Geography | అత్యధిక వేలా పరిమితి ఎక్కడ నమోదవుతుంది?
మహాసముద్రపు నీటి కదలికలు
- సముద్రపు నీరు మూడు రకాలుగా కదులుతుంది.
1) అలలు 2) పోటు, పాటులు 3) సముద్ర ప్రవాహాలు. - పైన చెప్పినవే కాకుండా భూకంప సమయంలో ఏర్పడే సునామీలు, తుఫానుల సమయాల్లో ఏర్పడే ఉప్పెనల రూపంలో కూడా నీరు కదులుతుంది. కానీ ఇది రోజువారీగా జరిగే దృగ్విషయం కాదు.
1) అలలు - విశాల సముద్ర ఉపరితలం మీద పవనాల ఒరిపిడి శక్తి వల్ల ఏర్పడే కదలికలు. ఈ కెరటాల్లో ఎత్తయిన భాగాన్ని శృంగం (Crest) అని, లోతైన భాగాన్ని ద్రోణి (Trough) అని అంటారు.
- అల లేదా కెరటం ఆకారం నీటి ఉపరితలం మీద కదులుతుంది. అయితే నీటి అణువులు వృత్తాకారంలో కదులు తాయి. కానీ స్థల మార్పిడి జరగదు.
ఎ) డోలనాపరిమితి: శృంగంలోని ఎత్తయిన భాగానికి, ద్రోణిలోని లోతైన భాగానికి గల ఎత్తులో తేడా.
బి) తరంగ దైర్ఘ్యం (Wave Length): రెండు శృంగాల లేదా రెండు ద్రోణుల మధ్య దూరం.
సి. తరంగ పౌనఃపున్యం (Wave Frequency): నిర్దిష్ట ప్రాంతంలో ఒక సెకను సమయంలో దాటే తరంగాల సంఖ్య.
డి. తరంగ అవధి (Wave Period): రెండు శృంగాలు లేదా రెండు ద్రోణులు దాటడానికి పట్టే కాలం. - తరంగ వేగాన్ని నాట్ (Knot)లలో చెబుతారు.
2) పోటు పాటులు (Tides) - ఒక రోజు వ్యవధిలో సముద్ర మట్టం రెండుసార్లు పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది.
- సముద్ర మట్టం పెరగడాన్ని పోటు, తగ్గడాన్ని పాటు అంటారు.
- పోటు పాటుల ఆవిర్భావానికి గల కారణాలను తెలిపే సిద్ధాంతాలు.
1) సమతాస్థితి సిద్ధాంతం (Equilibrium Theory)- న్యూటన్
2) చలన సిద్ధాంతం (Dynamical Theory)- పియరీ సైమన్
3) పురోగమన సిద్ధాంతం (Progressive Theory)- జీబీ ఏరి
4) స్థిర తరంగ సిద్ధాంతం (Stationary Wave Theory)- పీఏ హరిన్
పోటుపాటులు రావడానికి కారణాలు
1) సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి (Gravitational Force)
2) భూ అపకేంద్ర బలం (Centrifugal Force)
సూర్యచంద్రుల గురుత్వాకర్షణ: భూమ్మీద సూర్యుడి కంటే చంద్రుని గురుత్వాకర్షణ ప్రభావం ఎక్కువ. ఎందుకంటే సూర్యుడు పెద్దదిగా ఉన్నప్పటికీ దూరంగా ఉండటం, చంద్రుడు చిన్నదిగా ఉన్నప్పటికీ దగ్గరగా ఉండటం. - సరళంగా చెప్పాలంటే చంద్రుడు 9 యూనిట్లు, సూర్యుడు 4 యూనిట్ల ప్రభావాన్ని చూపుతారు.
భూ అపకేంద్ర బలం: భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు అపకేంద్ర బలం ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల భూమి నుంచి జలభాగం విసిరివేయబడుతుంది. అపకేంద్ర బలం వల్ల రెండో వైపున మరో పాటు ఏర్పడుతుంది. - ఇది అర్థం కావడానికి ఒక సరళ అంశాన్ని ఊహిద్దాం. 180 రేఖాంశం వద్ద సూర్యచంద్రులు ఉన్నారనుకోండి, అక్కడ పోటు ఏర్పడుతుంది. దీనికి పూర్తి వ్యతిరేక దిశలో 00ల వద్ద అపకేంద్ర బలం వల్ల మరొక పోటు ఏర్పడుతుంది. 900ల తూర్పు రేఖాంశం వద్ద, 900ల పశ్చిమ రేఖాంశం వద్ద పాటు ఏర్పడుతుంది.
- పై విధంగా రోజు వ్యవధిలో సూర్యచంద్రుల వల్ల ఒక పోటు, అపకేంద్ర బలం వల్ల ఒక పోటు ఏర్పడుతుంది.
పోటుపాటుల కాలవ్యవధి: 1) ఒక పోటుకు మరొక పాటుకు మధ్య కాలవ్యవధి 6 గంటల 13 నిమిషాలు ఉంటుంది.
2) ఒక పోటుకు మరొక పోటుకు మధ్య కాలవ్యవధి
12 గంటల 26 నిమిషాలు ఉంటుంది.
3) ఒక పాటుకు మరొక పాటుకు మధ్య కాలవ్యవధి
12 గంటల 26 నిమిషాలు ఉంటుంది.
4) రెండు పాటులు, రెండు పోటులు రావడానికి పట్టే మొత్తం సమయం 24 గంటల 52 నిమిషాలు. - అంటే ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో పోటు వస్తే మరుసటి రోజు ఉదయం 6.52 గంటలకు వస్తుంది. అంటే 52 నిమిషాలు ఆలస్యం అవుతుంది.
- ఇలా ఆలస్యం కావడానికి కారణం చంద్రుడు తన కక్ష్యామార్గంలో 1/30వ వంతు ముందుకెళ్లడం. ఫలితంగా చంద్రుడు నిన్న కనిపించిన ప్రదేశానికి రావడానికి 52 నిమిషాలు ఆలస్యం అవుతుంది.
పోటు, పాటుల రకాలు
1) పర్వవేలా తరంగాలు (Spring Tides): పౌర్ణమి (Full Moon), అమావాస్య (New Moon) రోజుల్లో వచ్చే పోటు పాటులు సాధారణం కంటే ఎక్కువ ఎత్తుగా వస్తాయి. సూర్యచంద్రులు ఒకే సరళరేఖపై ఉండటం వల్ల గురుత్వాకర్షణ శక్తి 9+4= 13 యూనిట్లు ఉంటుంది.
2) లఘువేలా తరంగాలు (Neap Tides): శుక్ల అష్టమి (First Quarter), బహుళ అష్టమి (Third Quarter) రోజుల్లో వచ్చే పోటుపాటు సాధారణం కంటే తక్కువ ఎత్తుగా వస్తాయి. సూర్యచంద్రులు వ్యతిరేక దిశలో ఉంటాయి. గురుత్వాకర్షణ బలం 9-4=5 యూనిట్లు అవుతుంది.
3) పెరిజి పోటుపాటులు (Perigean Tides): చంద్రుడు భూమికి దగ్గరగా ఉండే పరిస్థితి. పోటుపాటులు సాధారణం కంటే ఎక్కువ ఎత్తుకు లేస్తాయి.
4) అపోజి పోటుపాటులు (Apogean Tides): చంద్రుడు భూమికి దూరంగా ఉండే పరిస్థితి. పోటుపాటులు సాధారణం కంటే తక్కువ ఎత్తుకు లేస్తాయి.
5) పరిహేళి పోటుపాటులు (Perihelion Tides): సూర్యుడు, భూమికి దగ్గరగా ఉండే పరిస్థితి (జనవరి 3). సాధారణం కంటే ఎక్కువ ఎత్తుకు పోటుపాటులు లేస్తాయి.
6) అపహేళి పోటుపాటులు (Aphelion Tides): సూర్యుడు భూమికి దూరంగా ఉండే పరిస్థితి (జూలై 4). సాధారణం కంటే తక్కువ ఎత్తుకు పోటుపాటులు లేస్తాయి.
7) విషవత్తు పోటుపాటులు (Equinoctial Tides): మార్చి 21, సెప్టెంబర్ 23న ఏర్పడే పోటుపాటులు సాధారణం కంటే ఎక్కువ ఎత్తుకు లేస్తాయి. సూర్యుడు, భూమధ్యరేఖ వద్ద ఉండే స్థితి.
8) అయనాంత పోటుపాటులు (Solstice Tides): జూన్ 21, డిసెంబర్ 23 లలో ఏర్పడే పోటుపాటులు. సూర్యుడు, కర్కటరేఖ, మకర రేఖల వద్ద ఉండే సమయం.
వేలా పరిమితి (Tidal Ranges): పోటుకు, పాటుకు మధ్య సముద్ర మట్టంలో గల తేడాలు. - అత్యధిక వేలాపరిమితి కెనడా తీరంలో గల ఫండీ అఖాతంలో నమోదవుతుంది (15 నుంచి 18 మీటర్లు).
- దేశంలో గుజరాత్ తీరంలో గల ‘ఓఖి’ వద్ద 2.5 మీటర్లు గరిష్ఠ వేలాపరిమితి నమోదవుతుంది.
టైడల్ బోర్: పోటు వచ్చినప్పుడు నదీ ముఖద్వారం వద్ద నీటి మట్టం పెరిగి నీరు వెనుకకు మళ్లుతుంది. నదీ ముఖద్వారం వద్ద ఏర్పడిన ఎత్తయిన గోడలాంటి నిక్షేపణే ‘టైడల్ బోర్’.
పోటుపాటుల ఉపయోగాలు - మత్స్యకారులకు ఉపయోగకరం.
- నదీ ముఖద్వారాల వద్ద ఏర్పడే నిక్షేపాలను తొలగిస్తాయి.
- కొన్ని ఓడరేవులు కూడా పోటుపాటుల మీదనే ఆధారపడి పనిచేస్తాయి.
ఉదా: లివర్‌పూల్, కాండ్ల ఓడరేవులు - ఉప్పు తయారీకి ఉపయోగపడుతుంది.
- తరంగ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయవచ్చు.
మాదిరి ప్రశ్నలు
1. అతి పొడవైన ఖండతీర రేఖ, అతి వెడల్పు ఖండ తీరపు అంచు కలిగిన మహాసముద్రం ఏది?
1) పసిఫిక్ 2) హిందూ
3) అట్లాంటిక్ 4) ఆర్కిటిక్
2. జతపర్చండి.
1. అతిపెద్ద సముద్రం ఎ. ఇంగ్లిష్ చానల్
2. అతిచిన్న సముద్రం బి. దక్షిణ చైనా సముద్రం
3. అత్యంత లోతైన సముద్రం సి. పర్షియన్సింధుశాఖ
4. అతి తక్కువ లోతైన సముద్రం డి. కరేబియన్ సముద్రం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3. జతపర్చండి.
1. భూ ఉపరితలంలో ఉన్న మొత్తం జలభాగం ఎ. 61 శాతం
2. ఉత్తరార్ధగోళంలో జలభాగం బి. 97 శాతం
3. దక్షిణార్ధగోళంలో జలభాగం సి. 81 శాతం
1) 1-బి, 2-సి, 3-ఎ 2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-సి, 2-బి, 3-ఎ 4) 1-బి, 2-ఎ, 3-సి
4. సముద్ర భూతలాల్లోని పొడవైన, ఎత్తయిన భూస్వరూపాలను ఏమంటారు?
1) గమోట్స్ 2) ట్రెంచ్‌లు
3) రిడ్జ్‌లు 4) ఏదీకాదు
5. ఈ రోజు వచ్చిన పోటు రేపు వచ్చే మొదటి పోటుకు ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వస్తుంది?
1) 52 2) 53 3) 55 4) 57
6. మాంగనీస్ నాడ్యూల్స్ లభించే సముద్ర భూ తలం ఏది?
1) ఖండతీరపు వాలు 2) ఖండతీరపు అంచు
3) అగాథ సముద్ర మైదానం 4) అగాథాలు
7. కింది వాటిలో పసిఫిక్ మహాసముద్రంలో భాగంగా ఉన్న సముద్రం ఏది?
1) దక్షిణ చైనా, తూర్పు చైనా సముద్రం, పసుపు సముద్రం
2) జపాన్ సముద్రం 3) బేరింగ్ సముద్రం
4) పైవన్నీ
8. అధిక సంఖ్యలో దీవులు అగాథ సముద్ర మైదానం ఎక్కువ వెడల్పు కలిగిన మహాసముద్రం?
1) అంటార్కిటిక్ 2) హిందూ
3) ఆర్కిటిక్ 4) పసిఫిక్
9. చేపలను పట్టడానికి వీలుగా, పెట్రోలియం లభించే సముద్ర భూతలం ఏది?
1) ఖండతీరపు అంచు
2) ఖండతీరపు వాలు
3) అగాథ సముద్ర మైదానం
4) అగాథాలు
10. కాంతిని తయారు చేసుకొనే జీవులు (బెంథిక్ దీవులు) ఉండే సముద్ర భూతలం ఏది?
1) అగాథాలు 2) అగాథ సముద్ర మైదానం
3) ఖండతీరపు అంచు 4) ఖండతీరపు వాలు
11. ఒక పోటు, ఒక పాటుకు మధ్యగల కాలవ్యవధి ఎంత?
1) 6 గం. 13 ని. 2) 12 గం. 26 ని.
3) 6 గం. 6 ని. 4) 12 గం. 12 ని.
12. డ్రమ్లిన్లు ఎక్కడ కనిపిస్తాయి?
1) హిందూ మహాసముద్రం 2) థార్ ఎడారి
3) హిమాలయ హిమానీ నదాలు
4) గంగా డెల్టా
13. ప్రపంచంలో ఎక్కువ వెడల్పయిన ఖండతీరపు అంచు గల భౌగోళిక ప్రాంతం ఏది?
1) కెనడా తూర్పుతీరంలోని న్యూ ఫౌండ్‌ల్యాండ్ దీవి గల ‘గ్రాండ్ బ్యాంక్’
2) ఇంగ్లండ్‌లోని ‘డ్రాగర్ బ్యాంక్’ ప్రాంతం
3) చిలీ తీరంలోని అంచు 4) ఏదీకాదు
14. కింది వాటిలో హిందూ మహాసముద్రంలో భాగంగా గల సముద్రం ఏది?
1) ఎర్ర 2) పర్షియన్ గల్ఫ్
3) అరేబియా, బంగాళాఖాతం 4) పైవన్నీ
15. జతపర్చండి.
1. హెడ్రింగ్ పాండ్ ఎ. ఆర్కిటిక్ మహాసముద్రం
2. ఉత్తర మహాసముద్రం బి. అట్లాంటిక్ మహాసముద్రం
3. దక్షిణ మహాసముద్రం సి. పసిఫిక్ మహాసముద్రం
4. పసిఫిక్ అగ్నివలయం డి. అంటార్కిటిక్ మహాసముద్రం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
సమాధానాలు
1-3, 2-3, 3-4, 4-3, 5-2,
6-3, 7-4, 8-4, 9-1, 10-2, 11-1, 12-3, 13-1, 14-4, 15-4.
జీ గిరిధర్
సివిల్స్ ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్
హైదరాబాద్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు