Geography – Groups Special | స్థానిక శైథిల్యం – గతిశీల క్రమక్షయం
వికోశీకరణం, క్రమక్షయ భూస్వరూపం
- భూస్వరూపాల నిర్మాణం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. వీటిపై బాహ్య, అంతర్గత బలాలు పని చేస్తూ ఉంటాయి. అంతర బలాలు భూభాగాన్ని ఉత్థానపరిస్తే, బాహ్య బలాలు ఈ ఉత్థాన భాగాలను శైథిల్యం, క్రమక్షయం చేస్తాయి.
- శిలలను శిథిలం చేయడం, భూమిని సమం చేసే క్రియను ‘వికోశీకరణం’ అంటారు. వికోశీకరణం 2 రకాలు. అవి..
1) శిలా శైథిల్యం - భూ పటలంలోని శిలలు వాతావరణంలోని భౌతిక, రసాయన కారణాల వల్ల కృషించి శిథిలమవడాన్ని శిలా శైథిల్యం అంటారు.
- శిలా శైథిల్యాన్ని ప్రభావితం చేసే కారకాలు శిలా స్వభావం, శీతోష్ణస్థితి, కాలం.
- శిలా శైథిల్యం 2 రకాలు.
ఎ) భౌతిక (యాంత్రిక) శైథిల్యం: శిలల రసాయనిక సంఘటలో ఎలాంటి మార్పులేకుండా కేవలం శిలలు భౌతికంగా కావడమే. కారణం ఉష్ణోగ్రతలో మార్పులు, మంచు ఒత్తిడి, జంతువులు, వృక్షాల వల్ల. - భూమధ్యరేఖ, ఎడారి ప్రాంతంలో ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల భౌతిక శైథిల్యం.
- ఉన్నత అక్షాంశ ప్రాంతాల్లో మంచు వల్ల శిలాశైథిల్యం.
బి) రసాయనిక శిలా శైథిల్యం: శిలల రసాయన సంఘటనలో మార్పు రావడం. - ఇది ఎక్కువగా అధిక వర్షపాతం, సున్నపురాయి ప్రాంతం లో జరుగుతుంది. భూమధ్య రేఖా ప్రాంతంలో కూడా ఎక్కువగా ఈ శైథిల్యం ఉంటుంది.
2) క్రమక్షయం - శిలా శైథిల్యం వల్ల శిలల పై భాగంలో ఏర్పడిన శైథిల్య పదార్థాలను (Regolish) పవనాలు, నదులు, హిమానీ నదాలు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి రవాణా చేస్తాయి. ఈ రవాణా జరిగేటప్పుడు శిలాపదార్థం మరింత ఎక్కువ శైథిల్యం అవుతుంది. దీన్నే క్రమక్షయం అంటారు.
- శైథిల్యానికి, క్రమక్షయానికి గల ముఖ్యమైన తేడా శైథిల్యం స్థానికంగా జరిగే చర్య కాగా, క్రమక్షయం గతిశీలమైన ప్రక్రియ. ఈ రెండింటిని కలిపి వికోశీకరణం అంటారు.
- బాహ్య బలాలు (బహిర్జనిత బలాలు) అయిన నదులు, సముద్ర ప్రవాహాలు, అంతర్ భూజలం, సముద్ర తరంగాలు, పవనాలు ఒకదానితో ఒకటి పరస్పర వ్యతిరేక దిశలో పని చేస్తూ ఉన్నందున భూ ఉపరితల దృశ్యంపై అనేక రకాల ‘మూడో తరం భూస్వరూపాలు’ ఏర్పడి ఉన్నాయి.
నదీ క్రమక్షయ, నిక్షేపణ చర్య వల్ల ఏర్పడే భూ స్వరూపాలు - ఉష్ణ, సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో నదీ ప్రవాహాల క్రమక్షయం, నిక్షేపణ చర్యల వల్ల నదీ ప్రవాహ మార్గంలో ఈ భూస్వరూపాలు ఏర్పడతాయి.
ఎ) V ఆకారపు వలయం: నదీ ప్రవాహ మార్గంలో పక్క కోత కంటే అధోముఖ కోత ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి లోయలు ఏర్పడతాయి. ఉదా: హిమాలయ నదులు ప్రవహించే లోయలు
బి) గార్జ్‌లు: నదుల కోత వల్ల ‘V’ లోయల అంచులు కోతకు గురై, నిటారుగా ఉన్న గోడలు కలిగిన భూస్వరూపాలు ఏర్పడతాయి. ఉదా: గోదావరి నది వద్ద గల బైసన్ గార్జ్, బ్రహ్మపుత్ర పై గల దిహంగ్ గార్జ్, కడపలో పెన్నా నదిపై గల పెన్నా గార్జ్.
సి) అగాధ దరులు: V లోయలు క్రమేణా కోతకు గురై అతి లోతైన లోయలుగా మారుతాయి. వీటి గోడలు నిటారుగా ఉండి 3 కి.మీ. లోతును కలిగి ఉంటాయి.
ఉదా: అమెరికాలోని ఉటాహ, అరిజోనా రాష్ట్రంలోని కొలరాడో పీఠభూమిలో గల బ్రైస్ కాన్యాన్. దీన్నే గ్రాండ్ కాన్యాన్ ఆఫ్ కొలరాడో అని పిలుస్తారు. పొడవు 466 కి.మీ., లోతు 16 కి.మీ.
డి) నదీ జలపాతం: కఠిన శిల, మృదు శిల పొదలుగా అమరి ఉన్నప్పుడు ‘భేదక క్రమక్షయం’ జరుగుతుంది. దీనివల్ల జలపాతాలు ఏర్పడతాయి. ఇవి కిందకు దూకే ప్రదేశాన్ని ‘దుముకు మడుగు’ అంటారు. - ప్రపంచంలో ఎత్తయిన జలపాతం ఏంజెల్స్
- ప్రపంచంలో అతి పెద్దదైన నయాగరా జలపాతం (అమెరికా) సెయింట్ లారెన్స్ నదిపై ఉంది.
ఇ) మోనాడ్ నాక్స్: క్రమక్షయ కారకాల వల్ల ఒక భూస్వరూపం పెనిస్లేస్ స్థితికి చేరక ముందు అక్కడక్కడ మిగిలి ఉన్న అవశిష్టాలు లేదా చిన్న చిన్న గుట్టలు.
ఎఫ్) నదీ వంకరలు (ఆక్స్ బౌ సరస్సులు/ మియాండర్స్):
నదీ ప్రవాహ మార్గంలో నదీ వక్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు, నది వక్రమార్గాన్ని విడిచి పెట్టి తిన్నగా ప్రవహించడం వల్ల నదీ వక్రతలు సరస్సులుగా మారుతాయి. ఇవి ఎద్దు అడుగు రూపంలో ఉండటం వల్ల వీటిని ‘ఆక్స్ బౌ’ సరస్సులు అంటారు.
జి) ద్వీపం: అన్ని వైపులా నీటితో ఆవరించి ఉన్న భూ భాగం. ఉదా: శ్రీలంక, గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్
హెచ్) ద్వీపకల్పం: మూడు వైపులా నీటితో ఆవరించి ఉండి, ఒకవైపు భూ భాగంతో ఉన్న భూస్వరూపం. ఉదా: అరేబియా, భారత ద్వీపకల్పం.
ఐ) భూ సంధి (Isthumus): రెండు భూ భాగాలను కలుపుతూ, రెండు జల భాగాలను వేరు చేసే సన్నని భూ భాగాన్ని భూ సంధి అంటారు. ఉదా: పనామా, సూయజ్ భూ సంధులు
జే) అగ్రం (Horn): చివరికొన సముద్రంలోనికి చొచ్చుకొనిపోతే ఆ కొనను అగ్రం అంటారు. ఉదా: గుడ్‌హోప్ అగ్రం
(ఆఫ్రికా ఖండం చివరికొన), కన్యాకుమారి అగ్రం (భారత చివరి కొన)
కే) ఎడారి: అత్యల్ప వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రతలు గల ప్రాంతాన్ని ఎడారి అంటారు. ఉదా: సహారా, థార్, కలహారి
ఎల్) నది: పర్వతాలు, పీఠభూమి, మైదానాల గుండా సహజంగా ప్రవహించే జీవ లేదా అశాశ్వత జల ప్రవాహాన్ని
నది అంటారు.
ఎం) లోయలు: సన్నని లోతైన భూతలాన్ని ‘లోయలు’. ఇవి నదుల, హిమానీ నదాల క్రమక్షయం వల్ల ఏర్పడతాయి. ఉదా: బ్రహ్మపుత్ర లోయ
ఎన్) పగులు లోయ: భూ అంతర్ భాగంలోని బలాల వల్ల భూ పటలంపై ఉన్న సమాంతర భ్రంశాల మధ్య ఉన్న భూ భాగాల కిందకు దిగజారగా ఏర్పడే లోయలు. ఉదా: నర్మద, తపతి లోయలు
ఓ) డెల్టా: నదీ ముఖ ద్వారం వద్ద రెండు లేదా అంతకు మించిన పాయలతో సముద్రాన్ని కలుస్తుంది. ఈ పాయల మధ్యగల ప్రాంతంలో సారవంతమైన ఒండ్రు మట్టి నిక్షేపిస్తుంది. దాన్ని డెల్టా అంటారు. ఉదా: గంగా డెల్టా, గోదావరి డెల్టా
పీ) సరస్సు: అంతర్ భాగంలో ఉన్న నదీ జలభాగాన్ని సరస్సు అంటారు. ఉదా: చిల్కా సరస్సు (ఒడిశా), కొల్లేరు సరస్సు (ఏపీ)
క్యూ) అఖాతం: సముద్రపు అలల ద్వారా క్రమక్షయం చెందినటువంటి అర్ధచంద్రాకార భూ స్వరూపాన్ని ‘అఖాతం’ అంటారు. ఉదా: బంగాళాఖాతం
ఆర్) జలసంధి: రెండు విశాల సముద్ర ప్రాంతాలను కలుపుతూ, రెండు విశాల భూ భాగాలను వేరు చేస్తున్న సన్నని సముద్ర జల భాగాన్ని జలసంధి అంటారు. ఉదా: బేరింగ్ జలసంధి, పాక్ జలసంధి
2) హిమానీ నద క్రమక్షయ, నిక్షేపణ చర్యల వల్ల ఏర్పడే భూ స్వరూపాలు: ఉన్నత అక్షాంశ ప్రాంతాల్లో హిమానీ నద క్రమక్షయ, నిక్షేపణ చర్యల వల్ల ఈ భూ స్వరూపాలు ఏర్పడతాయి. హిమానీ నదాలనే మంచు నదులు అంటారు. - పర్వత వాలును అనుసరించి భూ గురుత్వాకర్షణ శక్తి వల్ల కిందకు జాలువారే మంచు సమూహాన్నే హిమానీ నదం అంటారు. హిమానీ నద జన్మస్థలాలు హిమక్షేత్రాలు.
- హిమ రేఖ అంటే హిమక్షేత్రాల కింద సరిహద్దును హిమరేఖ అంటారు. హిమాలయాల్లో హిమరేఖ 18,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. హిమరేఖకు ఎగువన ఉన్న ప్రాంతమంతా ఎప్పుడూ మంచుతో కప్పి ఉంటుంది.
- ఐస్‌బర్గ్స్ అంటే హిమానీ నదం సముద్రంలో చేరేటప్పుడు దాని అగ్రభాగం ముక్కలుగా విడిపోయి మంచుగడ్డల రూపంలో నీటిలో తేలియాడుతూ ఉండేవాటిని ‘ఐస్‌బర్గ్’ అంటారు.
- అవలాంచ్ అంటే అధిక బరువు గల మంచు ఖండాల భూ ఉపరితలంపై పడితే వాటిని అవలాంచ్ అంటారు.
- ప్రపంచంలో అతిపెద్ద హిమనదం అంటార్కిటికా ఖండంలోని ‘బియర్డ్ మోరె’.
1) ‘U’ ఆకారపు లోయలు: హిమానీ నదుల అడుగు భాగంలో సమతలంగా, నిట్రవాలుతో కూడిన క్రమక్షయ లోయలు. ఉదా: సెయింట్ లారెన్స్ లోయ (అమెరికా)
2) రోచ్మాటినే: ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతాల్లో హిమానీ నదాల కోత మూలంగా పెద్ద బండరాళ్లు చిత్ర విచిత్ర ఆకారాలను సంతరించుకుంటాయి. గొర్రెల మంద ఆకృతిని పోలి ఉంటే రోచ్మాటినే అంటారు.
3) ఫియార్డ్స్: హిమానీ నదాలు సముద్రాలు లేదా లోయలోకి జారుతున్నప్పుడు ఏర్పరచే చేతివేళ్లను పోలిన క్రమక్షయ స్వరూపం.
4) హిమగర్తలు: హిమానీ నదం ప్రవహించే మార్గంలో ఏర్పడిన అర్ధ చంద్రాకారపు లేదా పడక కుర్చీ లాంటి ఆకారంలో ఏర్పడిన స్వరూపం. వీటినే కొర్రీలు అని కూడా అంటారు.
5) ఎరిటె: రెండు, మూడు హిమగర్తలు కలిసినప్పుడు కనిపించే కత్తిలాంటి స్వరూపం.
6) మొరైన్లు: హిమనదాల క్రమక్షయం వల్ల సేకరించిన అవక్షేపాలను ‘టిల్’ అంటారు. హిమానీ నదం చివరి దశలో కరిగిపోయి ఈ టిల్ పదార్థం మొత్తాన్ని వదిలివేస్తుంది. వీటినే మొరైన్లు అంటారు.
7) డ్రమ్లిన్లు: మొరైన్లు బోర్లించిన స్పూన్ ఆకారంలో ఉంటే వాటిని డ్రమ్లిన్లు అని, ఈ డ్రమ్లిన్లు అధికంగా ఉన్న ప్రాంతాన్ని ‘ఎగ్ బాస్కెట్’ ప్రదేశం అంటారు.
8) బౌల్డర్ క్లే: మొరైన్లలో బంకమట్టి అధికంగా ఉంటే వాటిని బౌల్డర్ క్లే అంటారు.
3) పవన క్రమక్షయ, నిక్షేపణ చర్య వల్ల ఏర్పడే భూ స్వరూపాలు - భూ ఉపరితలం 30 శాత ఎడారులను కలిగి ఉంది. శుష్క, అర్ధ శుష్క శీతోష్ణస్థితి గల ఎడారి భౌగోళిక ప్రాంతాల్లో వర్షపాతం అత్యల్పం. కాబట్టి పవనాలు భూ స్వరూపాలను ఏర్పరుస్తాయి.
- పవనాలు క్రమక్షయాన్ని ఎగురవేత (Deflation), అపఘర్షణ (Abarsion), రాపిడి (Attition) పద్ధతుల ద్వారా నిర్వహిస్తుంది.
పవన క్రమక్షయ స్వరూపాలు
1) పుట్టగొడుగు ఆకారపు శిలలు: పవనాలు ఎడారిలోని శిలలను పుట్టగొడుగు ఆకారంలో క్రమక్షయం చేస్తాయి. - ఈ శిలలు అడుగు భాగాన అధికంగా, ఉపరితలాన తక్కువగా క్రమక్షయం చేస్తాయి.
2) ఏకాంతర కొండ (Inselberg): ఎడారిలోని పరిసర ప్రాంతాలన్నీ క్రమక్షయం కాగా ఇంకా అక్కడక్కడ మిగిలిపోయిన కఠిన శిలా స్వరూపాలు. ఉదా: ఆస్ట్రేలియాలోని అయర్స్ రాక్
3) యార్డాంగ్, జ్యూగెన్స్: ఇవి కూడా భేదక క్రమక్షయం వల్ల ఏర్పడే పవన క్రమక్షయ స్వరూపాలు.
4) ఎగురవేత గుంతలు: ఎడారిలో అప్పుడప్పుడు గాలి దుమారాల వల్ల టన్నుల కొద్ది ఇసుక మొత్తం ఎగురుతుంది. ఇలా ఏర్పడిన గుంతలే ఇవి. ఇవి వర్షం నీటితో నిండి ఒయాసిస్సులు ఏర్పడుతాయి.
జీ గిరిధర్
ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్
హైదరాబాద్
9966330068
Previous article
NITHM Hyderabad | అతిథి దేవోభవ!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు