నిరుద్యోగం-ఇవీ కారణాలు

భారత ఆర్థికవ్యవస్థ (Indian Economy)
నిరుద్యోగం (Unemployment)
-ఉద్యోగం చేసే శక్తి, ఆసక్తి, అర్హత ఉండి ఉద్యోగం లభించని స్థితిని నిరుద్యోగం అంటారు.
నిరుద్యోగిత అంచనాలు
– NSSO 1955లో (9వ రౌండ్) ఉద్యోగ, నిరుద్యోగ సర్వే నిర్వహించింది.
– 1969లో ఎంఎల్ దంత్వాలా కమిటీ సిఫారసుల మేరకు NSSO ప్రతి ఐదేండ్లకు ఒకసారి ఎంప్లాయ్మెంట్ను, అన్ ఎంప్లాయ్మెంట్ను అంచనా వేస్తున్నది. మొదట 1972-73లో (27వ రౌండ్) సర్వే నిర్వహించి అంచనాలను ప్రకటించారు.
– NSSO 68వ రౌండ్ అంచనాల ప్రకారం భారతదేశంలో నిరుద్యోగ రేటు 5.6 శాతం (పురుషులు 5.3 శాతం, స్త్రీలు 6.6 శాతం)
-గ్రామీణ నిరుద్యోగ రేటు 5.7 శాతం (పురుషులు 5.5 శాతం, స్త్రీలు 6.2 శాతం)
– పట్టణ నిరుద్యోగ రేటు 5.5 శాతం (పురుషులు 4.9 శాతం, స్త్రీలు 8 శాతం)
-అధిక నిరుద్యోగిత గల రాష్ట్రం – నాగాలాండ్ (24.1 శాతం)
-అల్ప నిరుద్యోగిత గల రాష్ట్రం – మేఘాలయ (1.2 శాతం)
– మొత్తం లేబర్ ఫోర్స్ – 44.04 కోట్లు
– మొత్తం వర్క్ ఫోర్స్ – 41.57 కోట్లు
– నిరుద్యోగుల సంఖ్య – 2.47 కోట్లు
రంగాల వారీగా ఉపాధి అవకాశాలు
వ్యవసాయ రంగం – 48.9 శాతం
పారిశ్రామిక రంగం – 24.3 శాతం
సేవా రంగం – 26.9 శాతం
వ్యవస్థీకృత రంగం – 17.3 శాతం
అవ్యవస్థీకృత రంగం – 82.7 శాతం
– అప్పటి నుంచి 8 సర్వేలు చేపట్టిన NSSO చివరగా 2011-12లో (68వ రౌండ్) సర్వేచేసి అంచనాలను ప్రకటించింది.
-2011-12లో మొత్తం ఉపాధిలో.. స్వయం ఉపాధి 52 శాతం, రెగ్యులర్ ఉపాధి 18 శాతం, రోజువారి ఉపాధి 30 శాతం.
PLFS – 2019-20 అంచనాలు
– PLFS అంటే Periodic Labour force Survey.
– 2018 నుంచి NSO ప్రతి ఏడాది PLFS నిరుద్యోగ అంచనాలను నిర్వహించి ప్రకటిస్తున్నది.
-దేశంలో నిరుద్యోగుల సంఖ్య 2.81 కోట్లు (పురుషులు 2.09 కోట్లు, స్త్రీలు 0.72 కోట్లు).
-గ్రామీణ నిరుద్యోగం 1.5 కోట్లు (పురుషులు 1.18 కోట్లు, స్త్రీలు 0.32 కోట్లు).
-పట్టణ నిరుద్యోగం 1.31 కోట్లు (పురుషులు 0.91 కోట్లు, స్త్రీలు 0.40 కోట్లు).
– రంగాల వారీగా ఉపాధి అవకాశాలు చూస్తే..
-వ్యవసాయ రంగం – 23.27 కోట్లు
– పురుషులు – 14.77 కోట్లు
– స్త్రీలు – 8.51 కోట్లు
-దేశంలో నియత రంగంలో (Formal sector) పనిచేసేవారు 5.89 కోట్లు. ఇందులో వ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారు 5.09 కోట్లు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారు 0.80 కోట్లు.
-దేశంలో అనియత రంగంలో (Informal sector) పనిచేసేవారు 47.64 కోట్లు. ఇందులో వ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారు 4.41 కోట్లు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారు 43.19 కోట్లు.
నిరుద్యోగిత కారణాలు
శ్రామిక శక్తి పెరుగుదల (Increase in Labour force)
-2011 జనాభా లెక్కల ప్రకారం 1210 మిలియన్ల జనాభాలో 15-64 ఏండ్ల మధ్య శ్రామికుల సంఖ్య 790 మిలియన్లు. అంటే 65.20 శాతం. అదేవిధంగా 2022 మార్చి నాటికి భారతదేశ జనాభా 1404 మిలియన్లు కాగా, శ్రామికుల సంఖ్య 67.27 శాతం. వీరికి ఉపాధి కల్పించడం సాధ్యం కాదు. కాబట్టి నిరుద్యోగం పెరుగుతున్నది.
ఉపాధి రహిత వృద్ధి
– ఆర్థికవృద్ధి కంటే ఉపాధి వృద్ధి రేటు తక్కువగా ఉంది. 2004-05 నుంచి 2011-12 మధ్య ఉత్పత్తి వేగంగా పెరిగినా ఉద్యోగ వ్యాకోచత్వం 0.04 మాత్రమే. ఇదే కాలంలో వ్యవసాయ ఉపాధి వ్యాకోచత్వం రుణాత్మకతలో ఉంది. అంటే ఉపాధి రహిత వృద్ధి నమోదవుతున్నది.
వ్యవసాయ రంగంపై ఆధారపడటం
-దేశ జనాభాలో అధిక శాతం గ్రామాల్లో జీవిస్తున్నారు. వీరి ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఫలితంగా వ్యవసాయ రంగంలో ఒత్తిడి పెరిగి ప్రచ్ఛన్న నిరుద్యోగిత, రుతు సంబంధ నిరుద్యోగిత ఏర్పడుతుంది.
లోపభూయిష్టమైన విద్యావిధానం
-భారత విద్యావిధానం వృత్తి విద్యను, సాంకేతిక విద్యను, స్వయం ఉపాధి కల్పించుకునే విద్యను అందించడం లేదు. ఫలితంగా మానవ వనరుల అభివృద్ధి జరుగక నిరుద్యోగం పెరుగుతున్నది.
మూలధన సాంద్రత, ఉత్పత్తి పద్ధతులు
-మన దేశంలో శ్రమ పుష్కలంగా ఉంది. శ్రమ సాంద్రత పద్ధతులకు బదులు 2వ ప్రణాళిక నుంచి మూలధన సాంద్రత పద్ధతులను అనుసరించడంవల్ల నిరుద్యోగం పెరుగుతున్నది.
శిక్షణ వసతుల కొరత
-శ్రామికుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. వారికి సరైన శిక్షణ వసతులు లేవు. వారిలో గమనశీలత కూడా లేదు. కాబట్టి నిరుద్యోగం పెరుగుతున్నది.
అల్ప వనరుల వినియోగం
-దేశంలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ వాటిని పూర్తిగా సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతున్నాం. కాబట్టి నిరుద్యోగం పెరుగుతున్నది. ఉదా: నీటి వనరులు
పరిశ్రమల ఆధునికీకరణ
-ఇటీవలి కాలంలో పరిశ్రమలు తమ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడానికి, పరిశ్రమల్లో ఆధునిక ఉత్పత్తి పద్ధతులను (యంత్రాలను, పరికరాలను) ప్రవేశపెట్టడంవల్ల శ్రామికుల అవసరం తగ్గి, నిరుద్యోగిత పెరుగుతుంది.
అవస్థాపన సౌకర్యాల కొరత
-రవాణా, బ్యాంకింగ్, బీమా, శక్తి, సమాచారం మొదలైనవి తగినంతగా అభివృద్ధి చెందలేదు. ఫలితంగా నిరుద్యోగం పెరుగుతున్నది. అవస్థాపనా సౌకర్యాల కొరత ఆర్థికాభివృద్ధికి బాటిల్ నెక్లా ఉన్నది.
విద్యావంతుల సంఖ్య పెరుగుదల
– మన దేశంలో ప్రణాళికలు ప్రారంభమైనప్పటి నుంచి విద్యా సౌకర్యాలు పెరిగాయి. కానీ ఉపాధి అవకాశాలు పెరుగలేదు. ఫలితంగా నిరుద్యోగం పెరుగుతున్నది.
కుటీర పరిశ్రమలు క్షీణించడం
-చిన్న, కుటీర, లఘు పరిశ్రమలు క్షీణించడంవల్ల వాటిపై ఆధారపడేవారు నిరుద్యోగులు అవుతున్నారు.
-ప్రాంతీయ అసమానతలు
– ఆదాయ పంపిణీలో అసమానతలు
-ఆర్థిక స్థోమత కేంద్రీకరణ
– ప్రభుత్వ విధానాలు
-పై అంశాలు/కారణాలను బట్టి దేశాన్ని నిరుద్యోగిత ఎక్కువగా నిర్మాణాత్మకమైనదిగా చెప్పవచ్చు.
ఆర్థికవ్యవస్థపై నిరుద్యోగిత ప్రభావం
– పేదరికం పెరుగుతుంది. ఎందుకంటే పేదరికం, నిరుద్యోగం ఒకదానికి ఒకటి పరస్పర ఆధారిత/అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. నిరుద్యోగంవల్ల ఆదాయం లేక పేదరికం పెరిగి మరింత నిరుద్యోగానికి, నిరుద్యోగం మరింత పేదరికానికి దారితీస్తుంది.
– నిరుద్యోగం వల్ల మానవ వనరుల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేం. ఫలితంగా ఆర్థిక వనరులు కూడా పూర్తిగా వినియోగించబడవు.
-ప్రభుత్వ ఆదాయాలు తగ్గి, వ్యయాలు పెరుగుతాయి.
సామాజిక ప్రభావం: నిరుద్యోగితవల్ల జూదం, నేరాలు, దొంగతనాలు, లంచాల స్థాయి పెరిగిపోతుంది.
వ్యక్తులపై ప్రభావం: నిరుద్యోగితవల్ల పోషకాహార లోపం, అనారోగ్యం, మానసిక ఒత్తిడి పెరుగడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. ఫలితంగా శ్రామికుల ఆయుర్దాయం తగ్గుతుంది.
రుణాత్మక గుణక ప్రభావం
– నిరుద్యోగితవల్ల వస్తు సేవలకు డిమాండ్ తగ్గి కొన్ని ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితి వస్తుంది.
కోశపరమైన వ్యయాలు
– నిరుద్యోగితవల్ల పన్ను రాబడి తగ్గుతుంది. నిరుద్యోగులపై అధిక వ్యయం చేయాల్సి వస్తుంది. ఫలితంగా బడ్జెట్లో లోటు పెరుగుతుంది.
శ్రామిక దోపిడీ
-నిరుద్యోగితవల్ల శ్రామికులకు తక్కువ వేతనాలు ఇచ్చి, వారి శ్రమను దోపిడీ చేస్తారు.
– నిరుద్యోగితవల్ల ప్రజల్లో అశాంతి పెరిగి సమాజ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతారు. అవి విప్లవాలకు దారితీయవచ్చు.
ప్రాక్టీస్ బిట్స్
1. NSSO ఉద్యోగిత, నిరుద్యోగితపై మొదటిసారిగా ఎప్పుడు సర్వే చేసింది?
A) 1970-71 B) 1971-72
C) 1972-73 D) 1973-74
2. NSSO అంచనా ప్రకారం 2011-12 ఏడాది నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు ఎంత?
A) 5.5 శాతం B) 5.6 శాతం
C) 5.7 శాతం D) 5.8 శాతం
3. 2011-12 ఏడాది నాటికి అధిక నిరుద్యోగిత గల రాష్ట్రం ఏది?
A) నాగాలాండ్ B) త్రిపుర
C) కేరళ D) మహారాష్ట్ర
4. NSSO అంచనా ప్రకారం (2011-12) దేశంలో నిరుద్యోగుల సంఖ్య ఎంత?
A) 44.04 కోట్లు B) 41.57 కోట్లు
C) 2.47 కోట్లు D) 3.45 కోట్లు
5. NSSO తన 68వ రౌండ్ సర్వేను ఏ సంవత్సరంలో నిర్వహించింది?
A) 2010-11 B) 2011-12
C) 2012-13 D) 2014-15
6. 2011-12 ఏడాది నాటికి NSSO ప్రకారం గ్రామీణ నిరుద్యోగ రేటు ఎంత?
A) 5.7 శాతం B) 5.6 శాతం
C) 5.5 శాతం D) 5.4 శాతం
7. 2011-12 ఏడాది నాటికి వ్యవసాయ రంగంలో ఉపాధి పొందే వారి శాతం ఎంత?
A) 24.9 శాతం B) 24.3 శాతం
C) 48.9 శాతం D) 49.8 శాతం
8. NSSO చిట్టచివరి సర్వే ఏ సంవత్సరంలో నిర్వహించింది?
A) 2011-12 B) 2012-13
C) 2013-14 D) 2010-11
9. PLFS అంటే..
A) Periodic Labour Force Survey
B) Participation Labour Force Survey
C) Primary Labour Force Survey
D) Papulation Labour Force Survey
10. NSSO అంటే..
A) Net Sample Survey Organ ization
B) National Sample Survey Orga nization
C) National Survey Sample Office
D) National Survey Sample Organization
11. ఏ సంవత్సరం నుంచి PLFS నిరుద్యోగ అంచనాలను నిర్వహించి ప్రకటిస్తున్నది?
A) 2017-18 B) 2018-19
C) 2019-20 D) 2016-17
12. PLFS (2019-20) అంచనాల ప్రకారం దేశంలో నిరుద్యోగుల సంఖ్య ఎంత?
A) 1.5 కోట్లు B) 1.3 కోట్లు
C) 2.5 కోట్లు D) 2.8 కోట్లు
13. 2019-20 ఏడాది PLFS ప్రకారం వ్యవసాయ రంగంలో ఉపాధి పొందేవారు ఎంత మంది?
A) 14.77 కోట్లు B) 23.27 కోట్లు
C) 8.51 కోట్లు D) 25.25 కోట్లు
14. 2019-20 ఏడాది నాటికి దేశంలో నియతరంగంలో పనిచేసేవారు?
A) 5.89 కోట్లు B) 5.09 కోట్లు
C) 5.5 కోట్లు D) 4.4 కోట్లు
15. 2019-20 ఏడాదికి PLFS అంచనా ప్రకారం అనియత రంగంలో పనిచేసేవారు?
A) 47.64 కోట్లు B) 45.64 కోట్లు
C) 43.19 కోట్లు D) 40.50 కోట్లు
16. NSSO 68వ రౌండ్ అంచనా ప్రకారం తక్కువ నిరుద్యోగితగల రాష్ట్రం ఏది?
A) త్రిపుర B) మేఘాలయ
C) నాగాలాండ్ D) కేరళ
సమాధానాలు
1-C, 2-B, 3-A, 4-C, 5-B, 6-A, 7-C, 8-A, 9-A, 10-B, 11-A, 12-D, 13-B, 14-A, 15-A, 16-B.
పానుగంటి కేశవరెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
పెద్దపల్లి జిల్లా
9949562008
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు