విజ్ఞాన సర్వస్వాల గురించి తెలుసుకుందాం!
అనంతమైన ఈ కాలవాహినిలో మానవుడు నిరంతరాభ్యుదయాన్వేషణతో నిత్యం సుఖాన్వేషణ కోసం తహతహలాడుతున్నాడు. అందుకు విజ్ఞాన సమూపార్జనే సాధనం. విశ్వవ్యాప్తమైన విజ్ఞానం దేశకాల ప్రాంతాలకు అతీతమై ప్రపంచ సౌభాగ్యానికి సాధనమవుతుంది. భారతీయ విజ్ఞానం ప్రాచీనకాలంలో మానవాభ్యుదయానికి ఉపయోగపడినట్లే నేటికీ ఉపయోపడుతుంది.
నేడు తెలుగులో వాడుతున్న విజ్ఞాన సర్వస్వం అనే పదానికి సమానార్థకంగా ఆంగ్లంలో ఎన్సైక్లోపీడియా అనే పదం కనిపిస్తుంది. గ్రీకు భాషాపదాలపైన ఎన్సైక్లియో, పీడియా అనే రెండు పదాలు కలిసి ఎన్సైక్లోపీడియా ఏర్పడింది. అంటే ఒక పద్ధతి ప్రకారం నిబంధించబడిన సంపూర్ణ విజ్ఞానంగా చెప్పవచ్చు.
ఇలియట్ తన లాటిన్ డిక్షనరీలో ఎన్‌సైక్లోపీడియాని నిర్వచిస్తూ క్రమపద్ధతిలో కూర్చిన అన్ని సిద్ధాంతాల సమాహారమే విజ్ఞాన సర్వస్వం అన్నారు.
-ఈ విజ్ఞాన సర్వస్వం వల్ల ప్రపంచంలోని జాతుల చరిత్రలు, మానవ జీవిత విధానాలు, మహాత్ముల జీవిత చరిత్రలు, వివిధ జాతుల నాగరికత సంస్కృతులు పరిచయం కావడం వల్ల, సమైక్యతా సౌభ్రాతృత్వాలు పెరిగి, కుటుంబ భావనకు దారితీస్తుంది.
-ఈ విజ్ఞాన సర్వస్వం మొదట గ్రీకు దేశంలో వెలువడి ఉంటుందనేది పెద్దల అభిప్రాయం. పాశ్చాత్య దేశాల పండితులైన అరిస్టాటిల్, డిడిరో, మార్కస్ టెర్షనియన్వారో, జాన్ హరీన్, అల్స్టెడ్ ఇంకా ఎందరో ఉన్నారు. 1) ఫ్రెంచి ఎన్సైక్లోపీడి- డేనిస్ డిడిరో 2) ఎన్సైక్లోపీడియా బ్రిటానికా-1768లో 3) ఆస్ట్రేలియన్ ఎన్సైక్లోపీడియా-1925 4) కెనడా ఎన్సైక్లోపీడియా-1935 5) గ్రీక్ ఎన్సైక్లోపీడియా-1926 6) హంగరీ ఎన్సైక్లోపీడియా 1911-27 7) ఇండోనేషియా-1954-56 8) జపాన్-1931 9) మెక్సికో-1950 10) నెదర్లాండ్స్-1947 11) స్కాండినేవియన్, స్పెయిన్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, టర్కీ, రష్యా 12) బాగ్దాద్ ఎన్సైక్లోపీడియా-ఇబ్నెఖాతైబా కితాబ్-య్యాల్ అక్బర్ అనే గ్రంథాన్ని క్రీ.శ. 800 ప్రాంతంలో రాశారు. 13 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విజ్ఞాన సర్వస్వం 1917లో వరల్డ్ బుక్ ఎన్ఐక్లోపీడియా వచ్చింది. 14) 1974లో ఎన్సైక్లోపీడియా బ్రిటానికా 3 భాగాలుగా వచ్చింది.
భారతీయ భాషల్లో : ఇండియాలో ప్రపంచంలోనే మొదటి విజ్ఞాన సర్వస్వాలనదగినవి వేదాలు. ప్రపంచంలో మొదటి గ్రంథం చతుర్వేతాల్లో మొదటిదైన రుగ్వేదం. ఇంకా 1) బెగాలీ విశ్వకోశ్-1911లో నరేంద్రబసు సంపాదకత్వంలో వెలువడింది. 2) హిందీ విశ్వకోశ్ 1916లో 3) గుజరాతీ విశ్వకోశ్ మొత్తం 100 సంపుటాలు. 4) మరాఠీ విశ్వకోశ శ్రీధర్ వెంకటేశ్ కేట్కర్ 5) తమిళ విజ్ఞాన సర్వస్వం తమిళ వళర్పికజగం 1947లో 6) కలైకలంజయమ్ (1947-75)ను పెరియస్వామి తూరన్ సంపాదకుడు.
7) కన్నడ విజ్ఞాన సర్వస్వం 1969-75 నిరంజన సంపాదకుడు- జ్ఞానగంగోత్రి. 8) కేరళ 1966లో మలయాళ విశ్వకోశం 10 సంపుటాలు వెలువడినాయి. 9) ఉర్దూ ఎన్సైక్లోపీడియా హైదరాబాద్‌లో అబుల్ కలాం ఆజాద్ ఓరియంటల్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ 12 సంపుటాలు 10) 1915లో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు మద్రాస్‌లో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ సమితిని ఏర్పర్చారు.
పండితారాధ్య చరిత్ర: తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ కవి పాల్కురికి సోమనాథుడు. ఈయన రచనల్లో ప్రముఖమైనవి బసవపురాణం, పండితారాధ్య చరిత్ర. పండితారాధ్య చరిత్ర నాటి సాంఘిక జీవన విధానానికి అద్దం పట్టింది. ప్రజల ఆహారవిహారాలు, ధరించే దుస్తులు, ఆభరణాలు, నాటకాలు, తోలుబొమ్మలాటలు, శివపూజలు, శివ మహోత్సవాలు ఆ రోజుల్లో ప్రచారంలో ఉండే శివగ్రంథాలు, అష్టనీరాజనాలు, శివభక్తుల కథలు మహాద్భుతాలైన శివుని ఇరవైఅయిదు లీలలు, ప్రజలు నిత్యం పారాయణం చేసే గ్రంథాల పేర్లు పదరచనలు, యోగాచార్యులు, షోడశ గణాలు, దశ గణాలు, సహస్ర నామ గణాలు ఉన్నాయి. వైద్యచికిత్సా విధానాలు, వీణలు, తంత్రులు గుప్తవిధ తాళాలు, సప్తవింశతి శుద్ధ తాళాలు 108 తాళభేదాలు, జన్యజనక రాగాలు, బంధాలు, 18 వాసనాదాలు, గతిభేదాలు అక్షరాలు, శృతులు, గమకాలు, ప్రత్యేక గమకాలు, రాగభేదాలు, సరివాచకాలు, అనువాచకాలు, జయపంచకం, జయత్రయం, తిరువులు, వహణులు, విశుద్ధదాయాలు, సాళగ తాళగతులు, అశతులు మొదలైన సంగీత నాట్యశాస్ర్తాలకు సంబంధించిన విషయాలెన్నో ఉన్నాయి.
భౌగోళిక అంశాలు: దివ్యక్షేత్రాలైన శ్రీశైలం వంటి వాటిని గురించి వివరించారు. జంగమకోట్లు, మకుటాలు, మండలాలు, ఆభరణాలు, వేషధారణలు, మట్టిపాత్రలు, శివపూజకు వాడే పూలు, పండ్లు వివరించారు.
-ఈ గ్రంథంలో వివిధ శాఖలకు చెందిన అన్ని శాస్త్ర అంశాలు ఉన్నాయి. అందుకే కొందరు దీన్ని తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వం అన్నారు.
-సెలయేళ్లు, నదీనదాలు, అడవులు మొదలైనవాటితోకూడిన ప్రకృతి సోయగాలు, చెంచులు, గిరిజనులు మొదలైన జాతులవారు తెలంగాణ, కన్నడ సంస్కృతులను అనుసరించే వారున్నారు. క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి ఇక్కడి గణతంత్ర రాజ్య వ్యవస్థ గురించి తరువాత నంద, మౌర్య, శాతవాహన, ఇక్ష్వాక, విష్ణుకుండిన, బాదామీ చాళుక్య, కందూరునాడు చోడులు, కాకతీయుల, దేవగిరి, యాదవ రాజులు, చెరకు, వావిలాల, ముసునూరి వంశరాజుల వివరణలు ఉన్నాయి. కుతుబ్‌షాహీ, మొఘల్స్, అసఫ్‌జాహీ వంశపాలన వివరాలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలైన ఉమామహేశ్వరం, అలంపురం, నృసింహక్షేత్రాలు, వెంకటేశ్వరాలయాలు, చెన్నకేశవాలయాలు వివరాలు ఉన్నాయి. ఆదిమ మానవుని ఆవాస వివరాలు, నదులు, సంస్కృతుల గురించి రాసిఉన్నాయి.
రెడ్డిరాజ్య సర్వస్వం: కొండా లక్ష్మీకాంతరెడ్డి అభ్యర్థన మేరకు బీఎన్ శాస్త్రి రాశారు. కొండా మాధవరెడ్డికి అంకితమిచ్చాడు. ఇందులో రెడ్డి పదోత్పత్తి రెడ్డి రాజ్య వంశాలైన దోసటి, పంట, వెల్లచేరి వివరాలు, రెడ్డి రాజ్యాలైన రేచర్ల, చెరకు, మల్యాల, మిరియాల, గోన, వావిలాల వంశాలు, సామంత రాజ్యాల వివరాలు ఉన్నాయి. రెడ్డి వంశీయులు సామంతులుగా, దండనాయకులుగా, మహాసామంతులుగా, మహాసామంతాధిపతులుగా విలసిల్లినట్లు వివరణలు ఉన్నాయి. ఇందులో 174 శాసనాల వివరాలు ఉన్నాయి.
బీఎన్ శాస్త్రి విజ్ఞాన సర్వస్వం: బిన్నూరి నరసింహ శాస్త్రి వలిగొండలో 1932 డిసెంబర్ 12న జన్మించారు. ఈయన నల్లగొండ మండల సర్వస్వం, ఆదిలాబాద్ విజ్ఞానం సర్వస్వం, బ్రాహ్మణ రాజ్య సర్వస్వం మొదలైనవి రాశారు.
నల్లగొండ జిల్లా సర్వస్వం: 1986లో ప్రథమ ముద్రణ. అన్ని జిల్లాల విజ్ఞానం సర్వస్వాలు వెలువడితే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులై అభివృద్ధి చెందుతారని శాస్త్రి అభిప్రాయపడ్డారు. నల్లగొండ జిల్లా (పాత) పశ్చిమాంధ్ర, పూర్వాంధ్రాల కూడలి. జిల్లాలోని దుర్గాలు, పుణ్యక్షేత్రాలు, మతాలు, కవులు, పండితులు, లలితకళాకారులు, ప్రజాపోరాటాలు, స్వాతంత్య్రసమరయోధులు, 126 శాసనాలు వివరాలు ఉన్నాయి. ఇంకో భౌగోళిక అంశాలు, చరిత్ర, ప్రజల ఆచారవ్యవహారాలు, సాహిత్యం, స్థానిక సంస్థలు, ప్రభుత్వాల వివరాలు ఉన్నాయి. ఇది శాస్త్రి తొలి విజ్ఞానం సర్వస్వం.
ఆదిలాబాద్ జిల్లా విజ్ఞానం సర్వస్వం: 1987 నుంచి 1989 వరకు జిల్లాను 75 సార్లు దర్శించి, 262 రోజులు శ్రమించి 1990లో దీన్ని ప్రకటించారు.
మహబూబ్‌నగర్ మండల విజ్ఞానం సర్వస్వం: 1933లో మూసీ పబ్లికేషన్వారి ప్రచురణ ఉమ్మడి రాష్ట్రంలో 3వ విజ్ఞానం సర్వస్వం ఇది.
బ్రాహ్మణ రాజ్య సర్వస్వం: ఇదికూడా బీఎన్ శాస్త్రి రచనల్లో ముఖ్యమైనది. ఇందులో 26 బ్రాహ్మణ వంశాలు, గణతంత్ర రాజ్యాలు, భారత వలస రాజ్యాలు, సంస్థానాలు, జమీందారులు, మరాఠపీష్వాలు, బౌద్ధం వర్థిల్లిన కాలంలో బ్రాహ్మణుల సాంఘిక చరిత్ర, 135 శాసనాల వివరాలు ఉన్నాయి. బ్రాహ్మణ జమీందారులైన లోకాయపల్లి, వాడాల, చంద్రగధ, లింగగిరి సంస్థానాలు పేర్కొన్నారు. శాతవాహన, ఇక్ష్వాక, ప్రాచీన పల్లవ, బృహత్పలాయన, శాలంకాయన, ఆనందగోత్రియ, విష్ణుకుండిన, మరాఠవంశ, పృథ్విమాల, గుప్తవంశ, మౌఖరి, వాకాటక, పాల వంశాలకు చెందిన 135 శాసనాల వివరాలు ఉన్నాయి.
ఆంధ్రుల సాంఘిక చరిత్ర: సురవరం ప్రతాపరెడ్డి రాసిన సాంఘిక చరిత్ర కాకుండా, బీఎన్ శాస్త్రి క్రీ.పూ. 4వ శతాబ్దం వరకు గల చరిత్రను కూడా రాసి 1975లో ముద్రించారు.
-ఇవేగాకుండా శాస్త్రి ఎన్నో రచనలు చేశారు. అందులో 1) ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి 2) భారతదేశ చరిత్ర-సంస్కృతి 3) ప్రతీహార యుగం 4) ఢిల్లీ సుల్తానుల యుగం 5) కాకతీయ యుగం 6) విజయనగర యుగం 7) మరాఠా యుగం 8) సాంస్కృతిక పునరుజ్జీవన యుగం 9) బ్రిటిష్ ఇండియా కంపెనీ యుగం 10) కందూరునాడు చోడుల శాసనాలు మొదలైనవి చాలా ఉన్నాయి.
హంసవింశతి: అయ్యలరాజు నారాయణామాత్యుడు రాశారు. సుమారు క్రీ.శ. 1800 సంవత్సర ప్రాంతంలోనిది. వింశతి అంటే సంస్కృతంలో ఇరవై. హంస చెప్పిన 20 కథలు. శ్రీరామునికి అంకితమిచ్చిన ఈ గ్రంథం రచయిత కొండమాంబ నూరపామాత్యుల పుత్రుడు.
హంస వింశతి విజ్ఞానం సర్వస్వం: 4 సంపుటాల్లో 2వేల పుటల్లో ఉన్న విజ్ఞానం సర్వస్వం ఇది.
రచయిత జీ వెంకటరత్నం. మొదటి సంపుటం 1990లో, రెండోది 1995లో వచ్చింది. కళావర్గం, విద్యావర్గం అనే ప్రకరణల్లో 1) నాట్యకళ-షోడశవృత్తాలు 2) వాదకళ-సప్తస్వరాలు, రాగ, తాళ భేదాలు ఉన్నాయి. విద్యారంగంలో 1) అలంకారాలు 2) అష్టాదశ పద్యాలు 3) అష్టాదశ పురాణాలు 4) అష్టాదశ సంహిత 5) చేషష్టి విద్యలు 6) చందస్సు 7) నిఘంటువులు 8) వేదాలు 9) వేదాంగాలు 10) శయ్యాపాకములు 11) షట్శాస్ర్తాలు 12) పంచసిద్ధాంతాలు ఇటువంటి 400కు పైగా అంశాలు ఉన్నాయి. హంసవింశతిలోని శాస్త్ర సాంకేతికాది పద వివరణ ఒక జ్ఞానసముద్ర మదనం వంటిది. నిఘంటువులు పక్షి విశేషం, వృక్ష విశేషం, ఆభరణ విశేషం అని దాటవేసిన మాటలు దాదాపు 4000లకు రచయిత వివరణ విచ్చినట్లు ఆచార్య బిరుదురాజు రామరాజు ప్రస్తుతించారు. హంసవింశతి రెండో సంపుటంలో భూగోళవర్గంలో 460 పదాలు వృక్ష వర్గంలోని చెట్లపేర్లకు శాస్త్రీయనామాలు పెట్టడం విజ్ఞాన సర్వస్వం ప్రత్యేకత.
-కొమర్రాజు లక్ష్మణరావు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం: 1915లో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ సమితి ఏర్పడింది. ఆధునికయుగంలో మొదటి విజ్ఞాన సర్వస్వం కూడా ఇదే. ఇది 3 సంపుటాలు. 1915, 1916, 1917లలో వెలువడినవి.
సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశాలు: 3 సంపుటాలు. దీని ప్రచురణ గురించి ఖండవల్లి లక్ష్మీరంజనం ఇలా చోప్పారు తెలంగాణలో పోలీస్ యాక్షన్ గొప్ప సాహిత్య ప్రభావంతో దాశరథి, కాళోజీ మొదలైన సాహిత్యవేత్తలకు విజ్ఞాన సర్వస్వ నిర్మాణాలపై అభిలాష కలిగింది. 1953లో ఉస్మానియా యూనివర్సిటీలో గణిత శాస్ర్తాచార్యులు భేతనభట్ల విశ్వనాథం, తెలుగు శాఖాధ్యక్షులు ఖండవల్లి లక్ష్మీరంజనం ఈ విజ్ఞాన కోశ నిర్మాణాని కోసం చర్చించి 1953 అక్టోబర్ 15న సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశ నిర్మాణానికి పునాదులు వేశారు.
-ఈ శతాబ్దం నుంచి తెలంగాణలో విద్య, భాష, సంస్కృతి రంగాల్లో నవచైతన్యం పెల్లుబికి ఒకప్పుడు వేగంగాను మరొకప్పుడు నెమ్మదిగాను పురోగమించుటకు ఈ సమితివారు గమనించి, విశ్వవ్యాప్తమైన విజ్ఞానాన్ని సంక్షేపరూపంలో కుటీరప్రాంగణానికి తీసుకొనివచ్చుటకు సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశ నిర్మాణానికి పూనుకొన్నారని తెలుస్తుంది.
-సంగ్రహాంధ్ర విజ్ఞానకోశంలో చెప్పాల్సిన ప్రధాన విషయాలను ఉస్మానియా విశ్వవిద్యాలయాన్నే ఒరవడిగా చేసుకొని ప్రణాళికలు తయారయ్యాయి.
కొన్ని విజ్ఞాన సర్వస్వాలు: 1) ఆర్ష విజ్ఞాన సర్వస్వం- శీలప్ప రామకృష్ణశాస్త్రి-1965, 2) ఆంధ్ర విజ్ఞాన సంపుటాలు- కందుకూరి బాలసూర్య, 3) ఆంధ్ర సర్వస్వం- మాగంటి బాపినీడు-1961, 4) ఆంధ్రదేశ చరిత్ర భూగోళ సర్వస్వం- ఖండవల్లి లక్ష్మీరంజనం- 1971, 5) ఆంధ్రప్రదేశ్ దర్శిని- 1976- వైవీ కృష్ణారావు, 6) రుగ్వేద భాష్య భూమిక- స్వామి దయానంద సరస్వతి-1955 ఆర్యసమాజ్ హైదరాబాద్, 7) తెలుగు హరికథా సర్వస్యం- దోమాటి దొణప్ప, 8) పురాణ నామ చంద్రకళ- ఎం వెంకట్రామయ్య
-1877, 9) ప్రపంచ రాజ్య సర్వస్వం- దేవులపల్లి రామానుజారావు-1971, 10) బాలల విజ్ఞాన సర్వస్వం- బుడ్డిగ సుబ్బరాయన్- 1990, 11) విజ్ఞాన దీపిక- ఎన్ నరోత్తంరెడ్డి, 12) విజ్ఞాన సర్వస్వం తెలుగు భాషా సమితి, 13) విక్రమసింహపురి మండల సర్వస్వం- నల్లపురెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి 14) శ్రీకృష్ణదేవరాయాంధ్ర సాహిత్య విజ్ఞాన సర్వస్వం-1978 15)
తెలుగు సాహిత్య కోశం: 1986లో తెలుగు అకాడమీ ప్రచురించింది. నీలా జంగయ్య, నల్లపాటి శివనాగయ్య, ఎం ప్రమీలారెడ్డి, బీ విజయభారతి సంపాదకులు.
ప్రపంచ రాజ్య సర్వస్వం: 1977లో సంపాదక మండలిగా దేవులపల్లి రామానుజారావు, శారదాహెచ్ రావు. సరోజిని రేగాని, ఆర్వీ రావు, ఎం రాధాకృష్ణశర్మ, కే విఠల్‌రెడ్డి పనిచేశారు. దీని ఆంధ్ర సారస్వత పరిషత్తు హైదరాబాద్‌వారు దీన్ని ప్రచురించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు