కార్మికుల స్వేదం – ప్రగతికి ఇంధనం
అర్థశాస్త్రం
కార్మికులు – సమస్యలు, హక్కులు, చట్టాలు
– అర్థశాస్త్రంలో లేదా ఆర్థికవ్యవస్థలో శ్రమ అనేది ఒక ఉత్పత్తి కారకం. శ్రమను అందించేవారు శ్రామికులు. ఆదాయాన్ని సముపార్జించడానికి ఉత్పత్తి ప్రక్రియలో (ప్రతిఫలాన్ని ఆశించి) శారీరకంగా, మానసికంగా చేసే పనిని శ్రమ అంటారు.
– శ్రామికులు అనే పదానికి కార్మికులు అనే పదాన్ని పర్యాయ పదంగా వాడుతుంటారు. కార్మికులను పనివారు అని కూడా అంటారు.
కార్మికులు – రకాలు (Types of workers)
– కార్మికులు ఆర్థికవ్యవస్థలో వివిధ రంగాల్లో పనిచేస్తుంటారు. పనిచేసే రంగాన్ని బట్టి కార్మికులను వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, రవాణా కార్మికులు, నిర్మాణ కార్మికులు, తయారీ కార్మికులు అని వివిధ రకాలుగా వర్గీకరిస్తాం.
– లింగ భేదాన్ని బట్టి పురుష కార్మికులు, స్త్రీ కార్మికులు అని వర్గీకరిస్తాం.
– వయస్సును బట్టి బాల కార్మికులు, వృద్ధ కార్మికులు అని వర్గీకరిస్తాం.
– కార్మికులను వారు చేసే పనిని బట్టి, వారు ధరించే ఏకరూప దుస్తులను బట్టి స్థూలంగా మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అవి..
1. బ్లూకాలర్ కార్మికులు
2. వైట్ కాలర్ కార్మికులు
3. ప్రత్యేకతల ఆధారిత కార్మికులు
– వీటిలోని ప్రతి వర్గాన్ని మళ్లీ కొన్ని ఉప వర్గాలుగా వర్గీకరిస్తారు.
1. బ్లూ కాలర్ కార్మికులు (Blue Collar workers)
– వీరు శారీరక శ్రమ చేస్తారు. గంటల ప్రాతిపదికన వేతనం పొందుతారు. తాము చేసే పనివల్ల తమ దుస్తులకు అంటుకునే మురికిని సులభంగా కనబర్చని దుస్తులను వీరు ధరిస్తారు. రంగు ఏదైనా ముతకగా, దలసరిగా ఉండి కగా లభించే దుస్తులు ధరిస్తారు. బ్లూకాలర్ కార్మికులను తిరిగి రెండు రకాలుగా వర్గీకరిస్తారు.
స్కార్లెట్ కాలర్ కార్మికులు (Scarlet Collar workers): ఈ వర్గీకరణ 2000 సంవత్సరం నుంచి వాడుకలోకి వచ్చింది. దుకాణాల్లో పనిచేసే మహిళలు ఈ కోవకు చెందుతారు.
బ్లాక్ కాలర్ కార్మికులు (Black Collar workers): ఈ వర్గీకరణ 1998 సంవత్సరం నుంచి వాడుకలోకి వచ్చింది. బొగ్గు గనుల్లో, చమురు పరిశ్రమల్లో పని చేసేవారు ఈ కోవకు చెందుతారు.
2. వైట్ కాలర్ కార్మికులు (White Collar workers)
– ఈ వర్గీకరణ 1930 నుంచి వాడుకలోకి వచ్చింది. ఈ భావనను మొదట అప్టాన్ సింక్లెయర్ ఉపయోగించారు. వీరు సాధారణంగా కార్యాలయాల్లో యాజమాన్య సంస్థల్లో పని చేస్తారు. వీరిని జీతం తీసుకునే పనివారు అని కూడా అంటారు. వైట్ కాలర్ కార్మికులను తిరిగి నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు.
పింక్ కాలర్ కార్మికులు (Pink Collar workers): ఈ వర్గీకరణ 1975 నుంచి వాడుకలోకి వచ్చింది. కార్యాలయాల్లో పనిచేసే గుమస్తాలు, వివిధ శ్రేణుల్లోని ఉద్యోగులు, పాలనాసంబంధ బాధ్యతలు నిర్వహించే ఉద్యోగులు ఈ కోవకు చెందుతారు.
గ్రే కాలర్ కార్మికులు (Grey Collar workers): ఈ వర్గీకరణ 1981 నుంచి వాడుకలో ఉంది. నైపుణ్యాలు కలిగి సాంకేతిక విభాగాల్లో పని చేసేవారు ఈ వర్గానికి చెందుతారు. వీరు వైట్ కాలర్ వర్గానికి చెందిన వారైనప్పటికీ బ్లూ కాలర్ కార్మికులు నిర్వర్తించే విధులు కూడా నిర్వర్తిస్తారు.
ఉదా: IT రంగం వారు
గోల్డ్ కాలర్ కార్మికులు (Gold Collar workers): ఇది 1985 నుంచి ప్రచారంలో ఉంది. అధిక నైపుణ్యం కలిగి వృత్తిరీత్యా ఉన్నతస్థాయి కలిగిన శ్రామికులను గోల్డ్ కాలర్ కార్మికులుగా పిలుస్తారు.
ఉదా: డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు
రెడ్ కాలర్ కార్మికులు (Red Collar wor kers): ఎండలో పనిచేసే వ్యవసాయదారులు, కొన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు ఈ కోవకు చెందుతారు.
3. ప్రత్యేకతల ఆధారిత కార్మికులు
– కార్మికులను ప్రత్యేకతల ఆధారంగా ఐదు రకాలుగా వర్గీకరిస్తారు.
గ్రీన్ కాలర్ పనివారు(Green Collar workers): ఇది 1984 సంవత్సరం నుంచి ప్రాచుర్యంలో ఉంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన విధులు నిర్వర్తించే శ్రామికులు ఈ కోవకు చెందుతారు.
ఎల్లో కాలర్ పనివారు (Yellow Collar workers): ఫొటోగ్రాఫర్లు, ఫిల్మ్ డెవలపర్లు, తమ కుల వృత్తిలో కాకుండా ఇతర వృత్తుల్లో కూడా పని చేస్తున్నవారు ఈ కోవకు చెందుతారు.
లైట్ బ్లూ కాలర్ పనివారు (Light blue collar workers): వైట్ కాలర్ వృత్తుల్లో, బ్లూ కాలర్ వృత్తుల్లో తాత్కాలిక ప్రాతిపదికన పని చేసేవారు ఈ కోవకు చెందుతారు.
ఆరెంజ్ కాలర్ పనివారు (Orange collar workers): రహదారి, భవన నిర్మాణ పనుల్లో, పారిశుద్ధ్య కార్యకలాపాల్లో పనిచేసే శ్రామికులు ఈ కోవకు చెందుతారు. వీరు విధి నిర్వహణలో ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తారు.
ఓపెన్ కార్మికులు (Open labours): తమ ఇండ్ల వద్దనే ఉంటూ విధి నిర్వహణ చేసే వారిని ఓపెన్ కార్మికులు అంటారు.
బాల కార్మికులు (Child labours): 14 ఏండ్ల లోపు వయస్సుగల పనివారిని బాల కార్మికులు అంటారు.
వృద్ధ కార్మికులు (Oldage labours): 60 ఏండ్లకు పైబడిన వయస్సుగల వారిని వృద్ధ కార్మికులు అంటారు.
– కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అసంఘటిత కార్మిక శక్తిని నాలుగు గ్రూపులుగా వర్గీకరించింది.
వృత్తుల వర్గం: చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు, వాటాదారులు, మత్స్యకారులు, పశుపోషణ, బీడీ కార్మికులు, పాల వ్యాపారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఈ వర్గంలోకి వస్తారు.
ఉపాధి స్వభావ వర్గం: అనుబంధ వ్యవసాయ రంగం కార్మికులు, వలస కార్మికులు, బాండెడ్ కార్మికులు, కాంట్రాక్ట్, క్యాజువల్ కార్మికులు ఈ కోవలోకి వస్తారు.
సేవా వర్గం: గృహ కార్మికులు, బార్బర్, కూరగాయలు, పండ్లు అమ్ముకునేవారు, వార్తా పత్రికలు అమ్మేవారు ఈ వర్గంలోకి వస్తారు.
ప్రత్యేక, నిరాదరణకు గురైన వర్గం: గీత కార్మికులు, స్కావెంజర్లు, హెడ్లోడ్ క్వారి యర్లు, డ్రైవర్లు, లోడర్లు, అన్ లోడర్లు ఈ కోవకు చెందుతారు.
కార్మిక/శ్రామిక సమస్యలు (Problems of labours)
–శ్రామికులు లేదా కార్మికులు ఏ రంగంలో పని చేస్తున్నప్పటికీ వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యమైనవి..
ఎ. అల్ప వేతనాలు
బి. స్త్రీలు, పురుషులు, బాలల మధ్య వేతన వ్యత్యాసాలు
సి. బోనస్ చెల్లించక పోవడం
డి. అధిక పని గంటలు
ఇ. విరామం కాలువ తక్కువ లేదా లేకపోవడం
ఎఫ్. ఉద్యోగ భద్రత లేకపోవడం
జి. ఆరోగ్య భద్రత లేకపోవడం
హెచ్. సాంఘిక భద్రత లేకపోవడం
ఐ. ప్రమాదకర వాతావరణంలో పని
జె. అనారోగ్యకర వాతావరణంలో పని
కె. వేధింపులు, అక్రమ చర్యలకు గురికావడం
ఎల్. సరైన హక్కులు లేకపోవడం
– పై సమస్యల వల్ల యాజమాన్యాలకు, శ్రామికులకు మధ్య విభిన్నమైన వివాదాలు ఉత్పన్నం అవుతున్నాయి.
– ఈ సమస్యల పరిష్కారంలో సరైన విధి విధానాలు లేక కార్మికులు, యాజమాన్యం మధ్య సమన్వయం లోపించి సమ్మెలు, ధర్నాలు, లాకౌట్లు జరుగుతున్నాయి. కొన్ని సమస్యల పరిష్కారం కోసం శ్రామికులు, యాజమాన్యం కూడా న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటారు.
కార్మిక సంస్కరణలు
– 1991 నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత కార్మిక సంస్కరణల కోసం వివిధ కమిటీలు ఏర్పడ్డాయి.
– జాతీయ గ్రామీణ శ్రామికుల కమిషన్ను 1991లో సీహెచ్ హనుమంతరావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు.
– మిత్ర కమిటీ-1997.
-రెండో జాతీయ లేబర్ కమిషన్ – 2002. రవీంద్రవర్మ అధ్యక్షతన ఏర్పాటు చేశారు.
– పీసీ చతుర్వేది వర్కింగ్ గ్రూప్ 2007-2012.
కార్మికుల హక్కులు – భారత రాజ్యాంగం
– భారత రాజ్యాంగంలోని కొన్ని అధికరణలు కార్మికులకు రక్షణ కల్పిస్తున్నాయి. 14వ అధికరణ కార్మికుల సమానత్వాన్ని, 16వ అధికరణ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలను, 19వ అధికరణ భావప్రకటన స్వేచ్ఛను, 23వ అధికరణ వెట్టి చాకిరి నిషేధాన్ని, 39వ అధికరణ స్త్రీ, పురుషుల మధ్య సమాన జీవనోపాధిని, సమాన పనికి సమాన వేతనాన్ని, 43వ అధికరణ గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కృషి చేయాలని సూచిస్తున్నాయి. 43(A) అధికరణ పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని సూచిస్తుంది.
కార్మిక చట్టాలు
– భారత రాజ్యాంగంలో శ్రామికులు/కార్మికులు అనే అంశం ఉమ్మడి జాబితాలో ఉంది.
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలు చేసే అధికారం కలిగి ఉండి కొన్ని కార్మిక చట్టాలు చేశాయి. వాటిలో ముఖ్యమైనవి..
– కార్మికుల నష్టపరిహార చట్టం-1923. దీన్ని ఉద్యోగుల నష్టపరిహార చట్టంగా 2013లో మార్చారు.=
– ట్రేడ్ యూనియన్ చట్టం 1926
– వేతన చెల్లింపుల చట్టం 1936
– పారిశ్రామిక వివాదాల చట్టం 1947
– కనీస వేతన చట్టం 1948
– ఉద్యోగుల ప్రభుత్వ బీమా చట్టం 1948
– కర్మాగారాల చట్టం 1948
– ఉద్యోగుల భవిష్య నిధి, మిస్లేనియస్ ప్రొవిజన్స్ చట్టం 1952
– గనుల చట్టం 1952
– కంపెనీ చట్టం 1956, 2013
– ప్రసూతి ప్రయోజనాల చట్టం 1961
– బోనస్ చెల్లింపుల చట్టం 1965
– కాంట్రాక్ట్ కార్మికుల చట్టం 1970
– గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972
– సమాన వేతన చట్టం 1976
– బాల కార్మికుల (నిషేధం, క్రమబద్ధీకరణ) చట్టం 1986
– భవనం, ఇతర నిర్మాణరంగ
-కార్మికుల చట్టం 1996
– అనియత రంగ కార్మికుల
సామాజిక భద్రత చట్టం 2008
ప్రాక్టీస్ బిట్స్
1. శ్రామికులు అనే పదానికి పర్యాయ పదం ఏది? (4)
1) కార్మికులు 2) పనివారు
3) శారీరక, మానసిక శ్రమ అందించే వారు
4) పైవన్నీ
2. స్కార్లెట్ కాలర్ కార్మికుల వర్గం ఏ సంవత్సరం నుంచి వాడుకలోకి వచ్చింది? (2)
1) 1999 2) 2000
3) 2001 4) 2002
3. చమురు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు
ఏ కోవకు చెందుతారు? (3)
1) వైట్ కాలర్ కార్మికులు
2) పింక్ కాలర్ కార్మికులు
3) బ్లాక్ కాలర్ కార్మికులు
4) గ్రే కాలర్ వర్కర్స్ 4. జీతం తీసుకునే పనివారు అని ఏ కార్మికులను పేర్కొంటారు? (2)
1) బ్లాక్ కాలర్ కార్మికులు
2) వైట్ కాలర్ కార్మికులు
3) పింక్ కాలర్ కార్మికులు
4) గోల్డ్ కాలర్ కార్మికులు
5. వివిధ శ్రేణుల్లో పనిచేసే గుమస్తాలు, ఉద్యోగులు, పాలనాసంబంధ బాధ్యతలు నిర్వహించే ఉద్యోగులు ఏ కోవకు చెందుతారు? (3)
1) బ్లూ కాలర్ కార్మికులు
2) బ్లాక్ కాలర్ కార్మికులు
3) పింక్ కాలర్ కార్మికులు
4) రెడ్ కాలర్ కార్మికులు
6. పింక్ కాలర్ పనివారు అనే వర్గం ఏ సంవత్సరం నుంచి వాడుకలోకి వచ్చింది? (2)
1) 1970 2)1975
3) 1980 4) 1985
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు