Economy | సర్వాంగీకార వినిమయ మాద్యం… ప్రచ్ఛన్న నిరుద్యోగం
1. మిశ్రమ అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? (బి)
ఎ) ఆడమ్‌స్మిత్ బి) జె.ఎం.కీన్స్
సి) ఆల్ఫ్రెడ్ మార్షల్
డి) దాదాభాయ్ నౌరోజీ
వివరణ:
- అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్‌స్మిత్.
- సంప్రదాయ అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్‌స్మిత్
- ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు జె.ఎం.కీన్స్
- సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు ఆల్ఫ్రెడ్ మార్షల్
- స్థూల అర్థశాస్త్ర పితామహుడు జె.ఎం. కీన్స్
- సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు ఆల్ఫ్రెడ్ మార్షల్
- నూతన సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు పారెటో
- మిశ్రమ అర్థశాస్త్ర పితామహుడు-జె.ఎం.కీన్స్
- భారత ఆర్థిక వ్యవస్థ పితామహుడు -దాదాభాయ్ నౌరోజి
- భారత ప్రణాళికల పితామహుడు – మోక్షగుండం విశ్వేశ్వరయ్య
- భారత హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్
- ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్
- భారత పారిశ్రామిక పితామహుడు జంషెడ్జీ టాటా
- భారత ఆధునిక పారిశ్రామిక పితామహుడు – జేఆర్డీ టాటా
2. కింది వాటిలో బదిలీ చెల్లింపులకు ఉదాహరణ ఏది? (డి)
ఎ) వృద్ధాప్య పెన్షన్లు బి) నిరుద్యోగ భృతి
సి) స్కాలర్షిప్స్ డి) పైవన్నీ
వివరణ: ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తుసేవల ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినప్పటికీ వివిధ మార్గాల ద్వారా లభించే ఆదాయాలను బదిలీ చెల్లింపులు అంటారు.
- బదిలీ చెల్లింపులను చాలక బదిలీ అని, ఏక పక్ష ప్రవాహం అని కూడా అంటారు.
ఉదా: వృద్ధాప్య పెన్షన్లు, నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్స్, ప్రభత్వ రుణమాఫీ, బహుమతులు, కానుకలు, విరాళాలు మొదలైనవి. - బదిలీ చెల్లింపులు ప్రభుత్వ బదిలీ చెల్లింపులు, ప్రైవేట్ బదిలీ చెల్లింపులు, నికర విదేశీ బదిలీ చెల్లింపులు అని మూడు భాగాలుగా ఉన్నాయి.
ప్రభుత్వ బదిలీ చెల్లింపులు : ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి ఉచితంగా అందించే ఆదాయాన్ని ప్రభుత్వ బదిలీ చెల్లింపులు అంటారు.
ఉదా: ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్స్, నిరుద్యోగ భృతి,పింఛన్లు.
ప్రైవేట్ బదిలీ చెల్లింపులు: ప్రైవేట్ రంగంలో ఒకరి నుంచి మరొకరికి ఉచితంగా అందించే ఆదాయాన్ని ప్రైవేట్ బదిలీ చెల్లింపులు అంటారు.
ఉదా: తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీ
నికర విదేశీ బదిలీ చెల్లింపులు: ఒక దేశంలోని ప్రైవేట్ రంగానికి విదేశాల నుంచి వచ్చే గ్రాంటులు, విరాళాలు, ప్రకృతి విపత్తులు సహాయం మొదలగు ఆదాయాల నుంచి ఆదేశం నుంచి విదేశాలకు వెళ్లే గ్రాంటులు, విరాళాలు, ప్రకృతి విపత్తు సహాయాలు మొదలైనవి తీసివేయగా మిగిలిన ఆదాయాన్ని ‘నికర విదేశీ బదిలీ చెల్లింపులు’ అంటారు. బదిలీ చెల్లింపులు జాతీయాదాయంలో భాగం కాదు. కానీ ప్రైవేట్ ఆదాయంలో భాగమై ఉంటాయి.
3. ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత రుణాత్మకం అని పేర్కొన్న ఆర్థిక వేత్త ఎవరు? (బి)
ఎ) రాగ్నర్ నర్క్స్ బి) జోన్ రాబిన్ సన్
సి) మార్క్ సియన్ డి) మార్షల్
వివరణ: - ఏదైన ఉత్పత్తి ప్రక్రియలో వాస్తవంగా కావలసిన శ్రామికుల కంటే ఎక్కువ మంది శ్రామికులు ఉంటే దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. వీరిని ఉత్పత్తి ప్రక్రియ నుంచి తొలగించినా ఉత్పత్తి తగ్గదు. ఉత్పత్తిలో కొనసాగించినా ఉత్పత్తి పెరగదు. వారి ఉపాంత ఉత్పాదకత శూన్యం/ సున్నా అని రాగ్నర్ నర్క్స్ పేర్కొంటే రుణాత్మకం అని జోన్ రాబిన్సన్ పేర్కొన్నాడు.
- ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉంటుంది.
- ప్రచ్ఛన్న నిరుద్యోగితను దాగి ఉన్న నిరుద్యోగిత అని, అంతర్గత నిరుద్యోగిత అని, మరుగున పడిన నిరుద్యోగిత అని, గుప్త నిరుద్యోగిత అని, కనపడని నిరుద్యోగిత అని కూడా అంటారు.
- భారతదేశంలో ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగితను శకుంతల మెహ్రా, అమర్త్యసేన్ అంచనా వేశారు.
- ప్రచ్ఛన్న నిరుద్యోగులు అనే పదాన్ని మొదట ఆర్థర్ లూయిస్ జోన్ రాబిన్ సన్ ఉపయోగించారు.
- ప్రచ్చన్న నిరుద్యోగిత భావనను ప్రచారం చేసింది టి.ఎన్.శ్రీనివాసన్, పి.కె.బర్దన్‌లు.
- జనాభా పెరగడం ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేకపోవడం ఈ రకమైన నిరుద్యోగితకు కారణంగా చెప్పవచ్చు.
4. 2024 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో తీపి విప్లవానికి ప్రధాని మోదీ ఏ సంవత్సరంలో పిలుపునిచ్చారు?
(సి)
ఎ) 2014 బి) 2015
సి) 2016 డి) 2017
వివరణ: భారతదేశం తన ఆహార పరిశ్రమలో శ్వేత, హరిత విప్లవంతోపాటు పసుపు విప్లవాలను కూడా చూసింది. అదే విధంగా తీపి విప్లవం ద్వారా శాస్త్రీయ పద్ధతుల ద్వారా తేనెటీగల పెంపకం, నాణ్యమైన తేనె, ఇతర తేనెటీగ ఉత్పత్తుల ఉత్పత్తిపై దృష్టిపెట్టింది. - తీపి విప్లవం భారతదేశంలోని చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
- 2024 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో తీపి విప్లవానికి ప్రధాని మోదీ 2016లో పిలుపునిచ్చారు.
- 2020లో ప్రభుత్వం తీపి విప్లవాన్ని అందించడానికి జాతీయ తేనెటీగల పెంపకం, తేనె మిషన్‌ను ప్రారంభించింది.
- ఆత్మనిర్భర్ అభియాన్ కింద జాతీయ తేనె టీగల పెంపకం, హనీమిషన్ కోసం ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది.
- తీపి విప్లవాన్ని, మిథి క్రాంతి అని, హనీ మిషన్ అని కూడా పిలుస్తారు.
5. ‘ద్రవ్యం అనేది తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం’ అని ఎవరు నిర్వచించారు?(ఎ)
ఎ) మిల్టన్ ఫ్రీడ్మన్
బి) చికాగో స్కూల్
సి) సెలిగ్మెన్ డి) వాకర్
నిర్వచనాలు: - ‘సర్వాంగీకారం కలిగినదే ద్రవ్యం’ – సెలిగ్మెన్
- ‘ద్రవ్యం ఏ పని చేస్తుందో అదే ద్రవ్యం’ – వాకర్
- ‘వస్తువులను కొన్నప్పుడు చెల్లించడానికి ఇతర రకాల వ్యాపారాలు, బాకీలు తీర్చడానికి అందరూ అంగీకరించేదే ద్రవ్యం’
– రాబర్ట్సన్ - ‘వస్తువులను కొనడానికి ఏ కొనుగోలు శక్తి అవసరమవుతుందో అదే ద్రవ్యం’ – కోల్
- ‘ఖర్చు చేయడానికి ఉపయోగించేది ఏదైనా ద్రవ్యమే’ – రాన్లైట్
- ‘వినిమయ మాద్యంగా, సర్వాంగీకారం పొంది, విలువ కొలమానం, విలువ నిధిగా ఉపయోగపడేదే ద్రవ్యం’ – క్రౌథర్
- ‘రుణాలను ఇచ్చి పుచ్చుకోవడంలో అందరూ అంగీకరించేదే ద్రవ్యం’- ఆర్.ఎస్. షేయర్స్
- ‘కరెన్సీ, డీడీ, టైమ్ డిపాజిట్లు, బ్యాంకు డిపాజిట్లు, నాన్ క్లియరింగ్ కలిగినదే ద్రవ్యం’
– చికాగోస్కూల్ - ‘చట్టం దేన్ని ద్రవ్యం అంటుందో దాన్నే ద్రవ్యం’ అంటారు.
6. క్రిప్టో కరెన్సీకి మరొక పేరు ఏది? (డి)
ఎ) డిజిటల్ కరెన్సీ
బి) వర్చువల్ కరెన్సీ
సి) ప్రత్యామ్నాయ కరెన్సీ
డి) పైవన్నీ
వివరణ: భౌతికంగా కనపడకుండా కేవలం కంప్యూటర్ ఆధారంగా రూపొందించే వెబ్ బేస్డ్ ద్రవ్యాన్ని డిజిటల్ ద్రవ్యం అంటారు. - బ్లాక్‌చైన్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కరెన్సీ చెలామణి చేయడాన్ని క్రిప్టోకరెన్సీ అంటారు.
- క్రిప్టోకరెన్సీని డిజిటల్ కరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీ లేదా ప్రత్యామ్నాయ కరెన్సీ అని కూడా పిలుస్తారు.
- భారతదేశంలో ఆర్బీఐ ఈ రకమైన కరెన్సీని నిషేధించింది.
ఉదా: బిట్ కాయిన్
7. అదృశ్య హస్తం భావనను మొదట ప్రతిపాదించినది ఎవరు? (ఎ)
ఎ) ఆడమ్‌స్మిత్ బి) ఆల్ఫ్రెడ్ మార్షల్
సి) లియోనల్ రాబిన్స్ డి) జె.ఎం.కీన్స్
వివరణ: ఆదృశ్య హస్తం అనే ఆర్థిక భావనను 18వ శతాబ్దపు ఆర్థికవేత్త స్కాటిష్ దేశ ఆర్థిక వేత్త/ ఆర్థశాస్త్ర పితామహుడైన ఆడమ్‌స్మిత్ 1759లో ‘ద థియరీ ఆఫ్ మోరల్ కాంటినెంట్స్’ అనే గ్రంథంలో మొదటిసారిగా పరిచయం చేశాడు. తర్వాత 1776లో ప్రచురించిన An equiry into the Nature and Causes of Wealth of Nations / దేశాల సంపద స్వభావం కారణాల పరిశోధన గ్రంథంలో మళ్లీ ఉపయోగించి, అభివృద్ధి చేశారు. - అదృశ్య హస్తం అనేది స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా మారింది. ఎందుకంటే ప్రతివ్యక్తి తనకు తెలియకుండానే దేశీయ సంపద పెంపునకు కృషి చేస్తూ ప్రజా సంక్షేమాన్ని పెంపొందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తారు. అంటే వ్యక్తులు ప్రజలు తమ స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలను వివరించే ఒక రూపమే ‘అదృశ్య హస్తం’.
- అదృశ్య హస్తం ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుంది అని ఆడమ్‌స్మిత్ పేర్కొన్నాడు.
- అదృశ్య హస్తం అంటే మార్కెట్ శక్తులు. అంటే సప్లయ్, డిమాండ్లు.
- ఆర్థిక వ్యవస్థలో సప్లయ్ డిమాండ్ కంటే తక్కువగా ఉంటే ధరలు పెరిగి, లాభాలు పెరిగి, పెట్టుబడి పెరిగి ఉత్పత్తి సప్లయ్‌లు పెరుగుతాయి. ఒకవేళ సప్లయ్ డిమాండ్ కంటే ఎక్కువగా ఉంటే ధరలు తగ్గి, లాభాలు తగ్గి, పెట్టుబడి తగ్గి సప్లయ్ తగ్గుతుంది. కావున మార్కెట్ శక్తులు ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో అదృశ్య హస్తం ప్రముఖపాత్ర
పోషిస్తుంది.
8. భారత ప్రభుత్వం ఎప్పటివరకు ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ సిద్ధాంతాన్ని అనుసరించింది? (సి)
ఎ) 1951 బి) 1960
సి) 1970 డి) 1975
వివరణ:
- దేశంలో ఆర్థికాభివృద్ధి జరుగుతుంటే ఆ అభివృద్ధి ఫలాలు ఆర్థిక వ్యవస్థలోని అన్ని వర్గాలకు చేరి పేదరికం, నిరుద్యోగం తగ్గుతుందని ప్రభుత్వం/ ప్రభుత్వ విధాన కర్తలు భావించారు. దీన్నే ‘ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ థియరీ” అంటారు.
- భారత ప్రభుత్వం 1970 వరకు ఈ సిద్ధాంతాన్నే అనుసరించింది ప్రదర్మనా ప్రభావం
- ప్రదర్శనా ప్రభావం అనేది ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవితంలోని చాలా అంశాలను ప్రభావితం చేసే సార్వత్రిక దృగ్విషయంగా చెప్పవచ్చు.
- ప్రదర్శనా ప్రభావాన్ని ప్రధానంగా అంతర్జాతీయ ప్రదర్శనా ప్రభావం, అంతర్గత ప్రదర్శనా ప్రభావం అని రెండు భాగాలుగా పేర్కొనవచ్చు.
9. అంతర్జాతీయ ప్రదర్శనా ప్రభావం అనే భావనను అభివృద్ధి చేసినది ఎవరు? (సి)
ఎ) ఆడమ్‌స్మిత్ బి) మార్షల్
సి) రాగ్నర్ నర్క్స్ డి) రాబిన్స్
అంతర్జాతీయ ప్రదర్శనా ప్రభావం: ఈ అంతర్జాతీయ ప్రదర్శనా ప్రభావం అనే భావనను రాగ్నర్ నర్క్స్ అభివృద్ధి చేశారు. - విదేశీ వినియోగపు అలవాట్లను వెనుకబడిన దేశాలు అనుసరించడాన్ని అంతర్జాతీయ ప్రదర్శనా ప్రభావం అంటారు.
- ఒక దేశం ఇతర దేశాల ఆచార వ్యవహారాలను వినియోగపు అలవాట్లను అనుసరించడాన్ని అంతర్జాతీయ ప్రదర్శనా ప్రభావం అంటారు.
10. దేశంలో వివిధ స్థాయిల వారు ఒకరినొకరు అనుసరించే విధానాన్ని ఏమంటారు?
ఎ) ప్రదర్శనా ప్రభావం
బి) అంతర్గత ప్రదర్శనా ప్రభావం
సి) దేశీయ ప్రదర్శనా ప్రభావం
డి) బి, సి
అంతర్గత ప్రదర్శనా ప్రభావం: - అంతర్గత ప్రదర్శనా ప్రభావం అనే భావనను డ్యూసెన్ బెర్రి అభివృద్ధి చేశారు
- పేదవారు మధ్యతరగతి వారి వినియోగపు తీరును మధ్య తరగతి వారు ధనవంతుల వినియోగపు తీరును అనుసరించడాన్ని అంతర్గత ప్రదర్శనా ప్రభావం అంటారు.
- అంతర్గత ప్రదర్శనా ప్రభావాన్ని దేశీయ ప్రదర్శనా ప్రభావం అని కూడా అంటారు.
11. పేదరికాన్ని లెక్కించే పి-ఇండెక్స్‌ను రూపొందించినది ఎవరు? (సి)
ఎ) అభిజిత్ బెనర్జీ బి) మన్మోహన్సింగ్
సి) ఆమర్త్యసేన్ డి) మదర్ థెరిస్సా - ఆమర్త్యసేన్ 1933లో బెంగాల్లో జన్మించారు.
- భారతదేశంలో జన్మించి అమెరికా పౌరసత్వం తీసుకున్న ఆర్థికవేత్త.
- 1998లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు?
- సంక్షేమ అర్థశాస్త్రంలో కృషి చేశారు. ‘Development as freedom’ రచించారు.
- పేదరికాన్ని లెక్కించే పావర్టీ ఇండెక్స్ (పి-ఇండెక్స్)ను రూపొందించారు.
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు