తెలంగాణ సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాభివృద్ధికి ఎన్నో కొత్త పథకా లను ప్రవేశపెడుతోంది. విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, కూర గాయల సాగును పెంచి, కూరగాయల ధరలను తగ్గించేందుకు మన ఊరు-మన కూరగాయలు క్రాప్‌కాలనీలను ప్రవేశ పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టిన పథకాలు మీకోసం..
వ్యవసాయరంగం..
తెలంగాణ రాష్ట్ర జనాభాలో దాదాపు 55.49 శాతం వ్యవసాయ కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నారు. రాష్ట్ర జీఎస్డీపీకి వ్యవసాయం అందిస్తున్న వాటా 2014-15లో వర్తమాన ధరల వద్ద 9.3 శాతం. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో43.2 శాతం విస్తీర్ణం(49.61లక్షల హెక్టార్లు) సాగులో ఉంది. 2010-11 వ్యవసాయ కమతాల గణన ప్రకారం రాష్ట్రంలో భూకమతాల సంఖ్య 55.54 లక్షలు. ఈ కమతాల కింద మొత్తం భూమి పరిమాణం 61.97 లక్షల హెక్టార్లు. కాగా అత్యధికంగా ఆదిలాబాద్(1.4 హెక్టార్లు) జిల్లాలో, అత్యల్పంగా నిజామాబాద్(0.92 హెక్టార్లు) జిల్లాలో ఉంది.
రాష్ట్ర సగటు వర్షపాతం సుమారు 906 మి.మీ. కాగా దీనిలో 80 శాతం(జూన్-సెప్టెంబర్ మధ్య) నైరుతి రుతుపవనాల ద్వారా లభిస్తుంది. గత దశాబ్దంలో 2004-05లో అత్యల్పంగా 614 మి.మీ., 2013-14లో అత్యధికంగా 1,212 మి.మీ. వర్షం కురిసింది. గత పదేళ్లలో 5సార్లు వర్షపాతం సగటు కన్నా తక్కువగా నమోదైంది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయం జూదంగా మారింది. రాష్ట్ర సేద్యపు నీటి సాగు సాంద్రత 1.38.
భూ వినియోగ సామర్థ్యానికి ముఖ్య సూచిక పంటల సాంద్రత. 2012-13లో 1.22గా ఉన్న పంటల సాంద్రత 2013-14లో 1.27కు పెరిగింది. నిజామాబాద్(1.67), కరీంనగర్1.53), వరంగల్(1.36) జిల్లాలో అత్యధిక పంటల సాంద్రత ఉండగా ఆదిలాబాద్(1.09), మహబూబ్‌నగర్(1.11), రంగారెడ్డి(1.14) జిల్లాల్లో అత్యల్పంగా ఉంది. రాష్ట్రంలో సేద్యపు నీటి సదుపాయంగల భూమి 2012-13లో 25.57 లక్షల హెక్టార్లుండగా 2013-14లో 31.64 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఇది 23.74 శాతం పెరుగుదల. ఇక నికరంగా సేద్యపు నీరు అందిన విస్తీర్ణం 2012-13 నాటికి 17.74 లక్షల హెక్టార్ల నుంచి 2013-14లో 29.03 శాతం పెరిగి 22.89 లక్షల హెక్టార్లకు చేరింది.
2009-10లో 84.33 శాతం ఉన్న బావి నీటి సేద్యం 2013-14 నాటికి 74.83 శాతానికి తగ్గింది. ఇక కాలువనీటి సేద్యం 12.67 శాతానికి పెరిగింది. అయినప్పటికీ బావి నీటి ఆధారిత సేద్యం అత్యధిక స్థాయిలోనే ఉంది. 2014-15 ఖరీఫ్‌లో వరి ఉత్పాదకత 3054 కిలోలు. ఒక హెక్టార్లో పండిన ధాన్యాన్ని ఉత్పాదకతగా పరిగణిస్తారు. 2014-15 ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణ స్థితి వల్ల 2013-14 ఖరీఫ్‌తో పోల్చినప్పుడు జొన్న మినహా అన్ని పంటల ఉత్పాదకత నిజామాబాద్(4,004 కిలోలు)లో అత్యధికంగా ఉండగా రంగారెడ్డి(2,284 కిలోలు)లో అత్యల్పంగా ఉంది. ఈ పరిస్థితి ఉత్పాదకతలో భారీ హెచ్చు తగ్గులను సూచిస్తోంది. మొక్కజొన్న ఉత్పాదకత ఖమ్మం(5,500 కిలోలు)లో అత్యధికంగా ఉండగా నల్లగొండ(1,675 కిలోలు)లో అత్యల్పంగా ఉంది. పత్తి ఎక్కువగా పండించే జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ పత్తి ఉత్పాదకతలో 10 జిల్లాల్లో 8వ స్థానంలో ఉండడం గమనార్హం. పత్తి ఉత్పాదకతలో ఖమ్మం(533 కిలోలు) అత్యధికంగా ఉండగా నిజామాబాద్(338 కిలోలు), మహబూబ్‌నగర్(352 కిలోలు), ఆదిలాబాద్(369 కిలోలు) చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి. మిరప ఉత్పాకదతలో ఖమ్మం(4179 కిలోలు), పసుపులో ఆదిలాబాద్(6721 కిలోలు) అగ్రస్థానాన్ని పొందాయి.
తెలంగాణ విస్తీర్ణంలో 48 శాతం ఎర్ర నేలలు ఉన్నాయి. నల్లరేగడి 25 శాతం, రేగడి 20 శాతం, రాళ్లు-గుట్టలు 7 శాతం ఉన్నాయి. ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్‌లలో భాస్వరం లోపం(55 శాతం కన్నా తక్కువ), నిజామాబాద్, వరంగల్, నల్లగొండ నేలల్లో నత్రజని లోపం (44 శాతం కన్నా తక్కువ) అత్యధికంగా ఉంది. రాష్ర్టాన్ని 4 వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని 145 మండలాల ఉత్తర తెలంగాణ మండలానికి జగిత్యాల కేంద్రంగా ఉంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 160 మండలాల దక్షిణ తెలంగాణ మండలానికి పాలెం కేంద్రంగా ఉంది. వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లోని 138 మండలాల కేంద్ర తెలంగాణ మండలానికి వరంగల్ కేంద్రంగా ఉంది. ఆదిలాబాద్, ఖమ్మం 13 పర్వత, గిరిజన ప్రాంత మండలానికి చింతపల్లి కేంద్రంగా ఉంది. వీటిలో మండలానికి ఒకటి చొప్పున ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ(పీజేటీఎస్ఏయూ) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను నెలకొల్పారు.
ఆహార ధాన్యాల భారత ఉత్పత్తి వృద్ధి రేటు 2.43 శాతం కాగా ఇది తెలంగాణలో 3.97 శాతం. అయితే నిలకడలేని వర్షపాతం, నేలల్లో పోషక లోపాలు, అత్యధిక కూలీల వ్యయభారం, తక్కువ యాంత్రికీకరణ, లోపించిన వ్యవసాయ మార్గదర్శకత్వం తెలంగాణ వ్యవసాయ వృద్ధికి ప్రధాన ఆటంకాలు. అలాగే ఉత్పాదకత పెంపులో కీలకపాత్రధారి విత్తనం. దేశానికే విత్తన భాండాగారంగా రాష్ర్టాన్ని మలిచేందుకు ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ప్రధానంగా హైబ్రీడ్ వరి, మక్కలు, పత్తి, పెసలు వంటి 37.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాష్ట్రం 3.22 లక్షల హెక్టార్లలో ఉత్పత్తి చేస్తోంది. 2014-15లో విత్తన ప్రణాళికకు రూ. 50 కోట్లను కేటాయించారు. భారత్‌లో కేవలం 20 శాతం రైతులు ధృవీకృత విత్తనాలను వినియోగిస్తుండగా తెలంగాణలో ఇది 70 నుంచి 80 శాతం కావడం గమనార్హం. 2014-15లో ఎరువుల వినియోగంలో కరీంనగర్ అగ్రస్థానంలో, మెదక్ చివరిస్థానంలో ఉంది.
వ్యవసాయ యాంత్రికీకరణ-ఆర్కేవీవై
వ్యవసాయంలో యాంత్రికీకరణ పెంచేందుకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్కేవీవై) కింద 67.4 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు. సౌర పంపుసెట్లను నెలకొల్పేందుకు వ్యవసాయ శాఖ నుంచి సబ్సిడీగా లక్ష రూపాయల వంతున, నూతన, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(ఎన్‌ఆర్‌ఈడీ) నుంచి 30 శాతం వంతున స్వీకరిస్తారు. ఆర్కేవీవై పథకం 100 శాతం కేంద్ర ప్రభుత్వ మద్దతుతో నడుస్తోంది.
2000 ఖరీఫ్ పంట మొదలుకొని జాతీయ వ్యవసాయ బీమా పథకం(ఎన్ఐఏఎస్)ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఖరీఫ్‌లో 19, రబీలో 10 పంటలకు రక్షణ కల్పించారు. సన్నకారు, చిన్నకారు రైతులకు ఎన్ఐఏఎస్ ప్రీమియంలో 10 శాతం సబ్సిడీ ఉంది. ఎన్ఐఏఎస్కు తోడుగా 2009 ఖరీఫ్ నుంచి వాతావరణ ఆధారిత పంటలకు బీమా పథకం(డబ్య్లూబీసీఐఎస్)ను ప్రారంభించారు.
వర్షపాతం, ఉష్ణోగ్రత, తేమ వంటి వాటి వల్ల రైతులకు నష్టాన్ని తగ్గించడానికి ఈ పథకాన్ని ఉద్దేశించారు. ఎన్ఐఏఎస్ను, డబ్య్లూబీసీఐఎస్లను కలిపి 2014 ఖరీఫ్ నుంచి జాతీయ పంటల బీమా పథకానికి(ఎన్సీఐపీ) కేంద్రం ఆదేశించింది. తెలంగాణలో దాదాపు 900 ఆటోమేటిక్ వాతావరణ పరిశీలన కేంద్రాల(ఏడబ్య్లూస్)ను నెలకొల్పారు. 2010-11 రబీ సమయంలో వరంగల్ జిల్లాలో కేంద్రం ప్రయోగాత్మకంగా మెరుగుపరిచిన జాతీయ వ్యవసాయ బీమా పథకం(ఎంఎన్ఏఐఎస్)ను ప్రవేశపెట్టింది. 2014-15 రబీ నుంచి దీనిని అన్ని జిల్లాలకు విస్తరించారు. వడగళ్ల వాన వంటి స్థానిక విపత్తు, విత్తుకు వచ్చిన ఆటంకాల వంటి వాటిని అదనంగా ఈ ఎంఎన్ఏఐఎస్లో చేర్చారు.
100 శాతం కేంద్ర ఆర్థిక సాయంతో 11వ ప్రణాళికలో ప్రారంభించిన జాతీయ ఆహార భద్రతా మిషన్(ఎన్ఎఫ్ఎస్ఎం)కు 2014-15 లో 85.43 కోట్లు కేటాయించారు.
సహకార రంగం
వ్యవసాయోత్పత్తుల సేకరణ, మూల విక్రయాలను చేపడుతున్న 9 జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలను కలిపి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్(టీఎస్ మార్క్‌ఫెడ్)గా పునర్వ్యవస్థీకరించారు. ఈ సంస్థకు ఆదిలాబాద్‌లో పత్తి వడికే కర్మాగారం, కరీంనగర్లో దాణా మిశ్రమ విభాగం ఉన్నాయి.
రాష్ట్రంలో 150 వ్యవసాయ మార్కెట్ కమిటీలుండగా వాటికింద 306 మార్కెట్ యార్డులు నోటిఫై అయ్యాయి. ఇందులో 140 ప్రధాన యార్డులు కాగా 101 ఉప యార్డులు.
ఉల్లి పాలసీ
రాష్ట్రంలో ఏటా 360 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లి అవసరం కాగా సాగవుతున్నది 250 లక్షల మెట్రిక్ టన్నులు. మరో 110 లక్షల మెట్రిక్ టన్నులు కర్నూలు, నాసిక్‌ల నుంచి దిగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో ఉల్లి సాగు కనిష్టంగా ఉండే జూన్-సెప్టెంబర్ల మధ్య ఉల్లి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకే దేశంలో తొలిసారిగా ఉల్లికి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఉల్లి సాగు ప్రోత్సాహకానికి 75 శాతం సబ్సిడీపై విత్తనాలతో పాటు డ్రిప్, స్ప్రింక్లర్లను ప్రభుత్వం అందిస్తోంది. వరితో పోలిస్తే 25 శాతం మాత్రమే నీరు అవసరమయ్యే ఉల్లి సాగును డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ప్రోత్సహించడం, 6 నెలల వరకు ఉల్లిని నిల్వ ఉంచేలా వెంటిలేషన్ గోదాముల ఏర్పాటు వంటివి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.
వికలాంగుల సంక్షేమం
భారత ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వైకల్యాన్ని మదింపు చేయడానికి సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిసేబుల్డ్ ఫర్ యాక్సెస్ రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్ (సదరమ్) అనే సాధనాన్ని వినియోగిస్తున్నారు. సదరమ్ ద్వారా 5,27,159 కంప్యూటర్ ధృవీకరణ పత్రాలను వికలాంగులకు జారీ చేశారు. భారత కృత్రిమ అవయవాల ఉత్పత్తి కార్పొరేషన్ (ఆలిమ్కో) సహకారంతో ప్రతిజిల్లాలో వికలాంగులకు సహాయ ఉపకరణాలను అందిస్తున్నారు. ఇక తల్లిదండ్రుల, వృద్ధుల భరణం సంక్షేమ చట్టం 2007 మేరకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో 10 జిల్లాల్లో అప్పిలేట్ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేశారు.
వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి కేంద్రం తెలంగాణకు నాలుగు జిల్లా వికలాంగ పునరావాస కేంద్రాలను (డీడీఆర్సీ) మంజూరు చేసింది. అవి వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు కేటాయించారు.
వికలాంగుల, ఓల్డ్ ఏజ్ హోం నివాసుల నెలవారీ పింఛన్లను రూ. 500 నుంచి రూ. 1500కు పెంచుతూ 2014, నవంబర్ 5న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వృద్ధాప్య పింఛన్ల ద్వారా 11,99,215 మంది, వికలాంగ పింఛన్ల ద్వారా 3,46,409 లబ్ధిదారులు అయ్యారు.
షీక్యాబ్స్
మహిళా డ్రైవర్ల ప్రోత్సాహానికి 35 శాతం సబ్సిడీతో 2015, సెప్టెంబర్ 8న షీక్యాబ్స్ను రాష్ట్ర రవాణా శాఖమంత్రి మహేంద్రరెడ్డి ప్రారంభించారు.
తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టు
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపలి శివారు జనావాసాలకు మినహాయించి మిగిలిన 9 జిల్లాల్లోని గ్రామీణ నగర, సంస్థాగత, వాణిజ్య, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందుకు వచ్చే నాలుగేండ్లలో అమలుకు తలపెట్టిన కార్యక్రమమే తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టు (TDWSP). రూ. 42 వేల కోట్ల అంచనా వ్యయంతో నామమాత్రపు ఖర్చుతో రోజుకు తలా 100 లీటర్ల తాగునీటిని దీనిద్వారా సమకూరుస్తారు. 67 మున్సిపల్, 25,139 గ్రామీణ ప్రాంతాల్లోని 3.19 కోట్ల జనాభాకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది.
కడెం, కొమరం భీం, నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పీ, సింగూరు, శ్రీశైలం, నాగార్జునసాగార్, పాలేరు, వైరా, దుమ్ముగూడెం ప్రాజెక్టుల ద్వారా TDWSP 63 టీఎంసీల నీటిని సమకూర్చుకుంటుంది. ఇందుకు 1.25 లక్షల కిలోమీటర్ల పైపులైన్లు, 18 స్వీకరణ (ఇన్‌టేక్) బావులు, (7.5 లక్షల కేఎల్ నీటి కోసం), 17,407 స్టోరేజ్ ట్యాంకులు, 62 ఇంటర్మీడియెట్ పంపింగ్ స్టేషన్లను నిర్మించాల్సి ఉంటుంది. దీనికోసం 186 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. స్మార్ట్ టెక్నాలజీ ద్వారా భూమి వాలుపై ఆధారపడి నీటిని సరఫరా చేసి నీటి వృథాను నివారిస్తారు.
26 విభాగాలుగా ఈ ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు ద్వైపాక్షిక, బహుళపక్ష సంస్థలతోపాటు ఆర్థిక సంస్థల నుంచి నిధులను సమీకరిస్తారు. ఇప్పుడున్న, త్వరలో రాబోతున్న అన్ని సేద్యపు నీటి ప్రాజెక్టుల నుంచి 10 శాతం TDWSPకి కేటాయిస్తారు. ఇందులో 10 శాతాన్ని పరిశ్రమలకు వినియోగిస్తారు. వచ్చే 30 ఏండ్ల తాగునీటి అవసరాలను తీర్చే ఈ ప్రాజెక్టు అమలు తీరును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని సమన్వయ సంఘం పర్యవేక్షిస్తుంది. జిల్లాస్థాయిలో కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి సమన్వయ కమిటీ పర్యవేక్షిస్తుంది.
కృష్ణా, గోదావరులు తలాపునే ఉన్న గ్రామీణ ప్రజలకు తాగునీటికి భూగర్భజలాలే ప్రధాన వనరు. గత ఐదేండ్లుగా లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణలో భూగర్భ జలాలు అనిశ్చిత వనరులుగా మారడంతో భవిష్యత్ భరోసా కోసం TDWSP తెరమీదకు వచ్చింది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో మితిమీరిన ఫ్లోరైడ్ శాతాన్ని 4506 జనావాసాల్లో గుర్తించారు. దీంతోపాటు 1590 ఆవాసాల్లో లవణీయత, 19 జనావాసాల్లో TDS కాలుష్యం, 1881 జనావాసాల్లో నైట్రేట్ కాలుష్యం, 576 జనావాసాల్లో ఇనుపమడ్డి హద్దులు దాటాయి. వీరందరికి సురక్షిత నీరు కూడా TDWSPని తప్పనిసరి పథకంగా మార్చింది. ప్రస్తుతం పట్టణ, గ్రామీణ ప్రాంతాల నీటి సరఫరా ప్రణాళికలు వేర్వేరుగా ఉండటంతో అనవసర ఖర్చు పెరుగుతోంది.
తాగునీటికోసం ఉపరితల వనరులవైపు దృష్టి సారించాలన్న జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమ మార్గదర్శకాలు కూడా TDWSP ద్వారా సాకారం కానున్నాయి. భవిష్యత్‌లో 100 LPCDలు దాటిన నీటివినియోగానికి వేర్వేరు శ్లాబుల ద్వారా, వాణిజ్య అవసరాలకు అదనపు ధర ద్వారా TDWSP ఖర్చులను రాబడతారు. ఇక ఈ రంగానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల సమన్వయం కోసం రాష్ట్ర నీరు, పారిశుధ్య మిషన్ (SWSM) కింద, రాష్ట్ర స్థాయిలో నీటి సరఫరా పారిశుధ్య సంస్థ (WSSO) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
ఉద్యానరంగం
తెలంగాణలో ఏటా ఉద్యానపంటలను 10.86లక్షల హెక్టార్లలో సాగుచేస్తూ 112.56 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని పొందుతున్నారు. వచ్చే ఐదేండ్లలో సాగు 14.48 లక్షల హెక్టార్లకు విస్తరించి 152.31 లక్షల మెట్రిక్ టన్నుల ఫల సాయం పొందాలనేది లక్ష్యం. 2014-15లో ఒక్కొక్క లబ్ధిదారుడికి గరిష్టంగా మూడెకరాల చొప్పున ఎకరానికి రూ.29.52లక్షల వంతున 75 శాతం సబ్సిడీతో వెయ్యి ఎకరాల్లో పాలీహౌస్‌ల నిర్మాణానికి రూ. 452.75 కోట్లు కేటాయంచారు.
రాష్ట్ర ఉద్యాన మిషన్ (ఎస్హెచ్ఎం)
కేంద్ర పథకంగా రాష్ట్ర ఉద్యాన మిషన్(ఎస్హెచ్ఎం)ను 2005 నవంబర్‌లో ప్రారంభించింది. తోటల పునరుజ్జీవం, కొత్త తోటల విస్తరణ, సమీకృత పోషక నిర్వహణ(ఐఎన్ఎం), సమీకృత తెగుళ్ల అదుపు(ఐపీఎం), పంటకోత అనంతర నిర్వహణ(పీహెచ్ఎం) వంటివి ఈ పథకం ద్వారా చేపడతారు. 2014-15లో ఇందుకు రూ. 28.3 కోట్లు వినియోగించారు.
సూక్ష్మసేద్యంలో నీటి సమర్థ వినియోగానికి 100 శాతం రాష్ట్ర ప్రణాళిక ద్వారా తోట నీటి నిర్వహణ కార్యక్రమం(ఓఎఫ్డబ్ల్యూఎం-ఎన్ఎంఎస్) పథకాన్ని అమలు చేస్తున్నారు. సూక్ష్మసేద్యంలో బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. తెలంగాణలో భూగర్భజలాలతో సేద్యం జరుగుతూ నికరంగా సేద్యపునీరు అందుతున్న భూమి 14.85 లక్షల హెక్టార్లు. దీనిలో సూక్ష్మనీటి సరఫరా అమలవుతున్న భూమి 4.7 లక్షల హెక్టార్లు. ఇది భూగర్భ జలాలతో సాగవుతున్న భూమిలో కేవలం 30 శాతం కావడం గమనార్హం. భూగర్భ జలాలతో అత్యధికంగా సాగయ్యే భూమి వరంగల్ జిల్లాలో(2,56,866 హెక్టార్లు) బిందు, తుంపర సేద్య సాగు విస్తీర్ణం 44598 హెక్టార్లు అంటే కేవలం 17.36 శాతం. వర్షాధార తెలంగాణలో బిందు సేద్య ఆవశ్యకతను గుర్తెరిగిన ప్రభుత్వం ఏటా లక్ష హెక్టార్లను కొత్తగా సూక్ష్మసేద్యం కిందకు తేవడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.
మన ఊరు – మన కూరగాయలు
కూరగాయలకు పెరుగుతున్న డిమాండుకు తగ్గట్లుగా మార్కెటింగ్‌ను విస్తృతం చేయడం, సాగును పెంచడం లక్ష్యంగా మన ఊరు – మన కూరగాయల పథకాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌కు చుట్టుపక్కన గల మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కూరగాయల సాగుపై దృష్టి పెట్టారు.
క్రాప్ కాలనీలు
తెలంగాణలో ప్రస్తుతం 2.27 లక్షల హెక్టార్లలో ఏటా 37 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయల ఉత్పత్తి జరుగుతున్నది. అయినా డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వేసవిలో కూరగాయల ఉత్పత్తి 4.4 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోతుంది. జంట నగరాల్లోని కూరగాయల అవసరాన్ని దిగుమతుల ద్వారా భర్తీ చేయాల్సి వస్తోంది. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రకు టమాటా,ఖమ్మం నుంచి విజయవాడకు టమాటా, సొరకాయ, బీరకాయ ఎగుమతి అవుతున్నా నికరంగా దిగుమతులే అధికం. దీనిని అధిగమించేందుకు హైబ్రీడ్ కూరగాయల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రోత్సాహకంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీలకు 90 శాతం పెద్ద రైతులకు 80 శాతం సబ్సిడీని ఇస్తున్నారు. అధిక సంఖ్యలో కూలీల అవసరం, దళారుల దోపిడీ కూరగాయల సాగు ఎదుర్కొంటున్న ప్రధాన అవరోధాలు. అందుకే నగరాల్లో అపార్ట్మెంట్ల అసోసియేషన్లతో నేరుగా అవగాహన ద్వారా దళారుల బెడద తొలగింపునకు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణలో సాగు విస్తీర్ణం పెంచేందుకు 9 జిల్లాల్లో 118 క్రాప్ కాలనీలల్లో కలిపి 1.69 లక్షల హెక్టార్లను కూరగాయల సాగుకు ఉద్యాన శాఖ గుర్తించింది. సంప్రదాయ పంటలకు బదులు తేమ, నేలల స్వభావానికి అనుగుణంగా తక్కువ నీటితో అధిక దిగుబడి లభించే కూరగాయల సాగు ఈ క్రాప్ కాలనీల ప్రధాన లక్ష్యం.
ఈ సాగుకు రైతులకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వమే అందించనున్నది. హైబ్రీడ్ విత్తనాలతోపాటు నాణ్యమైన రెడీమేడ్ మొక్కల పంపిణీ, రైతులకు అవసరమైన అవగాహన, శిక్షణ కార్యక్రమాలు, గోదాములు-మార్కెటింగ్ సౌకర్యాలు, ఇతర రాష్ర్టాల సాగు అనుభవాల అధ్యయనం, వర్షాభావ పరిస్థితులను అధిగమించే విధానాలు కూడా ఈ సాగులో భాగాలే. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ పేరిట విత్తన కేంద్రాల ఏర్పాటుకు మెదక్ జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి, రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల గ్రామాలను గుర్తించారు. 8,600 హెక్టార్లకు పాలీహౌసెస్ 700 హెక్టార్లు, పురుగు మందులు లేకుండా సేంద్రియ పద్ధతుల్లో 63 వేల హెక్టార్లలో కూరగాయల సాగు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా 41 వేల హెక్టార్లలో సాగు చేయనున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 14 క్రాప్ కాలనీల ద్వారా 14 వేల హెక్టార్లు, నిజామాబాద్‌లో 11 క్రాప్ కాలనీల ద్వారా 11 వేల హెక్టార్లు సాగు చేయనున్నారు. అదేవిధంగా కరీంనగర్లో 15 క్రాప్ కాలనీలు(15 వేల హెక్టార్లు), వరంగల్‌లో 14 క్రాప్ కాలనీలు(14 వేల హెక్టార్లు), ఖమ్మంలో 24 కాలనీలు(24 వేల హెక్టార్లు) ఏర్పాటు చేయనున్నారు. నల్లగొండలో 4 కాలనీలు(4 వేల హెక్టార్లు), రంగారెడ్డిలో 8 కాలనీలు(39 వేల హెక్టార్లు), మెదక్‌లో 5 కాలనీలు(25 వేల హెక్టార్లు) అభివృద్ధి చేయనున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు