Feet on Mars | మార్స్‌పై అడుగులు
మరో జీవయుత గ్రహం కోసం మానవుడి అన్వేషణ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా భూమి సమీపంలోని అంగారకుడిపై 1960, అక్టోబర్ 10న తొలి ఆర్బిటార్‌ను రష్యా ప్రయోగించగా అది విఫలమైంది. ఎన్నో విఫల ప్రయోగాల తర్వాత 1964లో నాసా ఆ ఘనతను సాధించింది. ఇది మొదలు.. అంగారకుడిపై ఎన్నో ఆర్బిటార్లను పంపిన నాసా 1975లో వైకింగ్-1, వైకింగ్-2 అనే ల్యాండర్లను అంగారకుడిపై దించింది. ఈ నెల 5న నాసా పంపిన ఇన్సైట్ అనే రోవర్ ఏకంగా 16 అడుగుల మేరకు అంగారకుడి ఉపరితలాన్ని తవ్వనున్నది. ఈ నేపథ్యంలో అంగారకుడిపైకి పంపిన ల్యాండర్, రోవర్ల సమాచారం నిపుణ పాఠకుల కోసం…
వైకింగ్-1, వైకింగ్-2
– అంగారకుడిపై పరిశోధన కోసం అమెరికాకు చెందిన నాసా వైకింగ్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా వైకింగ్-1 అనే ల్యాండర్‌ను 1975, ఆగస్టు 20న పంపించింది. 1976, జూలై 20న అంగారకుడిపై వైకింగ్-1 విజయవంతంగా ల్యాండై పనిచేయడం ప్రారంభించింది. ఇదే అంగారకుడిపై ల్యాండైన తొలి ల్యాండర్. ఇది దాదాపు 2307 రోజులపాటు (6 1/4 సంవత్సరాలు) అంగారకుడి ఉపరితలంపై ఉండి రికార్డు సృష్టించింది.
– జీవి మనుగడకు సంబంధించిన ఆధారాలను కనిపెట్టడం కోసం ఈ ప్రయోగం చేపట్టారు.
– వైకింగ్ -1ను టైటాన్ IIIఈ సెంట్యుర్ – డీ1టీ అనే భారీ రాకెట్ ద్వారా ప్రయోగించారు.
– 1975, సెప్టెంబర్ 9న వైకింగ్-2 ప్రయోగం చేపట్టారు. ఇందులో ఆర్బిటార్, వైకింగ్-1 వైశాల్యానికి సమానమైన ల్యాండర్‌ను కలిగి ఉంది. 1975, జూలై 25న విజయవంతంగా ల్యాండైన వైకింగ్-2 అంగారకుడి ఉపరితలంపై 1361 రోజులపాటు పనిచేసింది. బ్యాటరీలు విఫలం కావడంతో 1980, ఏప్రిల్ 11న వైకింగ్-2ను ఆఫ్ చేశారు. దాదాపు 16000 ఫొటోలను ఈ ల్యాండర్ పంపించింది.
– వైకింగ్-2 కూడా జీవి మనుగడకు సంబంధించిన ఆధారాల కోసం టైటాన్ IIIఈ సెంట్యుర్ – డీ1టీ ద్వారా ప్రయోగించారు.
స్నోజర్నర్
– అమెరికాకు చెందిన రోబోటిక్ వ్యోమనౌక మార్స్ పాత్‌ఫైండర్. ఇది 1997లో అంగారకుడిపై రోవింగ్ ప్రోబోతోపాటు బేస్ స్టేషన్లో దిగింది. అనంతరం ఈ బేస్ స్టేషన్‌కు కార్ల్ సాగన్ మెమోరియల్ స్టేషన్‌గా నామకరణం చేశారు. అతి తక్కువ బరువు కలిగిన రోబోటిక్ మార్స్ రోవర్‌కు స్నోజర్నర్గా పేరు పేట్టారు. భూమి, చంద్రుడికి వెలుపల పనిచేసిన తొలి రోవర్.
– ఈ ల్యాండర్‌ను 1996, డిసెంబర్ 4న డెల్టా II 7925 రాకెట్ ద్వారా ప్రయోగించారు.
– స్నోజర్నర్ 16,500లకు పైగా ఫొటోలు, 2.3 బిలియన్ల బిట్ల సమాచారాన్ని పంపించింది. వాతావరణ పీడనం, ఉష్ణోగ్రత, గాలి వేగాల 8.5 మిలియన్ల కొలతలు చేసింది.
– ఈ రోవర్ మూడు నెలలపాటు విజయవంతంగా పనిచేసింది. అక్టోబర్ 7 తర్వాత సమాచార సంబంధ వ్యవస్థ విఫలమైంది. స్నోజర్నర్ చిట్టచివరి సమాచారాన్ని 1997, సెప్టెంబర్ 27న పంపించింది.
స్పిరిట్/ ఎంఈఆర్-ఏ
– మార్స్ పైకి నాసా పంపించిన మరో రోబోటిక్ రోవర్ స్పిరిట్ లేదా ఎంఈఆర్-ఏ (మార్స్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్-ఏ) లేదా ఎంఈఆర్ -2. ఇది 2004 నుంచి 2010 వరకు సేవలు అందించింది. నాసా మార్స్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ మిషన్ కార్యక్రమంలో భాగంగా నాసా పంపించాలనుకున్న రెండింటిలో స్పిరిట్ ఒకటి. ఇది 2004, జనవరి 4న అంగారకుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. 2009 వరకు విజయవంతంగా పనిచేసిన రోవర్ స్ట్రక్ అవడంతో 2010, మార్చి 22న భూమితో సంబంధాలను కోల్పోయింది. స్పిరిట్ దాదాపు 2269 రోజులపాటు పనిచేసింది.
– స్పిరిట్ ప్రయోగం కోసం నాసా ఉపయోగించిన రాకెట్ డెల్టా II 7925
– అంగారకుడిపై ఉన్న గుసావ్ మైదానంలో బసాల్ట్ రకం రాళ్లు, ఆలివిన్, పైరోక్సెన్, ప్లాగియోక్లేస్, మాగ్నెటైట్ల వంటి ఖనిజాలకు సంబంధించిన ఆనవాళ్ల చిత్రాలను స్పిరిట్ పంపించింది.
ఆపర్చునిటీ
– నాసా మార్స్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ మిషన్ కార్యక్రమంలో భాగంగా 2003, జూలై 3న ఆపర్చునిటీ అనే రోవర్‌ను నాసా ప్రయోగించింది. దీనినే ఎంఆర్ఆర్-బీ (మార్స్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ – బి) లేదా ఎంఈఆర్-1గా పిలుస్తారు. ఇది అంగారకుడిపై గల Meridiani Planum అనే ప్రాంతంలో 2004, జనవరి 25న విజయవంతంగా దిగింది. అంగారకుడిపై మరో వైపు స్పిరిట్ దిగిన మూడు వారాల తర్వాత ఆపర్చునిటీ ల్యాండ్ అయింది. ఇది 2004 నుంచి విజయవంతంగా ఇప్పటికీ సేవలు అందిస్తుంది. ఇప్పటి వరకు ( 2018, మే 7 వరకు) 14 సంవత్సరాల 11 రోజుల జీవిత కాలాన్ని పూర్తి చేసుకుంది. 2018, జనవరి 23 వరకు అంగారకుడిపై ఆపర్చునిటీ 45.09 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.
– ఆపర్చునిటీ రోవర్‌ను ప్రయోగించడానికి ఉపయోగించిన రాకెట్ – డెల్టా II 7925 హెచ్
ఫోనిక్స్
– ఫోనిక్స్ స్పేస్ క్రాఫ్ట్‌ను నాసా 2007, ఆగస్టు 4న ప్రయోగించింది. ఇది 2008, మే 25న అంగారకుడిపై విజయవంతంగా దిగింది. జీవి బతకడానికి అనువైన వాతావరణానికి అసరమైన సూక్ష్మజీవుల ఉనికితోపాటు అంగారకుడి చరిత్రలో నీటి ఆనవాళ్లను గుర్తించడానికి అవసరమైన పరికరాలను ఫోనిక్స్ ల్యాండర్‌కు అనుసంధానం చేశారు. ఈ ప్రయోగం కోసం దాదాపు 386 మిలియన్ డాలర్లను నాసా ఖర్చు చేసింది. ఈ ప్రయోగానికి నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ మార్గదర్శకత్వంలో యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనాకు చెందిన లూనార్, ప్లానెటరీ ల్యాబొరేటరీ నాయకత్వం వహించింది. ఫోనిక్స్‌కు నిర్దేశించిన లక్ష్యాన్ని 2008, ఆగస్టు నాటికి పూర్తి చేసుకుంది. అంగారకుడిపై వాతావరణం కారణంగా సౌర విద్యుత్ స్తంభించడంతో నవంబర్ 2న భూమితో ఫోనిక్స్‌కు సంబంధాలు తెగిపోయాయి. తిరిగి సంబంధాలను పునరుద్ధరించడానికి ఇంజినీర్లు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో 2008, నవంబర్ 10న ఫోనిక్స్ జీవితకాలం ముగిసినట్లుగా ప్రకటించారు.
– ఫోనిక్స్ ల్యాండర్‌ను డెల్టా II 7925 రాకెట్ ద్వారా ప్రయోగించారు.
క్యూరియాసిటీ రోవర్
– క్యూరియాసిటీ కారు పరిమాణంలో ఉండే రోబోటిక్ రోవర్. ఇది నాసాకు చెందిన ల్యాబొరేటరీ మిషన్‌లో భాగంగా అంగారక గ్రహంపై దిగి గేల్ క్రేటర్ ప్రాంతాన్ని అన్వేషిస్తుంది. అమెరికాలోని కేప్ కానవెరల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి 2011, నవంబర్ 26న ఈ ప్రయోగం చేపట్టగా అంగారక గ్రహంపై గేల్ క్రేటర్ ప్రాంతంలో ఎయోలిస్ పలూస్పై 2012, ఆగస్టు 6న విజయవంతంగా దిగింది. అంగారకుడిపై వాతావరణం పరిశోధన, గేల్ క్రేటర్ ఎంచుకున్న ప్రాంతాల్లో నీటి లభ్యతను పరిశోధించడం, అంగారకుడి చరిత్రలో ఎప్పుడైనా సూక్ష్మజీవుల జీవనానికి అనుకూలమైన పర్యావరణ పరిస్థితులు ఉండేవా లేవా అన్న విషయాన్ని అంచనా వేయడం, భవిష్యత్తులో మానవ నివాస అనుకూలతలపై అధ్యయనం చేయడం కోసం ఈ రోవర్‌ను ప్రయోగించారు. 2014, జూన్ 24న క్యూరియాసిటీ 687 రోజులు పూర్తి చేసింది. ఒకప్పుడు అంగారకుడు సూక్ష్మజీవుల జీవనానికి అనుకూలంగా ఉండేదని కనుగొన్నది. ఈ రోవర్‌కు ఆరో తరగతి విద్యార్థిని క్లారా మా సూచించిన క్యూరియాసిటీగా నామకరణం చేశారు.
– క్యూరియాసిటీ రోవర్‌ను అట్లాస్ V 401 ద్వారా ప్రయోగించారు.
ఇన్సైట్
– అంగారక గ్రహ నేల లోతుల్లో చోటుచేసుకునే ప్రకంపనలను వినడం కోసం మే 5న అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ వైమానిక స్థావరం నుంచి అట్లాస్ -5 అనే భారీ రాకెట్ ద్వారా ఇన్సైట్ ల్యాండర్‌ను ప్రయోగించింది. ఇది 30 కోట్ల మైళ్ల దూరం ప్రయాణించి నవంబర్ 26న అరుణగ్రహంపైకి చేరుకుంటుంది. అమెరికా పశ్చిమ తీరం నుంచి ప్రయోగించిన మొదటి గ్రహాంతర వ్యోమనౌక ఇదే. ఇన్సైట్ అంటే… ఇంటీరియల్ ఎక్స్‌ప్లొరేషన్ యూజింగ్ సైస్మిక్ ఇన్వెస్టిగేషన్స్, జియోడెసీ అండ్ హీట్ ట్రాన్స్పోర్ట్. దీని బరువు 360 కిలోలు. దీనిని 99. 3 కోట్ల డాలర్లతో నిర్మించారు.
– అంగారకుడి మధ్య రేఖా ప్రాంతానికి ఉత్తరాన ఉన్న ఎల్సియం ప్లొనీషియా అనే మైదాన ప్రాంతంలో ఇన్సైట్ దిగనుంది. ఇది ఒకేచోట స్థిరంగా ఉండి అంగారకుడి భూకంపాల తీరుతెన్నులను శోధిస్తుంది. భూమి వంటి గ్రహాల పుట్టుక రహస్యాలను బహిర్గతం చేస్తుంది. ఇందుకోసం అంగారక గ్రహాన్ని ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా 16 అడుగుల లోతు వరకు తవ్వుతుంది.
– ఇన్‌సైట్‌లో సైస్మిక్ ఎక్స్పెరిమెంట్ ఫర్ ఇంటీరియర్ స్ట్రక్చర్, హీట్ ఫ్లో అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ప్యాకేజీ తదితర పరికరాలు ఉన్నాయి.
మామ్/ మంగళయాన్
అంగారక గ్రహంపై పరిశోధనల కోసం ఇస్రో 2013, నవంబర్ 5న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ25 ఉపగ్రహ వాహక నౌకద్వారా మామ్ (మార్స్ ఆర్బిటర్ మిషన్) లేదా మంగళయాన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇది 300 రోజులపాటు దాదాపు 40 కోట్ల కి.మీ.కు పైగా దూరం ప్రయాణించి 2014, సెప్టెంబర్ 24న అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. అంగారక గ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ప్రయోగించిన మొదటిసారే విజయం సాధించిన మొదటి దేశం భారత్.
మామ్‌లో ఐదు పరికరాలు
1. మార్స్ కలర్ కెమెరా
2. థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రామీటర్
3. మీథేన్ సెన్సర్ ఫర్ మార్స్
4. మార్స్ ఎనోస్ఫియరిక్ న్యూట్రల్
5. లెమెస్ ఆల్ఫా ఫొటోమీటర్
అంగారకుడి ఉపరితలాన్ని, భౌగోళిక స్వరూపాన్ని అధ్యయనం చేయడం, అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయడం, భవిష్యత్తులో భారీ ప్రయోగాలు, మానవసహిత అంగారక యాత్రకు వేదిక సిద్ధం చేయడం మంగళయాన్ లక్ష్యాలు. అంగారక గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన మొదటి ఆసియా దేశంగాను, ప్రపంచంలో ఈ విజయం సాధించిన నాలుగో దేశంగా నిలిపింది. మొదటి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి ఉపగ్రమాన్ని ప్రవేశపెట్టిన తొలిదేశంగా భారత్ గుర్తింపు పొందింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు