాలో భారత్ జనాభా 17.5 శాతం కలిగి ఉన్నది. ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన అమెరికా ప్రపంచ జనాభాలో 4.5 శాతం ఉంటే జనాభాలో 7.2 శాతాన్నే కలిగి ఉన్నది. 2001-2011ల మధ్య భారత్లో పెరిగిన జనాభా 18.19 కోట్లు. మనదేశంలో ప్రతి నిమిషానికి 29 మంది, గంటకు 1768 మంది, రోజుకు 42,434 మంది, నెలకు 12,73,033 మంది, ఏడాది గడిచే సరికి 1,55,31,000 మంది జన్మిస్తున్నారు. ప్రపంచంలో జన్మించే ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడే. ప్రపంచంలో అత్యధిక జనాభా గల ఐదో పెద్ద దేశమైన బ్రెజిల్ జనాభా, భారత్లో 2001-2011 మధ్య కాలంలో పెరిగిన జనాభా 18.1 కోట్ల కంటే ఎక్కువ. ప్రపంచంలోని వివిధ దేశాల జనాభా కన్నా మనదేశంలోని రాష్ర్టాల జనాభా ఎక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ జనాభా బ్రెజిల్ దేశ జనాభాకంటే ఎక్కువ. మహారాష్ట్ర జనాభా మెక్సికోతో పోటీపడుతుంటే, బీహార్ జనాభా జర్మనీతో సమానం. మన దేశ జనాభా అమెరికా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల జనాభాకు సమానం. మనదేశంలో దశాబ్ది కాలంలో పెరిగిన జనాభా పాకిస్థాన్ జనాభా (18.48 కోట్లు) కంటే కొంచెం తక్కువ. మన దేశ జనాభా బంగ్లాదేశ్ (16.44 కోట్లు), నైజీరియా (16.88 కోట్లు), రష్యా (14.04 కోట్లు), జపాన్ (12.81 కోట్లు) దేశాల కంటే ఎక్కువ. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రపంచంలో వార్షిక జనాభా వృద్ధిరేటు 2000-2010 మధ్య కాలంలో 1.23 శాతం ఉంటే, చైనాలో వార్షిక జనాభా వృద్ధిరేటు 0.53 శాతం మాత్రమై నమోదైంది. కానీ భారత్లో ఇదే కాలంలో వార్షిక జనాభా వృద్ధిరేటు 1.64 శాతం నమోదైంది. ఇదే కాలంలో నమోదైన వార్షిక జనాభా వృద్ధిరేటు రష్యా, జపాన్లలో 0.7 శాతమే. పెరుగుతున్న జనాభా వలన కలుగుతున్న నష్టాలను గ్రహించి భారతప్రభుత్వం 1952లో ప్రపంచంలోనే మొదటిసారిగా కుటుంబనియంత్రణ కార్యక్రమాలను ప్రారంభించి జనాభాను నియంత్రించడం కోసం రూ. 65 లక్షలు కేటాయించారు. 1966లో పూర్తిస్థాయి కుటుంబ నియంత్రణ శాఖను ఏర్పాటు చేశారు.
1976లో నూతన జనాభా విధానాన్ని ప్రకటించి అవసరమైతే కుటుంబనియంత్రణను తప్పనిసరి చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు. పురుషుల వివాహ వయస్సు 21 ఏండ్లు, స్త్రీల వివాహ వయస్సు 18 ఏండ్లుగా నిర్ణయించారు. 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో జనాభా పెరుగుదలను అరికట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని గురించి 1991 డిసెంబర్లో జాతీయాభివృద్ధి మండలిలో కరుణాకరన్ అధ్యక్షతన నియమించిన కమిటీ 1993, ఏప్రిల్ 5న నివేదికను సమర్పించింది. ఏడో పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వం అందిస్తున్న నిధులను 1.2 నుంచి 2 శాతానికి పెంచాలని, ఎనిమిదో పంచవర్ష ప్రణాళికాంతానికి 3 శాతానికి పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికేతర నిధుల కింద కుటుంబసంక్షేమ కార్యక్రమాలకు 10 శాతం నిధులను కేటాయించాలని సిఫారసు చేసినది. భవిష్యత్లో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కలిగిన వారు కేంద్ర, రాష్ట్ర చట్ట సభలకు పోటీ చేసే అర్హత లేకుండా చేయాలని 1992 డిసెంబర్లో నిర్ణయించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కుటుంబ నియంత్రణను అమలు చేసే బాధ్యతను, అధికారాన్ని పంచాయతీ వ్యవస్థకు ఇవ్వడంతో జనాభా సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అయింది.
సత్ఫలితాలివ్వని నియంత్రణ
– మనదేశంలో కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేయడానికి నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎంతో శ్రమించినా ప్రజల్లో వ్యతిరేక భావనలు వచ్చి సత్ఫలితాలు రాలేదు. మేమిద్దరం మాకిద్దరు అనే నినాదంతో కుటుంబ నియంత్రణ శాఖ జోరుగా ప్రచారం చేసినా అనుకున్న మేర జనాభా నియంత్రణను చేయలేకపోయారు. పొరుగున ఉన్న చైనా పెరుగుతున్న జనాభా వల్ల భవిష్యత్లో కలిగే ముప్పును గుర్తించి 1979లో మేమిద్దరం మాకు ఒక్కరు చాలు లేదా అసలే వద్దు అనే నినాదంతో జనాభా నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టినది. కుటుంబ నియంత్రణను పాటించని దంపతులపై అదనపు పన్నులను విధించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత విధించింది. అలాగే ఒక బిడ్డ కలిగిన దంపతులకు విద్యావైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించింది. డెంగ్ జియావో పింగ్ ప్రభుత్వం ఏక సంతాన విధానం ప్రవేశపెట్టి కఠినంగా అమలు పర్చడం వల్ల 40 కోట్ల మేర అదనపు జనాభా నివారించగలిగింది.
-మన దేశంలో జనాభా పెరుగుదలపై చైతన్యం కొరవడింది. అనుకున్న మేర జనాభాను నియంత్రించలేకపోయింది. మారుమూల ప్రాంతాల్లో, గిరిజన తండాల్లో జనాభా నియంత్రణపై అవగాహన లేకపోవడం, నిరక్ష్యరాస్యత, పేదరికం, నిరుపేదల కుటుంబాల్లో శిశు మరణాల రేటు ఎక్కువగా ఉండటం, పుట్టిన పిల్లలు ఎంతమంది బతుకుతారో అనే భరోసా లేకపోవడం వల్ల జనాభా పెరుగుదల రేటు నిరుపేదల కుటుంబాల్లో అధికంగా ఉన్నది. మతం పేరున, ధర్మం పేరిట, సంప్రదాయం పేరుతో, కులం పేరున చాలామంది కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో పాల్గొనటం లేదు. లేత వయస్సులోనే బాల్యవివాహాలు, సంపాదన లేకున్నా సంతానం కావాలనే ఆకాంక్ష, కాన్పు, కాన్పుకు మధ్య ఎడం పాటించకపోవడం, పేద కుటుంబాల్లో కుటుంబ సభ్యులు పెరిగితే ఆదాయం పెరగడానికి మార్గమని భావించడం, మరణాంతరం కొరివిపెట్టి పున్నామ నరకం నుంచి తప్పించేందుకు పుత్రుడు ఉండాలనే ఛాందస భావాలు ఉండటం, కొడుకు కోసం ఎదురుచూస్తూ పిల్లలు కనేవారు, కుటుంబ నియంత్రణను పాటించడం పాపం అనే అజ్ఞానం కలిగి ఉండటం వల్ల మన దేశంలో జనాభావృద్ధి నానాటికీ అధికమవుతున్నది. జనాభా పెరగడం వల్ల గ్రామాలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా, నగరాలు మహానగరాలుగా మారుతున్నాయి. జనావాసాలు పెరగడం మూలంగా అడవులు తగ్గి ఎన్నో రకాల వృక్ష జాతులు, జంతువులు అంతమయ్యాయి. ప్రతి ఏటా యాభై వృక్ష, జంతు జాతులు అంతరించే స్థాయికి చేరుకున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిరంతరం పెరుగుతున్న జనాభా పెను సమస్యలకు కారణమవుతున్నది. 2050 నాటికి భారతదేశ జనాభా 160 కోట్లకు చేరుతుందని ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోగ్రాఫిక్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం ప్రథమ స్థానంలో ఉన్న చైనా 130 కోట్లకు చేరుకుంటుందని, ప్రపంచ జనాభా కూడా 970 కోట్లకు చేరుతుందని అంచనా వేసిన నేపథ్యంలో భావి సవాళ్లకు దీటుగా ప్రజా ప్రభుత్వాలను కర్తవ్యోన్ముఖులను చేసేందుకు ఐక్యరాజ్య సమితి రూపొందించిన లక్ష్యా సాధనకు అందనంత దూరంలో ఉన్నాం.
– జనాభా పెరుగుదల వల్ల కలిగే అరిష్టాలను ప్రభుత్వం వార్తా పత్రికల ద్వారా, దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి. సంతానోత్పత్తి దశలో ఉన్న దంపతులకు కుటుంబ నియంత్రణ పద్ధతులను తెలుపుతూ, కుటుంబ నియంత్రణ పాటించిన పేదరికం దిగువన ఉన్న కుటుంబాలకు, ఉచిత విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పిస్తామని భరోసా ఇవ్వాలి. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఆడపిల్ల పుట్టినా, మగపిల్లవాడు పుట్టినా ఒకటేనని భావించి, జన్మించిన సంతానానికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి మంచి పౌరులుగా తీర్చిదిద్దడం దంపతుల ధ్యేయంగా ఉండాలని తెలుపుతూ పెరిగే జనాభాను గణనీయంగా తగ్గించాలి. గ్రామాల నుంచి పట్టణాలకు వలసపోకుండా యువతకు స్వయం ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించి పట్టణాలకు వలసలు పోకుండా చేసినప్పుడే పట్టణాల్లో పలు సమస్యలు నిరోధించవచ్చు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించి అగ్ర రాజ్యాల సరసన నిలబెట్టవచ్చు.
యూరప్లో జనాభా తగ్గుతుంది
– ఒక వైపు ప్రపంచ జనాభా శరవేగంగా పెరుగుతుంటే యూరప్ దేశాల్లో జనాభా తగ్గటం ఆ దేశాలకు ఆందోళన కలిగించే అంశం. ప్రత్యేకించి తూర్పు యూరప్ రష్యాల్లో జనాభా క్రమక్రమంగా తగ్గుతుంది. సంతాన సాఫల్యత రేటు తక్కువగా ఉండటం కూడా దీనికి ఒక కారణమని విశ్లేషకులు తెలుపుతున్నారు. ప్రస్తుత యూరప్ జనాభా 740 మిలియన్లు కాగా, 2050 నాటికి ఈ ఖండ జనాభా 732 మిలియన్లకు తగ్గుతుందని అంచనా.
– కొన్ని దేశాలు జనాభా పెరుగుదలను ప్రోత్సహిస్తున్నాయి
– అభివృద్ధి చెందిన దేశాలుగా గుర్తింపు పొందిన ఫ్రాన్స్, జర్మనీ, లక్సెంబర్గ్, డెన్మార్క్, రష్యా, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, పోర్చుగల్, స్పెయిన్, యూకే దేశాల్లో ఎక్కువ మంది పిల్లలు కనే జంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.
– పెరుగుతున్న వృద్ధ జనాభా : ఇటీవల విడుదల చేసిన వృద్ధుల జనాభా గణాంకాల లెక్కల ప్రకారం వృద్ధ జనాభా కూడా ప్రపంచంలో ఏ దేశంలో పెరగనంత మన దేశంలో పెరుగుతున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం వృద్ధుల జనాభా 10.39 కోట్లు. దేశ జనాభాలో వృద్ధుల శాతం 8.06. 2001-2011 మధ్య దశాబ్ది కాలంలో 2.7 కోట్లకు పైగా పెరిగినది. ఇలా పదేళ్ల కాలంలో 35 శాతం పెరగటమనేది ఆలోచించాల్సిన విషయం.
కుటుంబంలో ప్రతి జననం ఒక శుభ ఘడియ. కానీ జననాలు అధికమైతే దేశం, కుటుంబం భరిస్తుందా అనేదే ప్రశ్న – మాలిని బాల సింగం
భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థిక నరకం సృష్టిస్తాడు- టీఆర్ మాల్థస్
భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డ అభివృద్ధి కారకం- ఎడ్విన్ కానన్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు