Economy | అందరితో కలిసి.. అందరి అభివృద్ధి
నీతి ఆయోగ్ లక్ష్యాలు -విధులు-సమావేశాలు
- ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో, మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా, నూతన సంస్కృతిని ఆవిష్కరించాలంటే కాలం చెల్లిన ప్రణాళిక సంఘం స్థానంలో నూతన విధానాన్ని, నూతన సంస్థను ఏర్పాటు చేయాలని భావించి ఒక నూతన విధాన సంఘాన్ని/ నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు.
నీతి ఆయోగ్ లక్ష్యాలు (Aims of NITI Aayog)
- రాష్ర్టాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఏర్పడుతుందనే సాధికారతతో వివిధ స్థాయిల్లో ఆర్థిక విధాన రూపకల్పనలో రాష్ర్టాలను భాగస్వామ్యం చేయడం.
- వ్యవసాయ దారులకు ప్రయోజనం చేకూరే విధంగా వ్యవసాయ ఉత్పత్తులను ఆహార భద్రతను సమ్మిళితం చేయడం.
- ఉత్తేజితమైన మధ్యతరగతి ప్రజలను ఉత్పత్తి ప్రక్రియలో భాగస్వాములను చేయడం.
- స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో స్థిరపడిన భారతీయులను (ఎన్ఆర్ఐ) కూడా దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయడం.
- శాస్త్రీయ, మేధోశక్తితో కూడిన మానవ మూలధనాన్ని పెంపొందించడం.
- ఉత్పత్తి ప్రక్రియలో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం.
- ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో భారతదేశాన్ని ప్రధాన సూత్రధారిగా రూపొందించడం
- సమాన అవకాశాల కల్పించడం.
- జాతీయ, అంతర్జాతీయ నిపుణుల మధ్య, వివిధ పరిశోధన సంస్థల మధ్య సమన్వయం కల్పించి నవకల్పనలను సాధించడం.
- ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంకేతికంగా, జనాభాపరంగా ప్రణాళిక సంఘం ద్వారా సాధించిన ప్రగతికి భిన్నంగా అభివృద్ధి సాధించాలనేది నీతి ఆయోగ్ లక్ష్యం.
- అభివృద్ధి ప్రణాళికల రూపలక్పనలో ప్రణాళిక సంఘం అనుసరించిన పై నుంచి కిందికి (Top to bottom) అనుసరించే పద్ధతికి బదులుగా/ భిన్నంగా కింది నుంచి పైకి (Bottom to top) అనే పద్ధతిని
అనుసరించడం. - One way Centre to State flow కు బదులు రాష్ర్టాలకు ప్రాధాన్యం ఇచ్చే సహకార సమాఖ్యను ఏర్పాటు చేయడం.
- అంతిమంగా ప్రజల మనస్సును తెలుసుకొని వారి అవసరాలను తీర్చే విధంగా పని చేయడం.
నీతి ఆయోగ్ విధులు (Functions of NITI Aayog)
- ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా విధి విధానాలను వ్యూహాలను రూపొందించడంలో, నిర్ధారించడంలో రాష్ర్టాలను భాగస్వామ్యం చేయడం.
- బలమైన రాష్ర్టాలతో బలమైన దేశం ఏర్పడుతుంది. కాబట్టి జాతీయాభివృద్ధిని సాధించడంలో అన్ని రాష్ర్టాలకు సమాన భాగస్వామ్యం కల్పించే సహకార ఫెడరల్ వ్యవస్థ (Cooprative and Federal system) ను రూపొందించడం.
- ప్రణాళిక సంఘం అనుసరించిన పై నుంచి కిందికి (Top to bottom) కు భిన్నంగా కింది నుంచి పై స్థాయి వరకు వికేంద్రీకృత ప్రణాళిక నమూనాను ప్రవేశ పెట్టడం.
- సత్వర ఆర్థికాభివృద్ధి కోసం వివిధ రంగాల మధ్య / అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడం.
- కేంద్ర, రాష్ర్టాలకు, వివిధ మంత్రిత్వ శాఖలకు సలహాలు, సూచనలు అందించే మేధోకూటమిగా పని చేయడం.
- ప్రపంచ స్థాయిలో అందుబాటులో ఉన్న వనరులను, నైపుణ్యాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ‘నోడల్ ఏజెన్సీ’గా పనిచేయడం.
- దీర్ఘకాలిక వ్యూహాలను, పథకాలను రూపొందించి వాటి అమలును పర్యవేక్షిస్తూ తగిన మార్పులు చేస్తూ వాటి సామర్థ్యాన్ని పెంచడం.
- వ్యాపార అభివృద్ధిలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులను ప్రోత్సహించి భాగస్వాములను చేయడం.
- అనుభవజ్ఞులు, నిపుణులు, నిష్ణాతుల సహకారంతో దేశంలో వ్యవస్థాపక నైపుణ్యాన్ని, నవకల్పనలను, పరిజ్ఞానాన్ని పెంపొందించడం.
- అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి అంతర్రంగాలు అంతర శాఖల మధ్య సమన్వయంతో అభివృద్ధిని సాధించడం.
- అభివృద్ధి ఫలితాలు, అన్ని వర్గాలకు సమానంగా పంపిణీ జరిగేటట్లు చూడటం.
- సమ్మిళిత వృద్ధి సాధనకు అవసరమైన పద్ధతులను సూచించడానికి స్టేట్ ఆఫ్ ఆర్ట్ రిసోర్స్ సెంటర్‌ను నిర్వహించడం.
నీతి ఆయోగ్ సమావేశాలు
- నీతి ఆయోగ్ పాలక మండలి తొలి సమావేశం 2015 ఫిబ్రవరి 8న టీమ్ ఇండియా పేరుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగింది.
- నీతి ఆయోగ్ మొదటి సమావేశంలోనే ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ (అందరితో కలసి అందరి అభివృద్ధి) అనేది నీతి ఆయోగ్ లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు.
- నీతి ఆయోగ్ పాలక మండలి తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రులతో కూడిన మూడు సబ్ గ్రూపులను ఏర్పాటు చేశారు. అవి.
1) కేంద్ర ప్రాయోజిత పథకాల సబ్ గ్రూప్
2) స్వచ్ఛభారత్ సబ్‌గ్రూప్
3) నైపుణ్యాభివృద్ధి సబ్ గ్రూప్ - వీటితోపాటు రెండు టాస్క్‌ఫోర్స్‌లను కూడా ఏర్పాటు చేశారు. అవి
1) వ్యవసాయాభివృద్ధి టాస్క్‌ఫోర్స్
2) పేదరిక నిర్మూలన టాస్క్‌ఫోర్స్
కేంద్ర ప్రాయోజిత పథకాల సబ్‌గ్రూప్
- ప్రస్తుత కేంద్ర ప్రాయోజిత పథకాల స్థితిని పరిశీలించి తగిన సూచనలను, సిఫారసులను చేయడం కోసం అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కన్వీనర్‌గా ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.
- ఈ గ్రూప్‌లో ఉన్న పథకాలను 28కి కుదించి వాటిని అతి ముఖ్య పథకాలు (6), ముఖ్య పథకాలు (20), ఐచ్ఛిక పథకాలు (2) అని మూడు గ్రూపులుగా విభజించారు.
స్వచ్ఛభారత్ సబ్‌గ్రూప్
- 2014 అక్టోబర్ 2న ప్రారంభించిన స్వచ్ఛభారత్ అభియాన్(ఎస్బీఏ) కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేయడంలో భాగంగా 2019 అక్టోబర్ 2 నాటికి బహిరంగ మల విసర్జన లేని దేశంగా మార్చడం దీని ప్రధాన లక్ష్యం.
- ఈ గ్రూప్ కమిటీకి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు కన్వీనర్‌గా వ్యవహరించారు.
నైపుణ్యాభివృద్ధి సబ్ గ్రూప్
- దేశ, రాష్ట్రస్థాయిలో ప్రజల సామార్థ్యాన్ని నైపుణ్యాన్ని వృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.
- ఈ గ్రూప్ కమిటీకి అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ కన్వీనర్‌గా
వ్యవహరించారు.
వ్యవసాయాభివృద్ధ్ది టాస్క్‌ఫోర్స్
- 2015 నాటి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా దీన్ని ఏర్పాటు చేశారు.
- వ్యవసాయరంగం మరింత ప్రగతి పథంలో పయనించేందుకు తగిన సూచనలు, సిఫారసులను చేశారు.
- వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడమే కాకుండా తగిన మద్దతు ధరలను కూడా ప్రకటించడం.
- భూ సంస్కరణల్లో భాగంగా కౌలు, టైటిళ్ల విషయంలో సంస్కరణలు తీసుకురావడం.
పేదరిక నిర్మూలన టాస్క్‌ఫోర్స్
- వివిధ రకాల విపత్తులు సంభవించినప్పుడు రైతులకు తగిన సహాయం అందించడం.
- తూర్పు రాష్ర్టాల్లో హరిత విప్లవాన్ని విస్తరించడం.
- దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం 2015 నాటి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ దీనికి చైర్మన్‌గా ఉండి ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
- నీతి ఆయోగ్ పాలక మండలి 2వ సమావేశం 2015 జూలై 15
- నీతి ఆయోగ్ పాలక మండలి 3వ సమావేశం 2017 ఏప్రిల్ 23
- నీతి ఆయోగ్ పాలక మండలి 4వ సమావేశం 2018 జూన్ 17
- నీతి ఆయోగ్ పాలక మండలి 5వ సమావేశం 2019 జూన్ 15
- నీతి ఆయోగ్ పాలక మండలి 6వ సమావేశం 2021 ఫిబ్రవరి 20
- నీతి ఆయోగ్ పాలక మండలి 7వ సమావేశం 2022 ఆగస్టు 7
ప్రాక్టీస్ బిట్స్
1. కింది వాటిలో నీతి ఆయోగ్ లక్ష్యం ఏది?
ఎ) ఆర్థిక విధాన రూపకల్పనలో రాష్ర్టాలను భాగాస్వామ్యం చేయడం
బి) వ్యవసాయ ఉత్పత్తులను ఆహార భద్రతను సమ్మిళితం చేయడం
సి) ఉత్పత్తి ప్రక్రియలో మధ్యతరగతి ప్రజలను భాగస్వామ్యం చేయడం
డి) పైవన్నీ
2. కింది వాటిలో నీతి ఆయోగ్ అనుసరించే పద్ధతి ఏది?
ఎ) పై నుంచి కిందికి
బి) కింది నుంచి పైకి
సి) సమాంతరం డి) పైవన్నీ
3. అభివృద్ధి సాధనలో నీతిఆయోగ్ అనుసరించే వ్యవస్థా విధానం ఏది?
ఎ) అధ్యక్షతరహా వ్యవస్థ
బి) నియంతృత్వ వ్యవస్థ
సి) సహకార ఫెడరల్ వ్యవస్థ
డి) ప్రజాస్వామ్య వ్యవస్థ
4. నీతి ఆయోగ్ అనుసరించే నమూనా ఏది?
ఎ) కేంద్రీకృత నమూనా
బి) వికేంద్రీకృత నమూనా
సి) సంకుచిత నమూనా
డి) పైవన్నీ
5. అందుబాటులో ఉన్న వనరులు, నైపుణ్యాలు సమర్థంగా పనిచేయడానికి నీతి ఆయోగ్ ఏ విధంగా పనిచేస్తుంది?
ఎ) మేధోకూటమి బి) ఫెడరల్ వ్యవస్థ
సి) నోడల్ ఏజెన్సీ
డి) ప్రణాళికా నమూనా
6. నీతి ఆయోగ్ పాలక మండలి మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?
ఎ) 2014 ఫిబ్రవరి 8
బి) 2015 ఫిబ్రవరి 8
సి) 2016 మార్చి 5
డి) 2015 జనవరి 5
7. నీతి ఆయోగ్ పాలక మండలి ఎన్ని గ్రూప్ లను ఏర్పాటు చేసింది?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
8. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనేది నీతి ఆయోగ్ లక్ష్యం అని పేర్కొన్నది ఎవరు?
ఎ) నరేంద్ర మోదీ బి) అమిత్ షా
సి) నితిన్ గడ్కరీ
డి) అరవింద్ పనగారియా
9. నీతి ఆయోగ్ పాలక మండలి తొలి సమావేశం ఏ పేరు మీద నిర్వహించారు?
ఎ) ప్లాన్ ఇండియా బి) న్యూ ఇండియా
సి) టీమ్ ఇండియా డి) నీతి ఇండియా
10. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
ఎ) ప్రధానమంత్రి
బి) ముఖ్య కార్యనిర్వహణాధికారి
సి) నీతి ఆయోగ్ వైస్ చైర్మన్
డి) కేంద్ర ఆర్థిక మంత్రి
11. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ తొలి సమావేశం ఎక్కడ జరిగింది.
ఎ) బెంగళూరు బి) కోల్‌కతా
సి) మద్రాస్ డి) న్యూఢిల్లీ
12 కింది వాటిలో నీతి ఆయోగ్ విధులు ఏవి?
ఎ) ఆర్థిక లక్ష్యాల రూపకల్పనలో రాష్ర్టాల భాగస్వామ్యం
బి) రాష్ర్టాల మధ్య సమాన అవకాశాల కల్పన
సి) థింక్ ట్యాంక్‌గా వ్యవహరించడం
డి) పైవన్నీ
13. అందరితో కలిసి అందరి అభివృద్ధి నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏ సమావేశంలో పేర్కొన్నారు?
ఎ) మొదటి బి) రెండవ
సి) ఐదో డి) ఏడవ
14. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2014 ఆగస్టు 15
బి) 2014 అక్టోబర్ 2
సి) 2015 అక్టోబర్ 2
డి) 2019 అక్టోబర్ 2
15. నీతి ఆయోగ్ పాలక మండలి ఎన్ని టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
16. ఇప్పటి వరకు నీతి ఆయోగ్ పాలక మండలి ఎన్ని సమావేశాలను నిర్వహించింది?
ఎ) 4 బి) 5 సి) 6 డి) 7
17. నీతి ఆయోగ్ పాలక మండలి చివరి సమావేశం ఎప్పుడు జరిగింది?
ఎ) 2021 ఫిబ్రవరి 20
బి) 2021 మార్చి 15
సి) 2022 ఆగస్టు 5
డి) 2022 ఆగస్టు 7
18. ‘బలమైన రాష్ర్టాలతో బలమైన దేశం’ అనేది దేని సాధికారత?
ఎ) ప్రణాళికా సంఘం
బి) నీతి ఆయోగ్
సి) ఆర్థిక సంఘం డి) పైవన్నీ
19. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖలకు కావలసిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి నీతి ఆయోగ్ ఏ విధంగా పని చేస్తుంది?
ఎ) నోడల్ ఏజెన్సీ బి) థింక్‌ట్యాంక్
సి) ఫెడరల్ వ్యవస్థ డి) వికేంద్రీకృతం
20. 2015లో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు?
ఎ) నరేంద్ర మోదీ
బి) ఆరవింద పనగారియా
సి) సింధుశ్రీ ఖుల్లర్
డి) రమేష్ చంద్
సమాధానాలు
1-డి 2-బి 3-సి 4-బి
5-సి 6-బి 7-బి 8-ఎ
9-సి 10-ఎ 11-డి 12-డి
13-ఎ 14-బి 15-ఎ 16-డి
17-డి 18-బి 19-బి 20-బి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు