Geography Groups Special | ‘పీడన మేఖలలు’ అని వేటిని పిలుస్తారు?
వాతావరణ పీడనం
- ప్రమాణ వైశాల్యం గల భూ భాగంపై దానిపైగల వాతావరణపు బరువు కలుగజేసే ఒత్తిడి బలాన్ని వాతావరణ పీడనం అంటారు.
- వాతావరణ పీడనాన్ని భారమితి/బారోమీటర్ అనే పరికరం ద్వారా కొలుస్తారు. దీన్ని రూపొందించిన శాస్త్రవేత్త- ఎవాజి లెస్టా టారిసెల్లీ (ఇటలీ)
- వాతావరణ పీడనాన్ని సెం.మీ ఆఫ్ హెచ్జీ/ ఎంఎం ఆఫ్ హెచ్జీ/ఎం.బీ (మిల్లీబార్స్) అనే ప్రమాణాల్లో కొలుస్తారు.
- సముద్రమట్టం వద్ద సగటు వాతావరణ పీడనం- 76 సెం.మీ. ఆఫ్ హెచ్జీ లేదా 760 ఎంఎం ఆఫ్ హెచ్జీ లేదా 1013.25 ఎం.బీ.
- వాతావరణ పీడనం అన్ని భౌగోళిక ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండక కింద తెలిపిన కారణాల వల్ల ప్రభావితమై ప్రాంతాన్ని బట్టి మారుతుంది. అవి..
1) ఉష్ణోగ్రత
2) వాతావరణంలోని నీటి ఆవిరి
3) భూభాగాల ఎత్తు
ఉష్ణోగ్రత: ఒక భౌగోళిక ప్రాంతంలోని వాతావరణ పీడనం ఆ ప్రాంత ఉష్ణోగ్రతకు విలోమంగా ఉంటుంది.
నీటి ఆవిరి: తడిగాలి బరువు కంటే పొడిగాలి బరువు ఎక్కువ. కాబట్టి తడిగాలి భౌగోళిక ప్రాంతాల్లో వాతావరణ పీడనం తక్కువగా ఉండి, పొడిగాలి భౌగోళిక ప్రాంతాల్లో వాతావరణ పీడనం సాపేక్షంగా ఎక్కువగా ఉంటుంది.
భూభాగాల ఎత్తు: ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు సముద్ర మట్టం నుంచి ఎత్తుకువెళ్లే కొద్ది వాతావరణ పీడనం తగ్గుతుంది (ప్రతి 300 మీ. ఎత్తుకు 1.3 ఎం.బీ చొప్పున) - పైన తెలిపిన కారణాల వల్ల భూమిపై కొన్ని చోట్ల అధిక పీడనం ప్రాంతాలు, మరికొన్ని చోట్ల అల్ప పీడన ప్రాంతాలు ఏర్పడి ఉన్నాయి. భూమిపైగల ఈ అధిక పీడన, అల్ప పీడన ప్రాంతాలనే ‘పీడన మేఖలలు’ అని పిలుస్తారు. భూమిపై మొత్తం 4 రకాలకు చెందిన 7 పీడన మేఖలాలు ఏర్పడి ఉన్నాయి. అవి..
1) భూమధ్యరేఖా అల్పపీడన మేఖల
2) ఉప అయనరేఖా అధికపీడన మేఖల
3) ఉపధృవ అల్పపీడన మేఖల
4) ధృవ అధికపీడన మేఖల
భూమధ్యరేఖా అల్పపీడన మేఖల
- భూమధ్యరేఖకు ఇరువైపులా ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్యగల భౌగోళిక ప్రాంతమే ‘భూమధ్యరేఖా అల్పపీడన మేఖల’.
- ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడటానికి కారణం అధిక ఉష్ణోగ్రతల వల్ల విపరీత సంవహన ప్రక్రియ జరగడం.
- ఈ ప్రాంతాన్ని ‘డోల్డ్రమ్స్ లేదా ప్రశాంత మండలం’ అని పిలుస్తారు.
- ఈ ప్రాంతంలో జరిగే విపరీత సంవహన ప్రక్రియ వల్ల ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన తక్కువ సమయంలో అధిక పరిమాణంలో వర్షపాతం సంభవిస్తుంది.
ఉప అయనరేఖా అధికపీడన మేఖల - 250-350 ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్యగల భౌగోళిక ప్రాంతాలు
- ఈ ప్రాంతాల్లో అధిక పీడనం ఏర్పడటానికి కారణం కోరియాలిస్ ప్రభావం వల్ల నిమజ్జనం చెందే గాలులు
ఉపధృవ అల్పపీడన మేఖల - 450-650 ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్యగల భౌగోళిక ప్రాంతాలు.
- ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడటానికి కారణం కోరియాలిస్ ప్రభావం.
ధృవ అధికపీడన మేఖల - 750 – 900 ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్యగల భౌగోళిక ప్రాంతాలు.
- ఈ ప్రాంతంలో అధిక పీడనం ఏర్పడటానికి కారణం సూర్యకిరణాలు ఏటవాలుగా పడటం వల్ల నమోదయ్యే అల్ప ఉష్ణోగ్రతలు.
- పైన తెలిపిన వాటిలో భూమధ్యరేఖా అల్పపీడన మేఖల ధృవ అధికపీడన మేఖల ఉష్ణోగ్రతలో మార్పు వల్ల ఏర్పడగా, ఉపఅయనరేఖా అధికపీడన మేఖలలు, ఉపధృవ అల్పపీడన మేఖలలు కోరియాలిస్ ప్రభావం/ గతిశీల బలాల వల్ల ఏర్పడుతున్నాయి.
పీడన ప్రవణత
- ప్రమాణ వైశాల్యంగల భూభాగంపై పీడనంలో కలిగే మార్పు రేటే పీడన ప్రవణత. ఒక భౌగోళిక ప్రాంతంలో పీడన ప్రవణత ఎక్కువగా ఉంటే పవనాల వేగం ఎక్కువగా, పీడన ప్రవణత తక్కువగా ఉంటే పవనాల వేగం తక్కువగా ఉంటుంది.
- భూమిపై అధిక వాతావరణ పీడనం నమోదయ్యే ప్రదేశం- అగాటా (సైబీరియా)
- భూమిపై తక్కువ వాతావరణ పీడనం నమోదయ్యే ప్రదేశం- టిప్ (ఫిలిప్పీన్స్ దీవుల సమీపం)
సమభార రేఖలు (Isobars) - భూమిపై ఒకే వాతావరణ పీడనం గల ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహారేఖలే ‘సమభార రేఖలు’.
పవనాలు - భూమికి క్షితిజ సమాంతరంగా కదిలే వాయు అణువుల సమూహాన్ని ‘పవనం’ అని, ఊర్ధముఖంగా కదిలే వాయు అణువుల సమూహాన్ని ‘గాలి ప్రవాహం’
అని పిలుస్తారు. - ప్రతి పవనానికి 2 లక్షణాలుంటాయి. అవి..
1) వేగం 2) దిశ - పవన వేగాన్ని ఎనిమోమీటర్, బీ ఫోర్డ్ స్కేల్ అనే పరికరాల ద్వారా కొలుస్తారు.
- ఒక భౌగోళిక ప్రాంతంలో పీడన ప్రవణత రేటు ఎక్కువగా ఉంటే పవనాల వేగం ఎక్కువగాను, పీడన ప్రవణత రేటు తక్కువగా ఉంటే పవనాల వేగం తక్కువగాను ఉంటుంది.
- పవనాలు ఏ దిశలో జనిస్తాయో ఆ దిశ పేరుతో పవనాన్ని పిలుస్తారు.
- పవన దిశను పవనసూచీ అనే పరికరం ద్వారా గుర్తిస్తారు.
- పవనాల వేగం, వాటి దిశ కింది అంశాలతో ప్రభావితమవుతాయి. అవి..
1) కోరియాలిస్ ప్రభావం: ఇది పవనం దిశలో మార్పు కలుగజేస్తుంది.
2) ఘర్షణ బలాలు: ఇవి పవనాల వేగం, దిశలో మార్పు కలుగజేస్తాయి.
3) ఖండాంతర అంచులు: పవనం దిశలో మార్పు కలుగజేస్తాయి.
4) పీడన ప్రవణతా బలాలు: ఇవి పవనం వేగంలో మార్పు కలుగజేస్తాయి. - పవనాలు వీచే భౌగోళిక ప్రాంతాన్ననుసరించి వాటిని 3 రకాలుగా విభజించవచ్చు. అవి..
1) ప్రపంచ పవనాలు/ శాశ్వత పవనాలు
2) కాలాన్ని బట్టి వీచే పవనాలు
3) స్థానిక పవనాలు
ప్రపంచ పవనాలు
- అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతం వైపు స్థిరంగా నిర్ణీత దిశలో సంవత్సరమంతా వీచే పవనాలు.
- ప్రపంచ పవనాలు వీచే భౌగోళిక ప్రాంతాన్ననుసరించి వాటిని 3 రకాలుగా వర్గీకరించారు. అవి..
ఎ) వ్యాపార పవనాలు (Trade Winds)
బి) పశ్చిమ పవనాలు (Westerlies)
సి) ధృవ/ తూర్పు పవనాలు (Polarity/Easterlies)
వ్యాపార పవనాలు: ఉప అయనరేఖా అధిక పీడన ప్రాంతం నుంచి భూమధ్యరేఖా అల్పపీడన ప్రాంతం వైపు 500-350 ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య వీచే పవనాలు. - ఉత్తరార్ధగోళంలో ఈశాన్య దిశలో జనిస్తున్నందున వాటిని ‘ఈశాన్య వ్యాపార పవనాలు’ అని, దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ దిశలో వీస్తున్నందున ‘ఆగ్నేయ వ్యాపార పవనాలు’ అని పిలుస్తారు.
- వ్యాపార పవనాలు ఉష్ణమండల ప్రాంతాల్లో వీస్తున్నందు న అధికంగా బాష్పీభవనం చెంది అధిక వర్షపాతాన్ని కలుగజేస్తాయి.
- వ్యాపార పవనాలు ఖండాల తూర్పు భాగంలో మాత్రమే వర్షాన్నిచ్చి పశ్చిమ ప్రాంతాల్లో ఇవ్వనందున 50-350 అక్షాంశాల మధ్య ఉన్న ఖండాల పశ్చిమ ప్రాంతమంతా ఉష్ణమండల ఎడారులు ఏర్పడి ఉన్నాయి.
పశ్చిమ పవనాలు: ఉప అయనరేఖా అధికపీడనం ప్రాంతం నుంచి ఉప ధృవ అల్పపీడన ప్రాంతంవైపు 400-600 ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య వీచే పవనాలు. - పశ్చిమ పవనాలు ఖండాల పశ్చిమ ప్రాంతంలో మాత్రమే వర్షాన్నిచ్చి తూర్పు ప్రాంతాల్లో వర్షాన్నివ్వలే నందున ఆ ప్రాంతమంతా శీతల ఎడారులేర్పడి ఉన్నాయి. ఉదా: మంగోలియా, చైనాలలో విస్తరించి ఉన్న గోబి ఎడారి, అర్జెంటీనా-> పెటగోనియా ఎడారి
- ఉత్తరార్ధగోళంలోని పశ్చిమ పవనాలు నైరుతి దిశలోను, దక్షిణార్ధగోళంలోని పశ్చిమ పవనాలు వాయవ్య దిశలోనూ జనిస్తాయి.
- మధ్యధరా సముద్ర ఉత్తర తీర ప్రాంతాల్లో వర్షపాతాన్నివ్వడంలో కీలక పాత్ర వహించే పవనాలు- పశ్చిమ పవనాలు
- 400 దక్షిణ అక్షాంశంపై వీచే పశ్చిమ పవనాలను ‘రోరింగ్ 40లు’ అని
- 500 దక్షిణ అక్షాంశంపై వీచే పశ్చిమ పవనాలను ‘ఫ్యూరియస్ 50లు (బలోపేత)’ అని
- 600 దక్షిణ అక్షాంశంపై వీచే పశ్చిమ పవనాలను ‘విధ్వంసకర 60లు’ అని పిలుస్తారు.
ధృవ/తూర్పు పవనాలు: ధృవ అధిక పీడన ప్రాంతం నుంచి ఉపధృవ అధికపీడన ప్రాంతం నుంచి ఉపధృవ అల్పపీడన ప్రాంతంవైపు 900-600 ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య వీచే పవనాలు. - ఉత్తరార్ధగోళంలో ఇవి ఈశాన్య దిశ నుంచి దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ దిశ నుంచి వీస్తాయి.
- ఇవి అతిశీతల ప్రాంతాల్లో వీస్తున్నందున బాష్పీభవనం చెందక వర్షపాతాన్నివ్వలేదు.
కాలాన్ని బట్టి వీచే పవనాలు: రుతువుననుసరించి గాని లేదా సమయాన్ననుసరించి గాని తమ దిశలో మార్పు కలుగజేసుకుంటూ వీచే పవనాలు.
ఉదా: రుతు పవనాలు, భూ పవనాలు (స్థల), సముద్ర పవనాలు (జల), పర్వత లోయ పవనాలు, సరస్సు సమీరాలు. - ఢిల్లీ, హైదరాబాద్ వంటి ఖండాంతర్గత ప్రాంతాలతో పోలిస్తే చెన్నై, ముంబై వంటి తీర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో వేడిగా ఉండటానికి కారణం – భూ పవనాల తాకిడి
- ఒక అక్షాంశం మీద ఉన్న భూ జల భాగాల్లోని ఉష్ణోగ్రత లో గల తేడాలను అనుసరించి ఈ పవనాలు జనిస్తాయి.
- పగటి సమయంలో జలభాగం నుంచి అల్పపీడనం ఉన్న భూ భాగంవైపు వీచే పవనాలు ‘సముద్ర/జల పవనాలు’. వీటి కారణంగా తీరప్రాంత భూ భాగాల్లో వాతావరణం చల్లబడుతుంది.
ఉదా: పగటి సమయంలో ఢిల్లీ, హైదరాబాద్ లాంటి ఖండాంతర్గత ప్రాంతాలతో పోలిస్తే చెన్నై, ముంబై వంటి తీరప్రాంత భూభాగాల్లో వాతావరణం చల్లగా ఉండటానికి కారణం – సముద్ర పవనాల తాకిడి - రాత్రి సమయాల్లో పవనాలు భూ భాగం నుంచి అల్పపీడనం ఉన్న జలభాగం వైపు వీస్తాయి. వీటినే భూ పవనాలు/ స్థల పవనాలు అని పిలుస్తారు. వీటి కారణంగా తీర ప్రాంత భూభాగాల్లో సాయంత్ర సమయం నుంచి వాతావరణం వేడెక్కుతుంది. ఉదా: సాయంత్ర సమయంలో ఢిల్లీ, హైదరాబాద్ వంటి ఖండాంతర్గత ప్రాంతాలతో పోలిస్తే చెన్నై, ముంబై వంటి తీర ప్రాంత భూ భాగాల్లో వాతావరణం వేడిగా ఉండటానికి, మానవ జీవనం అసౌకర్యంగా ఉండటానికి గల కారణం- భూ పవనాల తాకిడి
పర్వత, లోయ పవనాలు - ఇవి కూడా పర్వత ఉపరితలాలు, లోయ అడుగు భాగాల మధ్య ఉష్ణోగ్రతలో గల తేడాననుసరించి జనిస్తాయి.
- రాత్రి సమయంలో పర్వత ఉపరితలాల నుంచి లోయ అడుగు భాగం వైపు వీచే పవనాలను ‘పర్వత పవనాలు’ అని, పగటి సమయాల్లో లోయ అడుగు భాగం నుంచి పర్వత ఉపరితలాల వైపు పవనాలను ‘లోయ పవనాలు’ అని పిలుస్తారు. సరస్సు సమీరాలు
భూ పవనాలు, సముద్ర పవనాలు
- పగటి సమయంలో సరస్సు నుంచి చుట్టూ ఉన్న భూ భాగంవైపు సాయంత్ర సమయం నుంచి భూ భాగం మీదుగా సరస్సు వైపు వీచే పవనాలను సరస్సు సమీరాలు అని పిలుస్తారు.
- ఇవి కూడా రాత్రి, పగటి సమయాల్లో ఉష్ణోగ్రతలోని తేడా వల్ల జనిస్తున్నందున కాలాన్ని బట్టి వీచే పవనాలకు ఉదాహరణగా చెప్పవచ్చు.
స్థానిక పవనాలు - కొన్ని ప్రత్యేక భౌగోళిక ప్రాంతాల్లో నిర్దిష్ట రుతువుల్లో ఉష్ణోగ్రత పీడనా వ్యత్యాసాల్లో కలిగే మార్పులనను సరించి ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమై వీచే పవనాలు.
- ఇవి వీచే భౌగోళిక ప్రాంతాన్ననుసరించి 2 రకాలు.
1) వేడి పవనాలు
ఎ) ఫోయన్: శీతాకాలంలో ఆల్ప్స్ పర్వతాలను తూర్పుగా స్విట్జర్లాండ్ భూ భాగం మీదుగా వీచే వేడి పొడి పవనాలే ఫోయన్. శీతాకాల దుప్పటి
బి) చినూక్: శీతాకాలంలో అలస్కా, కెనడా ఉత్తర ప్రాంత భూ భాగాల్లో వీచే వేడి పొడిగాలులు. - వీటినే హిమభక్షికలు అని పిలుస్తారు.
సి) శాంటా అనా: కాలిఫోర్నియాలో వేసవిలో వీచే తీవ్రమైన వేడి పొడి పవనాలు - వీటిని పోలిన పవనాలను వివిధ దేశాల్లో ఈ విధంగా పిలుస్తారు. అర్జెంటీనా- జోండా, జపాన్- యమో, ఈజిప్ట్- ఖమ్సిన్, ఆస్ట్రేలియా- బ్రిక్ఫీల్డర్స్
హర్మటాన్: సహారా ఎడారిలో జనించి ఆఫ్రికా పశ్చిమ తీరం వెంబడి వీచే వేడి పొడి గాలులు - వీటినే ది డాక్టర్ పవనాలు అంటారు.
సిరాకో: సహారా ఎడారిలో జనించి మధ్యధరా సముద్రం మీదుగా ఇటలీ దక్షిణ భూభాగాల్లోకి వీచే వేడి పొడి గాలులు. - వీటి కారణంగా ఇటలీ దక్షిణ ప్రాంతంలో ఎర్రమట్టి రేణువులతో కూడిన ధూళి తుఫాన్లు సంభవిస్తాయి.
లూ (Loo): భారత వాయవ్య ప్రాంతంలో వేసవిలో అత్యధిక వేగంతో వీచే వేడి పొడిగాలులు.
జీ గిరిధర్
సివిల్స్ ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్
హైదరాబాద్
9966330068
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






