తనను తాను దున్నుకునే నేలలు?
మృత్తికలు
-తెలంగాణలోని నేలలు సారవంతమైనవి. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకొనే నేలలు తెలంగాణలో ఉన్నాయి. శీతోష్ణస్థితి కారకాలైన అవపాతం, ఉష్ణోగ్రత నేలను అధికంగా ప్రభావితం చేస్తాయి. నేలల రసాయన భౌతిక జీవ ప్రక్రియలపై ప్రభావం చూపిస్తాయి. శిలలు శైథిల్యం చెందగా ఏర్పడే అంత్య పదార్థాన్ని మృత్తిక అంటారు.
-మృత్తికల ఏర్పాటును గురించి తెలియజేసే ప్రక్రియను పెడోజెనిసిన్ (Pedojenesis) అని పిలుస్తారు.
-నేలల స్వభావం గురించి చర్చించే శాస్త్రం: పెడాలజీ/ఎడపాలజీ
ఎర్రనేలలు (Red Soils)
– ఈ నేలలు రాష్ట్ర విస్తీర్ణంలో 48 శాతం ఆక్రమించాయి.
-ఐరన్ ఆక్సైడ్‌ను కలిగి ఉండటం వల్ల ఎరుపు రంగులో ఉండి త్వరగా నీరు ఇంకిపోయే స్వభావం కలిగి ఉంటాయి.
-తెలంగాణలో ఎక్కువ భాగం విస్తరించి ఉన్నాయి. ఈ నేలలు ఎక్కువగా గ్రానైట్ నుంచి రూపాంతరం చెంది ఏర్పడినవి. ఈ నేలలు నీసిస్, గ్రానైట్ శిలా సముహాల నుంచి ఏర్పడుతాయి.
– అంతర్నిర్మాణం ప్రకారం ఇవి రెండు రకాలు. అవి.
– రెడ్లోమ్ (Red Loams)
ఎర్రఇసుకనేలలు(Res Earths)
-రెడ్లోమ్ ఎర్రనేలలు బంకమన్ను అధికంగా ఉండి కొన్ని రాళ్లను కలిగి ఉంటుంది.
– ఎర్రఇసుక నేలలు (Res Earths) గండ్ర ఇసుక, రాళ్లతో కూడిన పదార్థం వెదచల్లిన విధంగా ఉంటుంది.
– ఈ నేల రంగు ఎరుపు నుంచి పసుపు రంగు వరకు ఉంటుంది.
-ఫెరిక్ ఆక్సైడ్ యాన్ హైడ్రస్గా పనిచేసినప్పుడు మృత్తిక ఎరుపు రంగును కలిగి ఉంటుంది. ఫెరిక్ ఆక్సైడ్ హైడ్రేట్ రూపంలో ఉంటే పసుపు రంగులో ఉంటుంది. (లైమ్లైట్ మృత్తిక).
ఎరమృత్తికల్లో నీరు త్వరగా ఇంకి పోతుంది. ఈ నేల తేమను కోల్పోయే గుణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఈ నేలలకు నీటిపారుదల సౌకర్యం ఎక్కువగా ఉండాలి. వీటిలో బంకమట్టి తక్కువగా ఉంటుంది (క్లే). ఈ నేలలో తేమ శాతాన్ని పెంచాలంటే కుంటలు, చెరువుల్లోని బంకమన్ను ఇతర ఎరువులను ఉపయోగించాలి.
ఈ రకమైన మృత్తికల pH విలువ 6.0 నుంచి 7 వరకు ఉండి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. పౌరనేల నైట్రోజన్, పాస్ఫరస్, జింక్, కాల్షియం, సల్ఫర్ శాతం తక్కువగా ఉంటుంది. పొటాషియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి.
ఇవి నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
ప్రధానంగా పండే పంటలు
– పప్పు దినుసులు, వేరుశనగ, ఆముదాలు పండిస్తారు. నీటి పారుదల సౌకర్యాలు ఉన్న చోట వరి, చెరుకు పతి,్త పండ్ల తోటలను పండిస్తున్నారు. తెలంగాణలో ఎర మృత్తికలు ఎక్కువగా ఉండడంవల్ల వర్షపాతం తక్కువగా ఉండడంవల్ల ప్రభుత్వం అనేక విధాలైన నీటి పారుదల ప్రాజెక్టులను ఏర్పాటు చేసి నీటిని అందిస్తుంది. నీటి పారుదల సౌకర్యాలు పుష్కలంగా ఉన్నట్లయితే వాణిజ్య పంటలను పండించడానికి ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఎర నేలలను చెల్క, దుబ్బ నేలలుగా వర్గీకరిస్తారు.
తెలంగాణలోని నేలల రకాలు
ఎర్రనేలలు (Red Soils)( 48శాతం )
చల్క నేలలు (ఎర ఇసుక నేలలు)
దుబ్బ నేలలు (ఎర బంక మన్ను నేలలు)
నల్లరేగడి నేలలు (Black Soils) (25శాతం)
ఒండ్రు నేలలు (Alluvial Soils) (20శాతం)
రాళ్లు బండలు (5శాతం )
లాటరైట్ నేలలు (Latarite Soils) (1శాతం)
ఇతర నేలలు (1శాతం )
మృత్తికలు ఏర్పడేందుకు కావాల్సిన అనుకూల పరిస్థితులు
మాతృశిల (Parent Rock Material)
వర్షపాతం, ఉష్ణోగ్రత (Climate)
సహజ ఉద్బిజ సంపద (Vegetation)
నైసర్గిక స్వరూపం (Relief Features)
పరివాహం (Drainage)
సూక్ష్మజీవులు (Bacteria)
క్రిమికీటకాదులు (Insects)
జంతువులు (Animals)
మానవులు (Human Beings)
చెల్క నేలలు
– ఈ నేలలో ఇసుక రేణువుల శాతం అధికంగా ఉండి, బంకమన్ను శాతం తక్కువగా ఉన్నందు వల్ల ఈ భూముల్లో నైట్రోజన్, పాస్ఫరస్ శాతం తక్కువగా ఉండి సారహీనంగా ఉంటాయి.
– నీటి ప్రసరణ ఎక్కువగా ఉండి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది.
-ఈ నేలలు ముఖ్యంగా ఎత్తయిన గుట్టల మధ్య ఏటవాలు భూముల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ నేల మందం 75 నుంచి 80 సెం.మీ ల పొరలుంటాయి.
– ఇవి మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, మహబూబాబాద్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి.
-ఎర చెల్కలు ఎక్కువగా మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలో ఉన్నాయి.
దుబ్బనేలలు
– ఈ నేలలు అత్యంత సారహీనంగా, బూడిద రంగులో ఉంటాయి.
– వీటిలో ఇసుక రేణువుల పరిమాణం తక్కువగా ఉండి, బంకమన్ను శాతం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది.
– నీటిని నిల్వచేసుకునే సామర్థ్యం ఎక్కువ.
-ఈ నేలలు ఎండాకాలంలో పూర్తిగా బీడు వారిపోయి, దుమ్ము, ధూళీ లేచిపోతూ ఉంటుంది. క్రమక్షయం ఎక్కువగా ఉంటుంది. లోతుగా దున్నడం సాధ్యం కాదు. వీటిలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. చెరువులు కుంటల్లో నిక్షిప్తమైన మట్టిని వాడుతూ పంటల ఉత్పత్తులను పెంచుతున్నారు. ఈ నేలలు రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఎరనేలలు, దుబ్బనేలలు 47శాతం ఆక్రమించగా మిగతాది ఎరచెల్క నేలలతో ఏర్పడి ఉంది.
నల్లరేగడి నేలలు (Black Soils)
– తెలంగాణ విస్తీర్ణంలో ఇవి 25 శాతం ఆక్రమించి ద్వితీయ స్థానంలో ఉన్నాయి. అవక్షేప శిలలు, రూపాంతర ప్రాప్తి శిలలు, సున్నపురాయి శిలలు క్రమక్షయం చెందడం వల్ల ఇలాంటి నేలలు ఏర్పడుతాయి.
-ఈ నేలలు నీటిని గ్రహించి ఎక్కువ కాలం నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
– ఇవి లోతుగాను, మెత్తగాను ఉంటాయి. కొన్ని నేలలు జిప్సాన్ని కలిగి ఉంటాయి. మరికొన్ని నేలల్లో జిప్సం ఉండదు. ఈ నేలలు PH విలువ 8 నుంచి 8.7 వరకు ఉంటుంది. కొన్ని నేలల్లో ఇది 9.4 వరకు ఉంటుంది. ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. వీటిలో నైట్రోజన్, ్యమస్ తక్కువగా ఉండి పొటాష్, పాస్ఫరస్ తగిన విధంగా ఉంటాయి.
-వేసవి కాలంలో ఈ మృత్తికలు బీటలు వాలి చీలిపోయి గాలి లోనికి పోవడం వల్ల తనను తాను దున్నుకునే నేలలు అంటారు.
-సారవంతమైన నల్లరేగడి మృత్తికలు 9శాతం కలిగిఉండి గోదావరినది తీరంలోని ఆదిలాబాద్‌లో అక్కడక్కడ ఉంటాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఈ మృత్తికలు అధికంగా ఉన్నాయి. నిజామాబాద్, కామారెడ్డిలో 52 శాతం ఈ మృత్తికలు కలిగి ఉన్నాయి. వరంగల్‌లో అక్కడక్కడ, ఖమ్మంలో 25 శాతం కలిగి ఉన్నాయి.
-ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం వరకు గోదావరి సమీపంలోనూ, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల పశ్చిమ భాగంలోనూ లోతైన నల్లరేగడి భూములున్నాయి.
-నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పశ్చిమ భాగాల్లో మధ్యతరహా నల్లరేగడి భూములున్నాయి.
-నల్ల మృత్తికలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు
లోతైన నల్ల మృత్తికలు
– మధ్యస్థ నల్ల మృత్తికలు (ఈ మృత్తికలు రాష్ట్రంలో విస్తారంగా ఉన్నాయి)
-వర్గీకరించని నల్లమృత్తికలు – ఈ మృత్తికలు తెలంగాణలో అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో దక్షిణం వైపు ఉన్నాయి. నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కుమ్రం భీం జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ మృత్తికల్లో పత్తి ఎక్కువగా పండుతుంది. వాణిజ్య పంటలైన మిరప, పొగాకు, పసుపు, చెరకు పండిస్తారు.
-ఆహార ధాన్యాలు జొన్న, సజ్జ, కొరలు నీటిపారుదల కింద వరి పంటను పండిస్తారు.
-మందాన్ని ఆధారంగా చేసుకుని నల్లరేగడి మృత్తికలను 3 రకాలు విభజించవచ్చు.
– నిసిస్ శిలలతో శైథిల్యం చెంది, తక్కువ లోతు నుంచి సాధారణ లోతు గల మృత్తికలు- 50-75 సెం.మీ.
-బసాల్ట్ మొదలైనవి శిలలతో ఏర్పడిన కార్బోనేట్ అధిక పరిమాణం గల లోతైన మృత్తికలు 75-108 సెం.మీ.
– బంకమన్నుతో అభివృద్ధి చెందిన అధిక కాల్షియం కార్బోనేట్ గల మృత్తికలు .. 100 (పత్తి సాగుకు ఇవి అత్యంత అనుకూలమైనవి)
ఒండ్రు నేలలు (Alluvial Soils)
-ఈ నేలలు తెలంగాణ విస్తీర్ణంలో 3వ స్థానం ఆక్రమించాయి. మొత్తం విస్తీర్ణంలో 20 శాతం వరకు ఈ నేలలున్నాయి. నదీ ప్రవాహాల వల్ల వచ్చిన మట్టి వల్ల ఈ నేలలు ఏర్పడుతాయి. ఇవి గోదావరి, కృష్ణా, ప్రాణహిత నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి.
– ఈ మృత్తికల్లో పాస్ఫరస్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. నైట్రోజన్ ఆర్గానిక్ కార్బన్ తక్కువగా ఉంటాయి. ఈ నేలలు క్షార స్వభావం కలిగి ఉంటాయి. వ్యవసాయానికి అనువైన నేలలు. ఎక్కువ పంట దిగుబడికి దోహదం చేస్తాయి. ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఈ నేలలు విస్తరించి ఉన్నాయి.
లాటరైట్ నేలలు (Latarite Soils)
– ఈ నేలలు ముదురు ఎరుపు వర్ణాన్ని కలిగి అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో ఏర్పడుతాయి. వీటిని ‘జేగురు నేలలు’ అని కూడా అంటారు.
– ఇవి రాష్ట్ర విస్తీర్ణంలో 1శాతం మాత్రమే ఉన్నాయి.
-ఇవి అతి తక్కువ సారవంతమైన నేలలు.
– ఈ మృత్తికల నిర్మాణం ఎక్కువ లోతులో శైథిల్యం ప్రక్రియ వల్ల జరుగుతాయి. ఈ శైథిల్యం ప్రక్రియ కొన్ని మీటర్ల వరకు ఉంటుంది. ఈ మృత్తికల pH విలువ 6 నుంచి 6.8 వరకు ఉంటుంది.
– ఇవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ రకమైన మృత్తికలు ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్‌లో విస్తరించి ఉన్నాయి. లాటరైట్ నేలల్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్, అల్యూమినియం, పాస్ఫరస్, పొటాషియం ఉంటాయి.
-ఇనుము, అల్యూమినియం ఆక్సైడ్లు 30 నుంచి 35 శాతం ఉన్న లాటరైట్ నేలలో ఎరుపు లేదా పసుపు రంగుతో కూడిన ఎరరంగులో ఉంటుంది. ఈ మట్టితో బంగ్లాపెంకు, ఇటుకలు తయారు చేస్తారు.
– నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ నేలలు తోటల పెంపకానికి అనుకూలమైనవి. చింత, మామిడి తోటలు, పసుపు, అల్లం, సుగంధ ద్రవ్యాలు, తేయాకు, కాఫీ, జీడిమామిడి, బంగాళదుంపల పంటలకు అనుకూలమైనవి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు