General Studies | సజీవులు.. నిర్జీవులు.. ప్రకృతి
జీవ వైవిధ్యం
- జీవ వైవిధ్యం అంటే ఈ భూమిపై కనిపించే అన్ని రకాల జీవులు (మొక్కలు, జంతువులు), సమాజంలోని ఆవాసాలు అని అర్థం.
- జీవ వైవిధ్యం అనే పదం Biological, Diversity అనే రెండు పదాల నుంచి ఉద్భవించింది. వాల్టర్ రోసన్ అనే శాస్త్రవేత్త జీవవైవిధ్యం అనే పదాన్ని 1986లో ప్రవేశపెట్టారు. జీవ శాస్త్రవేత్తల ప్రకారం ఒక ప్రాంతంలోని జన్యు, జాతులు, ప్రజాతులు, జీవావరణ వ్యవస్థల సమూహమే జీవ వైవిధ్యం.
జీవావరణ వ్యవస్థ: ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే సజీవులు (మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు), నిర్జీవ పరిసరాలు (కాంతి, మృత్తిక, వాతావరణం) మధ్య జరిగే పరస్పర చర్యల సమూహమే జీవావరణ వ్యవస్థ.
జీవ మండలం: జీవ మండలం అంటే పెద్దపెద్ద జీవ సమాజాలు (వృక్ష, జంతు), అవి నివసించే నిర్దిష్ట ప్రదేశాలు ఉదా: ఎడారులు, పచ్చికబయళ్లు, సమశీతోష్ణ వర్షాధార అడవులు. జీవ వైవిధ్యంలో వివిధ రకాల జీవ జాతులు, జీవావరణ వ్యవస్థలు, జన్యు పదార్థం మాత్రమే కాదు వాటిలోని వైవిధ్యాలు కూడా వస్తాయి. జీవ వైవిధ్యం, జీవ వనరులు వేర్వేరు అంశాలు. జీవ వనరులు అంటే జీవావరణ వ్యవస్థలో కనిపించే భౌతిక జీవుల సమాజాలు (ఒక జాతికి చెందిన పక్షులు, ఒక పంటలో పండించే గోధుమ, ఒక కలప మొదలైనవి). జీవ వైవిధ్యం అనేది ఆ జీవుల గుణాలకు సంబంధించినది (వివిధ జాతి పక్షులు).
- సృష్టిలో దాదాపు 50 మిలియన్ల కన్నా ఎక్కువ జంతు, వృక్ష సూక్ష్మజీవుల జాతులున్నాయి. వీటిలో 1.4 మిలియన్ జాతులని మాత్రమే గుర్తించారు. ప్రతి జీవి సృష్టిలో ఒక ప్రత్యేకమైన జీవావరణంలో నివసిస్తుంది. అవి పర్వతాలు, సముద్ర అగాథాలు, మంచు ధృవాలు, సమ శితోష్ణ వర్షాధార అడవులు, ఎడారులు అయి ఉండవచ్చు. అన్ని రకాల జీవ వైవిధ్యం ఈ భూమిపై జలావరణం, శిలావరణం, వాతావరణంలో దాదాపు ఒక కిలోమీటర్ మందంతో ఆవరించి జీవగోళాన్ని ఏర్పరుస్తాయి.
జీవ వైవిధ్యం రకాలు
- ప్రకృతిలో జీవ వైవిధ్యం పెరుగుతున్న కొద్దీ జీవావరణ వ్యవస్థల మధ్య సమతుల్యత పెరుగుతుంది. జీవావరణంలో ఉండే అన్ని జీవులు పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఉదా: జంతు, వృక్ష జాతులు, ఆహారం, ఆవాసం కోసం, నీటి కోసం పర్యావరణంపై ఆధారపడతాయి. జీవ వైవిధ్యం వనరులు, జాతులు, జన్యువైవిధ్యం పరంగా ఆవరణ వ్యవస్థలో ఎంత వైవిధ్యం ఉందనేది తెలుపుతుంది. సమతుల్య జీవావరణ వ్యవస్థలో అన్ని జీవులు విజయవంతంగా జీవిస్తూ మంచి వనరులను కలిగి, కరవు, వ్యాధులు, జాతి విలుప్తత నుంచి రక్షించబడతాయి. జీవ వైవిధ్యంలో అనేక వైవిధ్య స్థాయిలు ఉంటాయి. అవి ఒక ప్రాంతంలోని జన్యు, జాతి వనరులతో ఏ విధంగా విభిన్నతను చూపుతాయో తెలుపుతుంది.
జాతి వైవిధ్యం: ఒక జీవావరణ వ్యవస్థలో గోచరించే అనేక జాతులకు చెందిన మొక్కలు, సూక్ష్మజీవరాశులు, జంతువుల సముదాయాన్ని జాతుల వైవిధ్యం అంటారు. ఉదా: జాతి సంపన్నత: ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే జాతుల సంఖ్య
సమృద్ధత: ఒక జాతిలోని జీవుల సంఖ్య
జన్యు వైవిధ్యం: ఒకే జాతి లేక వివిధ జాతుల జీవుల్లోని జన్యువుల్లో ఉండే మొత్తం లక్షణాలను జన్యు వైవిధ్యం అంటారు. జన్యు వైవిధ్యం ఎక్కువ ఉన్నచోట జనాభా మనుగడ స్థిరంగా ఉంటుంది. ఉదా: కుక్కల జాతిలో పాడిల్, జర్మన్ షెపర్డ్, గోల్డెన్ రిట్రీవర్ జాతి ఒక్కటే అయినా వీటి జన్యువుల్లో స్వల్ప భేదాలు ఉంటాయి. కాబట్టి ఇవి చూడటానికి వేరుగా ఉంటాయి.
జీవావరణ లేదా సమాజ వైవిధ్యం: జీవావరణంలో ఉండే వివిధ జీవావరణ వ్యవస్థలు వాటిలో నివసించే జీవులు, పరిసరాల మధ్య గల సంబంధాలను జీవావరణ వైవిధ్యం అంటారు. ప్రతి ఆవరణ వ్యవస్థ సజీవ (మొక్కలు, జంతువుల) అంశాలు, నిర్జీవ (సూర్యరశ్మి, గాలి, నీరు, ఖనిజాలు గల మృత్తిక లాంటి పోషకాలు) అంశాల మధ్య ఒక వరుస సంక్లిష్ట సంబంధాలను కలిగి ఉంటుంది.
ఉదా: సమశితోష్ణ, ఉష్ణ అరణ్యాలు, ఉష్ణ, శీతల ఎడారులు, తడి నేలలు, కొండలు, నదులు, పగడపు దిబ్బలు మొదలైనవి
క్రియా వైవిధ్యం: జీవావరణ వ్యవస్థలోని వివిధ జాతుల ప్రవర్తన, ఆహారపు అలవాట్లు, వనరుల వినియోగాన్ని క్రియా వైవిధ్యం అంటారు. అధిక జాతి సంపన్నత ఉన్న జీవావరణంలో అనేక జాతులు అనేక భిన్న ప్రవర్తనల వల్ల క్రియా వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. జీవుల ప్రవర్తన, విధులు తెలియడం వల్ల విచ్ఛిన్నం చెందిన ఆహార గొలుసులు, జీవావరణ వ్యవస్థలను పూర్వస్థాయికి తీసుకురావచ్చు.
జీవ వైవిధ్యాన్ని మూడు రకాలుగా విభజించారు.
1. ఆల్ఫా వైవిధ్యం: ఒక సమాజంలో గోచరించే జాతుల వైవిధ్యం.
2. బీటా వైవిధ్యం: ఒక ఆవరణ వ్యవస్థలో సమాజాల మధ్య జరిగే మార్పులు.
3. గామా వైవిధ్యం: మొత్తం భూ విస్తీర్ణంలో కాని, ఒక భౌగోళిక ప్రాంతంలో గాని వివిధ ఆవాసాలు వ్యక్తపరిచే మార్పులు.
జీవ వైవిధ్యం – సంరక్షణ – చర్యలు
- మానవుడి వివిధ కార్యకలాపాల వల్ల జీవ వైవిధ్యం ఏవిధంగా విచ్ఛిన్నమవుతుందో దాన్ని సంరక్షించడానికి చేపట్టవలసిన చర్యలు తీసుకోకపోతే భూమిపై జీవం అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది. జీవవైవిధ్య సంరక్షణ ముఖ్య ఉద్దేశం జాతులు, వాటి ఆవాసాలు, వ్యవస్థలు, జీవులు. ఆవరణ వ్యవస్థల మధ్య పరస్పర సంబంధాలు రక్షించడం ఆవరణ వ్యవస్థల సంరక్షణ అనేక జాతుల సంఖ్యను అంటే అంతరించిపోయే జాతులను కాపాడటం, జీవనాన్ని కొనసాగించే ఆధార వ్యవస్థలను సంరక్షించడం.
- జీవ వైవిధ్య సంరక్షణ సాధనకు ప్రపంచ జాతీయ, స్థానిక స్థాయిల్లో ప్రయత్నాలు జరగాలి. జీవ వైవిధ్య సంరక్షణ రెండు రకాలు అవి.. సహజ స్థాన సంరక్షణ, స్థల బాహ్య సంరక్షణ.
సహజ స్థాన సంరక్షణ (In-Situ Conservation)
- In-Situ అనే లాటిన్ పదానికి తన స్వస్థలం లేదా అమరిక అని అర్థం. జీవ జాతులు తమ స్వస్థలంలో లేదా సహజ జీవావరణంలో సంరక్షింపబడటాన్ని సహజ స్థాన సంరక్షణ అంటారు. ఈ ప్రక్రియలో సహజ పరిసరాలు లేదా ఆవరణ వ్యవస్థలు రక్షించబడి కాపాడబడతాయి. కాబట్టి అన్ని ఆవశ్యక జాతులు సంరక్షించబడి లాభం పొందుతాయి. జీవ జాతుల ఉనికికి హానికరమైన కారకాలు తగిన పద్ధతుల ద్వారా నిర్మూలించబడతాయి. స్థాయిని బట్టి మానవుల జోక్యాన్ని బట్టి వివిధ రకాల సంరక్షణ ప్రదేశాలు మనదేశంలో ఉన్నాయి.
- అవి ఎ. జాతీయ పార్కులు
- బి. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
- సి. పరిరక్షణ సమాజ నిల్వలు
- డి. సముద్ర రక్షిత ప్రాంతాలు
- ఇ. జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాలు
- ఎఫ్. జీవగోళపు సురక్షిత కేంద్రాలు
- జి. పావన వనాలు హెచ్. రామ్సర్ స్థలాలు.
స్థల బాహ్య సంరక్షణ (Ex-Situ Conservation)
- సహజ ఆవాసాల్లో జీవించే ముప్పు వాటిల్లబోయే ప్రత్యేక మొక్కలు లేదా జంతువులను ప్రత్యేక వాతావరణ పరిస్థితులు గల ప్రదేశానికి అంటే జూ పార్క్‌లు, గార్డెన్స్, నర్సరీలకు తరలించి వాటిని సంరక్షించడాన్ని స్థల బాహ్య సంరక్షణ అంటారు. ఇక్కడ ఉండే జీవులకు ఆహారం, మౌలిక వసతుల కోసం పోటీ ఉండదు. కాబట్టి ఒత్తిడికి గురవకుండా సురక్షితంగా ఉండి సంతానోత్పత్తి అధికంగా జరుగుతుంది. అవి.
- ఎ. జన్యు బ్యాంకు లేదా జన్యు నిధి
- బి. విత్తన బ్యాంకు లేదా విత్తన నిధి
- సి. బొటానికల్ గార్డెన్స్, జంతు ప్రదర్శనశాలలు
- డి. క్షేత్ర జన్యు నిధులు
- ఇ. సూక్ష్మజీవ సంవర్ధన-సేకరణ కేంద్రాలు
జీవ వైవిధ్య సదస్సు
- 1992లో బ్రెజిల్‌లోని రియోడిజెనిరోలో ధరిత్రీ సదస్సులో జీవ వైవిధ్య సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్ధారించారు. అవి 1. జీవ వైవిధ్య పరరక్షణ 2. జీవ వైవిధ్య సంఘటితాలను స్థిరంగా ఉపయోగించుకోవడం 3. జన్యు వనరుల వినియోగం, ఉపయోగం, వాటి లాభాలను పారదర్శకంగా, సమానంగా దేశాల మధ్య పంచుకోవడం.
- ఒడంబడికలో భాగంగా సభ్య దేశాల ప్రభుత్వాలు జీవవైవిధ్యంపై వ్యూహాలు, ప్రణాళికలు రచించి పర్యావరణాభివృద్ధికి తోడ్పడాలి. ఇది ముఖ్యంగా అటవీ, వ్యవసాయ, మత్స్య, శక్తి, రవాణా, పట్టణీకరణ రంగాలకు తోడ్పడుతుంది.
అత్యధిక జీవ వైవిధ్యం గల దేశాలు
1. బ్రెజిల్2. కొలంబియా
3. ఈక్వెడార్ 4. పెరూ
5. మెక్సికో 6. మడగాస్కర్
7. మలేషియా8. భారత్
9. చైనా 10. ఇండోనేషియా
11. ఆస్ట్రేలియా12. అమెరికా
13. వెనెజులా 14. కాంగో
15. దక్షణాఫ్రికా16. న్యూగినియా
జీవ వైవిధ్య చట్టం-2002: ఈ చట్టం భారతదేశంలో పరిశోధనకు లేదా వాణిజ్యానికి లేదా జీవ సర్వే, జీవ వినియోగానికి లేదా పరిశోధన బదిలీకి జీవన వనరులు, దాని అనుబంధ జ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు అని తెలుపుతుంది. ఇది జీవ వనరులను పొదడం, దాన్ని ఉపయోగించుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలకు ఒక చట్రాన్ని అందిస్తుంది.
జీవ వైవిధ్య మండలం: ఇది రాష్ట్ర ప్రభుత్వం చట్టం ద్వారా ఏర్పరచిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ఇది జీవ వైవిధ్య సంరక్షణ అమలు పరచడానికి జీవ వనరుల సుస్థిరాభివృద్ధి లాభాలను సమానంగా పంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి తగిన సూచనలిస్తుంది.
- తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి జాతీయ జీవ వైవిధ్య అవార్డు పొందింది. తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి IIOR, BMCలతో (కొత్తకోట- మహబూబ్‌నగర్ జిల్లా, కొత్తగూడెం-నల్లగొండ జిల్లా) కలిసి సంయుక్తంగా 2016 సంవత్సరానికి విజయవంతమైన ABS విధానానికి జీవ వైవిధ్య అవార్డులు అందుకున్నాయి. ఈ అవార్డు మృత్తిక బ్యాక్టీరియాను వాణిజ్య స్థాయిలో జీవ సంహారిణిగా ఉపయోగించుకోవడానికి చేసిన కృషికి లభించింది.
జీవ వైవిధ్య యాజమాన్య కమిటీ: స్థానిక సంస్థలు వాటి పరిధుల్లో జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలను ఏర్పరిచి అక్కడి అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి.
BMCS విధులు
- జీవ వైవిధ్య సంరక్షణాభివృద్ధికి తోడ్పడటం.
- జీవ వైవిధ్య సుస్థిర వినియోగం, రికార్డుల తయారీ.
- ఆవాసం, పరిరక్షణ.
- స్థానికంగా పెంచే సంప్రదాయ మొక్కలు, జంతు జాతులు, సంకర వంగడాలు, సంకర పెంపుడు జంతువులు, సూక్ష్మజీవుల సంరక్షణ, జీవ వైవిధ్య జ్ఞానాన్ని భద్రపరచడం.
- ప్రజల జీవ వైవిధ్య రిజిస్టర్ తయారీకి తోడ్పడటం.
జీవ వైవిధ్య రిజిస్టర్: ఇది స్థానికంగా లభించే జీవ వనరులు, వాటి ఔషధ గుణం లేదా వాటికి సంబంధించిన సంప్రదాయ జ్ఞానం ఉపయోగాల పట్టిక. ఇది ఆ ప్రాంత ప్రజలకు ఆ వనరులపై కొంత హక్కును కల్పిస్తుంది. జీవ వైవిధ్య జ్ఞాన వ్యాప్తికి తోడ్పడుతుంది.
- వన్య ప్రాణుల సంరక్షణ కోసం వీటిని ఏర్పరుస్తారు. వీటి పరిధిలో ఎలాంటి వ్యక్తిగత భూ హక్కులు, వ్యవసాయం, పశువులను మేపడం వంటి వాటిని అనుమతించరు.
- 1872లో అమెరికాలో ప్రపంచంలోనే మొట్టమొదటి జాతీయ పార్కుగా ఎల్లోస్టోన్ జాతీయ పార్కును ఏర్పాటు చేశారు.
- దేశంలో భారత అటవీ చట్టం-1927 ప్రకారం ఉత్తరాఖండ్‌లో 1936లో మొదటి జాతీయ పార్కు- జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్
- దేశంలో మొత్తం 104 జాతీయ పార్కులున్నాయి.
అభయారణ్యాలు
- ఇక్కడ వన్యమృగాల సంరక్షణ మాత్రమే జరుగుతుంది.
- ఇక్కడ కలప చెట్లను పెంచడం, అటవీ ఉత్పత్తులను సేకరించడం, వ్యవసాయ పనులు వంటి వాటిని మన్య మృగాలకు హానికలగనంత వరకు మాత్రమే అనుమతిస్తారు.
- ప్రస్తుతం భారతదేశంలో 566 అభయారణ్యాలున్నాయి.
- అత్యధికంగా అండమాన్ నికోబార్ దీవుల్లో 96 తర్వాత మహారాష్ట్రలో 50 ఉన్నాయి.
- వీటిని UNESCO వారు 1971లో ‘మానవుడు, జీవగోళం’ను ప్రవేశపెట్టారు.
- వీటిలో వన్య సమాజంతో పాటు, మచ్చిక చేసిన జంతువులు, వృక్షాలు, ఆయా ప్రాంతాల్లో నివసించే గిరిజనుల జీవన విధానాన్ని కూడా పరిరక్షిస్తారు.
- బయోస్పియర్ రిజర్వులు సరిహద్దులకు పరిమితమై ఉండవు. అంటే విశాలంగా ఉంటాయి.
- భారతదేశంలో ఇప్పటి వరకు 18 బయోస్పియర్ రిజర్వులను ఏర్పాటు చేశారు.
- 1986లో నీలగిరి బయోస్పియర్ రిజర్వును మొదట ఏర్పాటు చేశారు.
- బయోస్పియర్ రిజర్వులో మూడు జోన్లు ఉంటాయి. అవి. 1. కేంద్ర మండలం 2. బఫర్ ప్రాంతం 3. పరివర్తన మండలం
తెలంగాణలోని జాతీయ పార్కులు
- మృగవని నేషనల్ పార్క్ – మొయినాబాద్, రంగారెడ్డి జిల్లా
- కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ – జూబ్లీహిల్స్, హైదరాబాద్
- మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ – వనస్థలిపురం, హైదరాబాద్
తెలంగాణలోని అభయారణ్యాలు
- శివరాల వన్యప్రాణి అభయారణ్యం
- కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం
- పాకాల వన్యప్రాణి అభయారణ్యం
- ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఏటా మే 22న నిర్వహిస్తారు.
ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి(మంచాల)
రంగారెడ్డి జిల్లా
sudha.avanchi@gmail.com
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు