General Science | మోతాదు తక్కువ.. ప్రయోజనం ఎక్కువ
విటమిన్లు
మానవుడు ఆరోగ్యంగా మనుగడ సాగించడానికి విటమిన్ల అవసరం ఎంతో ఉంది. విటమిన్ల లోపం వల్ల ఎన్నో వ్యాధులు వచ్చినా లోపాన్ని పూరిస్తే ఆయా వ్యాధులు సులభంగా నయమవుతాయి. పోటీ పరీక్షల్లో
విటమిన్లకు సంబంధించిన ప్రశ్నలు తరచూ అడుగుతున్నారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా విటమిన్ల సమాచారాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం..
- విటమిన్లు జీవ సంబంధిత పదార్థాలు. ఇవి మన శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే సూక్ష్మపోషకాలు. విటమిన్ అనే పదం లాటిన్ పదాలైన వైటల్ (అతిముఖ్యమైన), అమైన్లు (అమైనో సమ్మేళనాలు) కలయిక వల్ల ఉద్భవించింది.
- పోలెండ్ దేశానికి చెందిన కసిమిర్ ఫంక్ జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండటానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలను విటమిన్లుగా నిర్వచించాడు.
- తర్వాతి కాలంలో విటమిన్లు అన్ని అమైన్లు కాదని గుర్తించారు. అందువల్ల Vitamines లోని e ని తొలగించి ప్రస్తుతం Vitaminలుగా పిలుస్తున్నారు.
- ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలో కానీ, దేహ నిర్మాణంలో కానీ తోడ్పడవు. శక్తి ప్రసరణ, జీవక్రియల నియంత్రణలో ముఖ్య పాత్ర వహిస్తాయి.
- కొన్ని విటమిన్లు సహ ఎంజైమ్‌లుగా పనిచేస్తాయి. విటమిన్ల లోపం వల్ల న్యూనతా వ్యాధులు కలుగుతాయి.
- మన శరీరానికి విటమిన్లు రెండు రకాలుగా అందుతాయి. 1. మనం తీసుకునే ఆహారం ద్వారా 2. జీర్ణవ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా విటమిన్లను సంశ్లేషిస్తుంది.
- కరిగే స్వభావాన్ని బట్టి విటమిన్లను రెండు రకాలుగా వర్గీకరించారు.
1. కొవ్వులో కరిగే విటమిన్లు
2. నీటిలో కరిగే విటమిన్లు
కొవ్వులో కరిగే విటమిన్లు - ఎ, డి, ఇ, కె విటమిన్లు. ఇవి శోషణం చెందడానికి పైత్యరసం అవసరం.
విటమిన్ – ఎ
- దీని రసాయన నామం- రెటినాల్
- విటమిన్-ఎను యాంటీ జిరాఫ్తాల్మిక్ విటమిన్, యాంటీ నిక్టాలోపిక్ విటమిన్‌గా పిలుస్తారు.
- విటమిన్-ఎ మొక్కల్లో బీటా కెరోటిన్ (ప్రోవిటమిన్-ఎ) రూపంలో ఉంటుంది. కాలేయం, పేగుల్లో బీటా కెరోటిన్ విటమిన్-ఎ గా మారుతుంది.
విధులు - ఉపకళా కణజాలాలు ఉత్తేజితంగా ఉండటానికి, పెరుగుదలకు, కంటిచూపు మామూలుగా ఉంచడంలోనూ ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. రక్తనాళాల్లో మ్యూకస్ పొరను రక్షిస్తుంది.
- కంటి నేత్రపటంలో (రెటినా) రొడాప్సిన్ (విజువల్ పర్పుల్) పునఃసంశ్లేషణకు విటమిన్-ఎ అత్యావశ్యకం.
- రెటినోయిక్ ఆమ్లం (విటమిన్-ఎ ఆమ్లం) కొన్ని రకాల క్యాన్సర్లను నాశనం చేస్తుంది.
- జంతువుల్లో శరీర పెరగుదలకు, ఎముకలు, దంతాలు ఏర్పడటానికి విటమిన్-ఎ అవసరం.
లోపం వల్ల కలిగే వ్యాధులు - విటమిన్-ఎ లోపం వల్ల రేచీకటి (నిక్టోలోపియా), జిరాఫ్తాల్మియా (కండ్ల కలక, కంజెక్టివా పొడిబారడం), కెరటోమలేషియా (శుక్ల పటలం పొడిబారడం), చత్వారం కలుగుతాయి. ఇవే కాకుండా చర్మం పొడిబారడం, నేత్ర పటలం సమస్యలు కలుగుతాయి.
లభించే వనరులు - ఆకుకూరలు, క్యారెట్, టమాటా, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసం, చేపలు, గుడ్లు, పాలు, కాడ్ చేపలు, షార్క్ చేపల నుంచి లభించే నూనెల్లో విటమిన్-ఎ పుష్కలంగా లభిస్తుంది. రోజువారీ ఆహారంలో విటమిన్-ఎ ఉండాల్సిన పరిమాణం 750 మిల్లీ గ్రాములు.
విటమిన్ – డి
- దీని రసాయననామం- కాల్సిఫెరాల్
- సాధారణంగా యాంటీ రాకైటిక్ విటమిన్ అని, సన్‌షైన్ విటమిన్ అని కూడా అంటారు. (ఫ్రీ విటమిన్, హార్మోన్ లాంటి విటమిన్)
- సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల సమక్షంలో క్షీరదాల చర్మం విటమిన్-డి ని సంశ్లేషించుకోగలుగుతుంది.
విధులు - అన్నవాహిక నుంచి కాల్షియం పాస్ఫరస్లను ఎక్కువగా గ్రహించి ఎముకలు ఏర్పడటానికి, గట్టిపడటానికి తోడ్పడుతుంది.
- దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి ఇది అత్యవసరం.
- విటమిన్-డి రెండు రూపాల్లో ఉంటుంది. 1. విటమిన్-డి2 (ఎర్గో కాల్సిఫెరాల్) 2. విటిమన్-డి3 (కోలె కాల్సిఫెరాల్)
- ఎర్గో స్టెరాల్ మొక్కల్లో లభిస్తే, కోలె కాల్సిఫెరాల్ జంతువుల్లో లభిస్తుంది.
లోపం వల్ల కలిగే వ్యాధులు - విటమిన్-డి లోపం వల్ల పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో ఆస్టియోమలేసియా అనే వ్యాధులు కలుగుతాయి.
- దీని లోపం వల్ల పక్కటెముకల్లో బుడిపెలు ఏర్పడతాయి. ఈ స్థితిని ‘రాకిటిక్ రోజరీ’ అంటారు.
- ప్రపంచంలో 80 శాతం మంది విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలుపుతుంది.
లభించే వనరులు - కాలేయం, గుడ్లు, వెన్న, కాడ్ చేపలు, షార్క్ చేపల కాలేయం నుంచి లభించే నూనెల్లో, క్యాబేజీ నుంచి లభిస్తుంది.
విటమిన్ – ఇ
- దీని రసాయననామం- టోకోఫెరాల్
- దీన్ని సాధారణంగా యాంటీ స్టెరిలిటీ విటమిన్, బ్యూటీ విటమిన్‌గా పిలుస్తారు.
విధులు - విటమిన్-ఇ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
- ఇది ఆక్సిజన్ స్వేచ్ఛా రాడికల్స్‌ను తటస్థీకరిస్తూ కండరాలను సమగ్రంగానూ, ఆరోగ్యంగానూ ఉంచుతుంది.
- బీజకోశాలు క్రియాశీలకంగా ఉండటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
- ముఖంపై ముడతలు రాకుండా ఉండటానికి విటమిన్-ఇ ఉపయోగకరం.
లోపం వల్ల కలిగే వ్యాధులు - కండరాల క్షీణత, ఎర్రరక్త కణాలు విచ్ఛిన్నమవడం, పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో
రుతుస్రావం, గర్భస్రావం వంటి సమస్యలు, సంతానోత్పత్తి సమస్యలు కలుగుతాయి.
విటమిన్ – కె
- దీని రసాయననామం- నాఫ్తోక్వినోన్
- దీన్ని సాధారణంగా యాంటీ హెమరేజిక్ విటమిన్ లేదా రక్తం గడ్డకట్టే విటమిన్‌గా పిలుస్తారు.
- ఇది సహజంగా రెండు రూపాల్లో లభిస్తుంది. అవి 1. విటమిన్-కె1 (ఫైలోక్వినోన్) 2. విటమిన్-కె2 (మోనాక్వినోన్/ఫార్నో క్వినోన్)
- పేగులోని సూక్ష్మజీవులు ఈ విటమిన్‌ను సంశ్లేషిస్తాయి.
విధులు - కార్బాక్సిలేజ్ సహకారకంగా పనిచేస్తుంది.
- రక్త స్కందనానికి అవసరమైన ప్రోత్రాంబిన్ ఏర్పడటానికి విటమిన్-కె అత్యవసరం.
- రక్తం గడ్డకట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
లోపం వల్ల కలిగే వ్యాధులు - విటమిన్-కె లోపం వల్ల రక్త స్కందనం ఆలస్యమవుతుంది. ఫలితంగా చిన్న గాయాల వల్ల కూడా అధిక రక్తస్రావం జరుగుతుంది.
లభించే వనరులు - కాలీఫ్లవర్, క్యాబేజీ, గుడ్లు, ఆకుకూరలు, టమాటా, జున్ను, ఆవుపాలు.
- నీటిలో కరిగే విటమిన్లు
- విటమిన్-బి, సి నీటిలో కరుగుతాయి. ఇవి పేగులో నేరుగా రక్తంలోకి శోషణం చెంది వివిధ భాగాలకు రవాణా అవుతాయి.
బి కాంప్లెక్స్ విటమిన్లు
విటమిన్-బి1
- దీని రసాయననామం-థయమిన్
- దీన్ని సాధారణంగా యాంటీ బెరిబెరి కారకం అంటారు.
- దీన్నే యాంటీ న్యూరైటిస్ విటమిన్ అని కూడా అంటారు.
- పాలిష్ చేసిన బియ్యంలో బి1 విటమిన్ లోపించి ఉంటుంది.
- హృదయ స్పందన క్రమరహితమవడాన్నే బెరిబెరి అంటారు. నరాలు బలహీనమవడం, పాక్షిక పక్షవాతాన్నే పాలిన్యూరైటిస్ అంటారు.
- నాడీ వ్యవస్థ పెరుగుదలకు, సరిగా పనిచేయడానికి చాలా అవసరం.
- పిండి పదార్థాలు, అమైనో ఆమ్లాల జీవక్రియలో పాల్గొనే ఎంజైమ్‌ల్లో ఇది సహ ఎంజైమ్‌గా పనిచేస్తుంది.
- దీని లోపం వల్ల బెరిబెరి అనే వ్యాధి కలుగుతుంది.
- పెద్దల్లో పాలీ న్యూరైటిస్, పిల్లల్లో పెరుగుదల తగ్గడం, ఆకలి తగ్గడం.
విటమిన్-బి2
- దీని రసాయననామం-రైబోఫ్లావిన్
- వాడుక భాషలో దీన్ని ఎల్లో విటమిన్, ఖిలోసిస్ విటమిన్, యాంటీ గ్లాసైటిస్ విటమిన్ అంటారు.
- ఆవుపాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణం విటమిన్-బి2
- నోటి మూలాల్లో పగలడాన్ని ఖిలోసిస్ అంటారు.
- బి2 లోపం వల్ల ఖిలోసిస్ (పెదవులు పొడిగా మారడం, నోటి మూలాలు పగలడం), గ్లాసైటిస్ (నాలుక ఎర్రగా మారి మంటగా ఉండటం), సెబోరిక్ డెర్మటైటిస్ (ముక్కు, చెవులపై పొలుసులు లేచి జిగట కలుగుతాయి)
- ఈ విటమిన్ తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్డులో పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్-బి3
- దీని రసాయన నామం- నియాసిన్/నికోటినికామ్లం లేదా నికోటినమైడ్
- దీన్ని వాడుక భాషలో యాంటీ పెల్లాగ్రా విటమిన్, సుస్థిర విటమిన్‌గా పిలుస్తారు.
- ఇది NADP, ADP సంయోగాల తయారీలో క్రియాశీలకంగా పనిచేస్తుంది.
- దీనిలోపం వల్ల చర్మ వ్యాధులు, నీళ్ల విరేచనాలు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, చర్మం పొలుసులు బారిపోవడం జరుగుతుంది.
- ముల్లంగి, బఠాణి, ఈస్ట్, చేపలు, వేరుశనగల ఇది పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్-బి5
- దీని రసాయననామం- పాంటోథెనిక్ ఆమ్లం
- ప్రకృతిలో విరివిగా లభించడం వల్ల దీన్ని సర్వ విస్తృత విటమిన్ అంటారు.
- గ్రీకు భాషలో పాంటోథెన్ అంటే ప్రతిచోట అని అర్థం.
- బి5 లోపం వల్ల అరికాళ్ల మంటలు, పెరుగుదల మందగించడం, వెంట్రుకలు రాలడం, ఆర్థరైటిస్ సంభవిస్తాయి.
- కూరగాయలు, కాలేయం, గుడ్డు, మాంసం, చిలగడదుంప, చేపలు, పాలు, ఈస్ట్, ధాన్యాలు, పండ్లలో ఈ విటమిన్ లభిస్తుంది.
విటమిన్-బి6
- దీని రసాయననామం- ఫైరిడాక్సిన్
- వాడుక భాషలో యాంటీ ఎనీమియా విటమిన్‌గా పిలుస్తారు.
- మాంసకృత్తుల జీవక్రియలో పాల్గొనే అనేక ఎంజైమ్‌లలో ఇది సహ ఎంజైమ్‌గా ఉంటుంది.
- హిమోగ్లోబిన్ సంశ్లేషణలో ఇనుము వినియోగానికి, ప్రతిదేహాల ఉత్పత్తికి కూడా తోడ్పడుతుంది.
- ఈ విటమిన్‌ను పేగులోని సూక్ష్మజీవులు సంశ్లేషిస్తాయి. కాబట్టి పెద్దల్లో దీని లోపం ఉండదు.
- చిన్న పిల్లల్లో దీనిలోపం వల్ల Covulsion కలుగుతుంది. దీని లోపం వల్ల హైపోక్రోమిక్ మైక్రోసైటిక్ రక్తహీనత కూడా కలుగుతుంది.
- గోధుమ, దంపుడు బియ్యం, సోయా చిక్కుడు, మాంసం, గుడ్లు, కాలేయం, పాలలో లభిస్తుంది.
విటమిన్-బి7
- దీన్ని H విటమిన్ అంటారు. రసాయననామం బయోటిన్.
- పేగులోని సూక్ష్మజీవులు ఈ విటమిన్‌ను సంశ్లేషిస్తాయి.
- సల్ఫర్ మూలకం కలిగిన విటమిన్.
- పచ్చిగుడ్డులో ఎవిడిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది బయోటిన్‌ను తటస్థీకరించడం వల్ల ఈ విటమిన్ లోపం కలగుతుంది.
లోపం వల్ల కలిగే వ్యాధులు
- కండరాల నొప్పులు, అలసట, నాడీ మండలంలో తేడాలు సంభవించడం, మానసిక రుగ్మత, రక్తంలో కొలెస్టిరాల్ అధికమవ్వడం, ఆకలి మందగించడం.
లభించే వనరులు - చేపలు, మాంసం, సోయా చిక్కుడు, టమాటా, పాలు, కాలేయం, మూత్రపిండాలు, గింజలు, కూరగాయలు.
విటమిన్-బి11
- వాడుక భాషలో ఫోలిక్ ఆమ్లం లేదా ఫోలాసిస్ అంటారు.
- దీన్ని విటమిన్ M అని కూడా అంటారు.
- విటమిన్-బి11ను ఎల్లాప్రగడ సుబ్బారావు కనుగొన్నాడు.
- ఈ ఆమ్లం స్టినాక్ పత్రాల నుంచి మొదట లభ్యమైంది.
- DNA, RNA తయారీకి కావలసిన ఎడినిన్, గ్వానిన్, థైమిన్ల సంశ్లేషణలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
- ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు ఏర్పడి అవి పరిణతి చెందడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
- దీని లోపం వల్ల రక్త హీనత, అతిసారం, మానసిక రుగ్మతలు కలుగుతాయి.
- మొక్కజొన్న, గోధుమలు, మొలకెత్తే గింజలు, ఆకుకూరలు, ధాన్యాలు, ఫలాలు, పాలు, గుడ్లు, మాంసంలో లభిస్తుంది.
విటమిన్-బి12
- దీని రసాయననామం- సయనోకోబాలమిన్
- దీన్ని యాంటీ పెర్నీషియన్ ఎనీమియా విటమిన్ అంటారు.
- జీర్ణ వ్యవస్థలోని బ్యాక్టీరియా ఈ విటమిన్‌ను సంశ్లేషిస్తుంది.
- నీలి రంగులో ఉంటూ కోబాల్ట్ అనే లోహ మూలకాన్ని కలిగి ఉంటుంది.
- ఎర్ర రక్తకణాలు పరిణతి చెందడానికి, DNA ఏర్పడటంలోనూ, మిథయోనైన్ ఏర్పడటంలో ఈ విటమిన్ సహ ఎంజైమ్‌గా పనిచేస్తుంది.
- పెర్నిషియస్ ఎనీమియా, మాక్రోసైటిక్ ఎనీమియా, హానికారక రక్తహీనత కలుగుతాయి.
- కోడి మాంసం, పాలు, గుడ్లు, కాలేయంలో పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్-సి
- దీని రసాయననామం-ఆస్కార్బిక్ ఆమ్లం
- వాడుక నామం యాంటీ స్కర్వీ విటమిన్.
- గాయాలు త్వరగా మానడానికి, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి విటమిన్-సి ఉపయోగపడుతుంది.
- కణాంతరాల్లో కొల్లాజెన్ ఏర్పడటానికి, దంతాల్లో డెంటిన్ ఏర్పడటానికి తోడ్పడుతుంది.
- ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
- దీని లోపం వల్ల స్కర్వీ వ్యాధి కలుగుతుంది.
- స్కర్వీ వ్యాధిని సెయిలర్స్ డిసీజ్ అని కూడా అంటారు.
- చర్మం పగలడం, పళ్లు, చిగుళ్లు వాయడం, రక్తస్రావం, గాయాలు మానకపోవడం స్కర్వీ వ్యాధి లక్షణాలు.
లభించే వనరులు - ఆకుకూరలు, సిట్రస్జాతి ఫలాలు (నిమ్మ, ఉసిరి), జామకాయలు, టమాటాల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది.
ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి(మంచాల)
రంగారెడ్డి జిల్లా
Previous article
ICMR-NCDIR | ఎన్‌సీడీఐఆర్ – బెంగళూరులో ఖాళీలు.. రేపే చివరితేదీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు