Divide .. Occupy | విభజించు.. ఆక్రమించు
భారతదేశ చరిత్ర
బెంగాల్లో ద్వంద ప్రభుత్వం
– బ్రిటిష్ కంపెనీ అధికారుల కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిన బెంగాల్ పరిస్థితిని రాబర్ట్ ైక్లెవ్ స్వయంగా ఇలా వర్ణించాడు.. అటువంటి అరాచకత్వం, గందరగోళం, అవినీతి, లంచగొండితనం, దోపిడి ఒక్క బెంగాల్లో తప్ప ప్రపంచంలో మరెక్కడా కానరాదని నేను ఘంటాపథంగా చెప్పగలను. అలాగే అంత అధమంగా, దురాశపూరితంగా సంపద పోగేసుకోవడం కూడా నేనెక్కడా చూడబోను. అక్షరాల 30 లక్షల పౌండ్ల ఆదాయం తెచ్చిపెట్టే బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ర్టాలు.. మీర్ జాఫర్‌ని మళ్లీ గద్దె ఎక్కించినప్పటి నుంచి కంపెనీ అధికార్ల సంపూర్ణ ఏలుబడి కింద ఉన్నాయి. పౌర, సైనిక అధికారాలు రెండూ వాళ్లవే. కాస్తోకూస్తో అధికారం, పలుకుబడి కలిగిన ప్రతి మనిషి దగ్గరా, నవాబు మొదలుకొని చోటా జమీందారు దాకా అందరి దగ్గరా కంపెనీ అధికార్లు విరాళాలు గుంజారు.
– ఇక లండన్‌లోని కంపెనీ అధికార్లు తమ వంతు కర్తవ్యంగా బెంగాల్ సంపదని పీల్చిపిప్పి చేయడానికి పూనుకొన్నారు. భారతీయ వస్తువులను కొనుగోలు చేయడానికి వాళ్లు డబ్బు పంపటం మానుకున్నారు. బెంగాల్ మీద వచ్చే ఆదాయంతో ఇక్కడ సరుకు కొని, ఇంగ్లండ్‌లో అమ్ముకున్నారు. వాటికి కంపెనీ పెట్టుబడి అని పేరు పెట్టారు. కంపెనీ సంపాదించే లాభాల్లో ఇవి ఒక భాగం. ఈ భాగోతం చాలక, బ్రిటిష్ ప్రభుత్వం తన వాటా పంపించమని, కంపెనీని నిలదీసింది. ఏటా నాలుగు లక్షల పౌండ్లు తనవాటా కింద చెల్లించమని ప్రభుత్వం 1767లో ఉత్తర్వులు జారీచేసింది.
– 1766 నుంచి 1768 వరకు అంటే మూడు సంవత్సరాల స్వల్పకాలంలో తూర్పు ఇండియా కంపెనీ బెంగాల్ నుంచి సుమారు 57 లక్షల పౌండ్లను వసూలు చేసింది. ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ అవినీతి ఒక వైపు, ఉన్న సంపద యావత్తు ఊడ్చుకుపోయే దమననీతి మరొకవైపు రాష్ర్టాన్ని పిప్పిచేశాయి. 1770లో బెంగాల్లో భయంకర క్షామం సంభవించింది. దాని కరాళనృత్యంతో జరిగిన ఘోరకలి లెక్కగడితే మానవ చరిత్రలో అంతటి భయానక కాటకం మరొకటి లేదని రుజువైంది. లక్షలాది మంది పురుగుల్లా రాలిపోయారు. బెంగాల్ జనాభాలో దాదాపు మూడోవంతు కరువు రాక్షసికి బలైపోయారు. వానలు కరువై క్షామం సంభవించినప్పటికీ దాని భయంకర పరిణామాలకు కారణం కంపెనీ విధానాలే.
– 1772లో కంపెనీ ప్రభుత్వం వారెన్ హేస్టింగ్స్‌ను బెంగాల్ గవర్నర్‌గా నియమించి పరిస్థితిని పునర్వవ్యస్థీకరించమని ఆదేశించింది. అతని నియామకం హిందూ దేశంలో కంపెనీ పాలనలో గవర్నర్ జనరల్ పరిపాలనా అధ్యాయానికి నాందిగా పరిణమించింది. వారెన్ హేస్టింగ్స్ బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేశాడు.
వారెన్ హేస్టింగ్స్ ఆక్రమణలు (క్రీ.శ. 1772 – 1785)
– బెంగాల్ గవర్నర్‌గా నియమించిన వెంటనే హేస్టింగ్స్ దేశంలో బ్రిటిష్ వారి పలుకుబడిని పెంపొందించడానికి కృషిచేశాడు.
– 1772లో అతడు బెనారస్ సంధి కుదుర్చుకుని కారా, అలహాబాద్ ప్రాంతాలను అయోధ్య నవాబుకు ఇచ్చి 50 లక్షల రూపాయలను పుచ్చుకున్నాడు. అతనికి అవసరమైనప్పుడల్లా సైనిక సహాయం చేయడానికి కూడా కంపెనీ ప్రభుత్వం అంగీకరించింది.
– ఇతని కాలంలో మొదటి ఆంగ్ల మరాఠా యుద్ధం, రెండో మైసూర్ యుద్ధం జరిగాయి.
రెండో మైసూరు యుద్ధం (1780-1784)
– హైదరాలీతో యుద్ధం 1780లో మొదలైంది. అంతకుముందు మాదిరిగానే హైదరాలీ ఇంగ్లిష్వారిని దెబ్బమీద దెబ్బ తీశాడు. ఇంగ్లిష్ సైన్యంలో అనేక మంది లొంగిపోక తప్పలేదు. హైదరాలీ దాదాపు యావత్తు కర్ణాటకను కైవసం చేసుకున్నాడు. కానీ మరోసారి బ్రిటిష్‌వారి రాజనీతిజ్ఞత, ఆయుధ బలం వారిని కాపాడింది. గుంటూరు జిల్లాని అప్పగించడం ద్వారా నిజాంను లంచంతో లొంగదీసుకుని బ్రిటిష్ వ్యతిరేక కూటమి నుంచి విడదీశారు. వారెన్ హేస్టింగ్స్ 1781-82 మధ్య మహారాష్ర్టులతో సంధి చేసుకుని, మహారాష్ట్ర సరిహద్దుల్లో కాపుంచిన సైన్యాన్ని ఉపసంహరించి మైసూరుకు వ్యతిరేకంగా మోహరించాడు. 1781 జూలైలో ఐర్క్యూట్ నాయకత్వంలో సాగిన బ్రిటిష్ సేనలు పోర్టునోవా వద్ద హైదరాలీని ఓడించి మద్రాసును కాపాడుకున్నాయి. 1782లో హైదరాలీ మరణానంతరం అతని కుమారుడు టిప్పు సుల్తాన్ యుద్ధాన్ని కొనసాగించాడు. ఉభయులూ ఒకరినొకరు ఓడగొట్టలేక పోరు విరమించి 1784 మార్చిలో శాంతి ఒప్పందం చేసుకున్నారు. ఈ విధంగా బ్రిటిష్‌వారు మహారాష్ర్టులనుగానీ, మైసూరునుగానీ ఓడించలేమని గ్రహించారు. అయినా భారతదేశంలో పట్టు నిలుపుకుని తమ రాజకీయ చతురతను రుజువుపర్చుకున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యం దక్షిణ భారతంలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోకుండా కాపాడుకోవడమేగాక, ఆ యుద్ధాల్లో దేశంలోని మూడు అగ్రరాజ్యాల్లో ఒకటిగా బ్రిటిష్ రాజ్యం మొగ్గ తొడిగింది.
కారన్‌వాలీస్ – మూడో మైసూరు యుద్ధం (1790-92)
– 1786లో పదవీ బాధ్యతలు చేపట్టిన గవర్నర్ జనరల్ కారన్‌వాలీస్.. టిప్పు సుల్తాన్‌ను బలహీనపర్చడానికి కంపెనీకి మహారాష్ర్టుల సహకారం తప్పనిసరని భావించాడు. ఈలోగా టిప్పు సుల్తాన్ మంగళూరు సంధి నిరుపయోగమైనదని గ్రహించి 1787లో పారిస్‌కు, కాన్స్టాంటినోపూల్కు తన దూతలను పంపగా, ఆ సమయానికి వాళ్లెవరూ అతనికి సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. కారన్‌వాలీస్ 1788లో గుంటూరు సర్కారుని పొంది, నిజాంకు 1768 ఒప్పందం ప్రకారం సహాయపడటానికి అంగీకరించాడు. 1789 డిసెంబర్లో కంపెనీవారికి ఎప్పటినుంచో మిత్రుత్వంగల తిరువాన్కూర్ సంస్థానాన్ని టిప్పుసుల్తాన్ ముట్టడించడం మూడో మైసూరు యుద్ధానికి తక్షణ కారణమైంది.
– కారన్‌వాలీస్ ఈ ఆక్రమణను యుద్ధంగా గుర్తించి తన కుటిల నీతితో మరాఠా, నిజాం పాలకులతో ఒక త్రైపాక్షిక ఒడంబడికను చేసుకున్నాడు. వీరు ముగ్గురూ కలిసి టిప్పు సుల్తాన్‌తో యుద్ధం చేశారు. యుద్ధం రెండేండ్లపాటు సాగింది. జనరల్ మెడోస్‌ను నిర్వీర్యం చేయడం ద్వారా టిప్పు సుల్తాన్ ఖ్యాతిని, కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 1791 మార్చి 21న కారన్‌వాలీస్ స్వయంగా నాయకత్వం వహించి బెంగళూరును ఆక్రమించాడు. 1791 డిసెంబర్ 3న టిప్పు కోయంబత్తూరును ఆక్రమించాడు. 1792 ఫిబ్రవరి 5 నాటికి కారన్‌వాలీస్ బొంబాయి సేనలతో శ్రీరంగ పట్టణం ముట్టడించాడు. అనివార్యమైన పరిస్థితుల్లో టిప్పుసుల్తాన్ 1792 మార్చిలో శ్రీరంగపట్టణం ఒప్పందం చేసుకున్నాడు.
– ఆ ఒప్పందం ప్రకారం కృష్ణా, పెన్నా నదుల మధ్య భాగంలో ఎక్కువ భాగం నిజాంకు, కొంత మహారాష్ర్టులకు ఇవ్వాల్సి వచ్చింది. మలబార్, కూర్ల్, దిండిగల్, బారామహల్లను ఇంగ్లిష వారికి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో సగానికిపైగా కోల్పోయాడు. అంతేగాక కంపెనీకి 30 లక్షల పౌండ్లను నష్టపరిహారంగా ఇస్తూ, తన ఇరువురు కుమారులను కారన్‌వాలీస్ శిబిరంలో ఉంచాల్సి వచ్చింది.
మొదటి ఆంగ్ల – మరాఠా యుద్ధం (1775 – 1782)
– 1775లో ఇంగ్లిష్ వాళ్లకి మహారాష్ర్టులతో తగాదా వచ్చింది. మహారాష్ర్టుల మధ్య అధికార వారసత్వం కోసం సంఘర్షణ రగిలిన కాలం ఇది. పసివాడిగా ఉన్న రెండో మాధవరావు పీష్వా తరపున నానా ఫడ్నవీస్, అతనికి వ్యతిరేకంగా రఘునాథరావు బరిలోకి దిగిన సమయం. బాంబేలోని కంపెనీ అధికార్లు రఘునాథరావు తరుపున రంగంలోకి దిగారు. మద్రాసు, బెంగాల్ ప్రాంతాల్లో మాదిరిగా సంఘటనలు ఇక్కడా పునరావృతం అవుతాయని కంపెనీ వాళ్లు ఆశించారు. మద్రాసులో, బెంగాల్లో మాదిరిగా మహారాష్ట్రలో కూడా డబ్బు సంచులు గుంజుకోవచ్చని ఆశపడ్డారు. 1775 నుంచి 1782 దాకా మహారాష్ర్టులతో సాగిన సుదీర్ఘ యుద్ధంలో తలమునకలై పోయారు.
– ప్రారంభంలో మహారాష్ర్టులు బ్రిటిష్ బలగాలను తలెగావ్ దగ్గర ఓడించి వడెగావ్ ఒడంబడిక మీద సంతకాలు పెట్టించారు. దీని ప్రకారం ఇంగ్లిష్ వాళ్లు తాము జయించిన భూభాగాన్ని తిరిగి అప్పగించారు. రఘునాథరావు పక్షం వదిలివేశారు. కానీ మళ్లీ వెంటనే యుద్ధం మొదలైంది. భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్యానికి ఎసరొచ్చిన విషమకాలం అది. మరాఠా సర్దార్లు యావన్మంది పీష్వా తరుపున, పీష్వాను బలపరిచే నానా ఫడ్నవీస్ తరుపున ఐక్యంగా నిలబడ్డారు. ఇంగ్లిష్ వాళ్ల వాసనగిట్టని హైదర్ అలీ, నైజాంలు కంపెనీకి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. మహారాష్ర్టులు, హైదరాలీ, నైజాంల శక్తివంతమైన సంయుక్త ప్రతిఘటనని కంపెనీ ఏకాకిగా ఎదుర్కోవలసి వచ్చింది. పైగా అమెరికాలో 1776లో ప్రజలు బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా తిరుగబడ్డారు.
– అమెరికా వలస యుద్ధాల్లో బ్రిటిష్‌వారి ఓటమి దగ్గరపడింది. మరోవైపు చుట్టుముట్టిన ఇబ్బందుల్లో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్న తమ పాత శత్రువును తొక్కిపారేయడానికి ఫ్రెంచివారు సమాయత్తమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్.. కూలిపోతున్న తమ సామ్రాజ్యాన్ని తన సమర్థతతో, పట్టుదలతో నిలబెట్టాడు. బ్రిటిష్ కంపెనీ సేనలు 1780లో అహ్మదాబాద్‌ను స్వాధీనం చేసుకున్నాయి. అయితే అమేయ సాదన సంపత్తితో, తీవ్ర అభినివేశంతో పోరుకు తలపడ్డ మహారాష్ర్టులు బ్రిటిష్ సైన్యానికి చెమటలు పట్టించారు. మహదాజీ సింధియా తన ప్రతాపప్రభ ప్రదర్శించాడు. ఆయనతో పోటీకి ఇంగ్లిష్‌వారు జంకారు. ఇరుపక్షాల్లో విజయం ఎవరిని వరించలేదు. యుద్ధం నిలిచిపోయింది. మరాఠాలు, ఆంగ్లేయులు 1782లో సాల్టే శాంతి సంధిపై సంతకాలు చేశారు. యథాపూర్వ స్థితికి ఉభయపక్షాలు సమ్మతించాయి. భారత సంస్థానాల సంయుక్త ప్రతిఘటన నుంచి ఇంగ్లిష్‌వారు బైటపడ్డారు.
– దీన్నే చరిత్రలో మొదటి ఆంగ్ల-మహారాష్ట్ర యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో ఏ పక్షానికి విజయం దక్కలేదు. అయితే బ్రిటిష్‌వారికి మేలు జరిగింది. ఆ యుద్ధం తర్వాత 20 ఏండ్లపాటు మహారాష్ర్టులతో శాంతియుతంగా జీవించే సదుపాయం కలిగింది. అప్పట్లో మహారాష్ర్టులంటే దేశంలో ఒక దుర్భేధ్య శక్తి. మహారాష్ర్టులతో శాంతి వర్థిల్లిన కాలంలో ఇంగ్లిష్‌వారు బెంగాల్ ప్రెసిడెన్సీలో తమ ప్రభుత్వాన్ని ధృడపర్చుకున్నారు. ఈ లోగా మారణ అంతఃకలహాల్లో మునిగిపోయి మహారాష్ర్టుల శక్తియుక్తులు ఉడిగిపోయాయి. సాల్టే సంధి ప్రకారం హైదరాలీతో జరిగిన యుద్ధంలో పూర్వం కోల్పోయిన తమ భూభాగాన్ని పునరాక్రమించుకునే సందర్భం వచ్చినప్పుడు మహారాష్ర్టులు ఇంగ్లిష్‌వారికి మద్దతు ఇస్తామని వాగ్దానం చేశారు. కాబట్టి ఇంగ్లిష్‌వారు మైసూరు మీద యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ విధంగా స్వదేశీ సంస్థానాలు రెండింటిని చీల్చడంలో ఇంగ్లిష్‌వారు మరోసారి సఫలమయ్యారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు