GEOGRAPHY | పర్వతాల ఊయలగా వేటిని పేర్కొంటారు?
ప్రాథమిక భూస్వరూపాలు
- ఇవి ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు. ఇవి ఏర్పడటానికి కారణం ప్రథమశ్రేణిపై ఒకదానిపై ఒకటి వ్యతిరేక దిశలో పనిచేసే అంతర్జనిత (భూకంపాలు, అగ్నిపర్వతాలు), బహిర్జనిత (నదులు, పవనాలు, హిమానీ నదాలు, సముద్ర తరంగాలు, అంతర్భూజలం) బలాలే.
అంతర్జనిత బలాలు: వీటిని విరూపకారక బలాలు అని అంటారు. వీటి కారణంగా భూ ఉపరితల దృశ్యంపై ఉన్న ప్రస్తుత ప్రధాన భూస్వరూపాలు వివిధ భౌమకాలాల్లో ఏర్పడ్డాయి.
బహిర్జనిత బలాలు/బాహ్య ప్రకృతి బలాలు: ఇవి భూ ఉపరితల భూ స్వరూపాలను శైథిల్యం, క్రమక్షయ, నిక్షేపణ ప్రక్రియలకు లోనుచేస్తూ వాటి ఆకార, పరిమాణంలో నిరంతరం మార్పులు కలుగజేస్తాయి. - పై బలాల వల్ల ఏర్పడిన పరిణామ స్వరూపాలే
1) పర్వతాలు 2) పీఠభూములు 3) మైదానాలు
1) పర్వతాలు - పరిసర ప్రాంతంతో పోలిస్తే ఎత్తుగా ఉండి, నిట్రవాలు కలిగిన భూ స్వరూపం ‘పర్వతం’.
- సాధారణంగా 1000 మీ. కంటే ఎక్కువ ఎత్తుగా ఉంటే పర్వతం, తక్కువగా ఉంటే కొండలు.
- పర్వతాలు ఏర్పడిన కాలాన్ని (యుగం) బట్టి నాలుగు రకాలుగా విభజించారు. అవి..
1) పూర్వ కేంబ్రియన్ పర్వతాలు: అత్యంత పురాతనమైనవి.
ఉదా: లారెన్షియా, ఆల్గోమన్ పర్వతాలు (నార్త్ అమెరికా)
2) కలెడోనియన్ పర్వతాలు: సైలూరియన్, డివోనియన్ యుగంలో ఏర్పడ్డాయి.
ఉదా: టాకోనిక్ (యూఎస్ఏ), ఆరావళి, మహదేవ, సాత్పూర పర్వతాలు
3) హెర్కినియన్ పర్వతాలు: పర్మియన్, కార్బోనిఫెరస్ యుగంలో ఏర్పడ్డాయి.
ఉదా: వాస్జెస్ (ఫ్రాన్స్), బ్లాక్ఫారెస్ట్ (జర్మనీ), టియూన్షాన్, ఆల్టాయ్ (మధ్య ఆసియా)
4) ఆల్పైన్ పర్వతాలు: టెర్షియరీ యుగంలో ఏర్పడిన నవీన పర్వతాలు. ఇవి పామీర్ ముడి కేంద్రంగా, అర్మేనియా ముడి కేంద్రంగా విస్తరించాయి.
ఉదా: హిమాలయాలు, ఆండీస్, రాఖీ, ఆల్ప్స్, కాకసస్, అట్లాస్, కున్లున్, ఎల్బ్రస్, జాగ్రోస్ పర్వతాలు.
పర్వతాల రకాలు
1) ముడుత పర్వతాలు
- భూ అభినతిలోని నిక్షేపాలు భూపటల ఒత్తిడుల వల్ల నెట్టబడి ముడుత పర్వతాలు ఏర్పడుతాయి.
- అభిసరణ పలక కదలికల వల్ల ముడుత పర్వతాలు ఏర్పడ్డాయి. వీటిని నిజమైన పర్వతాలు అంటారు.
- ఈ భూ అభినతులను పర్వతాల ఊయలగా పేర్కొంటారు. ఇవి ప్రాచీన ఆరావళి, అపలేచియన్, యూరల్, నవీన హిమాలయాలు, ఆల్ప్స్, రాఖీ, ఆండీస్ పర్వతాలు.
- ఆసియా- హిమాలయాలు, హిందూకుష్, కారకోరం, యూరల్, అరకాన్, యోమ, పెగుయోమ, ఎల్బ్రస్, హిమాలయాలు, ఆరావళి పర్వతాలు.
- ఆఫ్రికా- అట్లాస్, డ్రాకెన్స్బర్గ్
- ఉత్తర అమెరికా- రాఖీ, అపలేచియన్
- దక్షిణ అమెరికా- ఆండీస్ (ప్రపంచంలో పొడవైనవి)
- అంటార్కిటికా- ట్రాన్స్ అంటార్కిటికా పర్వతాలు
- ఐరోపా- ఆల్ప్స్, పైనరీస్, కాకసస్
- ఆస్ట్రేలియా- గ్రేట్ డివైడింగ్ పర్వతాలు (ఆస్ట్రేలియన్ ఆల్ప్స్)
2) అగ్నిపర్వతాలు - భూమిలోపలి అధిక ఉష్ణోగ్రత వల్ల ఏర్పడిన మాగ్మా (శిలాద్రవం) ఒకే అగ్నిపర్వత గొట్టం గుండా, భూఉపరితలానికి వచ్చి పోగుపడితే ఆ స్వరూపాన్ని అగ్నిపర్వతం అంటారు.
ఉదా: ఆసియా- బారెన్, నార్కొండం (అండమాన్ దీవులు), మౌంట్ ఫ్యూజీ (జపాన్), క్రాకటోవా (ఇండోనేషియా), మేయాన్ (ఫిలిప్పీన్స్), కోహ్-ఇ-సుల్తాన్ (పాకిస్థాన్), మౌంట్ పోప (మయన్మార్) - ఆఫ్రికా- కామెరూన్ (కామెరూన్), రువెంజరీ (డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో)
- మధ్య అమెరికా- పోస్ (కోస్టారికా), పీలే (మార్టినిక్యూ ద్వీపం)
- దక్షిణ అమెరికా- కొటోపాక్సీ (ఈక్వెడార్), ఓజోస్ డెల్ సలాడో (అర్జెంటీనా, చిలీ మధ్య)
- యూరప్: మౌంట్ ఎట్నా (ఇటలీ), వెసూవియస్ (ఇటలీ), స్ట్రంబోలి (మధ్యధరా సముద్రంలో)
3) ఖండ పర్వతాలు - రెండు భూభాగాల మధ్యగల భాగం అకస్మాత్తుగా అంతర్గత శక్తుల వల్ల పైకి నెట్టబడితే ఆ ప్రక్రియను భ్రంశోత్తిలు శిలావిన్యాసం అని, ఈ పర్వతాన్ని ‘ఖండ పర్వతం’ అని అంటారు.
- ఒకవేళ రెండు భూ భాగాల మధ్య భాగం అకస్మాత్తుగా సర్దుబాటుకు గురై కుంగిపోతే ఆ ప్రక్రియను ‘గళిత శిలావిన్యాసం’ అని, ఆ లోయ ప్రాంతాన్ని పగులులోయ అని అంటారు. పగులులోయ పక్కనే ఉన్న ఎత్తయిన ప్రాంతాన్ని ‘ఖండపర్వతం’ అంటారు.
ఉదా: వాస్జెస్ పర్వతాలు (ఫ్రాన్స్), బ్లాక్ ఫారెస్ట్ (జర్మనీ), సాల్ట్ రేంజ్ (పాకిస్థాన్), సియెర్రానెవడా
(కాలిఫోర్నియా) - వాస్జెస్, బ్లాక్ ఫారెస్ట్ పర్వతాల మధ్యలో గల పగులులోయ గుండా రైన్ నది ప్రవహిస్తుంది.
- వింధ్య, సాత్పూర పర్వతాల మధ్య లోపల పగులులోయ గుండా నర్మద నది ప్రవహిస్తుంది.
- సాత్పూర, అజంతా పర్వతాల మధ్య లోపల పగులులోయ గుండా తపతి నది ప్రవహిస్తుంది.
4) అవశిష్ట పర్వతాలు - క్రమక్షయ శక్తుల వల్ల ఎత్తును, పరిమాణాన్ని, విస్తీర్ణాన్ని కోల్పోయిన పురాతన పర్వతాలను ‘అవశిష్ట పర్వతాలు’ అంటారు.
ఉదా: ఆరావళి, రాజ్మహల్ పర్వతాలు (భారతదేశం) - అపలేచియన్ పర్వతాలు (అమెరికా తూర్పుభాగం)
5) పరిశిష్ట పర్వతాలు
- ఎత్తయిన పీఠభూములు నదుల క్రమక్షయానికి గురికాగా మిగిలిన ఎత్తయిన ప్రాంతం పర్వతం లాగా కనిపిస్తుంది. ఇలాంటి వాటిని ‘పరిశిష్ట పర్వతాలు’ అంటారు.
ఉదా: పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, అజంతా శ్రేణులు, హరిశ్చంద్ర శ్రేణులు (భారతదేశం)
2. పీఠభూములు - సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండి కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్న విశాలమైన భూభాగాన్ని ‘పీఠభూమి’ అంటారు. పీఠభూములను కింది విధంగా వర్గీకరించారు.
1) పర్వతాంతర పీఠభూమి: చుట్టూ పర్వతాలతో చుట్టిన పీఠభూములు. ఇవి సాధారణంగా ఎత్తుగా ఉండి, పర్వత వర్షాచ్ఛాయ ప్రాంతంగా ఉంటాయి.
ఉదా: టిబెట్ పీఠభూమి (హిమాలయాలు, కున్లున్ పర్వతాల మధ్య), ఇరాన్ పీఠభూమి (జాగ్రఫీ, ఎల్బ్రస్ పర్వతాల మధ్య), మంగోలియా పీఠభూమి (అల్టాయ్ పర్వతాలు, హింగన్, యిన్ పర్వతాల మధ్య), మెక్సికో పీఠభూమి (సియెర్రా మాడ్రి, ఓనియంటల్ మధ్య), బొలీవియా పీఠభూమి (ఆండీస్ పర్వతాలు)
2) పర్వతపాద పీఠభూములు: పర్వతాల దిగువన విస్తరించిన పర్వతాలు. రెండో వైపున వీటికి మైదానాలు గాని, సముద్రాలు గాని సరిహద్దుగా ఉంటాయి. అందుకే వీటిని సరిహద్దు పీఠభూములు’ అంటారు.
ఉదా: ఆండీస్ పర్వత పాదాల వద్దగల పెటగోనియా పీఠభూమి, అపలేచియన్ పర్వత పాదాల వద్దగల అపలేచియన్ పీఠభూమి, ఆరావళి, వింధ్య పర్వత పాదాల వద్దగల మాళ్వా పీఠభూమి
3) ఖండాంతర పీఠభూములు: భూ అంతర్భాగంలోని ఊర్ధబలాల వల్ల, విరూపక శక్తుల ప్రభావం వల్ల ఖండ మధ్యభాగంలో ఏర్పడిన విశాలమైన పీఠభూములు.
ఉదా: అరేబియా పీఠభూమి, దక్షిణాఫ్రికా పీఠభూమి, దక్కన్ పీఠభూమి
4) లావా పీఠభూమి: మాగ్మా ఒకే గొట్టం గుండా ఉపరితలానికి వస్తూ అగ్నిపర్వతాన్ని ఏర్పరుస్తుంది. అదే మాగ్మా అనేక భ్రంశాల ద్వారా పైకి వస్తూ లావా పీఠభూములు ఏర్పడుతాయి. ఇవి అత్యంత సారవంతమైన నల్లరేగడి మృత్తికలను కలిగి ఉంటాయి.
ఉదా: మహారాష్ట్ర పీఠభూమి (దక్కన్ పీఠభూమి వాయవ్య భాగం), కొలంబియా పీఠభూమి (ఉత్తర అమెరికా), సెర్రాజెరాల్ పీఠభూమి (బ్రెజిల్ తూర్పుభాగం), అబిసీనియా పీఠభూమి (ఇథియోపియా), ఐస్లాండ్ పీఠభూమి (ఐస్లాండ్), ఆగ్నేయ ఆఫ్రికా పీఠభూమి (దక్షిణాఫ్రికా)
5) కళశ పీఠభూమి: గోళాకారంలో ఉండే పీఠభూములు. ఇవి వలయాకార ప్రవాహ నమూనాను కలిగి ఉంటాయి.
ఉదా: చోటానాగపూర్ పీఠభూమి (భారతదేశం), ఓజార్క్ పీఠభూమి (అమెరికా)
3) మైదానాలు - తక్కువ ఎత్తును కలిగి దాదాపు సమతలంగా ఉండే భూస్వరూపం. సారవంతంగా, నీటి పారుదల సౌకర్యాలతో, అధిక జనాభాను కలిగి ఉంటాయి.
- మైదానాలను కింది విధంగా వర్గీకరిస్తారు.
1) ఖండాంతర్గత మైదానాలు: వీటిని నిర్మితీయ మైదానాలు అని కూడా పిలుస్తారు. భూమి లోపల అంతర్గత శక్తుల వల్ల విశాల భాగం సముద్రమట్టం కంటే పైకి వచ్చి ఏర్పడే మైదానాలు.
ఉదా: సైబీరియా మైదానాలు (రష్యా), అమెరికాలోని గొప్ప మైదానాలు (గ్రేట్ ప్లెయిన్స్)
2) తీర మైదానాలు: సముద్ర తీరాన్ని అంటిపెట్టుకొని ఉన్న మైదానాలు. ఖండతీరపు అంచు కుంగిపోవడం వల్ల గాని, పైకి నెట్టబడటం వల్ల గాని ఏర్పడే మైదానాలు.
ఉదా: భారతదేశంలోని పశ్చిమ తీర మైదానాలు మొదటి రకానికి (నిమజ్జిత), తూర్పు తీర మైదానాలు రెండో రకానికి (ఉద్భవిత) చెందినవి.
3) క్రమక్షయ మైదానాలు: క్రమక్షయ శక్తుల వల్ల ఎత్తయిన ప్రాంతాలు దీర్ఘకాలంలో మైదానాలుగా ఏర్పడతాయి. అవి..
ఎ) నదీ కోత మైదానాలు: నదీ క్రమక్షయం వల్ల ఏర్పడే మైదానాలు. మైదానంలో అక్కడక్కడ ఇంకా క్రమక్షయం కాని శిలాభాగాలు ఉంటాయి. వాటిని మొనాడ్ నాక్స్ అంటారు.
ఉదా: సట్లెజ్ మైదానాలు (భారతదేశం), పశ్చిమ సైబీరియా మైదానాలు (రష్యా), కెనడియన్ షీల్డ్ మైదానాలు (కెనడా)
బి) హిమానీనద కోత మైదానాలు: హిమానీ నదాల క్రమక్షయం వల్ల ఏర్పడే మైదానాలు.
ఉదా: కెనడా ఉత్తర మైదానాలు, ఉత్తర ఐరోపా మైదానాలు, ఆక్సాయ్చిన్ మైదానాలు (భారతదేశం), లడఖ్ మైదానాలు (భారతదేశం)
సి) పవన క్రమక్షయ మైదానాలు: ఎడారి ప్రాంతాల్లో పవన క్రమక్షయం వల్ల ఏర్పడుతాయి.
ఉదా: వీటిని సహారా ఎడారిలో రెగ్, హమడా, సెరిర్ మైదానాలు అని పిలుస్తారు.
డా) సముద్ర తరంగ క్రమక్షయ మైదానాలు: వీటిని స్ట్రాండ్ ప్లాట్ మైదానాలు అంటారు.
ఉదా: నార్వే వాయవ్య తీరాన, ఈ రకమైన మైదానం ఉంది.
ఇ) కార్బ్స్ మైదానం: సున్నపురాయి విస్తృతంగా ఉండే ప్రాంతంలో వర్షపు నీటిలోని కార్బోనిక్ ఆమ్లం ప్రభావానికి లోనై ఏర్పడిన మైదానం
4) నిక్షేపిత మైదానాలు: నదులు, హిమానీ నదాలు, పవన నిక్షేపణ వల్ల ఏర్పడినవి.
ఎ) నదీ నిక్షేపిత మైదానాలు: వరద మైదానాలు, డెల్టాలు వంటి నదీ నిక్షేపణ వల్ల ఏర్పడినవి. ప్రపంచంలోని పెద్ద పెద్ద మైదానాలన్నీ ఈ కోవకు చెందినవే.
ఉదా: గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానాలు, మెసపటోమియా (ఇరాన్) మైదానాలు, డాన్యూబ్ మైదానాలు - నదులు, సరస్సుల్లో నిక్షేపణ జరిపి మైదానాలను ఏర్పరిస్తే వాటిని సరోవరీయ మైదానాలు అంటారు.
బి) హిమానీనద నిక్షేపిత మైదానాలు: వీటిని టిల్ మైదానాలు లేదా అవుట్వాష్ మైదానాలు అని కూడా అంటారు. - హిమానీనదం కరిగిపోయే సమయంలో నిక్షేపించబడే మైదానాలు.
సి) పవన నిక్షేపిత మైదానాలు: పవన వేగం తగ్గుతూపోయే కొద్ది వాటి రవాణా సామర్థ్యం తగ్గిపోయి సన్నని రేణువులను నిక్షేపించడం ప్రారంభిస్తుంది. ఇలాంటి మైదానాలను ‘లోయస్ మైదానాలు’ అంటారు. - చైనాలో గల పసుపు మైదానాలు ఇలా ఏర్పడినవే.
జీ గిరిధర్
సివిల్స్ ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్
హైదరాబాద్
9966330068
Previous article
ISRO Recruitment | ఇస్రోలో 303 సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు