General Studies | వరద ముప్పు.. సాంకేతికతో గుర్తింపు
విపత్తు నిర్హహణ
- సాధారణంగా ముంపునకు గురికాని నేల ముంపునకు గురికావడానికి దారితీసే విధంగా నదీ, కాలువ వెంబడి లేదా తీరం వద్ద అధిక నీటిస్థాయి ఉండే పరిస్థితిని వరద అంటారు.
- దీనివల్ల ప్రజలకు, భవనాలకు కలిగే ప్రమాదాన్ని వరద వైపరీత్యం అంటారు.
- వరదలు గంటల సమయం తీసుకొని క్రమంగా ఏర్పడవచ్చు. లేదా ఆనకట్టలు తెగిపోవడం, భారీ వర్షాలు మొదలైన వాటి వల్ల ఎలాంటి హెచ్చరిక లేకుండానే అకస్మాత్తుగానూ రావచ్చు.
వరదలకు కారణాలు
- భారీ వర్షాలు కురవడం
- నదీ భూతలంపై భారీగా పూడిక పేరుకుపోయి. నదులు లేదా ప్రవాహాల నీటిని మోసుకెళ్లే సామర్థ్యాన్ని కుదించడం.
- మురుగు నీటి కాలువల్లో అడ్డంకులు ఏర్పడి, ఆ ప్రాంతం వరద ముంపునకు గురికావడానికి దారితీయడం.
- భూపాతాల కారణంగా నీటి ప్రవాహం నిలిచిపోవడం.
- తుఫాను ముంపుగల ప్రాంతాల్లో తుఫాన్ల్లతో కూడిన భారీ వర్షాలు, బలమైన గాలులు
- నదీ ప్రవాహం కుచించుకు పోవడం.
- నదీప్రవాహం తన మార్గాన్ని మార్చుకోవడం
- ఆనకట్టలు, డ్యాములు, కాలువల నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలు
వరదలు – రకాలు
- వరదల్లో విభిన్న రకాలున్నాయి. అవి 1) ఆకస్మిక వరద 2) నదీ వరద 3) పట్టణ వరద.
ఆకస్మిక వరద: కుంభవృష్టి లేదా తుఫాన్లతో కూడిన భారీ వర్షాలు మొదలైన ఆరుగంటల్లోపు సంభవించే వరదలను మెరుపు లేదా ఆకస్మిక వరదలుగా నిర్వచించవచ్చు. వీటివల్ల సంభవించే నష్టాన్ని కుదించడానికి వేగంతో కూడుకున్న స్థానికంగా హెచ్చరిక పర్యవేక్షణ కోసం వైర్లెస్నెట్వర్క్, టెలిఫోన్ కనెక్షన్లు ఉపయోగిస్తారు.
నదీవరద: నదీ ప్రవాహం ఆనకట్టలను దాటి ప్రవహించే నీరు చుట్టపక్కల ప్రాంతాలను ముంచి వేయడాన్ని నదీవరద అంటారు. ఇది అత్యంత సాధారణ వరద రూపం. నదీ వరదలు ప్రధానంగా వర్షపు నీరు లేదా మంచు కరిగి నదీ ప్రవాహంలో వేగంగా కలవడంవల్ల సంభవిస్తాయి. వరద ప్రారంభం కావడానికి ముందు నదిలో ఉండే నీటి పరిమాణ సామార్థ్యాన్ని చానెల్ కెపాసిటీ అంటారు.
పట్టణ వరద : స్వల్పకాల వ్యవధిలో భారీవర్షాలు సంభవించడం, నీటి మార్గాలను విచక్షణా రహితంగా ఆక్రమించడం, డ్రైనేజి వసతులను సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల నగరాలు, పట్టణాల్లో వచ్చే వరదలను పట్టణ వరద అంటారు.
వరదలు – వివిధ దశలు
- వరదలను పర్యవేక్షించేందుకు కేంద్ర జల సంఘం వరదల తీవ్రతను నాలుగు కేటగిరీలుగా వర్గీకరించింది. అవి
1) నిమ్న వరద దశ: నదీ నీటిమట్టం హెచ్చరిక స్థాయికి, ప్రమాద స్థాయికి మధ్య ప్రవహిస్తున్నప్పుడు ఉండే వరద పరిస్థితిని నిమ్న వరద దశ అంటారు.
2) మధ్యస్థ వరద దశ: నదీ నీటిమట్టం ప్రమాద స్థాయిని దాటి, అత్యధిక వరద మట్టానికి 0.50 మీటర్లకు దిగువన ఉన్నప్పుడు ఆ నది వరద మధ్యస్థ దశలో ఉన్నట్లు చెబుతారు.
3) అధిక వరద దశ: నదీ నీటిమట్టం అత్యధిక వరదమట్టానికి 0.50 మీటర్లలోపు ఉన్నప్పుడు దాన్ని అధిక వరద దశ అంటారు.
4) సాధారణ వరద దశ : ఏదైనా వరద ముందస్తు సూచన కేంద్రం వద్ద నదీ నీటి మట్టం దాని అధిక వరద మట్టానికి చేరుకున్నప్పుడు సాధారణ వరదలు సంభవించినట్లు చెబుతారు.
వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలు
- ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ విపత్తు కుదింపు వ్యూహం (యునైటెడ్నేషన్స్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్- (యూఎస్ఐఎస్డీఆర్) రూపొందించిన గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్టు 2011 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వరదలు ఎదుర్కొంటున్న జనాభాలో 90 శాతం మంది దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాల్లోనే నివసిస్తున్నారు.
- దక్షిణాసియాలో విపత్తు ముప్పును ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్, బంగ్లాదేశ్‌లు ముందున్నాయి. ఈ దేశాల్లో ప్రజలు అత్యధికంగా వరద ముప్పును ఎదుర్కొంటున్నారు.
- ప్రపంచంలో అత్యధిక వరద ముప్పున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. భారత్‌లో వరదలకు రుతుపవనాలు, అధిక పూడిక తీత కలిగిన నదులు, వాలైన, ఎక్కువగా కోసుకు పోయిన హిమాలయాల పర్వత శ్రేణులు వంటివి ముఖ్య కారణాలవుతున్నాయి.
- దేశం మొత్తం మీద 39 జిల్లాలను తీవ్ర వరద ముప్పు ఉన్న జిల్లాలుగా గుర్తించారు. దేశంలో అత్యధిక వరదలకు ప్రభావితమయ్యే ప్రాంతాలు
- గంగానది పరివాహక ప్రాంతం, బారక్, తస్తీ, కోర్సా, సుబంసిరి, సంకోష్, దిహాంగ్, లుహిత్ మొదలైన వాటితో కూడిన బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతం.
- జీలం, చీనాబ్, రావి, సట్లేజ్, బియాస్, ఘాగ్రా నదులతో కూడిన వాయవ్య నదీ పరివాహక ప్రాంతం
- తపతి, నర్మద, మహానది, వైతరణి, గోదావరి, కృష్ణా, పెన్నా కావేరి నదులతో కూడిన ద్వీపకల్ప నదీ పరీవాహక ప్రాంతం,
- ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, కేరళ ప్రాంతాలు, అసోం, ఉత్తరప్రదేశ్ , బీహార్లు తరచుగా తీవ్ర వరద ముంపునకు గురవుతున్నాయి.
ప్రభావాలు – నష్టాలు
- భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. సుమారు 7.5 మిలియన్ల హెక్టార్ల భూమి ప్రతి సంవత్సరం పునరావృతమయ్యే వరదల ప్రభావానికి గురవుతోంది.
- 200 మిలియన్ల మంది ప్రజలు వరదల వల్ల ప్రభావితమవుతున్నారు. దేశంలో వరద ముప్పు ఉన్న 40 మిలియన్ల హెక్టార్లలో ఉత్తరప్రదేశ్-21.9శాతం, బీహార్-12.71 శాతం, అసోం-9.4 శాతం, పశ్చిమ బెంగాల్-7.91-శాతం, ఒడిశా-4.18 శాతం మిగిలిన రాష్ర్టాలు 43.9 శాతం వరద ముప్పు ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి.
- వరదల వల్ల ఏటా సగటున 1464 మంది మరణిస్తున్నారు. 86,288 పశువులు చనిపోతున్నాయి.
- వరద ముంపునకు గురైన ప్రాంతాలు దేశంలోని మిగతా ప్రాంతాలతో సంబంధాలు కోల్పోవచ్చు.
- అధికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు వరదల విధ్వంసక ప్రభావాలకు ఎక్కువ గురవుతుంటాయి. ఈ వర్గాలు తిరిగి పూర్వస్థితికి చేరడానికి చాలా సమయం పడుతుంది.
- వరద నిర్వహణపై 12వ పంచవర్షప్రణాళిక వర్కింగ్ గ్రూప్ తెలిపిన వివరాల ప్రకారం 1953 నుంచి 2010 మధ్య ప్రతి సంవత్సరం సగటున 7.208 మిలియన్ హెక్టార్ల భూమి , 3.19 మిలియన్ల ప్రజలు వరద ప్రభావానికి గురవడం జరిగింది.
- వరదల వల్ల జరిగే అత్యంత ముఖ్యమైన పర్యవసానం ప్రాణాలకు, ఆస్తికి నష్టం వాటిల్లడం. గృహాలు, వంతెనలు, రోడ్లు వంటి నిర్మాణాలు వరదనీరు, నీరు నిలిచిపోవడం వల్ల, కొండచరియలు విరిగి పడటం కారణంగా దెబ్బతింటాయి.
- పడవలు, చేపలు పట్టే వలలకు కూడా నష్టం వాటిల్లుతుంది. ముంపు కారణంగా ప్రాణాలకు పశు సంపదకు అపార నష్టం జరుగుతుంది.
- సరైన తాగునీటి సౌకర్యాలు లేకపోవడం వల్ల బావినీరు భూగర్భజలాలు నీటి పైపుల ద్వారా వచ్చే జలాలు కలుషితమై,అంటు వ్యాధులు డయేరియా, వైరస్ వ్యాధులు, మలేరియాతోపాటు ఇంకా అనేక సంక్రమణ వ్యాధులు రావడానికి దారితీస్తాయి.
- వరదల వల్ల వ్యవసాయ భూమి మునిగిపోయి, పెద్ద ఎత్తున పంటనష్టం జరుగుతుంది. దీనివల్ల ఆహార, పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. నేల పైపొర కొట్టుకుపోవడం వల్ల నిస్సారంగా మారుతుంది. సముద్రం నీరు చేరడం వల్ల చౌడు భూమిగా మారుతుంది.
హెచ్చరిక వ్యవస్థ
- శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ పరికరాల వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నీటి మట్టాల ఆధారంగా వరద తరంగాలను పసిగట్టవచ్చు.
- ఆకస్మిక వరదలు మినహాయిస్తే మిగతా వరదలకు సాధారణంగా సహేతుకమైన హెచ్చరిక వ్యవధి ఉంటుంది. అధిక అవపాతం ముంచుకొస్తున్న నదీ వరదను హెచ్చరిస్తుంది. అధిక గాలులతో కూడిన ఎత్తైన పోటుపాట్లు కోస్తా ప్రాంతాలకు ఉన్న వరద ముప్పు గురించి హెచ్చరిస్తాయి. తగు పర్యవేక్షణ హెచ్చరికలతో వరద ముప్పు ఉన్న ప్రాంతాలను ఖాళీ చేయించడం సాధ్యమవుతుంది. వరద హెచ్చరికలను కేంద్ర జలసంఘం సాగునీరు వరద నియంత్రణ శాఖ, జలవనరుల శాఖ జారీ చేస్తాయి.
- మొట్టమొదటిసారిగా భారత్‌లో కేంద్ర జలసంఘం 1958 నవంబర్‌లో శాస్త్రీయంగా వరద ముందస్తు సూచనలు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో, నదీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను వరద హెచ్చరికలు జారీ చేసేందుకు కేంద్ర జల సంఘం ఢిల్లీలోని తన ప్రధాన కార్యాలయంలో వరద ముందస్తు సూచన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అది ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విస్తరించింది.
- వరద ముందస్తు సూచనలో నాలుగు ప్రధాన కార్యకలాపాలు ఇమిడి ఉంటాయి. అవి
1) హైడ్రోలాజికల్, హైడ్రో మెటీయోరాలాజికల్ డేటాను పరిశీలించడం, సేకరించడం.
2) డేటాను ముందస్తు హెచ్చరికల కేంద్రాలకు ప్రసారం చేయడం
3) డేటాను విశ్లేషించడం ముందస్తు
సూచనను రూపొందించడం
4) ముందస్తు సూచనను ప్రసారం చేయడం - ప్రతి సంవత్సరం రుతుపవనాల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో సగటున 6000 ముందస్తు సూచనలను జారీ చేయడం జరుగుతుంది.
హెచ్చరికలు చేరవేసే విధానాలు
ప్రభుత్వ చానళ్లు
అధిక ప్రాధాన్యం ఉన్న టెలిగ్రాములు
దూరదర్శన్ స్థానిక కేబుల్ చానళ్లు
ఆకాశవాణి
పత్రికల్లో ప్రకటనలు
శాటిలైట్ ఆధారిత విపత్తు హెచ్చరిక వ్యవస్థలు
ఫ్యాక్స్
టెలిఫోన్లు
వరద వైపరీత్య మ్యాపులు
- వరద వైపరీత్య మ్యాపులను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) రూపొందిస్తుంది. ఈ మ్యాపుల్లో నిషేధిత, ఆంక్షలతో, హెచ్చరికలతో కూడిన వరదరహిత మండలాలను సూచిస్తుంది. జీఎస్ఐ వరదలకు సంబంధించిన అంశాలపై జరిపిన అధ్యయనాలను కేంద్ర జలసంఘం, జలవనరుల అభివృద్ధి ప్రాజెక్ట్ అథారిటీలు, పట్టణ, గ్రామీణ ప్రణాళికా అథారిటీలు, పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖలు వినియోగించుకుంటాయి.
ఉపశమన చర్యలు
- తరచుగా వరదముంపును ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణాత్మక, నిర్మాణేతర ఉపశమన చర్యలను చేపట్టడం ద్వారా వరదల ప్రభావాన్ని కుదించవచ్చు
నిర్మాణాత్మక ఉపశమన చర్యలు
ఎ) వాటర్ షెడ్ మేనేజ్మెంట్ : సహజ సిద్ధమైన జలవనరులను (చెరువులు, సరస్సులు) పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నీటిపారుదల వ్యవస్థలను సకాలంలో శుభ్రం చేయడం, పూడిక తీయడం, లోతు పెంచడం.
2) రిజర్వాయర్లు: సహజ సిద్ధమైన నీటి నిల్వ ప్రదేశాలను వర్షాకాలానికి ముందు తప్పనిసరిగా శుభ్రం చేయాలి. రుతుపవనాల అరంభానికి ముందు చెరువులు కుంటలు లేదా సహజ సిద్ధమై నీటిపారుదల వ్యవస్థలపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి.
సి) ఇంజినీర్డ్ కట్టడాల నిర్మాణం : వరద మైదానాల్లో ఇంజినీర్డ్ కట్టడాలను నిర్మించాలి. ఆ కట్టడాలు వరదనీటి శక్తిని, చెమ్మను తట్టుకునే విధంగా దృఢంగా ఉండాలి. భవనాలను ఎత్తైన ప్రాంతాల్లో నిర్మించాలి. అవసరమైన పక్షంలో దిన్నెలు ప్ల్లాట్ ఫారాలపై నిర్మించాలి. ఫ్లడ్ ప్రూఫింగ్ ద్వారా వరద ముప్పును నష్టాన్ని తగ్గించవచ్చు. ఇందుకోసం వరదనీరు రాకుండా ఇసుక బస్తాలు అడ్డువేయడం, ఇంటి తలుపులు కిటికీలను గట్టిగా బిగించడం మొదలైన చర్యలు తీసుకోవాలి.
డి) సహజ సిద్ధమైన జలబంధన పరీవాహకాలు
- వరద నిరోధక ఆనకట్టలు, అంగుళీయాకార కట్టలు, ఇతర ఆనకట్టలను నిర్మించడం, సంరక్షించడం. లోతట్టు మైదాన ప్రాంతాలను వరద ముప్పనకు గురయ్యే అవకాశాలను తగ్గించడం కోసం తాత్కాలిక నీటి రిజర్వాయర్లుగా ఉపయోగించుకునేందుకు డ్యాములు, కరకట్టలు నిర్మించాలి.
ఇ) వరద నియంత్రణ చర్యలను అమలు చేయడం - వరద నష్టాన్ని కుదించేందుకు నియంత్రణ చర్యలను అమలు చేయాలి. అడవులను పునరుద్ధరించడం. వృక్ష సముదాయాలను సంరక్షించడం. నీటి ప్రవాహాలు, ఇతర జలాశయాల నుంచి చెత్తను శుభ్రం చేయడం. చెరువులు, సరస్సులు మొదలైన వాటిని సంరక్షించడం ద్వారా నీటి ప్రవాహ పరిమాణాన్ని తగ్గించి, వరదను నియంత్రించవచ్చు.
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు