నిజాం రాజ్యంలో ఆర్థిక పాలన ఎలా ఉండేది?
వేల ఎకరాలుగా ఉన్న తెలంగాణ ప్రాంత భూమి రకరకాల మధ్యవర్తుల చేతుల్లో మూలుగుతూ ఉండేది. భూస్వాములే రెవెన్యూ, పోలీసు అధికారాలు చెలాయించడానికి ఈ భూ వ్యవస్థే మరో కారణమైంది. అందువల్లనే ఈ వ్యవస్థను ఎలాగైనా మార్చాలనే సంకల్పంతో సాలార్జంగ్ సంస్కరణలు అవసరమయ్యాయి.
– తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ సంస్థానంలో ఏ రకంగా మిళితమై ఉంది, హైదరాబాద్ రాష్ట్రం ఉనికి, దాని స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి, సాలార్జంగ్ సంస్కరణలకు ముందు భూ రికార్డుల పరిస్థితి మొదలైన అంశాలను చర్చించాం. అదే కోవలో నిజాం ఆధీనంలో ఉన్న వివిధ ఆర్థిక వనరుల వినియోగ పనితీరు, వాటి అధికారిక వివరాలు, హైదరాబాద్ రాజ్యంలో అధికార విభజనను, దాని పరిణామక్రమంలో వచ్చిన మార్పులను కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్ రాజ్య భూ పరిధి వివరాలు, భూ చట్టాలు, వివిధ రకాల దళారీ వ్యవస్థలు, సాలార్జంగ్ సంస్కరణలకు ముందు హైదరాబాద్ రాజ్య పరిస్థితి తెలుసుకుందాం.
సాలార్జంగ్ సంస్కరణలు అంటే..
– సాలార్జంగ్గా పేరుగాంచిన మీర్ తురబ్ అలీఖాన్ 1853లో రెవెన్యూ, భూ సంబంధ, ఆర్థిక, పాలనా రంగం లో ప్రవేశపెట్టిన నూతన ఒరవడులనే సాలార్జంగ్ సంస్కరణలు అని అంటారు.
సాలార్జంగ్ సంస్కరణలకు ముందు హైదరాబాద్ పరిస్థితి
– హైదరాబాద్ రాష్ట్ర పరిపాలనాక్రమంలో ఉండే అధికార పరిధులు, అధికారాలను సంస్కరించడం ద్వారా రాజ్యాన్ని గాడిలో పెట్టాలని సాలార్జంగ్ నిర్ణయించారు. అందులో భాగంగానే రెసిడెంట్ల స్థానంలో అమీన్ల నియామకం, ప్రభుత్వ ఖజానాను పరిశీలించడానికి, ప్రభుత్వ పాలనను చక్కదిద్దడానికి రకరకాల అధికారులను నియమించడం వెరసి హైదరాబాద్ రాజ్య పాలనా, ఆర్థిక, సాంఘిక రూపు రేఖల్ని మార్చివేశారు.
రవాణా సౌకర్యాలు
– హైదరాబాద్ రాజ్యంలో ముఖ్యంగా రైల్వే, రోడ్డు, విమానయాన సర్వీసులు ఉండేవి. మొత్తం భూమితోనే పరిధిని విస్తరించుకుంది. కాబట్టి నీటి సంబంధ రవాణా సదుపాయాలు ఉండేవి కావు.
రైల్వే ట్రాన్స్పోర్ట్
– 1874 నుంచి 1930 వరకు ప్రైవేటు కంపెనీలతో నిర్వహించిన రైల్వే వ్యవస్థ 1930 నుంచి నిజాం స్టేట్ రైల్వేస్ పరిధిలోకి వచ్చి (ఏడో నిజాం కాలంలో) 1948 వరకు వైభవంగా కొనసాగింది.
– ఇంకా 1953-54 నాటికి హైదరాబాద్ రాజ్యంలో నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే ఆధ్వర్యంలో 858 మైళ్ల రైల్వేలైన్లు ప్రయాణికుల అవసరాలు తీర్చేవి. సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట ప్రముఖ రైల్వే కేంద్రాలు.
– వాడి నుంచి సికింద్రాబాద్ వరకు 110 మైళ్ల దూరంతో మొదటి రైల్వే లైనును నిర్మించారు. ఆ తర్వాత 1888లో 16 మైళ్ల రైల్వేలైనును డోర్నకల్ నుంచి సింగరేణికి వేశారు. ఇంకా 1889లో సికింద్రాబాద్ నుంచి విజయవాడకు 215 మైళ్ల పొడవుతో మరో రైల్వేలైనును ఏర్పాటుచేశారు.
రవాణా వ్యవస్థ
– 1867 వరకు బ్రిటిష్ ఆధీనంలో ఉన్న రోడ్డు వ్యవస్థ 1867 తర్వాత నిజాం రాజ్య పరిధిలోకి వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల హెడ్క్వార్టర్లను కలిపేటట్టు, బ్రిటిష్ ఇండియాలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ రోడ్డు వ్యవస్థను ఏర్పాటు చేశారు.
విమానయాన వ్యవస్థ
– అప్పటికే దేశంలోని అన్ని రాచరిక వ్యవస్థల్లో ఒక రాజ్యం సొంతంగా ఏవియేషన్ కలిగి ఉన్నది కేవలం హైదరాబాద్ మాత్రమే.
– 1938లో జారీ అయిన నిజాం ఫర్మానా ప్రకారం దక్కన్ ఏవియేషన్ సొసైటీ పేరుతో ఈ వ్యవస్థ నిర్మితమైంది.
– నిజాం హయాంలో ఏర్పాటుచేసిన బేగంపేట విమానాశ్రయాన్ని, మిలిటరీ ప్రభుత్వ హయాంలో రూ.2.36 కోట్లతో విస్తరించారు.
సమాచార వ్యవస్థ
– అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి చేసిన వ్యవస్థల్లో సమాచార వ్యవస్థ ముఖ్యమైంది. 1882లో తపాలా కార్యాలయాలు ప్రజలకు నిరంతరం సేవ చేస్తుండేవి. ఇంకా హైదరాబాద్, ఔరంగాబాద్ రేడియో స్టేషన్లు వివిధ భాషల్లో ప్రసారాలు చేస్తుండేవి.
– 1885లో మొదటసారి స్థాపించిన టెలిఫోన్ వ్యవస్థ నిరంతరాయంగా సేవలందిస్తూ వస్తుంది. 1922 నుంచి 1965 వరకు దాదాపు 10 టెలిఫోన్ ఎక్సేంజీలు, 2004 టెలిఫోన్ కనెక్షన్లు ఉండేవి.
భూ వర్గీకరణ
– హైదరాబాద్ రాజ్యంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమై అంశం భూ వివరాలు, వాటి వర్గీకరణ, వాటిపై ఎవరెవరకి హక్కులు ఉన్నాయి వంటి వివరాలు ముఖ్యమైనవి.
– భూస్వామ్య వివరాలు, భూస్వామ్య వ్యవస్థ, రాచరిక వ్యవస్థ కలయికతో భూ సంబంధ వివరాలు ఉండేవి. 1724-1948 మధ్య ఉన్న అసఫ్జాహీ పెరియాద్లో ఎన్నో రకాల భూ వర్గీకరణలు, చట్టాలు ఉండేవి.
– 82,698 చ.మైళ్ల భూభాగంలో 9.9 శాతం నిజాం ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. మిగతా భూమి అంతా వివిధ రకాల వ్యక్తుల చేతుల్లో ఉండేది.
– నిజాం కాలంలో 5.35 కోట్ల ఎకరాల భూమి నీటి పారుదల వ్యవస్థలో ఉండేది. మొత్తం భూమి దివానీ (ఖల్సా), గైర్ ఇ ఖల్సా, సర్ఫేఖాస్ మొదలైన వాటి రూపంగా ఉండేది.
– వేల ఎకరాలుగా ఉన్న తెలంగాణ ప్రాంత భూమి రకరకాల మధ్యవర్తుల చేతుల్లో మూలుగుతూ ఉండేది. భూస్వాములే రెవెన్యూ, పోలీసు అధికారాలు చెలాయించడానికి ఈ భూ వ్యవస్థే మరో కారణమైంది. అందువల్లనే ఈ వ్యవస్థను ఎలాగైనా మార్చాలనే సంకల్పంతో సాలార్జంగ్ సంస్కరణలు అవసరమయ్యాయి.
– నిజాం కాలంలో జాగీర్దారీ, ఇనాందారీ, సర్ఫ్-ఇ-ఖాస్, ఖల్సా/దివానీ/రైత్వారీ, గైర్-ఇ-ఖల్సా, సంస్థానాలు మొదలైన రకాలుగా నిజాం కాలంలో భూమిని విభజించారు.
జాగీర్దారీ విధానం
– ఈ విధానంలో జాగీరులు, జాగీర్దారులు అనే రెండు రకాల వ్యవస్థలుండేవి.
– జాగీరులు: నిజాం రాజుకు ప్రత్యేక సేవలు చేసినవారికి కొంత భూమి ఇచ్చేవారు. వీటికి ఎలాంటి పన్నులు కానీ, రుసుములు కానీ కట్టాల్సిన పనిలేదు. ఈ భూములనే జాగీరులు అనేవారు.
– జాగీర్దార్: నవాబులకు, రాజులకు, రాజ్యానికి ప్రత్యేక సేవలు చేసినవారికి ఈ భూములను ఇచ్చేవారు. వీరిని జాగీర్దారులు అనేవారు.
– 6500 గ్రామాలు, 40,000 చ.మైళ్ల విస్తీర్ణంలో ఉన్న జాగీర్లు 1922లో 1170 ఉండగా 1949 వరకు 1500లకు పెరిగారు. నిజాం ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాలవల్ల వీరికి భూ శిస్తును వసూలు చేసుకునే అధికారం ఉండేది. దీన్ని ఆసరాగా చేసుకుని ఈ జాగీరులు రైతులను పీడిస్తూ, వేధింపులకు గురిచేసేవారు.
జాగీర్లు-రకాలు
-జాగీర్లను మొత్తం 9 రకాలుగా వర్గీకరించారు. అవి..
1) తనఖా జాగీర్లు
2) జత్ జాగీర్లు
3) పైగా జమియత్ జాగీర్
4) ఇలాహత్ జాగీర్
5) అల్ తమ్లా జాగీర్
6) మదద్-ఇ-మాష్ జాగీర్
7) మష్రూత్ జాగీర్
8) సర్ఫ్-ఇ-ఖాస్ జాగీర్
9) ఇలాకస్ జాగీర్
– తనఖా జాగీర్: ఇంటిలెజెన్స్ సర్వీస్, మిలిటరీ, బాడీగార్డ్ పనులు చేసేవారికి జీతాలకు బదులుగా ఇచ్చే భూమిని తనఖా జాగీర్ అనేవారు.
– జత్ జాగీర్: తమ జీవితకాలం మొత్తంలో నవాబులకు, నిజాంలకు, రాజులకు సేవలు చేసేవారికి ఇచ్చే భూములు. ఇలాంటి భూమిపై ఎలాంటి పన్నులు కానీ, శిస్తులు కానీ ఉండేవి కావు. అయితే ఇది రానురాను వారి వంశపారపర్య అనుయాయులకు బదిలీ అయ్యింది.
– పైగా జమియత్ జాగీర్: నిజాం సంస్థానంలో గుర్రపు సైన్యాన్ని నిర్వహించిన వారసులకు ఇచ్చే భూమి ఇది. దీన్నే జగిరిత్-ఇ-నిగ్ధాస్టి జామతి అని అనేవారు.
– వీళ్లలోనే ఆసామి జాహి, ఖర్షీద్ జాహి, వికాస్-ఉల్-ఉమ్రా అనే రకరకాల పైగా జమియత్లు ఉండేవారు.
– ఇలాహత్ జాగీర్: వీరినే ఉమ్రా-ఇ-అజాన్ అనేవారు. నిజాం కుటుంబానికి వ్యక్తిగతంగా సేవలందించేవారికి ఈ భూములను ఇచ్చేవారు.
– అల్ తమ్లా జాగీర్: నిజాంకు ఉన్న ప్రత్యేక సేవకులకు ఈ భూములను ఇచ్చేవారు. ఇది వారసత్వంగా సంక్రమింపజేసుకోవచ్చు. కానీ వేరేవారికి అమ్మడంకానీ, దానంగా ఇవ్వడం కానీ చేయొద్దు.
– మదద్-ఇ-మాష్ జాగీర్: దివ్యాంగులు, అనాథలు మొదలైనవారికి స్వచ్చందంగా సేవలు చేస్తున్నవారికి ఇచ్చే భూములు.
– మష్రూత్ జాగీర్: మతపర వ్యవస్థలకు సేవ చేసేవారికి ఇచ్చే భూమి.
– సర్ఫ్-ఇ-ఖాస్: ఇది నిజాం ప్రభువు సొంత జాగీర్.
– ఇలాకాలు: పైగా జాగీర్ల కింద ఉండేవారిని ఇలాకాలు అంటారు. వీరినే ఉమ్ర-ఇ-ఒజ్జం అని అంటారు.
-నిజాం కోసం తమ జీవితాన్ని దారపోసినవారిని ఖూన్ బహా జాగీర్ అనేవారు
జాగీర్ల అధికారాలు
-పోలీస్, పాలన, న్యాయపరమైన అధికారాలు వీరి చేతిలో ఉండేవి. తాలూకాదార్లను, తహసీల్దార్లను నియమించేవారు. అయితే వీరి పాలనలో ఆరోగ్యం, విద్య, సౌకర్యాలు కుంటుపడ్డాయి. వీరిని సస్పెండ్చేసే అధికారం ఉన్నా కూడా వారి పలుకుబడిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర రెవెన్యూను దృష్టిలో పెట్టుకుని ఏమనలేకపోయేవారు. ఒకవేళ సస్పెండ్ చేసినా వారు కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. దాన్నే అతియత్ అంటారు. ఈ జాగీరులు నిజాంకు మొకాసా లేదా చౌత్ అనే పన్నులను చెల్లించేవారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు