G20 Summit 2023 | జీ-20కి భారత్ అధ్యక్ష బాధ్యతలు – విశ్లేషణ
పరిచయం
- G20 New Delhi Summit 2023 | ‘జీ-20కి భారత్ అధ్యక్షత వహించడం అంటే అది సమ్మిళితం, నిర్ణయాత్మకం, కార్యాచరణ సహితం.. వచ్చే ఏడాది మనం కొత్త ఆలోచనలతో ఉమ్మడి కార్యాచరణను వేగవంతం చేయడానికి కంకణబద్ధులవుదాం. కలిసికట్టుగా మనం ప్రపంచ మార్పు కోసం జీ-20ని ఒక ఉత్ప్రేరకంగా మారుద్దాం’ – ప్రధాని నరేంద్ర మోదీ (2022, నవంబర్ 16న ఇండోనేషియాలోని బాలిలో జీ-20 ముగింపు కార్యక్రమంలో).
- అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రతిష్ఠాత్మక వేదిక గ్రూప్ ఆఫ్ ట్వంటీ (జీ-20). ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత 1999లో జీ-20 ఏర్పాటయ్యింది. ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు అంతర్జాతీయ ఆర్థిక అంశాలను చర్చించే వేదికగా ఇది రూపుదిద్దుకుంది. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇది దేశాధినేతల వేదికగా మారింది. తర్వాత 2009లో ‘అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రతిష్ఠాత్మక సంస్థ’గా మారింది. ప్రపంచ జీడీపీలో సుమారు 85 శాతం వాటా, ప్రపంచ జనాభాలో 60 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం పైగా వాటాను జీ-20 కలిగి ఉంది. అలాంటి జీ-20కి స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా 2022, డిసెంబర్ 1 నుంచి భారత్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత పరపతికి, నాయకత్వ గుర్తింపునకు నిదర్శనం.
ప్రాధాన్యం
1) పారిశ్రామిక, అభివృద్ధి చెందుతున్న దేశాలతో సహా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న ఈ కూటమిలో యూరోపియన్ యూనియన్‌తో కలిపి మొత్తం 20 దేశాలను సభ్యదేశాలుగా కలిగి ఉంది.
2) అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పులను తగ్గించడం, స్థిరమైన అభివృద్ధి వంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి ఇది పనిచేస్తుంది.
3) ఇది మొదట్లో స్థూల ఆర్థిక అంశాల మీద దృష్టి సారించినా, తర్వాత కాలంలో దాని ఎజెండాను విస్తృతపరచుకుంది. ఫలితంగా వాణిజ్యం, వాతావరణ మార్పు, సుస్థిర అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, పర్యావరణం, అవినీతి నిరోధం వంటి అంశాలను కూడా తన ఎజెండాలో చేర్చింది.
4. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ఆర్థిక సంక్షోభాలను పరిష్కరించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో జీ-20 సభ్యులు ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడానికి, అభివృద్ధి వ్యయాన్ని పెంచడం, వాణిజ్య అడ్డంకులను తగ్గించడం వంటి సంఘటిత చర్యలను చేపట్టింది.
5. ప్రపంచ వాణిజ్యం, వాతావరణ మార్పు, డేటా వికేంద్రీకరణ మొదలైన కీలకమైన అంతర్జాతీయ విషయాల్లో జీ-20 అవసరమైన అంతర్జాతీయ సహకారానికి నాయకత్వం వహిస్తుంది.
6) కొవిడ్-19 సమయంలో పేద దేశాలకు జీ-20 కూటమి అండగా నిలబడింది. ఆ సమయంలో కొన్ని పేద దేశాలకు రుణాల మాఫీ చేసి గొప్ప ఉపశమనాన్ని అందించింది. ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి టీకాలు వేయడానికి 2021, అక్టోబర్‌లో జీ-20 ఆమోదించింది.
సమావేశం- 2022 - 17వ శిఖరాగ్ర సమావేశం ఇండోనేషియా రాజధాని బాలిలో 2022, నవంబర్‌లో నిర్వహించారు. దీన్ని ‘రికవర్ టుగెదర్ – రికవర్ స్ట్రాంగర్’ అనే థీమ్‌తో నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా మూడు ప్రాధాన్య అంశాల మీద చర్చ జరిగింది. అవి..
1) గ్లోబల్ హెల్త్ ఆర్కిటెక్చర్
2) డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్
3) సస్టెయినబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్
బాలి డిక్లరేషన్
1) రష్యా దురాక్రమణ ఖండన - ప్రపంచంలో కొవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకోకముందే రష్యా-ఉక్రెయిన్ రూపంలో మరొక సంక్షోభం ముందుకొచ్చింది. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోవడం, ఆహార ధాన్యాల కొరత ఏర్పడటం, ఆర్థికమాంద్యానికి ఊతమివ్వడం వంటి ప్రతికూల ఫలితాలు సంభవించాయి. వీటన్నింటికి కారణమైన రష్యా సామ్రాజ్యవాద పూరిత దురాక్రమణను సభ్యదేశాలు మూకుమ్మడిగా ఖండించాయి.
2) గ్లోబల్ ఎకానమీపై దృష్టి - కొవిడ్-19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావాల వల్ల పెరిగిపోతున్న ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యల పరిష్కారానికి సభ్యదేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.
3) ఆహారభద్రత - రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఆహార సంక్షోభాన్ని నివారించడానికి సభ్యదేశాల మధ్య అంగీకారం కుదిరింది. ముఖ్యంగా ‘నల్ల సముద్రం ధాన్యాల చొరవ’ను ప్రశ్నించారు.
4) వాతావరణ మార్పులు - జీ-20 సమావేశం 2015 నాటి పారిస్ ఒప్పందాన్ని అమలు చేయడానికి మరోసారి పునరుద్ఘాటించారు. శతాబ్దం చివరి నాటికి ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది.
5) డిజిటల్ పరివర్తన - సుస్థిరమైన లక్ష్యాలను చేరుకోవడానికి వీలుగా, మహిళలకు, బాలికలకు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారికి సాధికారత లభించేలా అందరిలో డిజిటల్ నైపుణ్యాలను పెంచడానికి కూటమి అంగీకరించింది.
6) ఆరోగ్యం - కొవిడ్-19 నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందన కోసం ప్రపంచ బ్యాంకు ప్రారంభించిన ‘పాండమిక్ ఫండ్’ అనే కొత్త ఆర్థిక మధ్యవర్తి నిధిని కూటమి స్వాగతించింది. అంతర్జాతీయంగా సార్వత్రిక కవరేజీని సాధించడానికి తన అంగీకారాన్ని తెలియజేసింది.
భారత్ అధ్యక్ష బాధ్యతలు - స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత భారత్ తొలిసారి ఒక బలమైన అంతర్జాతీయ కూటమికి నాయకత్వం వహించడం గొప్ప విశేషం. 2022, నవంబర్ 16న ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సులో ఇండోనేషియా అధ్యక్షుడు జోకోవిడోడో జీ-20 అధ్యక్ష బాధ్యతలు ప్రధాని నరేంద్ర మోదీకి అప్పగించారు. ఫలితంగా 2022, డిసెంబర్ 1 నుంచి 2023, నవంబర్ 30 వరకు జీ-20 అధ్యక్ష హోదాలో భారత్ తన పాత్రను పోషించనుంది.
భారత్ అధ్యక్ష బాధ్యతలు – అవకాశాలు
- 1) ప్రపంచ నాయకత్వం
- ఇప్పటికే ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్, కొవిడ్-19 సవాలును తట్టుకొని అభివృద్ధి బాటలో నడవగలుతుంది. అదే సమయంలో 2022లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి నెల రోజులు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించి ఉండటం, శాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్, వాసనార్ అరేంజ్మెంట్ వంటి వాటికి కూడా 2023లో అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండటం వల్ల అంతర్జాతీయంగా మన విదేశాంగ విధానానికి, మన సాంస్కృతిక వైభవానికి, మన నైపుణ్యాలకు గుర్తింపు లభించి, భవిష్యత్తులో ప్రపంచ నాయకత్వ దేశంగా నిలబడే అవకాశం ఏర్పడుతుంది.
2) వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ - ప్రపంచంలో ఇప్పటికే చైనా తర్వాత అనేక రంగాల్లో ముందజంలో ఉన్న భారత్ చైనా దురాక్రమణపూరిత విధానం వల్ల ప్రపంచంలో అపఖ్యాతి మూటగట్టుకుంటూ ఉండగా, భారత్ అందుకు ప్రత్యామ్నాయ శక్తిగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రపంచ దక్షిణ దేశాలకు ప్రాతినిథ్యం వహించేలా తన విదేశాంగ విధానాన్ని రూపొందించుకుంటున్నది.
3) ఉపాధి, పర్యావరణం - జీ-20 సమావేశం వల్ల దేశంలో పెట్టుబడుల ఆకర్షణకు అవకాశాలు ఏర్పడుతాయి. దేశం అతిపెద్ద మానవ వనరుల డెమోగ్రాఫిక్ డివిడెండ్, సహజ వనరుల లభ్యత వంటి అంశాల ఆధారంగా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంది.
- మరోవైపు భారత్ నాయకత్వం వహిస్తున్న ‘అంతర్జాతీయ సౌరకూటమి’, ‘వన్ సన్ – వన్ వరల్డ్ – వన్ గ్రిడ్’ వంటి చొరవలు మరింత బలోపేతం అవడానికి అవకాశం ఉంది. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి భారత్ తయారీ కేంద్రంగా మారవచ్చు.
4) సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన - జీ-20 అధ్యక్ష హోదాలో భారత్ తన అభివృద్ధి కార్యక్రమాల గురించి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో అంతర్జాతీయ కృషిని పొందడానికి అవకాశం ఉంది. వాతావరణ మార్పులను నిరోధించడానికి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు బహుళపక్ష వేదికల సంస్కరణలు అమలు చేయడానికి భారత్‌కు అవకాశాలు లభిస్తాయి.
భారత్ అధ్యక్ష బాధ్యతలు – సవాళ్లు
- ఎ) చైనా దూకుడు
- 2020 గల్వాన్ ఘర్షణల అనంతరం రెండు దేశాల మధ్య సరిహద్దు యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. అదే సందర్భంలో దక్షిణ చైనా సముద్రం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా తన స్థావరాలను పెంచుకుంటూ ఉండటం, వన్ రోడ్ – వన్ బెల్డ్ చొరవ ద్వారా భారత్ సరిహద్దు దేశాలను తన నియంత్రణలోకి తెచ్చుకోవడం ఇవన్నీ భారత్ ఎదుర్కోవాల్సిన సవాళ్లు.
బి) రష్యా-ఉక్రెయిన్ యుద్ధం - రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం వైపు నడిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరల పెంపు, ఆహార కొరత, నిరుద్యోగం, పేదరికం పెరుగుతున్నాయి. అదే సమయంలో రష్యాకు చైనా మద్దతు తెలుపుతుండటం కూడా ఒక సవాలే. ఈ నేపథ్యంలో భారత్ ఆర్థిక మాంద్యాన్ని తట్టుకొని ప్రపంచానికి నాయకత్వం వహించడం అతిపెద్ద సవాలు.
సి) కొవిడ్ భయాలు, రూపాయి పతనం - ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపించిన కొవిడ్, భారత్‌నూ ప్రభావితం చేసింది. కొత్త కొత్త వేరియంట్లతో ఎప్పటికప్పుడు దేశాన్ని భయపెడుతుంది. కాబట్టి ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జీ-20కు అధ్యక్ష వహించడం, అందుకు ప్రపంచ దేశాలను సమన్వయం చేయడం కత్తిమీద సాము.
- మరోవైపు అంతర్జాతీయ పరిణామాల వల్ల రోజురోజుకూ పడిపోతున్న రూపాయి విలువ, పెరిగిపోతున్న వాణిజ్య లోటు, ద్రవ్య లోటు వీటన్నింటినీ భారత్ సమతుల్యం చేయాల్సిన పరిస్థితి ఉంది.
డి) ఉగ్రవాద ముప్పు - అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడ్డాక భారత్‌కు ఉగ్రవాద ముప్పు మరింత పెరిగింది. దానికితోడు పాకిస్థాన్‌తో కూడా గత కొన్నేళ్లుగా మనకు సన్నిహిత సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో భారత భద్రతా వ్యవస్థకు ఒక చాలెంజింగ్ టాస్క్‌లా ఇది మారనుంది.
ఇ) మౌలిక వసతుల లేమి - భారత్‌లో జీ-20 సమావేశ నిర్వహణకు ఇప్పటి నుంచే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. నిధుల కొరత, వ్యవస్థలోని అవినీతి వల్ల అవి ఎంతవరకు ఫలితాలిస్తాయనేది ప్రశ్న.
ముందుకెళ్లాల్సిన మార్గం
1) ‘వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్’ అనే నాయకత్వం ద్వారా గ్లోబల్ సౌత్ దేశాలను ఒకచోట చేర్చి, వారి దృక్కోణాలు, ప్రాధాన్యాలను ఉమ్మడి వేదిక కూడా బలోపేతం చేయాలి.
2) జీ-20 2023 సమావేశ థీమ్ ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ను జన్ ఆందోళన్ (ప్రజా ఉద్యమం) ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి.
3) ఆత్మనిర్భర్ భారత్ చొరవ ద్వారా భారతీయ ఉత్పత్తులకు, ఆవిష్కరణలకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావాలి.
4) సభ్య దేశాలతో పాటు పొరుగు దేశాలను ఈ సమావేశానికి ఆహ్వానించి ప్రపంచ ఉమ్మడి ప్రయోజనాలను పరిరక్షించాలి.
ముగింపు - అంతర్జాతీయ ప్రాధాన్యమున్న కీలక విషయాల మీద గ్లోబల్ ఎజెండాకు తన వంతు పాత్ర పోషించడానికి భారత్‌కు ఇదొక విశిష్ట అవకాశం. భారతదేశం ఒకవైపు అభివృద్ధి చెందిన దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలతోనూ తన వాణిజ్య వాతావరణ, సాంస్కృతిక సంబంధాలను సమతుల్యం చేయడానికి ఈ వేదిక ఒక మంచి అవకాశంగా మారుతుంది. ప్రధాని దార్శనికతకు అనుగుణంగా రూపొందించిన భారత విదేశాంగ విధానం ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా నాయకత్వ పాత్రను పోషిస్తుంది.
జీ-20 2023 సమావేశం లోగో, చిహ్నం
- జీ-20 లోగోకు స్ఫూర్తి భారత జాతీయ పతాకంలోని కాషాయ, శ్వేత, ఆకుపచ్చ, నీలి వర్ణాలే. దానికి పక్కన ఇంకోవైపు భారత జాతీయ పుష్పమైన కమలంతో భూగ్రహం ఎదుగుదల సవాళ్లను ఎదుర్కోవడాన్ని ప్రతిబింబిస్తుంది. భారత్దేశ భూమి అనుకూల విధానాన్ని చాటుతుంది. ప్రకృతిలో మమేకమయ్యే భావనను ప్రతిబింబిస్తుంది.
- భారతదేశ జీ-20 అధ్యక్ష భావనకు ఆలంబనగా నిలిచే నినాదం ‘వసుదైవ కుటుంబమ్’ లేదా ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ను పురాతన సంస్కృత గ్రంథమైన మహోపనిషత్తు నుంచి స్వీకరించారు. ప్రధానంగా ఈ భావన జీవిత విలువలను మానవ, జంతు, వృక్ష, సూక్ష్మజీవులకు భూమ్మీద వాటి పరస్పర అనుబంధాన్ని, విశాల విశ్వంతో వాటి పరస్పర అనుబంధాన్ని పునరుద్ఘాటిస్తుంది.
Previous article
Geography | ఏ ఆవరణాన్ని ‘సమాచార వ్యవస్థ పొర’ అని అంటారు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు