పితృస్వామ్యంలో స్త్రీ పతాక రుద్రమ
పితృస్వామిక సమాజంలో భాషకు, రాజకీయానికి కూడా పితృస్వామ్య భావాలే అంటుకుని ఉంటాయి. కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించి ఒక ధీరోదాత్త పాలనను అందించిన రుద్రమ స్త్రీ కాబట్టి రాణి అంటే ఆమె ఏ రాజు భార్యగానో తోస్తుంది. అలాగే రాజు అందామంటే ఆమె స్త్రీ అస్తిత్వాన్ని కించపరిచినట్టు అవుతుంది. అందుకే పాలకురాలు అంటే మధ్యేమార్గం గా ఉంటుందేమో! తెలంగాణలో ఎదిగిన రాజకీయం, మధ్య యుగ చరిత్రకు అందించిన ప్రత్యేకమైన విషయాల్లో రుద్రమ ఒకరు. మధ్య యుగ చరిత్ర యుద్ధాలతో, రక్తపుటేరులు పారిన సందర్భంలో పురుషాధిక్య సమాజాన్ని ఎదిరించి, కత్తి దూసిన స్త్రీగా రుద్రమ చరిత్రపై సంతకం చేసింది. యోధురాలిగానే కాదు, పరిపాలనాదక్షురాలిగా కూడా ముద్రవేసిన వ్యక్తిత్వం రుద్రమది.
శాతవాహన, ఇక్ష్వాకు కాలాల్లో రాణి వాసపు స్త్రీల ప్రస్తావన భర్త లేదా కొడుకు శౌర్యాన్ని, గొప్పతనాన్ని చూపేవి గానో లేదా తాము చేసిన దానాల వల్లనో శాసనాల ద్వారా అజరామరం అయ్యారు. రెండవ చంద్రగుప్తుడి కూతురు, వాకాటక రాణి ప్రభావతి గుప్త సంరక్షకురాలిగా రాజ్యమేలింది. రాష్ట్రకూట రాజైన అమోఘవర్షుడు తన కూతురైన చంద్రబ్బాలబ్బేను రాయచూర్ ప్రాంత గవర్నర్ (ప్రాంతీయ పాలకురాలిగా)గా నియమించడం కనిపిస్తుంది. అయితే స్వతంత్ర పాలకులుగా ఉన్న స్త్రీలు తక్కువే.
ఈ కోవలో మొదట మనకు కనిపించేది కశ్మీర్లో రాణి దిడ్డ. మొదట సంరక్షకురాలిగా మొదలైన ఈమె క్రీ.శ.924-1003 మధ్య కాలంలో స్వతంత్ర పాలకురాలిగా ఏలినట్లు కల్హణుడి రాజతరంగిణి వల్ల తెలుస్తుంది. ఆ తర్వాత 1236 నుంచి 1240 వరకు నాలుగేళ్ల పాటు ఢిల్లీ సల్తనత్ (సుల్తానేట్ అని రాస్తాం)లో భాగమైన బానిస వంశ పాలకురాలు రజియా సుల్తానా. రజియా తండ్రి ఇల్టుట్మిష్ ఆమె సామర్థ్యం చూసి సింహాసనానికి వారసురాలిగా ప్రకటించాడు.
సుమారు రెండు దశాబ్దాల తర్వాత రుద్రమను ఆమె తండ్రి గణపతిదేవుడు తన తర్వాత పాలకురాలిగా ఎంచుకోవడం వెనుక ఢిల్లీలో అంతకు ముందు ఇల్టుట్మిష్ తీసుకున్ననిర్ణయం ప్రేరణగా ఉందా లేదా అనే దానికి ఆధారాలు లేవు. అయితే ఢిల్లీలో ఏం జరుగుతున్నదో ఓరుగల్లులో తెలిసే అవకాశం ఉండే ఉంటుంది. భారత ఉపఖండంలో తిరుగుతున్న వర్తకులు, యాత్రికుల ద్వారా ఢిల్లీలో జరుగుతున్న విషయాలు తెలియదని అనుకోలేం.
సుమారు ఆరు దశాబ్దాల గణపతిదేవుడి పాలన తరువాత 1259-60లో రుద్రమ రాజ ప్రతినిధిగా ‘రుద్రదేవ మహారాజు’ పేరుతో పాలన మొదలు పెట్టింది. 1269 నాటికి కూడా ఆమె పట్టాభిషిక్తురాలు కాలేదని, ఇంకా పట్టోధృతి (అంటే పాలనకు నియమింపబడిన వ్యక్తి) అనే పల్నాడు జిల్లా దుర్గి శాసనంలో ఉంది. అంటే గణపతిదేవుడు బతికి ఉన్నప్పుడే రాజ్యాన్ని స్వతంత్రంగా నడిపిందని తెలుస్తుంది. ఏదేమైనా మధ్య యుగ తెలంగాణ చరిత్రలోనే కాదు, దక్కన్ చరిత్రలో సైతం ఒక స్త్రీ, విశాల సామ్రాజ్యానికి పాలకురాలు కావడం విశేషం.
అసలు గణపతి దేవుడు రుద్రమను వారసురాలిగా ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందన్న విషయంపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి.
కొడుకులు లేనందుకు కూతురును ఎంచుకున్నాడనేది ఎక్కువమంది చరిత్రకారుల భావన. ఏకామ్రనాథుడు రాసిన ప్రతాప చరిత్ర అనే గ్రంథం ప్రకారం రుద్రమ దేవి సవతి సోదరులైన హరిహర దేవుడు, మురారి దేవుడు మరికొందరు సామంతులతో కలిసి తిరుగుబాటు చేసి రుద్రమకు సింహాసనం దక్కకుండా ఉండాలని రాజధానిని ముట్టడించారు. ఈ సవతి సోదరులు ఎవరనేదానికి జవాబు లేదు.
చివరి రాజైన ప్రతాపరుద్రుడి ఆస్థాన పండితుడైన విద్యానాథుడు రాసిన ప్రతాప రుద్రీయం (ఇంకో పేరు ప్రతాపరుద్ర యశోభూషణం) ప్రకారం.. గణపతిదేవుడి భార్య సోమకు పుట్టిన కూతురు రుద్రమ. ఈ సోమ యాదవుల చెర నుంచి విడుదలైనప్పుడు గణపతిదేవుడు పెళ్లి చేసుకున్న యాదవ రాకుమార్తె సోమల దేవి ఒకటేనా అనేది కూడా స్పష్టం లేదు. ఎందుకంటే ఇవన్నీ సాహిత్య ఆధారాలే. శాసనాల్లో ఈ విషయ ప్రస్తావన లేదు.
ఢిల్లీలో రజియా, ఓరుగల్లులో రుద్రమ ఇద్దరు కూడా మతాలు నిర్దేశించిన ధర్మ శాస్ర్తాలు, పితృస్వామ్య సమాజ నియమాలకు వ్యతిరేకంగా నిలిచి రాజకీయ అధికారం పొందినవాళ్లే. అయినా సమాజంలో సమ్మతి కోసమేమో రజియా సుల్తాన్ (సుల్తానా కాదు), రుద్రమ ‘రుద్రదేవ మహారాజు’గా వ్యవహరించుకున్నారు. మిర్యాలగూడ దగ్గర ఆలగడప శాసనం వంటి కొన్ని శాసనాల్లో ‘కాకతియ్య రుద్రమ దేవి మహారాజులు పృథివి రాజ్యము సేయుచుండ’ అని రాయడంతో ఇది రుద్రమ గురించి ప్రస్తావనే అని స్పష్టం అవుతుంది.
కోటగిరి తామ్ర శాసనం దొరికే వరకు రుద్రమదేవి గణపతి దేవుడి భార్య అని భావించి అలాగే చరిత్రలో రాస్తూ వచ్చారు. మొదటి కారణం సాహిత్య ఆధారాలు. 15వ శతాబ్దంలో మల్లినాథ సూరి కుమారుడైన కుమార స్వామి రాసిన ప్రతాపరుద్రీయంపై వ్యాఖ్య, మార్కోపోలో రచన వంటివి ఈ తప్పునకు కారణాలు. రెండోది పితృస్వామ్య ప్రధానమైన భూస్వామ్య యుగాల్లో కూతుళ్లను ఎవరూ వారసురాలిగా ప్రకటించరు కాబట్టి గణపతి దేవుడి మరణం తర్వాత విధవ అయిన రుద్రమ పాలించిందని భావించారు.
1890లో E. హుల్ష్ అనే జర్మన్ ఇండాలజిస్ట్ (భారత దేశ చరిత్రపై పరిశోధన చేసేవాళ్లు) రుద్రమ గణపతిదేవుడి కూతురు అని నిరూపణ చేసినా, కోటగిరి రాగి రేకుల్ని చూసేవరకు ఈ తప్పు అభిప్రాయం కొనసాగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ దగ్గర బీర్కూర్ గ్రామంలోని చెరువులో చేపలు పడుతుంటే మూడు రాగి రేకులు వలలో చిక్కుకొని బయట పడ్డాయి. వీటినే కోటగిరి తామ్ర శాసనాలు అంటారు. ఈ రాగి రేకులే (తామ్ర శాసనాలే) రుద్రమ.. గణపతి దేవుడి కూతురని మొదటిసారి తెలిపాయి. ఈ శాసనాన్ని నిజాం కాలేజీ ప్రొఫెసర్ హనుమంతరావు పరిష్కరిస్తే, దాన్ని అంతిమంగా సవరించింది భారత ప్రభుత్వ ఎపిగ్రాఫిస్టు రావు బహదూర్ హెచ్ కృష్ణశాస్త్రి. నిజాం ఆర్కియాలజీ శాఖ ఈ కోటగిరి తామ్ర శాసనంపై 1921-24 మధ్య ప్రచురించిన మోనోగ్రాఫ్లో రెండు విషయాలు స్పష్టమయ్యాయి. మొదటిది.. రుద్రమ దేవి గణపతి దేవుడి కూతురే. కానీ ముందు భావించినట్టు భార్య కాదని. రెండవది.. కాకతీయ సామంతుల్లో ఒకరైన విరియాల వంశం గురించి.
కోటగిరి శాసనంతో పాటు రుద్రమను గణపతి దేవుడి కూతురుగా స్పష్టం చేసింది మల్కాపురం శాసనం. 1917లో తొలిసారి ప్రస్తావించిన ఈ శాసనం 1927 నాటికి పూర్తిగా పరిష్కృతమైంది. రుద్రమ గురించి స్పష్టం చేసిన ఇంకో ముఖ్యమైన శాసనం కొలనుపాక శాసనం. 1279 నాటి ఈ శాసనంలో రుద్రమ తండ్రి గణపతిదేవుడని, భర్త చాళుక్య వీరభద్రుడని స్పష్టంగా ఉంది.
ఒక స్త్రీ రాజ్యాధికారాన్ని చేపట్టడం సహించలేని వాళ్లు, రాచ కుటుంబంలోనే ఉన్న పురుషులు, రాజు మారినప్పుడల్లా స్వతంత్రం ప్రకటించుకునే సామంతులు- రుద్రమ అధికారం చేపట్టడాన్ని వ్యతిరేకించినవాళ్లు. అయితే వీళ్లను ఎదుర్కోవడంలో సహాయం చేసిన మిత్రులు కూడా ఉన్నారు. వీరిలో మొదట చెప్పుకోవాల్సిన వాడు రేచర్ల వెలమ నాయకుడైన ప్రసాదాదిత్యుడు. రుద్రమ సింహాసనం అధిష్థించడాన్ని వ్యతిరేకించినవారిని అణచివేసి రుద్రమకు కుడి భుజంగా వ్యవహరించాడు. అందుకే అతనికి ‘కాకతి రాజ్య స్థాపనాచార్య’ ‘రాయపిత మహాంక’ అనే బిరుదులున్నాయి. ఇతడి చరిత్రను మనకు అందించిన పుస్తకం ‘వెలుగోటి వారి వంశావళి’.
గోన వంశపు రెడ్లు కూడా రుద్రమకు సహాయంగా నిలిచిన సామంత నాయకులే. కాకతీయ సామ్రాజ్య నైరుతి దిశలో మార్జవాడి ప్రాంతం, అంటే రాయలసీమ ప్రాంతంలోని కర్నూల్, కడప ప్రాంతాల్ని పాలించిన కాయస్థ వంశస్థులు కాకతీయ విధేయులు. గణపతిదేవుని కాలంలో అశ్వ సాహిణి అంటే అశ్వ సైన్యాధిపతిగా ఉన్న గంగయ సాహిణి మొదలు అతని సోదరి కొడుకులు జన్నిగదేవుడు, త్రిపురారి, చివరగా అంబదేవుడు రుద్రమకు విధేయులు. అంబదేవుడు మాత్రం రుద్రమ చివరి దశలో శత్రువుగా మారిపోయాడు. దేవగిరి యాదవ రాజు సింఘన కొడుకు సారంగపాణి దేవుడు రుద్రమకు సహాయంగా ఉన్నాడు.
బహుశా స్త్రీ కావడం వల్ల కావచ్చు రుద్రమ జీవితాన్ని మగ మహారాజుల జీవితాల్లాగా రికార్డ్ చేయలేదనిపిస్తుంది. కాకతీయ పతనం తర్వాత కూడా ప్రతాపరుద్రుడి మీద రచనలు చేశారు.
కానీ రుద్రమపై పుస్తకాలు రాయలేదు. ఆ మధ్య వచ్చిన ఒక సినిమాలో ఆమెకు చాలా ఏళ్లు తాను ఒక అమ్మాయిని అనే స్పృహ కూడా లేదని, మగవాడి లాగానే పెరిగిందని కథలు అల్లి చూపించారు. వాస్తవానికి ఇవన్నీ ఆధారాలు లేని విషయాలే.
రుద్రమను నిరవద్యపుర (నిడదవోలు) పాలకుడైన చాళుక్య ఇందుశేఖరుడి కొడుకు వీరభద్రుడితో పెళ్లి చేయడం గణపతిదేవుడి రాజకీయ వ్యూహంలో భాగమే. తద్వారా ఆంధ్ర ప్రాంతంలో సైతం మిత్రుల్ని పెంచుకోవచ్చు. రుద్రమకు ముగ్గురు కూతుళ్లు- ముమ్మడమ్మ, రుద్రమ, రుయ్యమ. ముమ్మడమ్మను కాకతీయ వంశానికే చెందిన మహాదేవుడికి ఇచ్చి పెళ్లి చేసింది. రెండో కూతురు రుద్రమను యాదవ రాకుమారుడు ఎల్లణ దేవుడికి ఇచ్చి వివాహం చేసింది. చివరి కూతురు రుయ్యమను బ్రాహ్మణ నాయకుడైన ఇందలూరి అన్నయమంత్రికి ఇచ్చి పెళ్లి చేసింది. పెద్దర కూతురు ముమ్మడమ్మ కొడుకే చివరి రాజు ప్రతాపరుద్రుడు. కొడుకులు లేకపోవడంతో మనవడు ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకుని వారసుడిని చేసింది రుద్రమ దేవి.
-Dr. M A Srinivasan , 8106935000
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






