Big Data Analytics | బంగారు భవితకు బిగ్ డేటా అనలిటిక్స్
ఒక సంస్థ మార్కెట్లో నిలువాలన్నా.. వినియోగదారుల మన్నన పొందాలన్నా.. వారి అభిరుచులకు అనుగుణంగా నడుచుకుంటూనే వ్యాపారంలో కొత్త పద్ధతులను అనుసరించడం తప్పనిసరి. అలా ముందుకు వెళ్లాలంటే వ్యాపారులు తీసుకొనే నిర్ణయమే ప్రధానమైనది. అలా నిర్ణయాలు తీసుకోవడానికి బిగ్ డేటా అనలిటిక్స్ అవకాశం కల్పిస్తున్నది.
-1990ల తర్వాత సమాచార, సాంకేతిక రంగాల్లో మార్పుల వల్ల ప్రజల జీవనవిధానాల్లో రోజురోజుకూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శాటిలైట్లు, విమానయాన (ఎయిర్‌లైన్స్) సంస్థలు, బ్యాంకింగ్, వెబ్సర్వర్స్ నుంచి పెద్ద మొత్తంలో డేటా క్రియేట్ అవుతున్నది. దీంతో సమాచార, ఆర్థిక, మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, ఈ-కామర్స్ రంగాల్లో సమాచార విశ్లేషణకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది.
-ప్రస్తుతం ఉన్న డేటా గత 15 ఏండ్లుగా ఉన్నదే. ఈ పదిహేనేండ్లలో ఒక సంస్థకు చెందిన మొత్తం డేటా 10 టెరాబైట్స్ (1,000 జీబీ) కంటే ఎక్కువ లేదు. కానీ, ప్రస్తుతం ఒకే రోజులో 10 టెరాబైట్స్ డేటా ఉత్పత్తి అవుతుంది. 2020 నాటికి ఇది జెటాబైట్లకు చేరనున్నది.
-భవిష్యత్‌లో కంప్యూటర్లు, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌ల వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించేవారు అధికమై రోజువారీ లావాదేవీలు ఆన్లైన్లో, ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతాయి. ఇలా పెద్దమొత్తంలో జనరేటవుతున్న డేటాను సేకరించడం, స్టోర్ చేయడం, ప్రాసెస్ చేయడం కంపెనీలకు కష్టమవుతున్నది. ఈ డేటాను విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవడమే బిగ్ డేటా అనలిటిక్స్.
-ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. ఆయా కంపెనీలు తమకు సంబంధించిన అనేక ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. వాటన్నింటి లక్ష్యం ఒక్కటే.. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వస్తు, సేవలు అందించి వారి మనసు గెలుచుకోవడం. దీనికోసం విభిన్న వర్గాల వినియోగదారులు, మారుతున్న వారి అవసరాలు, అభిరుచులకు సంబంధించి విశ్లేషణలు, సూచనలు, సలహాలతో కూడిన నివేదికలను రూపొందించి సంస్థకు అందించడం డేటా అనలిటిక్స్ ప్రధాన విధి. దీనికోసం వారు అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్టాటిస్టికల్, క్వాంటిటేటివ్, టెక్నికల్ పద్ధతులను ఉపయోగించి విశ్లేషిస్తారు. కంపెనీ వ్యాపార అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు.
-మనం షేర్ మార్కెట్లో ఒక కంపెనీకి చెందిన షేర్ కొనాలనుకుంటే… ఆ షేర్ విలువ ఏడాది క్రితం ఎంత ఉంది? ఆర్నెళ్ల క్రితం ఎంత ఉంది? వారం క్రితం ఎంత ఉంది? అనేదాన్ని తెలుసుకోవాలి. దీంతో భవిష్యత్‌లో ఆ షేర్ విలువ ఎలా ఉంటుంది? లాభాల్లో ఉంటుందా లేదా నష్టాల్లో ఉంటుందా? అని అంచనా వేసుకొని ఆ షేర్‌ను కొనుగోలు చేస్తారు.
-ఇలా అనలిటిక్స్ ద్వారా అందుబాటులో ఉన్న డేటాను సమర్థవంతంగా విశ్లేషించుకుని, సరైన నిర్ణయాలు తీసుకోగలిగితే ప్రతీ సంస్థకు లాభం చేకూరుతుంది. దీనివల్ల వినియోగదారులకు తక్కువ వనరులతో మరింత మెరుగైన సేవలను అందించే అవకాశం ఉటుంది.
ప్రభుత్వాలకూ అవసరమే
-హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. వివిధ రంగాల్లో నగరాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి అవసరమైన పెట్టుబడులు ఆకర్షించడానికి, పరిశ్రమలను నెలకొల్పేలా అనువైన వాతావరణం కల్పించడానికి మెరుగైన భద్రతతోపాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నది. ఇందులో భాగంగా నగరవ్యాప్తంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నది. ఇవి నిత్యం పరిసరాలను రికార్డు చేస్తుండడంతో పెద్దమొత్తంలో డేటా ఉత్పత్తి అవుతున్నది. ఈ బిగ్ డేటాను సాంకేతికంగా విశ్లేషించడం ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ ద్వారా అనుమానితులను, నేరగాళ్లను గుర్తించడం, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, ట్రాఫిక్ జాం ఏర్పడినప్పుడు ఇతరులను అప్రమత్తం చేయవచ్చు.
-ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో బిగ్ డేటాను ఉపయోగించి ప్రయోజనం పొందింది. ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, ఏ అభ్యర్థిని ఎక్కడ నిలబెడితే విజయం సాధించవచ్చు అనే అంశాలకు సంబంధించి వివిధ సోషల్ వెబ్సైట్ల ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని.. దానికి అనుగుణంగా తన వ్యూహాలు మార్చుకుని భారీ విజయం సాధించింది.
ఈ-కామర్స్‌కు ముఖ్యమే
-ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ వ్యాపారం (ఈ-కామర్స్) అధికంగా జరుగుతున్నది. కోరుకున్న వస్తువులు తాము ఉన్నదగ్గరికే వస్తుండడంతో వినియోగదారుల్లో ఎక్కువ మంది ఆన్లైన్లో షాపింగ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. కంపెనీలకు సంబధించిన వెబ్సైట్లలో కస్టమర్లు వెల్లడించే వివరాల ద్వారా కంపెనీలు వారికి సేవలు అందిస్తున్నాయి. దీంతో కస్టమర్ల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఆయా కంపెనీలకు లేదు. అందువల్ల డేటా అనలిస్టుల సేవలు ఇలాంటి కంపెనీలకు తప్పనిసరిగా మారింది.
-వినియోగదారులు అందించే వివరాల ద్వారా వారు ఏ వస్తువులను ఎక్కువగా కొంటున్నారు, ఎంత ధరకు వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు, ఏ సమయంలో షాపింగ్ చేస్తున్నారు.. ఏ విధానాల్లో పేమెంట్ చేస్తున్నారు, గత చెల్లింపుల్లో ఏవైనా పొరపాట్లు జరిగాయా వంటి అంశాలను విశ్లేషించి సంస్థకు అవసరమైన సమాచారాన్ని నివేదికల రూపంలో అందిస్తారు. దీనిద్వారా వినియోగదారునికి ఏవిధంగా చేరువకావచ్చు, వ్యాపారాన్ని ఎలా విస్తరించవచ్చనే విషయాలపై కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటాయి.
ఐటీ రంగంలో కూడా
-సాఫ్ట్వేర్ కంపెనీలు క్రమంగా అనలిటిక్స్ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, జెన్‌ప్యాక్ట్, టీసీఎస్, ఐబీఎం, విప్రో, డెల్ వంటి సంస్థలు అనలిటిక్స్ నిపుణులను భారీ ప్యాకేజీలతో ఉద్యోగాల్లోకి తీసకుంటున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఐటీ రంగంలోనూ అనలిటిక్స్‌కు తీవ్ర డిమాండ్ ఏర్పడనుంది. సాధారణ ఐటీ నిపుణులతో పోలిస్తే అదే వయస్సు, అనుభవం ఉన్న డేటా అనలిటిక్స్ నైపుణ్యాలు ఉన్న వారికి 30 నుంచి 50 శాతం అధిక వేతనాలు లభిస్తున్నాయి. అందువల్ల డేటా అనలిటిక్స్ నైపుణ్యాలను సొంతం చేసుకున్నవారి కెరీర్ ఉత్తమంగా ఉంటుంది.
ఉద్యోగావకాశాలు
-దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వాటిలో బిగ్ డేటా అనలిటిక్స్ రంగం ఒకటి. ఇది ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు పెరుగడానికి అవకాశం కల్పిస్తున్నది. డేటా అనలిస్టిక్ విభాగం త్వరితగతిన వృద్ధి చెందుతుండడంతో నిపుణుల కొరత ఉన్నది. నగరీకరణ, ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడం, క్షణకాలం తీరిక లేకుండా మనిషి జీవితం నడుస్తుండడంతో ఈ-కామర్స్ క్రమంగా విస్తృతమవుతున్నది. దీంతో బిగ్ డేటా అనలిటిక్స్ నిపుణులకు భారీ డిమాండ్ పెరుగుతున్నది.
-ప్రస్తుతం దేశీయ బిగ్ డేటా అనలిటిక్స్ విభాగం సేవల విలువ ఏడాదికి 200 కోట్ల డాలర్లుగా ఉంది. ఇది 2025 నాటికి ఎనిమిదిరెట్లు వృద్ధి చెంది సుమారు 16 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
-ప్రపంచవ్యాప్తంగా బిగ్ డేటా అనలిటిక్స్ మార్కెట్లో భారత్ పదోస్థానంలో ఉన్నది. వచ్చే మూడేండ్లలో తొలి మూడు మార్కెట్లలో ఒకటిగా భారతదేశాన్ని నిలుపాలని ఐటీ పరిశ్రమకు చెందిన సంస్థ నాస్కామ్ (ద నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్- NASSCOM) లక్ష్యంగా పెట్టుకున్నది.
-ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు, ఐటీ సేవలు, ఎడ్యుకేషన్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, రియాలిటీ, సూపర్ మార్కెట్, ఈ-కామర్స్, టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, బీమా, హెచ్ఆర్, మార్కెటింగ్ వంటి రంగాలకు చెందిన కంపెనీల్లో బిగ్ డేటా అనలిస్టులు, బిగ్ డేటా ఇంజినీర్, డేటా సైంటిస్ట్, బిగ్ డేటా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
-దేశంలో ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్ వంటి నగరాల్లో అనలిటిక్స్ నిపుణులకు డిమాండ్ ఉంది.
అందుబాటులోకి కోర్సులు
-మార్కెట్లో బిగ్ డేటా, బిగ్ డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యత పెరుగుతుండడంతో రాష్ట్రంలోని వర్సిటీలు కూడా సిద్ధమయ్యాయి. బిగ్ డేటాకు అవసరమైన కోర్సులను రూపొందించి పరిస్థితులకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేస్తున్నాయి.
-ఇంట్రడక్షన్ టూ అనలిటిక్స్ పేరుతో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మూడో ఏడాది రెండో సెమిస్టర్లో ఒక ఆప్షనల్ సబ్జెక్టును హైదరాబాద్‌లోని జేఎన్టీయూ ప్రవేశపెట్టింది.
-నాలుగో ఏడాది మొదటి సెమిస్టర్లో బిగ్ డేటా అనలిటిక్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అనే రెండు ఆప్షనల్స్ కూడా ఉన్నాయి.
-ఎంటెక్ మొదటి సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సుల్లో పాఠ్యాంశాలు ఉన్నాయి.
-హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), హైదరాబాద్ ఐఐటీ, కోల్‌కతా, లక్నో, బెంగళూరు ఐఐఎంలలో డేటా అనలిటిక్స్ కోర్సులను అందిస్తున్నారు.
ఇవి నేర్చుకుంటే..
-బిగ్‌డేటా అనలిటిక్స్ రంగంలో కెరీర్ మంచిగా ఉండాలన్నా, ఉన్నత అవకాశాలు రావాలన్నా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, మారుతున్న అంశాలను గురించి తెలుసుకోవాలి. వాటిపై పట్టు సాధించాలి. అందువల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా బేస్‌కు సంబంధించిన అంశాల్లో నైపుణ్యం సాధించాలి. హడూప్ (Hadoop), స్పార్క్, పైథాస్, స్కేలా (Scala), హైవ్, పిగ్, మెషీన్ లెర్నింగ్, డేటా మైనింగ్, స్టాటిస్టిక్స్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్, డేటా విజువలైజేషన్, SQL, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ వంటి కోర్సులు నేర్చుకుంటే డేటా అనలిటిక్స్ రంగంలో ఉన్నతమైన కెరీక్‌కు అవకాశం ఉంటుంది.
మార్కెట్లో డిమాండ్ ఉంది
మార్కెట్లో బిగ్ డేటా అనలిటిక్స్‌కు డిమాండ్ అధికంగా ఉంది. ఇది ఎవర్గ్రీన్. మరో పదేండ్ల వరకు మార్కెట్లో అధిక ప్రాధాన్యం ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఎగుడు దిగుడులు ఉన్నప్పటికీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, దాన్ని విరివిగా వినియోగిస్తుండటంతో డేటా ప్రతినిత్యం క్రియేట్ అవుతూనే ఉంది. ఈ బిగ్ డేటాను విశ్లేషించడానికి అనలిటిక్స్ అవసరం ఉంది. అందువల్ల మార్కెట్లో డేటా విశ్లేషకులకు ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలోనే తీసుకుంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్స్ఫర్స్, ఆన్లైన్ బిల్లింగ్ వంటివి రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం సెంటర్‌కు ఒక రోజులో డబ్బు కోసం ఎంతమంది వస్తున్నారు? ఏ సమయంలో ఎంత డబ్బు తీసుకుంటున్నారు? వారు కోరుకున్న డబ్బు అందివ్వాలంటే.. ఎంతమొత్తంలో డబ్బు నిల్వ ఉంచాలి? వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఆ సెంటర్లో ప్రతి రోజు జనరేటయ్యే డేటాను విశ్లేషించి, దానికి అనుగుణంగా ఖాతాదారులకు డబ్బును అందుబాటులో ఉంచవచ్చు. స్టాటిస్టిక్స్, డేటా మైనింగ్ టెక్నిక్స్, కోడింగ్, హడూప్లపై పరిజ్ఞానం ఉంటే ఈ బిగ్ డేటా అనలిటిక్స్ రంగంలో రాణించవచ్చు. ప్రస్తుతం కంపెనీలు కొత్తవారికి ప్రాధాన్యం ఇస్తుండడంతో డేటా అనలిస్టు నైపుణ్యాలు ఉన్నవారికి డిమాండ్ ఉన్నది. ఇలాంటి వారికి టెలికం, బ్యాంకింగ్, ఈ-కామర్స్, ఐటీ, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. భారీగా వేతనాలుండే ఈ రంగంలో ఎంటెక్, బీటెక్, బీఈ, ఎంఎస్, ఎంసీఏతోపాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?