మిషన్ కాకతీయతో ఏమిటి లాభం?
ఆంధ్రపాలకుల దోపిడి నుంచి విముక్తిపొందిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలను కొల్లగొట్టిన సీమాంధ్రపాలకుల దిమ్మతిరిగేలా..తెలంగాణలో భారీ, మధ్య, చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఓరుగల్లు కేంద్రంగా తెలంగాణను ఏలిన కాకతీయులు కాలంలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణకు కంకణం కట్టుకుంది. మిషన్ కాకతీయ పేరుతో చెరువులు, కుంటల్లో నీరు నింపేందుకు కృషి చేస్తున్నది. కృష్ణా, గోదావరి బేసిన్లో నిర్మించే ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, మరికొన్ని కొత్త సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి సారించింది. ప్రజలను ఆర్థికంగా అగ్రభాగంలో ఉంచడంలో సాగు, తాగు నీరు కీలకపాత్ర పోషిస్తుంది. అందువల్ల గ్రూప్-1, 2 పరీక్షలకు పోటీపడే అభ్యర్థుల ఉపయోగార్ధం నిపుణ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం…
సాగునీరు
తెలంగాణలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం చేయడానికి ముఖ్యమైన ఆధారం సాగునీరు. సాగునీరు ఉంటేనే ప్రజల సామాజిక- ఆర్థిక జీవనస్థితిలో మార్పు వస్తుంది. అయితే తెలంగాణలో సాగునీరు ఎక్కువగా గోదావరి, కృష్ణానదులు, ఉపనదులు, చెరువులు, కుంటల్లోని నీటి వినియోగం మీదనే ఆధారపడి ఉంది. అతి పెద్ద చెరువులనుంచి, నీటిని వడగట్టే తటాకాలతో సహా చిన్న చెరువుల వరకూ వివిధ జల సంరక్షణ నిర్మాణాలు దాదాపు 46 వేల వరకు ఉన్నాయి. ఈ జల సంరక్షణ నిర్మాణాలన్నీ కలిసి సాగునీరు, వాణిజ్య, ఇతర గృహావరాలను తీర్చే ప్రధాన వనరుగా ఉన్నాయి. సాగునీటి ప్రాధాన్యాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదుల నీటిని ఉపయోగించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నది. గోదావరి, కృష్ణా నదుల్లో ప్రణాళికాబద్ధమైన వినియోగం కృష్ణా బేసిన్లోని వరదనీటితో సహా లెక్క చూస్తే వరుసగా 933.70 టిఎంసీలు, 298 టీఎంసీలున్నాయి.
అద్భుతమైన సాటునీటి సాంకేతికతతో వర్షపునీటిలో ప్రతి బొట్టునూ సద్వినియోగం చేసుకున్న కాకతీయుల నాటి సాగునీటి వ్యవస్థ నిలకడగా కరువు నివారణ చర్యలను పునరుద్ధరించడానికి అతి చక్కని నమూనాను అందిస్తుంది. దాదాపు 11,975 హెక్టార్ల ఆయకట్టు మేర విస్తరించి, 5,872 ఎంసిఎఫ్టి నీటిని అందిస్తున్న నాలుగు ప్రధాన చెరువులు- పాకాల, రామప్ప, లక్నవరం, ఘనాపూర్లతో పాటు ఒక్కొక్కటీ 100 ఎంసిఎఫ్టీ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన మరో 5 వేల చెరువులు కూడా ఉన్నాయి. 2012-13, 2013-14లో భారీ సాగునీటి చెరువులకు చేపట్టిన మరమ్మతులు, ఆధునీకరణ, పునరుద్ధరణతో 3,908 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.
చిన్నతరహా సాగునీటి చెరువులు తెలంగాణకు జీవనరేఖగా ఉన్నాయి. రానున్న ఐదేండ్ల కాలంలో జిఓఐ, జెఐసీఏ, ఏఐబీపీ, ప్రపంచ బ్యాంకు నిధులతో సాధారణ రాష్ట్ర ప్రణాళికతో తన ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన మిషన్ కాకతీయ కింద చిన్నతరహా సాగునీటి రంగంలోని గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. భూగర్భ జలమట్టాలను స్థిరీకరించేందుకు కూడా ఈ కార్యకలాపాలు దోహదం చేస్తాయి. సులభంగా తరలించగలిగే స్థాయిలో సూక్ష్మ, చిన్న తరహా సాగునీటి వనరుల్లో నీటిని సమీకరించడం కోసం చేపట్టే వాననీటి సంరక్షణకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న మరో అంశం.
కృష్ణా, గోదావరి బేసిన్ల్లో ప్రాజెక్టు స్థాయి
భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల్ని దశల వారీగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. తద్వారా 99.136 లక్షల ఎకరాల సాగునీటి సామర్థ్యాన్ని సృష్టించవచ్చు.
ప్రతి నియోజకవర్గంలోనూ పట్ణణ ప్రాంతాలను మినహాయించి లక్ష ఎకరాలకు సాగునీటి సౌకర్యాన్ని రానున్న ఐదేండ్లలో సృష్టించేందుకు ఒక సర్వతోముఖమైన వ్యూహాం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఈ క్రమంలోనే రెండు భారీ ప్రాజెక్టులనూ, వరదనీటిని తరలించే ఒక కాలువను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. దీంతో 13.41లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో వర్షాకాలంలో వరదలకు అడ్డుకట్ట పడటంతో మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాలు ప్రయోజనం పొందుతాయి.
చిన్ననీటి పారుదల
దాదాపు 18.71 లక్షల ఎకరాల ఆయకట్టుకు సేవలందిస్తున్న చెరువులు 35,974 ఉన్నాయి. వీటిల్లో 31,196 పంచాయతీరాజ్ శాఖ చెరువుల ద్వారా 6.68 లక్షల ఎకరాలకు నీరందుతుంది. చెరువుల ద్వారా అందే సాగునీరు ఎక్కువగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో కేంద్రీకృతమై ఉంది. చిన్న నీటిపారుదల కింద 2013-14లో రూ.488.46 కోట్ల వ్యయంతో 37,300 ఎకరాలకు సాగునీటి సామర్థ్యాన్ని సృష్టిస్తున్నారు. 19,700 ఎకరాలకు సాగునీటి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. తెలంగాణ సామాజిక ఆధారిత చెరువుల నిర్వహణ ప్రాజెక్టు సహకారంతో ప్రపంచబ్యాంకు నిధులతో చిన్న నీటిపారుదల పథకాల పునరుద్ధరణ కార్యక్రమం సాగుతున్నది. మొత్తం 1,182 చెరువులను మెరుగుపర్చాలనేది ఈ పథకం ఉద్దేశం. ఇప్పటికే 762 చెరువుల పనులు పూర్తయ్యాయి.
రాష్ట్రంలో 1990 నుంచి సాగునీటి బావుల పరిమాణం నిలకడగా పెరిగింది. అదే సమయంలో సాగునీటి చెరువుల సంఖ్య స్థిరంగా తగ్గుతూ వస్తున్నది. వనరుల నిలకడ విషయంలోనూ, భూగర్భ జలాలను తోడటం కోసం విద్యుత్కు పెరుగుతున్న డిమాండ్ విషయంలోనూ ఆందోళనలు పెరగడానికి ఇది కారణమవుతోంది. ఉపరితల, భూగర్భజలాల నిర్వహణకూ, తెలంగాణ రాష్ట్రంలోని 9 కరువు బాధిత జిల్లాలో దాదాపు 11.5 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగించేందుకు రాష్ట్రంలోని చెరువుల సాగునీటి సామర్థ్యంలో నెలకొన్న 63 శాతం లోటును భర్తీ చేయడానికీ సంబంధించి ఒక సమగ్ర దృక్పథాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. దీనికోసం చెరువుల పునరుద్ధరణ, సాగునీటి సామర్థ్యానికి జవజీవాలు అందించడానికి ఒక సమగ్ర పథకం అవసరం.
ప్రతిష్ఠాత్మకమైన మిషన్ కాకతీయ
తెలంగాణలో 100 ఏండ్లుగా చెరువులే ప్రధాన వనరులుగా ఉన్నాయి. చాలాకాలం పాటు, సరైన నిర్వహణ లేనందున పూడికలు తీయనందునా వీటిలో చాలా చెరువులు పూడుకుపోయి లేదా నిరర్థకంగా మిగిలిపోయాయి. ఉపరితల జలాల లభ్యత తగ్గిపోవడంతో అందుబాటులో ఉన్న భూగర్భజల వనరులపై భారీగా వత్తిడి పెరిగింది. రుతుపవన వర్షాలు అన్నిచోట్లా ఒకేలా కురవడం లేదు. రాష్ట్రంలో 85 శాతం సాగుభూమి వర్షాధారంగానే ఉంది. తెలంగాణ నైసర్గిక స్వరూపం, వర్షపాత నమూనా కారణంగా ఈ ప్రాంతంలో సాగునీటి చెరువులే నీటిపారుదలకూ, నీటి నిల్వకూ, వ్యవసాయ వినియోగం కోసం నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు శ్రేష్టమైనవిగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో 46,531 సాగునీటి వనరులన్నాయి. ఈ సాగునీటి వనరులతో మొత్తం 10.17 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుంది.
చెరువులు
రాష్ట్రంలో వ్యవసాయాభివద్ధికి కీలకమైంది చెరువుల వ్యవస్థ. జల సంరక్షణ, వరదల నియంత్రణ, కరువు నివారణ, పశుగణం, గృహ వినియోగాలు, భూగర్భజలాలను పెంచడం, శీతోష్ణస్థితి, పర్యావరణ పరిరక్షణకు ఇది దోహదపడుతుంది. పేద ప్రజలకు సాగునీటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటంతో తమ పంటల ఉత్పాదకతను పెంచుకోగలుగుతారు. తమ ఆదాయ మూలాల్లో వైవిధ్యమైన అవకాశాలను విస్త్రృతం చేసుకోగలుగుతారు. రుతు సంబంధిత వాతావరణ మార్పులతో తలెత్తే ముప్పునకు వ్యవసాయ రంగం సులభంగా గురయ్యే ప్రమాదం తగ్గుతుంది.
అనేక రకాల పంటలు సాగుచేస్తున్న తెలంగాణలో విస్త్రృత వ్యవసాయ వైవిధ్యం ఉంది. ఈ పంటల్లో ఆహార, ఉద్యానవన, వాణిజ్య పంటలున్నాయి. మొత్తం భూభాగంలో సాగు భూమి దాదాపు 67 శాతం ఉంది. దీనిలో 60 శాతం మేర ఆహార పంటలు పండిస్తున్నారు. వరి ప్రధానమైన ఆహార పంట. సాగుభూమిలో 25 శాతం మేర దీన్ని పండిస్తున్నారు. పప్పుధాన్యాల సాగు 18 శాతం కాగా, ఆ తర్వాత స్థానంలో 14 శాతం భూమిలో జొన్న, మొక్కజొన్న పండుతున్నాయి. వేరుశెనగ, పత్తి, ఆముదం, పొద్దుతిరుగుడు, నువ్వులు, చెరకు రాష్ట్రంలో సాగుచేసే ఇతర ప్రధాన పంటలు.
సాగునీటి చెరువులకు సంబంధించిన విషయాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ ప్రభుత్వం సామాజిక భాగస్వామ్యంతో వికేంద్రీకరణ నమూనాలో మిషన్ కాకతీయ (మన ఊరు- మన చెరువు) పేరిట 46,531 చిన్న తరహాసాగునీటి వనరుల పునరుద్ధరణ కోసం బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. రానున్న ఐదేండ్లలో రూ.20 వేల కోట్ల అంచనా వ్యయంతో అన్ని చెరువుల పునరుద్ధరణ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
-చెరువుల పునరుద్ధరణలో ఈ కింది అంశాలు భాగంగా ఉంటాయి.
-పూడిక తొలగింపు, పూడిక మట్టి పునర్వినియోగం
-చెరువులకు సంబంధించి పిల్లకాలువల పునరుద్ధరణ( చెరువులు గొలుసుకట్టులో భాగం)
-గట్లు, అడ్డుకట్టలు, తూములకు మరమ్మతులు
-సాగునీటి కాలువల రీ- సెక్షనింగ్, సీఎం, సీడీ పనులకు మరమ్మతులు
-అవకాశం/ అవసరం ఉన్న చోట ఎఫ్టిఎల్ని పెంచడం
-2014-15 నుంచి మొదలయ్యే ఐదేండ్ల కాలంలో ఏడాదికి 1/5 భాగం చెరువుల చొప్పున మొత్తం 46, 531 ట్యాంకుల పునరుద్ధరణ పూర్తి చేయాలని ప్రతిపాదించారు.రానున్న ఐదేండ్ల కాలంలో దశలవారీగా అన్ని సాగునీటి చెరువులను పునరుద్ధరిస్తారు
ఆయకట్టు – అభివృద్ధి
మూడు ప్రధాన ఆయకట్టులైన నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు, శ్రీరామ్సాగర్ ఆయకట్ట, జూరాల ప్రాజెక్టు ఆయకట్టల కింద నీటిపారుదల శాఖ అధ్యయనాలను ఈ కింది అంశాలపై చేపట్టింది.
-ఇప్పటికే బురద ఎక్కువై, నిరుపయోగంగా మిగిలిపోయిన ప్రాంతాల గుర్తింపు
-ఉపరితల, భూగర్భజలాల విషయంలో సిఫార్సు చేసిన సంయోజక వినియోగం
-ఉత్పాదకతను పెంచడానికి సూచించిన ఇతర దిద్దుబాటు చర్యలు
భూగర్భజలాలు
రాష్ట్రంలో సాగునీటికి సంబంధించిన ప్రధాన వనరుల్లో భూగర్భజలాలు ఒకటి. జల వృత్తంలో ముఖ్యమైన, సమగ్రభాగంగా ఉన్న భూగర్భజలం లభ్యత వర్షపాతం మీద, ఖర్చయిన నీరు తిరిగి భర్తీ అయ్యే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఏండ్లు గడుస్తున్నాకొద్దీ నీటికి డిమాండ్ పెరిగుతోంది. ఇది ప్రపంచంలో చాలా ఏండ్లుగా నీటి కొరతకు దారీ తీస్తున్నది. భూగర్భ జలాలు వెలికితీత పెరుగుతుండటంతో అనేక ప్రాంతాల్లో జలమట్టం రెండు దశాబ్ధాలుగా వేగంగా పడిపోతున్నది.
అటు ఆహార, ఇటు వాణిజ్య పంటలకు సాగునీరు అందించడానికి తవ్వుతున్న బోరుబావుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. వ్యవసాయ, పారిశ్రామిక, గృహావసర రంగాల్లాంటి వాడకందారుల మధ్య పోటీ తీవ్రతరం కావడంతో భూగర్భ జలాలకు డిమాండ్ పెరిగిపోయింది. ఫలితంగా భూగర్భజలాల మట్టం తరిగిపోతోంది. 2010-11లో భూగర్భ జల వనరుల సమాచార నిధి ఆధారంగా వేసిన అంచనాల మేరకు రాష్ర్టాన్ని 494 వాటర్షెడ్లుగా (జల సేకరణ ఆవరణలుగా) విభజించారు. వీటినే భూగర్భజలాల బేసిన్లు లేదా అంచనా యూనిట్లు అంటారు.
సామాజిక ఆధారిత చెరువుల నిర్వహణ ప్రాజెక్టు
వర్షపాతం, ఉపరితల జలవనరులతో తిరిగి నింపిన, సాగునీటి ప్రాంతాల నుంచి తిరిగి వచ్చిన నీటిని, పంపిణీ చేయడంతో గతిశీలమైన భూగర్భ జలవనరులను వివేకవంతంగా నిర్వహించుకోవడం కోసం, చెరువుల ప్రభావిత మండలాల్లో భూగర్భ జల వినియోగదారులకు సాధికారత కల్పించడం, భాగస్వామ్య భూగర్భ జలనిర్వహణ లక్ష్యం. ఈ ప్రాజెక్టు కింద భాగస్వామ్య భూగర్భ జలనిర్వహణ కార్యకలాపాల కోసం 7 జిల్లాల్లోని 78 మండలాల పరిధిలో మొత్తం 172 చెరువులను ఎంపిక చేశారు. పీజోమీటర్ల డ్రిల్లింగ్, పీహెచ్ఎం పరికరాల ఏర్పాటు, శిక్షణలు, సమాచార విశ్లేషణ, సమాచార ప్రచారం తదితరాలతో కూడిన పీహెచ్ఎం పరికరాల ఏర్పాటు ఈ కార్యకలాపాల్లో భాగం. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ను ఏడేండ్ల కాలవ్యవధి (2007-14) లో రూ.16.24 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. 2013-14లో రూ.887.60 లక్షలను రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ విడుదల చేశారు. రూ.413.30 లక్షలు ఖర్చు చేశారు.
తెలంగాణ నీటి అభివృద్ధి ప్రాజెక్టు
ప్రస్తుత భూగర్భజల నిర్వహణ వ్యవస్థ పరిమితులను పరిగణలోకి తీసుకున్నప్పుడు, ప్రస్తుతం ఉనికిలో ఉన్న నిర్వహణ వ్యవస్థకు స్వయంగా ఉన్న పరిమితులను గుర్తించి, సమాజంతో జలాశయాల స్థాయి భూగర్భజల నిర్వహణ నమూనాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఆరేండ్ల కాలవ్యవధి కోసం (2010-2018) రూ.14.93 కోట్ల అంచనా వ్యయంతో ఆ ప్రాజెక్టును చేపట్టారు. రెండు పైలట్ ప్రాజెక్టులను నీటిపారుదల శాఖ నిర్వహిస్తున్నది.
-నల్లగొండలో వినియోగదారులు కేంద్రంగా జలాశయాల స్థాయి భూగర్భ జలాల నిర్వహణ ప్రాజెక్టు
-ఖమ్మంలోని ఎన్ఎస్ఎల్సీసీఎన్లో ఉపరితల, భూగర్భ జలాల సంయుక్త వినియోగ పైలెట్ ప్రాజెక్టులు
-ఈ ప్రాజెక్టు కింద 2014-15లో బడ్జెట్ అంచనా రూ.669.10 లక్షలు కాగా, విడుదల చేసిన బడ్జెట్ రూ.76.67 లక్షలు. వ్యయం రూ.13.25 లక్షలు. ఇంకా అతిగా నీటిని తోడేస్తున్న ప్రాంతాలకు నోటిఫికేషన్ కోసం తెలంగాణ భూ, జల, వృక్షాల (టీడబ్ల్యూఏఎల్టీఏ) చట్టం కింద 1,057 గ్రామాల్ని గుర్తించారు. ఈ గ్రామాల్లో తాగునీటి అవసరాలు మినహా భూగర్భజలాలను నిరంతరం వెలికితీయడంపై నిషేధం విధించారు. పరిమాణం విషయానికొస్తే రాష్ట్రంలో మొత్తం భూగర్భ జలాల లభ్యత 13,674 మిలియన్ క్యూబిక్ మీటర్లు(ఎంసీఎం). దీనిలో 7,502 ఎంసీఎంలను వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. మిగిలిన 5,805 ఎంసీఎంలను విడిచిపెట్టారు. మొత్తం భూగర్భజలాభివృద్ధి స్థితి 58 శాతం. ఏర్పాటైన మొత్తం అదనపు బావుల సంఖ్య 2,33, 529.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు