ఆర్థికం, అభివృద్ధి మిశ్రమమే
సుదీర్ఘకాలం బ్రిటిష్ దోపిడీ పాలన కింద నలిగిపోయి అసాధారణమైన శాంతియుత పోరాటంతో స్వాతంత్య్రం సంపాదించిన భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్న ఆలోచనతో మన పాలకు ప్రైవేటే, ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడిన మిశ్రమ ఆర్ధిక వ్యవస్థను స్వీకరించారు. ఈ విధానంతో ప్రజల జీవితాలు మెరుగుపడినప్పటికీ వేగవంతమైన అభివృద్ధి సాధ్యం కాకపోవటంతో 1990వ దశకం తర్వాత సరళీకరణ వైపు మొగ్గుచూపాల్సి వచ్చింది. దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, దాని ఫలితాలపై నిపుణ పాఠకులకు ప్రత్యేకం..
మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
-భాతరదేశం స్వాతంత్య్రానంతరం ఒక మంచి ఆర్థిక విధానాన్ని అంటే పెట్టుబడి వ్యవస్థ, సామ్యవాద వ్యవస్థ కాకుండా మధ్యేమార్గంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది.
-ఎందుకంటే పెట్టుబడి ఆర్థిక విధానంలో లాభాలే ప్రధానంగా ఉండి కొన్నివర్గాలే లబ్ధి పొంది, సాంఘిక సంక్షేమం కరువు అవుతుంది. అదేవిధంగా సామ్యవాదంలో సాంఘిక భద్రత ఉంటుంది. కానీ వ్యక్తికి స్వేచ్ఛ ఉండదు.
-అందువల్ల జేఎం కీన్స్ పేర్కొన్న మిశ్రమ ఆర్థిక వ్యవస్థను భారతదేశం ఏర్పాటు చేసుకుంది.
-1947-91 మధ్యలో సామ్యవాద ధోరణి కలిగి ఉండి ఉత్పత్తిలో ప్రైవేటు వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ప్రభుత్వం వింతగా ప్రవర్తించడం వల్ల సప్లయ్ తగ్గి డిమాండ్ పెరిగి రెండంకెల ద్రవ్యోల్బణానికి దారితీసింది.
-అదేవిధంగా 1991 నుంచి ఫ్రాన్స్ నుంచి పొందిన సూచనాత్మక ప్రణాళిక అంటే ప్రైవేట్, గవర్నమెంట్ విధానం ద్వారా ఉత్పత్తి పెరిగి, దాంతో ధరలు కూడా పెరిగే పరిస్థితి ఆర్థిక వ్యవస్థలో చూస్తున్నాం.
-అంటే ఇప్పటి వరకు (70 ఏండ్లు) మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కబ్జాకు గురైంది.
-దీనివల్ల సమాజంలో అసహనం పెరిగిపోయింది.
భూ సంస్కరణలు
-1950 దశాబ్దంలో వచ్చిన భూ సంస్కరణలు గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలో మార్పులను తీసుకొచ్చింది.
-ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ అభివృద్ధికి భూ సంస్కరణలు, నక్సలిజంలను ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు.
-దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో దున్నేవారికి భూమి లభించడం, పట్టణాల్లో పారిశ్రామీకరణకు దారితీశాయి.
-అంటే భూ సంస్కరణలు కొంతవరకు ఆధునికతకు దారితీసిందని భావించాలి.
-పేదరిక నిర్మూలనలో భూ పంపిణీ ప్రధాన అంశంగా పేర్కొనాలి.
-గ్రామీణులు కొంతవరకు భూస్వాముల నుంచి, వడ్డీ వ్యా పారుల నుంచి బయటపడి ఉత్పాదక సాంఘిక మార్పును పొందగలిగారు.
సంస్థాగత రుణాలు
-ఆర్బీఐ గణాంకాల ప్రకారం 1969లో 91 శాతం రుణా లు సంస్థేతర రుణాలు ఉండి అధిక వడ్డీ ఉండి, గ్రామీణ భారతం పూర్తిగా వడ్డీ వ్యాపారులపై భూస్వాములపై ఆధారపడింది.
-అయితే ప్రైవేటు బ్యాంకుల జాతీయీకరణ ద్వారా ప్రభుత్వ బ్యాంకులు పెరిగిపోయి వ్యవసాయంలో ముఖ్యంగా ప్రాధాన్యత రంగ రుణాన్ని పాటిస్తున్నారు.
-దీని వల్ల వ్యవసాయ పరపతి పెరిగింది.
-కానీ ఈ పరపతిని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత వర్గాలే అనుభవిచంటంతో రైతుల మధ్య అంతరం పెరిగిపోయింది.
-హరిత విప్లవం సంస్థాగత పరపతి గ్రామీణ భారతంలో సామాజిక విభజనకు దారితీసింది.
లైట్ ఇండస్ట్రీ
-భారత ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా పారిశ్రామిక రంగం 4, 5 ప్రణాళిక శ్వేత వస్తువులకు ప్రాధాన్యత ఇచ్చింది.
-అంటే కోర్ ఇండస్ట్రీని వదిలి లైట్ ఇండస్ట్రీ వైపు అంటే టీవీ, రిఫ్రిజిరేటర్, గ్రైండర్ మొదలైనవాటి ప్రాధాన్యత పెరగటంతో పొదుపులు తగ్గిపోయాయి.
-ఒక ఆర్థిక వ్యవస్థ చివరి దశలో హై మాస్ కన్జంప్షన్ కలిగి ఉంటుంది. కానీ దేశంలో ఇలాంటి అపరిపక్వ మార్పువల్ల కొంతవరకు దేశంలో ఆర్థిక సమస్య, వినియోగ వస్తువుల దిగుమతికి గురైంది.
-ఈ విధంగా దిగుమతులు ఎగుమతులను మించటంతో చెల్లింపుల సమస్య, మూల్యహీనీకరణకు దారితీసింది.
-అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేయకుండా సేవ రంగాన్ని అభివృద్ధి చేయటం కూడా కొంత అపరిపక్వ అభివృద్ధికి దారితీసి రుణాత్మక సామాజిక పరివర్తనకు గురైంది.
కులం
-రాజ్యాంగంలో లౌకికత్వానికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ రాజకీయాల్లో కులాన్ని పరోక్షంగా అమలు చేయటంతో కుల రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి.
-వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం రిజర్వేషన్ కల్పించింది. కానీ ఒక కులం వారు ఆర్థిక ఫలాలు అనుభవించాలని పేర్కొనలేదు.
-క్యాస్ట్ డిజేబిలిటీ అనేది ప్రతికూల సామాజిక మార్పును తెలుపుతుంది.
-కొన్ని రాష్ర్టాల్లో కొన్ని కులాలే ముఖ్యమంత్రి పదవులు కలిగి ఉండటం, దీనితో ఆర్థిక ఫలాలను కూడా కొన్ని కులాలే అనుభవించటం సాంఘిక అపరివర్తనకు దారితీస్తుంది.
-వ్యక్తుల పేర్లలో కుల చిహ్నం వాడి సమాజ ఛిద్రానికి దారితీస్తున్నారు.
-దేశంలో కొన్ని కులాలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని రాష్ర్టాలు దేశ జీడీపీని అనుభవిస్తున్నారు.
-దీన్నే పరిమిత ప్రజాస్వామ్యం అని నిపుణులు పేర్కొంటారు.
ఆర్థిక సంస్కరణలు – జాతీయాదాయం
-జాతీయాదాయ గణనలో కారకాల ఖరీదు దృష్ట్యా ఫ్యాక్టర్ కాస్ట్ బదులు 2014-15 నుంచి స్థిర ధరల్లో మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తిని పరిగణనలోకి తీసుకుంటున్నారు.
-అదే విధంగా 2014-15 నుంచి పరోక్ష పన్నులను కలుపుతున్నారు. ఎందుకంటే పరోక్ష పన్నులు జాతీయాదాయంలో భాగం కాబట్టి.
-అదే విధంగా సబ్సిడీలను 2014-15 నుంచి మినహాయించారు. ఎందుకంటే సబ్సిడీలను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. కాబట్టి 2014-15 నుంచి నికర ఆదాయానికి బదులు స్థూల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు.
-అంటే స్థిర మూలధన వినియోగం కలుపుకొని లెక్కిస్తారు.
ద్రవ్యోల్బణ ధరలు
-ద్రవ్యోల్బణ గణనలో టోకు ధరల సూచీకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇందులో ఉత్పాదక వస్తువులకే అధిక ప్రాధాన్యత ఉండి వినియోగ వస్తువులకు తక్కువ ప్రాధాన్యత ఉండేది. దీంతో వినియోగ వస్తువుల ధరలు పెరిగినా ఫలితం ఉండేది కాదు.
-అదే సమయంలో ఉత్పాదక వస్తువుల ధరలు తగ్గితే WPI తగ్గేది.
బీమా
-దేశంలో 1956లో ఎల్ఐసీని, 1973లో జీఐసీని జాతీయం చేశారు.
-దీని వల్ల బీమా ప్రజలకు దూరం అయ్యింది.
-ఎందుకంటే వస్తుసేవల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగం రెండు ఉన్నప్పుడు అందరికీ సేవలు అందుతాయి.
-ఆర్థిక సంస్కరణల్లో భాగంగా 1999లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (IRDA)ని ప్రారంభించి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చింది.
-దీని వల్ల బీమా విస్తరణ పెరుగుతుంది.
– బీమా ఫలాలను పంటకు కూడా విస్తరింపజేస్తారు.
-2016లో రైతులకు భరోసా ఇచ్చేందుకు NAIS, MNAIS స్థానంలో ప్రధాన్‌మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)ను కేంద్రం ప్రకటించి రబీలో ప్రీమియం 1.5 శాతం, ఖరీఫ్‌లో 2 శాతం ప్రీమియం ఉంటుందని మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ర్టాలు సమానంగా భరిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
-ప్రస్తుతం పంట బీమా ఫలాలు 25 శాతం రైతులే పొందుతున్నారు. రాబోయే మూడేండ్లలో 50 శాతానికి చేర్చాలని లక్ష్యంగా కలిగి ఉన్నారు.
-అయితే వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియంగా నిర్ణయించారు.
పెట్రోలియం
-1970లో పెట్రోలియం జాతీయ చేయటంతో పూర్తిగా ప్రైవేటు రంగం పెట్రోల్ ఉత్పత్తికి దూరమై పెట్రోల్ కొరత పెరిగిపోయి 1973 నుంచి ఇప్పటి వరకు దిగుమతుల్లో ప్రథమస్థానం పెట్రోలియం ప్రొడక్ట్స్ కలిగి ఉండటం గమనించాలి.
-దీన్నే అధిగమించేందుకు న్యూ ఎక్స్‌ప్లొరేషన్ లైసెన్సింగ్ పాలసీ (NELP), కోల్ బెడ్ మీథేన్ (CBM), సేల్గ్యాస్, హైడ్రేట్స్ మొదలైన చర్యల వల్ల ఎగుమతుల్లో దాదాపు 20 శాతం పెట్రోలియం ప్రోడక్ట్స్ కలిగి ఉండటం ఒక ఆరోగ్యకరమైన అభివృద్ధి.
డైరెక్టివ్ మార్కెట్
-అంచనా మార్కెట్ రెండు రకాలు 1) షేర్ మార్కెట్ 2) డెరివేటివ్ లేదా వస్తు మార్కెట్. అయితే ఈ మార్కెట్లో కుంభకోణం చోటుచేసుకోవటంతో ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ (FMC)ను సెబీతో 2015లో కలిపివేసింది.
-గోదాముల్లో లేని సరుకును ఉన్నట్లు చూపి జిగ్నేష్ కుంభకోణానికి దారితీసింది.
విద్యుత్ సంస్కరణలు
-1350 నుంచి 2,50,000 మెగావాట్ల ఉత్పత్తి పెంచిన దేశంలో విద్యుత్ డిమాండ్ సప్లయ్ భేదం 10-15 శాతం ఉంది.
-విద్యుత్ నష్టాలు దాదాపు 27 శాతం ఉన్నాయి.
-వీటినే టీ అండ్ డీ లేదా ఏటీసీగా భావిస్తాం.
-వీటిని తగ్గించటానికి 2000లో యాగ్జిలరేటెడ్ పవర్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ ప్రాజెక్టు (APDRP)ను ప్రారంభించారు. దీన్నే R-APDRPగా మార్చారు.
-అదే విధంగా 2020కి 100 GW సోలార్ విద్యుత్ లక్ష్యంగా కలిగి ఉన్నాయి.
-ప్రధాని మోడీ ప్యారిస్‌లో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ (ISA)ను ప్రారంభించటం ఒక ఆరోగ్యకరమైన అభివృద్ధి.
టెలికాం సెక్టార్
-1997 వరకు టెలికాం రంగంలో ప్రభుత్వ రంగం ఏకస్వామ్యాన్ని కలిగి ఉండేది. కానీ 1997లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఏర్పడటంతో ప్రభుత్వ, ప్రైవేట్ రెండు పోటీపడుతూ ప్రజలకు టెలికాం సేవలు అందిస్తున్నారు.
-ప్రతి నెలా దేశంలో 20 లక్షల కొత్త కనెక్షన్లు పెరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
-దేశంలో 1022 మిలియన్ల ఖాతాదారులు ఉన్నారు.
-25 మిలియన్లు ఫిక్స్డ్ లైన్‌గా పేర్కొన్నారు.
-టెలి డెన్సిటీ 80 శాతం, గ్రామ టెలి డెన్సిటీ 48 శాతం ఉన్నాయి.
జనాభా పెరుగుదల
-దేశంలో 1951లో జనాభా 36 కోట్లు ఉంటే, 2011లో 121 కోట్లకు పెరిగింది.
-జనాభా అంటే మార్కెట్లో డిమాండ్ అని గమనించాలి.
-దేశంలో జనాభా పెరుగుతున్న కొద్ది డిమాండ్ మార్కెట్లో పెరిగిపోయి ధరలు పెరగటం, పొదుపులు తగ్గిపోవటం, వినియోగ వస్తువుల దిగుమతులు పెరగటం మాల్థస్ ప్రకారం పుట్టే ప్రతి బిడ్డ నరకం చూడటం జరుగుతుంది.
-ఈ మార్పులు తప్పకుండా సమాజంలో కొన్ని వ్యతిరేక అనారోగ్య మార్పులను కలుగజేస్తాయి.
-జనాభా సమస్య అనారోగ్య సాంఘిక మార్పులకు దారితీస్తుంది.
జనాభావృద్ధి
-దేశంలో 1951-81 మధ్యలో జనాభా అధికవృద్ధిని కలిగి ఉండి 1981లో జనాభా వృద్ధి రేటులో తగ్గుదల కనిపించింది.
-అందువల్ల 1981ని గ్రేట్ ఇయర్‌గా పరిగణిస్తున్నారు.
-దేశంలో 1981 నుంచి సామాజిక మార్పు ఆర్థిక అం శాలపై కేంద్రీకరణ చేస్తుంది.
-జనాభా తగ్గించుకొని ఆర్థిక సంక్షేమం వైపు దేశం ప్రయాణించడంలో భాగంగా సాంఘిక అంశాలపై కొంత శ్రద్ధ తగ్గుతున్నటుల గమనించాలి.
-సాంఘిక అనుత్పాదక అంశాలపై ఖర్చు తగ్గించుకుంటుంది.
-భారత జనాభా పెంచటంలో కేంద్రీకరణ తగ్గించి ఆర్థిక సంక్షేమంపై కేంద్రీకరణ చేస్తున్నట్లు గమనించాలి.
ఏడాది జనాభావృద్ధి
1951 13.31
1961 21.64
1971 24.80
1981 24.66
1991 23.86
2001 21.34
2011 17.5
వివిధ వర్గాల పేదరిక శాతం
-2004-05లోని గణాంకాలను గమనిస్తే వ్యవసాయ రంగంలో స్వయం ఉపాధి పొందేవారిలో పేదరికం 21.96 శాతం ఉంటే వ్యవసాయేతర రంగాల్లో స్వయం ఉపాధి పొందేవారిలో పేదరికం 23.60 శాతంగా ఉంది. అయితే వ్యవసాయ కూలీల్లో పేదరికం 46.67 శాతం గరిష్టంగా ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల కంటే పేదరికం అధికంగా ఉండగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీల్లో పేదరికం అధికంగా ఉంది.
-2006లో ప్రారంభమైన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొంతవరకు పేదరికం తీవ్రతను తగ్గించినా ఇంకా చర్యలు తీసుకోవాలి. సంస్కరణలు బడుగు వర్గాలకు అందాలి.
-గ్రామ పేదరికం 2004-05లో 28.69 శాతం ఉండగా వ్యవసాయం కూలీల్లో 46.67 శాతం నమోదు కావటం విచారకరం.
సామాజిక అభివృద్ధి పథకం
-1952 అక్టోబర్ 2న గ్రామీణ భారతంలో సమగ్ర అభివృద్ధి కోసం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.
-దీని లక్ష్యం ఉత్పత్తిని పెంచటం.
-వ్యవసాయ సేవలను ఉధృతం చేశారు. కానీ ఈ పథకాన్ని కూడా గ్రామాల్లోని ఉన్నత వర్గాల ప్రజలు ఉపయోగించటంతో అంతరం పెరిగింది. కానీ సమ్మిళిత సాధనం కాలేదు.
-ఇది కూడా రుణాత్మక సామాజిక మార్పునే కలిగి ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు