జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లు
దేశంలో అణగారిన వర్గాలు వెట్టి, బానిసత్వం, అణచివేతలకు లోనై అస్పృశ్యులుగా, దళితులుగా, గిరిజనులుగా పిలువబడి అగ్రవర్ణాలవారికి సేవలు చేస్తూ జాజ్‌మానీ వ్యవస్థ మూలంగా తమ కనీస అవసరాలు తీరకపోగా, ఉన్నతవర్గాలు చేసే అఘాయిత్యాల నుంచి రక్షణ కరువై దుర్భర జీవనాన్ని కొనసాగించేవారు.
-దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగపరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు రూపొందించి రక్షణలు కల్పించాయి.
-మన పోరాటం ద్రవ్యం కోసమో, అధికారం కోసమో కాదు. మన ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడమే మన పోరాట అంతిమ లక్ష్యం – బీఆర్ అంబేద్కర్
-అస్పృశ్యతపై నా పోరాటం మానవాళి కల్మశాలపై పోరాటం- మహాత్మాగాంధీ
-గిరిజనులు ప్రధానంగా తమ భూమిని ఇతరులు స్వాధీనం చేసుకోవడం, వెట్టిచాకిరీ వ్యవస్థ విముక్తి లేకపోవడం, జీవనాధారమైన వ్యవసాయం పాతపద్ధతిలోనే కొనసాగడం, అప్పులబారిన పడటం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు.
-కులం, మతం లేదా చట్టబద్ధమైన జీవనోపాధి అంశా ల ఆధారంగా వివక్ష చూపించే ఏ చర్యనైనా అంటరానితనమే – రోహిణి కుమార్ చౌదరి
-ఎస్సీ, ఎస్టీ వర్గాలవారిపై అధికంగా దాడులు జరగడంతో కేంద్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలపై నేర అకృత్యాల నివారణ చట్టం రూపొందించి, అమల్లోకి తెచ్చింది.
జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్లు
1) సూరజ్ భాన్ – 2004 నుంచి 2007 వరకు
2) భూటాసింగ్ – 2007 నుంచి 2010 వరకు
3) పీఎల్ పూనియా – 2010 నుంచి 2013 వరకు
4) పీఎల్ పూనియా (రెండో సారి) – 2013 నుంచి 2016 వరకు
5) రాంశంకర్ కథేరియా – 2017 నుంచి 2020 వరకు
6) విజయ్ సంప్లా – 2020 February 18 to till date
ఎస్టీ కమిషన్ చైర్మన్లు
1) కున్వర్ సింగ్ – 2004 నుంచి 2007 వరకు
2) ఊర్మిళా సింగ్ – 2007 నుంచి 2010 వరకు
3) రామేశ్వర్ ఓరాన్ – 2010 నుంచి 2013 వరకు
4) రామేశ్వర్ ఓరాన్ (రెండోసారి) – 2013 నుంచి 2017 వరకు
5) నందకుమార్ సాయి – 2017 నుంచి 2020 వరకు
6) హర్ష చౌహాన్ – 2021 February 18 to till date
ఎస్సీ, ఎస్టీ – నేర అకృత్యాల నివారణ చట్టం- 1989
-రాజ్యాంగంలోని 17వ నిబంధన ప్రకారం అంటరానితనం నేరం. దాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 1955లో అస్పృశ్యత నివారణ చట్టాన్ని రూపొందించింది. దీన్ని 1976లో పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా మార్పుచేసింది. ఈ చట్టం ఎస్సీ, ఎస్టీలపై జరిగే నేరాలను నివారించలేకపోయింది. కాబట్టి మరో చట్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది.
-1988లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించింది. ఎస్సీ, ఎస్టీ నేర అకృత్యాల నివారణ చట్టాన్ని 1989 సెప్టెంబర్ 11న రాష్ట్రపతి ఆమోదించగా, 1990 జనవరి 30న అమల్లోకి వచ్చింది.
అట్రాసిటీ చట్టం-ముఖ్యాంశాలు
-ఎస్సీ, ఎస్టీల భూములను ఆక్రమించకూడదు.
-ఎస్సీ, ఎస్టీల గృహాల్లో కాని, పరిసర ప్రాంతంలో కాని చెత్తాచెదారం వేయరాదు.
-ఎస్సీ, ఎస్టీలతో బలవంతంగా తినకూడని పదార్థాలు, ద్రవాలను తినమని, తాగమని ఒత్తిడి చేయకూడదు.
-ఎస్సీ, ఎస్టీలతో తప్పుడు పనులు చేయించరాదు.
-ఎస్సీ, ఎస్టీలను బెదిరించి, భయపెట్టి బలవంతంగా వారితో సాక్ష్యం చెప్పించకూడదు.
-ఎస్సీ, ఎస్టీ మహిళలను కొట్టడం, అవమానించడం నేరం.
-ఎస్సీ, ఎస్టీల ఆవాస ప్రాంతాల్లో మంచినీటిని
కలుషితం చేయకూడదు.
-వారితో ఎన్నికల్లో బలవంతంగా ప్రచారం చేయించరాదు.
-ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోకుండా ఎవరూ అడ్డుపడరాదు.
-వారిచేత వెట్టిచాకిరీ చేయించరాదు.
-ఎస్సీ, ఎస్టీలు తప్పుచేశారని జంతువులపై ఊరేగించి గ్రామ బహిష్కరణ చేయకూడదు.
చర్యలు
-చట్టం ప్రకారం అరెస్టు చేసినప్పుడు బెయిల్ లభించదు.
-అట్రాసిటీకి సంబంధించిన వివాదాలపై డీఎస్పీ స్థాయి, లేదా అతని సమాన లేదా పై స్థాయి అధికారులకు విచారణ జరిపే అవకాశం ఉంది.
-చట్టాన్ని అమలుచేయడానికి, వివాదాలను పరిశీలించి విచారించడానికి ప్రత్యేక కోర్టులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలి.
-ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ప్రచారం చేయాలి.
-కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అట్రాసిటీ చట్టాన్ని సమగ్రంగా అమలు పర్చేందుకు, పర్యవేక్షణ చేయడానికి ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేయాలి. అవి..
-కేంద్రంలో ప్రధానమంత్రి అధ్యక్షతన 18 మంది సభ్యులుండాలి.
-రాష్ట్రంలో ముఖ్యమంత్రి/రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో 25 మంది సభ్యులుండాలి.
-కమిటీల్లో ఎంపీలు, రాష్ట్ర శాసనసభల సభ్యులు, అధికారులు, అనధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు అందులో సభ్యులుగా కొనసాగవచ్చు.
-వార్షిక నివేదికను జిల్లా కమిటీ రాష్ర్టానికి, రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రం ప్రతి ఏడాది మార్చి 31లోపు పార్లమెంట్ పరిశీలనకోసం పంపాలి.
-ఈ చట్టం అమలు చేసేందుకయ్యే ఖర్చులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తున్నాయి.
అట్రాసిటీ చట్టం – శిక్షలు
-ఎస్సీ, ఎస్టీల జలాశయాలను కలుషితం చేసినవారికి 6 నెలలకు తక్కువ కాకుండా ఐదేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.
-ఎస్సీ, ఎస్టీలు ఆస్తులు కోల్పోయేవిధంగా విస్ఫోటన పదార్థాలను వినియోగిస్తే ఏడేండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
-ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా కారణంతో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు సంబంధించిన ప్రయోజనాలు అమలు జరపకుండా నిలిపివేస్తే ఆ ఉద్యోగికి ఏడాది పాటు జైలు శిక్ష విధించవచ్చు.
-అగ్రవర్ణాల వారి చర్యల కారణంగా ఎస్సీ, ఎస్టీల ఆస్తులకు భంగం, నష్టం జరిగితే ఆ వర్గాలవారికి నష్టపరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలి.
ఎస్సీ, ఎస్టీ నేర అకృత్యాల సవరణ చట్టం- 2014
-ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి 2013లో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టగా అది ఆమోదం పొందలేదు. 2014 మార్చి 4న రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ సిఫార్సు ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్ 2015 ఆగస్టు 4న లోక్‌సభ, డిసెంబర్లో రాజ్యసభ ఆమోదం పొందింది.
సవరణ చట్టంలోని ముఖ్యాంశాలు
-ఈ చట్టం ప్రకారం తప్పుడు సాక్ష్యం చెప్తే జీవిత కారాగార శిక్ష విధించాలి.
-విచారణ 2 నెలల్లోగా పరిష్కరించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలి.
-కిందిస్థాయి కోర్టులో న్యాయం జరగనప్పుడు పై స్థాయి న్యాయస్థానానికి అప్పీలు చేసుకుంటే 3 నెలల్లోపు పరిష్కరించాలి.
-ఎస్సీ, ఎస్టీలు కేసు ఇచ్చిన తరువాత సంబంధిత వ్యక్తులపై ఉచితంగా ఎఫ్ఐఆర్ కాపీ అందజేయాలి.
-బాధితులు, వారికి సంబంధమున్నవారిపై ఆధారపడినవారికి పోషణ ఖర్చులను అందించాలి.
-బాధితులు, వారిపై ఆధారపడినవారికి కక్షిదారుల దాడుల నుంచి రక్షణ కల్పించాలి.
జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్
-జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లు రాజ్యాంగబద్దమైన, స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థలు.
-రాజ్యాంగంలోని 338 నిబంధన ప్రకారం 1950 నవంబర్ 8న రాష్ట్రపతి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషనర్‌ను నియమించారు.
-మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ అధ్యక్షుడిగా బోలా పాశ్వాన్ శాస్త్రిని నియమించింది. 1978లో బహుళ సభ్య కమిషన్‌గా ఏర్పాటు చేశారు. దీన్ని 1987లో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌గా పేరు మార్చారు.
-1990లో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగపరమైన హోదా కల్పించగా 1992 మార్చి 12న అమల్లోకి వచ్చింది.
-దిలీప్‌సింగ్ భూరియా కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో ఎస్సీ కమిషన్ నుంచి ఎస్టీ కమిషన్‌ను వేరు చేశారు.
జాతీయ ఎస్సీ కమిషన్ నిర్మాణం
-కమిషన్‌లో ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు.
-వారి పదవీ కాలం 3 ఏండ్లు.
-చైర్మన్‌కు క్యాబినెట్ మంత్రి హోదా, వైస్ చైర్మన్‌కు సహాయ మంత్రి (డిప్యూటీ), సభ్యులకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హోదా ఉంటుంది.
-చైర్మన్, సభ్యులు అందరూ షెడ్యూల్డ్ కులాలకు చెందినవారై ఉండాలి.
జాతీయ ఎస్సీ కమిషన్ విధులు
-షెడ్యూల్డ్ కులాల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు విచారణ చేపట్టడం
-ఎస్సీల రక్షణ కోసం ఆర్థికాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించడం
-రాజ్యాంగపరంగా ఎస్సీలకు కల్పించిన అవకాశాలను పరిరక్షించడం
-మారుతున్న కాలానికి అనుగుణంగా పార్లమెంట్ చేసిన చట్టాలను మాల్యాంకనం చేయడం
-సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు కమిషన్‌కు ఉన్నాయి.
-సాక్ష్యులను పిలిపించి విచారించడం, డాక్యుమెంట్లను పరిశీలించడం.
-షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను వార్షిక నివేదికగా రాష్ట్రపతికి సమర్పించాలి.
-ఎస్సీ కమిషన్ కార్యాలయం అనుశుచిత్ జాతి వాణి పేరుతో 3 నెలలకోసారి ఈ-మేగజైన్‌ను ప్రచురిస్తుంది.
-రాష్ట్రపతి సూచించిన అంశాలను పరిశీలించి రాష్ట్రపతికి నివేదిక రూపంలో అందిస్తుంది.
ఎస్టీ కమిషన్
-ఎస్సీ కమిషన్ నుంచి ఎస్టీ (జాతీయ షెడ్యూల్డ్ తెగల) కమిషన్‌ను 89వ రాజ్యాంగ సవరణ ద్వారా వేరు చేయగా 2004 ఫిబ్రవరి 19న అమల్లోకి వచ్చింది.
-338 (ఏ) నిబంధన ప్రకారం జాతీయ షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక కమిషన్‌ను రాష్ట్రపతి ఏర్పాటు చేయాలి.
-ఎస్టీ కమిషన్ రాజ్యాంగబద్దమైన, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ.
-షెడ్యూల్డ్ కులాలు, తెగల సమస్యలు భౌగోళికంగా, సాంస్కృతికంగా వేర్వేరుగా ఉంటాయని, అందుకే వేరు చేయాలన్న దిలీప్‌సింగ్ భూరియా కమిటీ సూచన మేరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను వేరు చేశారు.
ఎస్టీ కమిషన్ నిర్మాణం
-ఎస్టీ కమిషన్‌కు ఒక చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులుంటారు.
-వారిని రాష్ట్రపతి నియమిస్తారు.
-వారి పదవీకాలం 3 ఏండ్లు.
8 సర్వీసు నిబంధనలను, పదవీ కాలాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తారు.
-చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు ఎస్టీ వర్గాలకు చెందినవారై ఉండాలి.
కమిషన్ విధులు
-జాతీయ ఎస్సీ కమిషన్లాగానే ఎస్టీ కమిషన్ కూడా ఆయా వర్గాల రక్షణ కోసం కృషి చేస్తుంది.
-ఎస్టీల హక్కులకు భంగం కలిగినప్పుడు ఫిర్యాదుల ఆధారంగా లేదా సుమోటోగా స్వీకరిస్తుంది.
-గిరిజనుల భూములు ఇతరులచేత అన్యాక్రాంతం కాకుండా నివారిస్తుంది.
-పంచాయతీ చట్టం గిరిజన ప్రదేశాలకు వర్తించేవిధంగా కృషి చేస్తుంది.
-గిరిజన హక్కులను కాపాడుతూ పర్యావరణ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తుంది.
-రాష్ట్రపతికి వార్షిక నివేదిక సమర్పిస్తుంది.
-జాతీయ స్థాయిలోలాగానే రాష్ర్టాల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్లు, సంయుక్తంగానే (ఆంధ్రప్రదేశ్) ఏర్పాటు చేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు