Geography | ఏ ఆవరణాన్ని ‘సమాచార వ్యవస్థ పొర’ అని అంటారు?
శీతోష్ణస్థితి శాస్త్రం
1) వాతావరణ సంఘటనం – నిర్మాణం
- భూ ఉపరితలం నుంచి దాదాపు 1600 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉన్న అనేక వాయువుల మిశ్రమం వాతావరణం.
- మెండలీఫ్ ఆవర్తన పట్టికలోని క్లోరిన్ వాయువు తప్ప మిగతా అన్ని వాయువులూ భూ వాతావరణంలో ఉన్నాయి.
- మొత్తం భూ వాతావరణంలో 90 శాతం భూ ఉపరితలం నుంచి 50 కి.మీ. ఎత్తులో బరువైన వాయువులతో ఏర్పడి ఉండి, మిగిలినది ఆ పైన 1600 కి.మీ. వరకు తేలికైన హైడ్రోజన్, హీలియం వాయువులతో ఏర్పడి పలుచబడిపోతూ ఉంది.
వాతావరణ సంఘటనం
ఎ) నైట్రోజన్ (78.08 శాతం)
- మొక్కలు వాతావరణంలోని నత్రజనిని నైట్రేట్స్ రూపంలో పరోక్షంగా వినియోగించుకొని వాటి పెరుగుదలలో ఉపయోగించుకుంటాయి.
- వాతావరణంలో ఆక్సిజన్ దహన ప్రక్రియను నైట్రోజన్ స్థిరీకరిస్తుంది.
బి) ఆక్సిజన్ (20.9 శాతం) - జీవుల శ్వాసక్రియలో ఉపయోగపడుతున్నందున దీన్ని ప్రాణ వాయువు అని పిలుస్తారు. వాతావరణంలోని ఓజోన్ పొరను ఏర్పరచడంలో కీలక పాత్ర వహిస్తుంది.
సి) కార్బన్ డై ఆక్సైడ్ (0.03 శాతం) - మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారోత్పాదనను చేపట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పగటి సమయంలో భూమిపై ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువ కాకుండా, రాత్రి సమయాల్లో మరీ తక్కువ కాకుండా మాధ్యమిక స్థాయిలో ఉంచడంలో కీలకపాత్ర వహిస్తుంది.
డి) ఆర్గాన్ (0.93 శాతం) - ఎలక్ట్రిక్ బల్బుల్లో ఉపయోగిస్తారు.
- ఈ వాయువుతో పాటు హైడ్రోజన్, హీలియం, నియాన్, క్రిప్టాన్, జీనాన్ వంటి అప్రధాన వాయువులు కూడా భూ వాతావరణంలో ఉన్నాయి.
వాతావరణ నిర్మాణం
- సముద్ర మట్టం నుంచి వాతావరణంలో ఎత్తుకు పోయేకొద్ది ఉష్ణోగ్రతలో కలిగే మార్పుననుసరించి వాతావరణాన్ని 5 ఆవరణాలుగా విభజించారు. అవి..
1) ట్రోపో ఆవరణం 2) స్ట్రాటో ఆవరణం
3) మీసో ఆవరణం
4) థర్మో/ఐనో ఆవరణం
5) ఎక్సో ఆవరణం
1) ట్రోపో ఆవరణం
- భూ ఉపరితలం నుంచి సగటున 13 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉన్న వాతావరణంలోని మొదటి పొర ట్రోపో ఆవరణం.
- భూ రేఖా ప్రాంతంలో 18 కి.మీ., ధృవ ప్రాంతాల్లో 8 కి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది.
- ఈ ఆవరణంలో ప్రతి 165 కి.మీ. ఎత్తుకు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ సెంటిగ్రేడ్ చొప్పున తగ్గుతాయి. దీన్నే సాధారణ ఉష్ణోగ్రతా క్షీణతాక్రమం అంటారు.
- భూ ఉపరితలం నుంచి వాతావరణంలోకి విడుదలయ్యే 99 శాతం దుమ్ముధూళి కణాలు, నీటి ఆవిరి ఈ ప్రాంతంలో కేంద్రీకృతమవుతాయి. అందువల్ల ట్రోపో ఆవరణం అత్యధిక సాంద్రతను కలిగి ఉంటుంది.
- ద్రవీభవనం, మేఘ నిర్మాణం, ఉరుములు, మెరుపులు, అల్పపీడన వలయాలు, వర్షపాతం వంటి వాతావరణ అలజడులన్నీ ఈ ఆవరణంలోనే సంభవిస్తాయి.
- ట్రోపో ఆవరణానికి, దానిపై గల స్ట్రాటో ఆవరణానికి మధ్యగల సరిహద్దు ట్రోపోఫాస్.
l ఈ ఆవరణం పై సరిహద్దులో పశ్చిమం నుంచి తూర్పునకు వంకర్లు తిరుగుతూ అత్యధిక వేగంతో వీచే పవనాలు- జెట్ స్ట్రీమ్స్.
2) స్ట్రాటో ఆవరణం
- ట్రోపో ఆవరణం నుంచి 50 కి.మీ. వరకు ఉన్న వాతావరణంలోని రెండో పొర.
- ఈ ఆవరణంలో ఎత్తుకు పోయేకొద్ది ఉష్ణోగ్రత దాదాపు స్థిరం.
- వర్షపాతం ఇవ్వలేనటువంటి అత్యధిక ఎత్తులో ఏర్పడే సిర్రస్ మేఘాలు ఈ ఆవరణంలో కనిపిస్తాయి.
- ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు లేనందున వాతావరణం ప్రశాంతంగా ఉండి విమానయానానికి అనుకూలంగా ఉంటుంది.
- 25 కి.మీ. – 35 కి.మీ. ప్రాంతంలో ఓజోన్ పొర (O3) కేంద్రీకృతమై భూమివైపు ప్రసరించే ప్రమాదకర అతినీలలోహిత కిరణాలను భూమిని చేరనీయకుండా నియంత్రించి జీవజాతిని పరిరక్షిస్తుంది.
- స్ట్రాటో ఆవరణానికి దానిపై గల మీసో ఆవరణానికి మధ్యగల సరిహద్దు స్ట్రాటోఫాస్
3) మీసో ఆవరణం
- స్ట్రాటో ఆవరణం నుంచి 20 కి.మీ. వరకు ఉన్న వాతావరణంలోని 3వ పొర.
- ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్లేకొద్ది ఉష్ణోగ్రతలు చాలా హెచ్చుస్థాయిలో పతనమవుతాయి. దీని కారణంగా ఈ ప్రాంతంలోని వాయు అణువులు నిశ్చల స్థితిలో ఉన్నందున ఈ ప్రాంతంలో ఘర్షణబలాలు జనిస్తాయి.
- విశ్వాంతరాళం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించే ఆస్టరాయిడ్స్, తోకచుక్కల్లాంటి ఖగోళ వస్తువులు ఇక్కడి ఘర్షణ బలాల వల్ల పూర్తిగా మండించబడి భూగోళ పరిరక్షణ గావించబడుతుంది.
- మీసో ఆవరణానికి, దానిపై గల ఐనో ఆవరణానికి మధ్యగల సరిహద్దు మీసోఫాస్.
4) థర్మో/ఐనో ఆవరణం
- మీసో ఆవరణం నుంచి 400 కి.మీ. వరకు గల వాతావరణంలోని 4వ పొర.
- ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్లేకొద్ది ఉష్ణోగ్రతలు చాలా హెచ్చుస్థాయిలో పెరుగుతాయి.
- ఈ ప్రాంతంలో వాయువులు అయాన్ల రూపంలో ఉన్నందున ఇక్కడ జరిగే థర్మో న్యూక్లియర్ చర్యల వల్ల కొంత శక్తి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో విడుదలవుతుంది. దీని కారణంగా రేడియో తరంగాలు భూమ్మీదకు పరావర్తనం చెందడం, సమాచార వ్యవస్థ అభివృద్ధి చెందడం జరుగుతుంది. అందుకే ఈ ఆవరణాన్ని ‘సమాచార వ్యవస్థ పొర’ అని కూడా అంటారు.
5) ఎక్సో ఆవరణం
- 400 కి.మీ. కంటే పైన ఉన్న వాతావరణంలోని బాహ్యపొర.
- ఇక్కడ పదార్థం తేలికైన హైడ్రోజనల్, హీలియం వాయువులతో ఏర్పడి ప్లాస్మా స్థితిలో ఉంటుంది.
- ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు ఎత్తుకు వెళ్లేకొద్ది హెచ్చుస్థాయిలో పెరుగుతాయి.
సూర్యపుటం – ఉష్ణోగ్రత (Insolation and Temperature)
సౌరశక్తి (Solar Energy): కేంద్రక సంలీన చర్య ద్వారా సూర్యునిలో జనించే శక్తి.
సౌరవికిరణం: సూర్యునిలో జనించే సౌరశక్తి కాంతి, ఉష్ణం రూపంలో వికిరణ పద్ధతిలో విశ్వాంతరాళంలోకి ప్రసరించడాన్ని ‘సౌరవికిరణం’ అంటారు.
సూర్యపుటం: భూమివైపు ప్రసరించే సౌరవికిరణం లేదా భూమి గ్రహించే సౌరవికిరణం
- సూర్యుని నుంచి విడుదలయ్యే మొత్తం సౌరవికిరణంలో 1/2000వ మిలియన్ల వంతు మాత్రమే భూ ఉపరితలాన్ని చేరుతుంది. ఇంత తక్కువ పరిమాణంలో సౌరవికిరణం భూమిని చేరడానికి కారణాలు..
- సూర్యునికి, భూమికి మధ్యగల సగటు దూరం ఎక్కువగా ఉండటం
- సూర్యుని పరిమాణంతో పోలిస్తే భూమి పరిమాణం చిన్నదిగా ఉండటం
సౌర స్థిరాంకం: భూమిని చేరే మొత్తం సౌరవికిరణం (సూర్యపుటం) భూమ్మీద గల ప్రతి చ.సెం.మీ. భూ భాగాన్ని నిమిషానికి సగటున 1.94 గ్రా. క్యాలరీల చొప్పున వేడి చేస్తుంది. దీన్నే భూమి ‘సౌర స్థిరాంకం’ అని పిలుస్తారు.
ఉష్ణోగ్రత
- భూ వాతావరణ పగటి సమయంలో హ్రస్వ తరంగాల ద్వారా భూ ఉపరితలం వైపు ప్రసరించే సౌర వికిరణం వల్ల కొద్దిగా మాత్రమే వేడెక్కి సాయంత్ర సమయంలో భూ ఉపరితలం నుంచి దీర్ఘ తరంగాలు/పరారుణ రూపంలో పైకి వెళ్లే ఉష్ణశక్తి (భౌమ వికిరణం) ద్వారా అధికంగా వేడెక్కుతుంది.
నోట్: ఉష్ణశక్తిని క్యాలరీస్లో కొలుస్తారు. ఉష్ణోగ్రత (డిగ్రీల్లో కొలుస్తారు) అనేది ఒక యూనిట్ తీవ్రత. - వాతావరణంలోని ఆ వేడి తీవ్రతనే ‘ఉష్ణోగ్రత’ అని పిలుస్తారు.
- భూమిపై విస్తరించి ఉన్న ఉష్ణోగ్రతను వివిధ ఉష్ణమాపకాలను ఉపయోగించి తెలుసుకోవచ్చు.
1) ఒక భౌగోళిక ప్రాంతంలోని కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలను తెలిపేది ‘సిక్స్ గరిష్ఠ-కనిష్ఠ ఉష్ణమాపకం’. శీతల ప్రాంతాల్లో ఉపయోగించే ఈ ఉష్ణమాపకాన్ని ఆల్కహాల్తోను, ఉష్ణ ప్రాంతాల్లో వాడే ఉష్ణమాపకాన్ని పాదరసంతోను నింపుతారు. ఈ ఉష్ణమాపకంలో 2 రకాల స్కేల్స్‌ను ఉపయోగిస్తారు.
ఎ. సెంటీగ్రేడ్ స్కేల్- రూపకర్త ఆండర్స్ సెల్సియస్
బి. ఫారన్‌హీట్ స్కేల్- రూపకర్త ఫారన్‌హీట్
2) ఒక భౌగోళిక ప్రాంతంలోని అత్యధిక ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి ఉపయోగించే ఉష్ణమాపకం- ఫైరోమీటర్
3) ఒక భౌగోళిక ప్రాంతంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలను తెలిపేది- క్రయోమీటర్
4) నావికులు ప్రయాణిస్తున్న ప్రాంత ఉష్ణోగ్రతలను తెలిపేది- బర్డోలిట్యూబ్ - భూమిపై ఉష్ణోగ్రత విస్తరణను 2 అంశాల పరంగా తెలుసుకోవచ్చు. అవి..
1) క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతా విస్తరణ
2) ఊర్థ ఉష్ణోగ్రత విస్తరణ
క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతా విస్తరణ: భూమ్మీద క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతా విస్తరణ ఉన్న భౌగోళిక ప్రాంతాల్లో ఒక విధంగా ఉండక కింద తెలిపిన అంశాలతో ప్రభావితమై ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అవి..
1) అక్షాంశాలు (Longitude)/ భూమ్మీద సూర్యకిరణాలు పడే కోణం
2) పగటి సమయం
3) సూర్యునికి, భూమికి మధ్యగల దూరం
4) వాతావరణ పారదర్శకత
5) సముద్ర సామీప్యత
6) భూ భాగాల/ పర్వతాల వాలు
7) భూ భాగాల ఎత్తు
8) ఒక భౌగోళిక ప్రాంతంలో విస్తరించి ఉన్న నేల, వృక్ష సంపద, వర్షపాతం, ఆ ప్రాంతంలో వీచే పవనాలు
అక్షాంశాలు: భూమి గోళాకారంగా ఉన్నందున భూమధ్య రేఖా ప్రాంతాల్లో సూర్యకిరణాలు తక్కువ దూరం ప్రయాణించి ఎక్కువ కోణం (90 డిగ్రీలు)లో భూమిపై పడి తక్కువ స్థలాన్ని ఆక్రమించి భూమిని అధికంగా వేడిచేస్తాయి. - ధృవాలవైపు వెళ్లేకొద్ది సూర్యకిరణాలు ఎక్కువ దూరం ప్రయాణించి భూమిపై ఏటవాలుగా (తక్కువ కోణంలో) పడి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి తక్కువగా వేడిచేస్తాయి.
- దీనివల్ల భూ రేఖ నుంచి ధృవాల వైపు వెళ్లేకొద్ది అక్షాంశాల పరంగా పరిశీలిస్తే ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి.
పగటి సమయం: ఇది రుతువులను బట్టి మారుతూ ఉంటుంది. - ఈ గోళంలో వేసవికాలంగా ఉన్నప్పుడు భూ రేఖ నుంచి ఉత్తర ధృవం వైపు వెళ్లేకొద్ది పగటి సమయం పెరుగుతుండటం వల్ల భూమిని చేరే సూర్యపుట పరిమాణం కూడా పెరుగుతుంది. అదే సమయంలో దక్షిణార్ధ గోళంలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.
ఉదా: ఉత్తరార్ధగోళంలో వేసవికాలంగా ఉన్నప్పుడు భారత్‌లోని ఏ ప్రాంతంలో పరిమాణంలో ఎక్కువ సూర్యపుటం చేరుతుంది? (1)
1) లేహ్ (జమ్ముకశ్మీర్) 2) ఢిల్లీ
3) బెంగళూరు 4) కన్యాకుమారి - అధిక ఉష్ణోగ్రతలు కన్యాకుమారిలో నమోదవుతాయి.
సూర్యునికి, భూమికి మధ్యగల దూరం - భూ కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉన్నందున భూమికి, సూర్యునికి మధ్యగల దూరం స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటుంది.
- దీని కారణంగా జనవరి నెలలో భూమికి దగ్గరగా ఉన్నందున ఎక్కువ సూర్యపుటం భూమిని చేరి భూగోళ సగటు ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. జూలై నెలలో భూమి సూర్యునికి ఎక్కువ దూరంలో ఉన్నందున తక్కువ సూర్యపుటం భూమిని చేరుతుంది.
- కారణంగా భూగోళ సగటు ఉష్ణోగ్రతలు జూలైలో తక్కువ.
- భూగోళ సగటు ఉష్ణోగ్రత 25.4 డిగ్రీల సెంటిగ్రేడ్.
- ఒక వస్తువు ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి కావాల్సిన ఉష్ణశక్తి విశిష్టోష్ణం.
వాతావరణ పారదర్శకత: వాతావరణ పారదర్శకత దెబ్బతిన్న భౌగోళిక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, వాతావరణం పారదర్శకంగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.
సముద్ర సామీప్యత: భూ జల భాగాలు ఉష్ణోగ్రతకు విభిన్నంగా స్పందించడం వల్ల ఒక అక్షాంశం మీద ఉన్న భూ జల భాగాల్లో ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు ఏర్పడుతాయి.
భూభాగాల ఎత్తు: ఒక అక్షాంశంపై ఉన్న లుథియానా (పంజాబ్)తో పోలిస్తే సిమ్లాలో ఉష్ణోగ్రత తక్కువ. కారణం- సిమ్లా ఎత్తులో ఉంది (ఎత్తుకు వెళ్లేకొద్ది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి) - సముద్ర మట్టం నుంచి ప్రతి 165 మీ. ఎత్తుకు వెళ్లేకొద్ది ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ సెంటిగ్రేడ్ చొప్పున తగ్గడం వల్ల ఒక అక్షాంశం మీద ఉన్న రెండు ప్రాంతాల మధ్య ఉష్ణోగ్రతా వ్యత్యాసాలేర్పడతాయి. ఉదా: ఒకే అక్షాంశం మీద ఉన్న లుథియానాతో పోలిస్తే సిమ్లాలో వాతావరణం చల్లగా ఉండటానికి కారణం, అది (సిమ్లా) సముద్ర మట్టం నుంచి ఎక్కువ ఎత్తులో ఉండటమే.
భూ భాగాల/ పర్వతాల వాలు: ఉత్తరార్ధగోళంలోని భూ భాగాల/ పర్వతాల దక్షిణ వాలులు సూర్యునికి ఎదురుగా ఉన్నందున ఆ ప్రాంతంలో ఎక్కువ సూర్యపుటం చేరి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
జీ గిరిధర్
సివిల్స్ ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్
హైదరాబాద్
9966330068
Previous article
CRPF Recruitment | సీఆర్పీఎఫ్లో 9212 కానిస్టేబుల్ ఉద్యోగాలు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






