-ఆధునిక జీవనశైలిలో ఫ్యాషన్ డిజైనింగ్‌కు ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. ఫ్యాషన్ పరిశ్రమ దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. భారతీయ ఫ్యాషన్ విదేశాల్లో కూడా ప్రసిద్ధి చెందింది. భారత డిజైనర్లు అంతర్జాతీయ గిరాకీకి అనుగుణంగా ఫ్యాషన్ ఉత్పత్తులను, యాక్సెసరీస్‌ను రూపొందిస్తున్నారు. ఆసక్తి ఉన్న యువత ఈ రంగంలో అడుగుపెట్టి తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవచ్చు.
ఫ్యాషన్ డిజైనర్ అంటే..
-వస్ర్తాలు, ఆభరణాలు, బూట్లు, చెప్పులు ఇలా ఉత్పత్తి ఏదైనా చూడగానే ఆకట్టుకునేలా, కళాత్మకంగా రూపొందించడాన్నే ఫ్యాషన్ డిజైనింగ్ అంటారు. ఒక డిజైన్‌ను రూపకల్పన చేస్తున్నప్పుడు దానికి ఎలాంటి మెటీరియల్ ఉపయోగించాలి, దానిలోని ఏ భాగం ఎంత పరిమాణంలో ఉండాలి, ఎక్కడ ఏ రంగు బాగుంటుంది, చక్కని ఫినిషింగ్ రావాలంటే ఏం చేయాలి? మొదలైన అంశాలను డిజైనర్లు పర్యవేక్షిస్తారు.
కావాల్సిన స్కిల్స్
-ఫ్యాషన్ డిజైనింగ్‌ను కెరీర్‌గా మలుచుకోవాలంటే ముందుగా మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, రంగులు, ట్రెండ్ మొదలైన వాటిపై అవగాహన పెంచుకోవాలి. తార్కిక ఆలోచన, విశ్లేషణ సామర్థ్యం ఉండాలి. సృజనాత్మకత, సమయస్ఫూర్తి, మారుతున్న పరిస్థితులపట్ల అవగాహనతోపాటు టెక్నికల్ సామర్థ్యం అవసరం. అందంగా, ఆకర్షణీయంగా డిజైన్లు రూపొందించడంలో నైపుణ్యం ప్రదర్శించాలి. ఎప్పటికప్పుడు మార్కెట్ అవసరాలు, వినియోగదారుల అభిరుచిని అంచనావేసే నైపుణ్యం ఉండాలి. మొత్తానికి ఆలోచనల్లో నవ్యత, శైలిలో వైవిధ్యం చూపగలవారికి ఈ కెరీర్ అద్భుతంగా ఉంటుంది.
అవకాశాలు
-ఫ్యాషన్ సంబంధిత కోర్సులు చదివి సృజనాత్మకంగా ఆలోచించే లక్షణం, కష్టపడే తత్వం ఉన్నవారికి ఫ్యాషన్ డిజైనింగ్ రంగం అపారమైన అవకాశాలు కల్పిస్తున్నది. టెక్స్టైల్ మిల్లులు, గార్మెంట్ కంపెనీలు, జువెలరీ సంస్థలు, లెదర్ కంపెనీలు, ఫ్యాషన్ షో నిర్వహణ సంస్థలు, బొటిక్‌లు, మీడియా సంస్థలు మొదలైన వాటిలో విభిన్న హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. క్వాలిటీ కంట్రోల్, కాన్సెప్ట్ మేనేజ్మెంట్, ప్లానింగ్, ప్రింటింగ్, ఫ్యాషన్ మర్చండైజింగ్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
హోదాలు
-ఫ్యాషన్ రంగంలో ప్రవేశించేవారికి వారు చదివిన కోర్సును బట్టి వివిధ హోదాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఫ్యాషన్ డిజైనర్, ఫ్యాషన్ ఇలస్ట్రేటర్, ఫ్యాషన్ ైస్టెలిస్ట్, ఫ్యాషన్ కోఆర్డినేటర్, ఫ్యాషన్ కన్సల్టెంట్, ఫ్యాషన్ మర్చండైజర్, ఫ్రీలాన్స్ డిజైన్ కన్సల్టెంట్, కాస్ట్యూమ్ డిజైనర్, నిట్వేర్ డిజైనర్, ఫ్యాషన్ జర్నలిస్ట్, ఫ్యాషన్ ఎక్స్పర్ట్, ప్యాట్రన్ ఇంజినీర్, బ్రాండ్ మేనేజర్ మొదలైన హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
వేతనాలు
-ప్రారంభంలో మనం ఎంచుకున్న కంపెనీలు లేదా సంస్థల స్థాయిని బట్టి రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనం లభిస్తుంది. అనుభవం, నైపుణ్యాలు పెరిగేకొద్దీ వేతనాల్లో పెంపు భారీగా ఉంటుంది. ఈ రంగంలో తమదైన ముద్ర చూపగలిగిన వారు పేరు ప్రతిష్టలతోపాటు లక్షల్లో ఆదాయం ఆర్జించవచ్చు.
ఫ్యాషన్ కోర్సులు
-ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థుల కోసం రకరకాల ఫ్యాషన్ సంబంధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో డిప్లొమా ప్రోగ్రామ్‌లు, బీఏ, బీఎస్సీ, బీటెక్ వంటి బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు ఉన్నాయి. విద్యార్థులు తమ అభిరుచికి అనుగుణంగా గార్మెంట్, జ్యుయెలరీ, లెదర్ విభాగాల్లో కోర్సులను ఎంచుకుని కెరీర్లో రాణించవచ్చు. బ్యాచిలర్ డిగ్రీలు పూర్తిచేసిన వారు మెరుగైన హోదాలు, వేతనాల కోసం మాస్టర్ డిగ్రీ కోర్సులు చదవచ్చు.
డిప్లొమా ప్రోగ్రామ్‌లు
-డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైన్ & టెక్నాలజీ
-డిప్లొమా ఇన్ ప్యాటర్న్ మేకింగ్ & CAD
-డిప్లొమా ఇన్ క్వాలిటీ అస్యూరెన్స్ & కాంప్లియన్స్
-డిప్లొమాన్ ఇన్ అపరెల్ మ్యానుఫ్యాక్చరింగ్
-డిప్లొమా ఇన్ అపరెల్ మర్చండైజింగ్
-పైవాటిలో కొన్ని ఏడాది, మరికొన్ని రెండేండ్ల డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు
-బీఏ (ఫ్యాషన్ డిజైన్)
-బీఏ (ఫ్యాషన్ టెక్నాలజీ)
-బీఎస్సీ (డ్రెస్ డిజైనింగ్)
-బీఎస్సీ (కాస్ట్యూమ్ డిజైన్ అండ్ ఫ్యాషన్)
-బీఎస్సీ (గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్)
-బీటెక్ (ఫ్యాషన్ అండ్ లైఫ్‌ైస్టెల్ డిజైన్)
-బీటెక్ (అపరెల్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్)
-బీడిజైన్ (యాక్సెసరీ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, నిట్వేర్ డిజైన్, లెదర్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్)
-పైవాటిలో బీఏ, బీఎస్సీ మూడేండ్ల కాలవ్యవధి కోర్సులు. బీటెక్ కోర్సుల కాలవ్యవధి నాలుగేండ్లు. బీడిజైన్లో కొన్ని మూడేండ్లు, మరికొన్ని నాలుగేండ్ల కోర్సులు ఉన్నాయి.
గమనిక: పైన పేర్కొన్న కోర్సులతోపాటు ఫ్యాషన్ రంగానికి సంబంధించి ఇంకా ఎన్నో డిప్లొమా, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
సంస్థలు
-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT)
-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ (NIFD)
-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ (NID)
-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ (IIAFT)
-సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (SID)
-ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (IIFT)
-పెర్ల్ (Pearl) అకాడమీ ఆఫ్ ఫ్యాషన్
-జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీగమనిక: పైన పేర్కొన్నవేగాక మరెన్నో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఫ్యాషన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. విద్యార్థులు వివిధ సంస్థల వెబ్సైట్లను సందర్శించి తమకు నచ్చిన సంస్థలో నచ్చిన కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. చాలా సంస్థలు సొంతంగా ప్రవేశపరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు కల్పిస్తున్నాయి.