General Studies | ఆకస్మిక ప్రమాదం.. జనజీవనం అస్తవ్యస్తం
Groups Special – General Studies
భూకంపాలు
భూకంపం
- భూ పటలం లేదా ప్రావారంలో ఉనికి పొంది నాభి నుంచి జనించే ప్రకంపన తరంగాల పరంపరలే భూకంపం. అంతర్జనిత బలాల్లో ఆకస్మిక అంతర్జనిత బలాల వల్ల భూకంపాలు ఏర్పడతాయి. భూమి అంతర్భాగంలో, భూపటలంలో కలిగే ఆకస్మిక అలజడి వల్ల భూకంపాలు ఏర్పడతాయి. ఈ అలజడులు వివిధ రకాల కారణాల వల్ల ఏర్పడతాయి. జనావాసాలను
ధ్వంసం చేయడమే కాకుండా, ప్రభుత్వాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక నిర్మాణాన్ని అస్థిరపరుస్తున్నాయి. - శిలలు ఆకస్మిక అంతర్జనిత బలాల వల్ల ఆకస్మిక స్థానభ్రంశం చెందినప్పుడు శక్తి వెలువడుతుంది. ఈ శక్తి తరంగాల రూపంలో నలుదిశలా వ్యాపిస్తుంది. ఈ విధంగా PSL తరంగాలు వ్యాప్తించి ప్రకంపనలు కలుగజేస్తాయి. వీటినే భూకంపం అంటారు. భూకంపాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిస్మాలజీ అంటారు.
ముఖ్యాంశాలు - బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ దేశంలో అత్యంత తీవ్రతతో భూకంపాలు సంభవించే ప్రాంతాలను జోన్-5లో చేర్చింది. దేశంలో భవన నిర్మాణాలకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ రూపొందిస్తుంది.
- దేశంలో హిమాలయ ప్రాంతాలు, గుజరాత్‌లోని అలియాబాద్ భ్రంశరేఖ ప్రాంతాలు జోన్-5లో ఉన్నాయి.
- భూకంపాల నుంచి తమను తాము కాపాడుకోవడంలో డ్రాప్, కవర్, హోల్డ్ విధానాలు ప్రధానమైనవి.
- దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్యకలాపాల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలు రూపొందించడానికి 1970లో జాతీయ భవన నిర్మాణ కోడ్‌ను ప్రవేశపెట్టారు.
- బిల్డింగ్ మెటీరియల్స్, టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
- భూకంపాలను తట్టుకునేందుకు భూకంప దర్భలత్వ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లు దీర్ఘ చతురస్రాకార ప్రణాళికను కలిగి ఉండటం వల్ల సురక్షితంగా ఉంటాయి.
- భూకంప తరంగాలనేవి కంపనాలు, ప్రకంపనాల సమూహం.
- భూకంపాలు, సునామీలు రోజులో ఏ సమయంలోనైనా సంభవించవచ్చు. అయితే ఎక్కువ తీవ్రత గల భూకంపాలు, సునామీలు వేకువజామున సంభవిస్తాయి.
- భూకంపాల రాకను ముందుగా పసిగట్టడం వీలుకాదు. అయితే భూకంపాలు సంభవించే ప్రాంతాలను తెలుసుకోవచ్చు.
- ప్రపంచంలో భూకంపాలు సంభవించని ప్రాంతంగా ఆస్ట్రేలియా దేశాన్ని పేర్కొంటారు. ఆ ప్రాంతంలో కూడా భూకంపాలు సంభవిస్తున్నాయి. 2021 సెప్టెంబర్ 11న రిక్టర్ స్కేలుపై 6 పాయింట్ల తీవ్రత కలిగిన భూకంపం మెల్బోర్న్ ప్రాంతంలో సంభవించింది. 1989లో న్యూ క్యాజిల్ భూకంపం 5.6 తీవ్రత కలిగి కొన్ని మరణాలకు కూడా కారణమైంది. ప్రపంచంలో భూకంపాలు సంభవించని ప్రాంతం ఏదీ లేదు. భూ గ్రహంలో ఏ ప్రాంతంలోనైనా ఎప్పుడైనా చలనాలు సంభవించవచ్చు. స్థిరత్వం కలిగిన ప్రాంతం అంటూ ఏదీ ఉండదు.
- 2022లో అఫ్గానిస్థాన్‌లోని ఖోస్ట్‌లో రిక్టర్ స్కేల్‌పై 6 పాయింట్ల తీవ్రతతో భూకంపం సంభవించి దాదాపు 93 మంది మరణించారు.
- 2022లో పపువా న్యూ గినియాలో రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించి దాదాపు 21 మంది మరణించారు.
- 2022 నవంబర్ 21న ఇండోనేషియాలోని జావా ద్వీపం పశ్చిమ తీరంలో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాదాపు 323 మంది మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.
దేశంలో భూకంప నమోదు కేంద్రాలు
- దేశంలో మొట్టమొదటి భూకంప నమోదు కేంద్రాన్ని 1898లో పశ్చిమబెంగాల్లోని కలకత్తాలో ఏర్పాటు చేశారు. తర్వాత మహారాష్ట్రలోని ముంబై, తమిళనాడులోని కొడైకెనాల్లో ఏర్పాటు చేశారు.
- 1961లో హైదరాబాద్‌లో జాతీయ భౌగోళిక భౌతికశాస్త్ర పరిశోధన కేంద్రం (NGRI) ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రూర్కీలో భూకంపాలను తట్టుకునే విధంగా ఇళ్లను నిర్మాణం చేయడానికి సంబంధించిన పరిశోధన కేంద్రం ఉంది.
భూకంప తరంగాలు
- భూకంపాలను ముందుగా పసిగట్టి హెచ్చరిక చేయడానికి అవకాశం లేదు. 2000లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ అత్యంత భూకంపాల తీవ్రత కలిగిన ప్రాంతంగా ఈశాన్య భారత రాష్ర్టాలను గుర్తించింది.
- భూకంపాలు సంభవించినప్పుడు కొండచరియలు విరిగిపడటం, వరదలు, అగ్నిప్రమాదాలు, సునామీల వంటి వైపరీత్యాలు ఏర్పడతాయి.
- భూకంపంలో వచ్చే శక్తి తరంగాల రూపంలో వెలువడుతుంది. ఈ తరంగాల ప్రకంపనలే భూకంపాలు. భూకంపాల్లో మూడు రకాల తరంగాలు వెలువడుతాయి. అవి…
P తరంగాలు లేదా ప్రాథమిక తరంగాలు
S తరంగాలు లేదా ద్వితీయ తరంగాలు
L తరంగాలు లేదా దీర్ఘ తరంగాలు - ఈ తరంగాలు భిన్న ధర్మాలను కలిగి వేర్వేరుగా ఉంటాయి.
ప్రపంచ భూకంప విస్తరణ
పసిఫిక్ మహాసముద్రం చుట్టూ పరివేష్టితమై ఉండే మండలం
- ఈ ప్రాంతాన్నే పసిఫిక్ అగ్ని వలయ ప్రాంతం అంటారు. అలస్కా నుంచి న్యూజిలాండ్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో ఇండోనేషియా ద్వీప వక్రత వస్తుంది. ప్రపంచంలో సంభవించే భూకంపాల్లో నూటికి 68 శాతం ఈ ప్రాంతంలో సంభవిస్తాయి.
ట్రాన్స్ ఆసియాటిక్, మధ్యధరా మండలం - ఇది దక్షిణాసియా, ఆసియా మైనర్, మధ్యధరా ప్రాంతం గుండా విస్తరించింది. హిమాలయాల్లోని టిబెట్, చైనా, యూరప్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడ 21 శాతం భూకంపాలు సంభవిస్తాయి. 11 శాతం భూకంపాలు మిగతా ప్రాంతాల్లో సంభవిస్తాయి.
దేశంలో భూకంపాల విస్తరణ
హిమాలయ ప్రాంతాలు: ఈ ప్రాంతాల్లో పర్వతోద్భవం ఇంకా జరుగుతుండటం వల్ల భూకంపాలు విరివిగా సంభవిస్తుంటాయి. క్వేట్టా (1935), మోంగిర్ (1934), దుబ్రా (1930), కాంగ్రా (1905), అసోం (1950) మొదలైనవి ఈ ప్రాంతంలో సంభవించిన ముఖ్యమైన భూకంపాలు.
ఉత్తర మైదాన ప్రాంతం: హిమాలయ పర్వత ప్రాంతాల్లో వచ్చే భూకంపాల వల్ల ఇక్కడ భూకంపాలు వస్తాయి. ఈ ప్రాంతం కింద ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్లు ఉన్నాయి.
దక్షిణ ద్వీపకల్పం, కోస్తా తీరప్రాంతాలు: ఈ ప్రాంతం స్థిరమైన భూభాగం అయినప్పటికీ కొన్ని స్థానిక కారణాల వల్ల, ఇతర కారణాల వల్ల ఇక్కడ భూకంపాలు సంభవిస్తుంటాయి. కచ్ (1956), మద్రాస్ (1948), అహ్మదాబాద్, సూరత్, లాతూర్ (1993), 2001 జనవరి 26న గుజరాత్ భుజ్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ఈ మధ్యకాలంలో సంభవించిన వాటిలో పెద్దది. - తెలంగాణను భూకంపాలు రాని ప్రాంతంగా పేర్కొనవచ్చు. ఉత్తర తెలంగాణలో అప్పుడప్పుడు స్వల్ప భూకంపాలు సంభవిస్తున్నాయి. దీనికి కారణం భూమి అంతర్భాగంలో ప్రాంతీయంగా జరిగే భూ సర్దుబాట్లు, మైనింగ్.
- ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా ప్రాంతం భూకంపాలు సంభవించే ప్రాంతంగా ఉంది. ఒంగోలులో భూకంపాలు సంభవిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో కూడా అప్పుడప్పుడు భూ ప్రకంపనలు ఏర్పడుతున్నాయి.
భూకంపాలు – పదకోశం
భూకంప నాభి: భూకంపాలు ఏర్పడిన స్థానాన్ని భూకంప నాభికేంద్రం లేదా భూకంప నాభి అని అంటారు.
అధికేంద్రం: భూకంప నాభికి ఊర్ధంగా ఉపరితలంపై గల కేంద్రానికి అధికేంద్రం అని పేరు.
భూకంప లేఖిని: భూకంప లేఖిని అనే పరికరం భూకంపాలను, వాటి తీవ్రతలను నమోదు చేస్తుంది.
భూకంప రేఖా చిత్రం: భూకంప లేఖిని నమోదు చేసిన గ్రాఫ్‌ను భూకంప రేఖా చిత్రం అంటారు.
ఐసోసీస్మల్ రేఖలు: ఒకే భూకంప తీవ్రత గల ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఐసోసీస్మల్ రేఖలు అంటారు. ఇవి కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి.
భూకంప తీవ్రతను తెలిపే స్కేళ్లు
రిక్టర్ స్కేల్
- 1935లో డాక్టర్ చార్లెస్ రిక్టర్ అనే శాస్త్రవేత్త భూకంప పరిమాణం తెలుసుకోవడానికి ఈ స్కేలును రూపొందించాడు.
- భూకంపాల సమయంలో బహిర్గతమైన మొత్తం శక్తిని దీని ద్వారా తెలుసుకోవచ్చు.
- రిక్టర్ స్కేలుపై భూకంప తరంగ దైర్ఘ్యం ఆధారంగా తీవ్రతను కొలుస్తారు.
- ఈ స్కేలుపై భూకంప తీవ్రతను 0 నుంచి 9 వరకు 10 వర్గాలుగా విభజించారు. ట్రైనైట్రో టోలిన్ అనే రసాయన పదార్థం విడుదల చేసే శక్తితో భూకంప శక్తిని తులనం చేసి దానితో భూకంప తీవ్రతను తెలియజేస్తారు.
మెర్కలీ స్కేలు - ఈ స్కేలును ఇటలీకి చెందిన మెర్కలీ అనే శాస్త్రవేత్త రూపొందించారు. సాధారణంగా ఈస్కేలులో 12 పాయింట్లు ఉంటాయి. భూకంపాలు సంభవించినప్పుడు వివిధ తీవ్రతల వద్ద భూ పటలంలో జరిగే మార్పుల వల్ల కలిగే నష్టాలను మెర్కలీ స్కేలు అనుసరిస్తుంది.
షిండో స్కేలు - దీన్ని జపాన్ దేశస్తులు రూపొందించారు.
- షిండో స్కేలు ఒక నిర్ధిష్ట ప్రదేశంలో భూకంప తీవ్రతను లెక్కిస్తుంది.
- జపాన్‌లో భూకంప తీవ్రతను కొలవడానికి రిక్టర్ స్కేలుకు బదులుగా షిండో స్కేలును ఉపయోగిస్తారు.
- షిండో స్కేలులో 1-7 వరకు సూచనలు ఉంటాయి.
ఇండియాలోని భూకంప పరిశోధన కేంద్రాలు
భూకంప కార్యక్రమ కేంద్రం (EQOC)
నేషనల్ సిస్మోలాజికల్ నెట్వర్క్ (NSN)
జాతీయ భూకంప పరిశోధన బులిటెన్ (NERB)
నేషనల్ సిస్మోలాజికల్ డేటాబేస్ కేంద్రం (NSDC)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు