అభివృద్ధి అంతా భూమి చుట్టే..
ఆర్థిక వ్యవస్థ (వస్తు సేవలు) పెరుగుదలే ప్రజా సంక్షేమం. అంటే వస్తు సేవలను అందుబాటులో ఉంచినప్పుడే ప్రజా వినియోగం, నెలసరి తలసరి వినియోగ వ్యయం పెరిగి పేదరికం తగ్గుతుంది. తగ్గిన పేదరకం దాదాపు అన్ని ఆర్థిక సమస్యలను నిర్మూలిస్తుంది. అయితే అభివృద్ధిని పెంచడానికి సమస్యలను సృష్టించరాదు. ముఖ్యంగా ప్రాజెక్టుల పేరుతో ప్రజలను స్థానభ్రంశానికి గురి చేయరాదు.
-ప్రాజెక్టుల కోసం ప్రజలను వేరోచోటుకి తరలించాల్సి వస్తే వారికి 100 శాతం న్యాయం చేయాలి. గణాంకాల ప్రకారం దాదాపు 50 మిలియన్ల ఎకరాల భూమి, అంటే భారత భూభాగంలో 6 శాతం ప్రాజెక్టుల కోసం మళ్లించబడింది.
-దాదాపు 50 మిలియన్ల ప్రజలు స్థానభ్రంశానికి గురికావడం విచారకరం. బ్రిటిష్‌వారు ప్రవేశపెట్టిన చట్టాలను పట్టుకొని వేలాడటం వల్ల (2013 వరకు) సమస్యలెన్నో తలెత్తాయి. ముఖ్యంగా
-సింగూర్ (Nano car)
-Posco (Steel Factory)
-యుమున Express way
-Raigad Marchers
-Nandi Gram
-Maha Mumbai Sez
1824 భూసేకరణ చట్టం
దేశంలో మొట్టమొదటి భూసేకరణ చట్టం. దీన్నే Bengal Resolution of 1824గా పిలుస్తారు. ఈ చట్టం బెంగాల్ Provinceకు మాత్రమే వర్తిస్తూ రోడ్ల కోసం, కాల్వల కోసం, ఇతరత్రా ప్రజోపయోగం కోసం ప్రభుత్వభూమి సేకరించే అధికారం కలిగి ఉంటుందని చట్టం పేర్కొంది. ఈ చట్టం The Presidency of Fort Williamకు మాత్రమే వర్తిస్తుంది.
1839 భూసేకరణ చట్టం
బెంగాల్ భూసేకరణ చట్టం తరహాలో Bombay Presidencyలో ప్రజోపయోగం కోసం 1839 భూసేకరణ చట్టం ప్రారంభమైంది. Bombay Presidencyలో మహరాష్ట్ర, గుజరాత్, కర్ణాటక ఉన్నాయి. దీన్ని Building Act XVIII of 1839గా పేర్కొంటారు.
1850 భూసేకరణ చట్టం
మొత్తం కలకత్తాకు 1824 భూసేకరణ చట్టం వర్తించే విధంగా 1850లో మరొక చట్టాన్ని తీసుకొచ్చారు. Act of 1850 ప్రజా ఉపయోగం కోసం కలకత్తాలో ఎవరినుంచైనా భూమిని సేకరించే అధికారం ప్రభుత్వానికి కట్టబెట్టే చట్టమే ఈ 1850 భూ సేకరణ చట్టం.
1854 భూసేకరణ చట్టం
1852లో చేపట్టిన ఈ Presidency of fort st george చట్టాన్ని 1854లో విస్తరించారు. ఈ చట్టం ఒక మద్రాస్‌కే కాకుండా మొత్తం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, లక్షదీవులకు వర్తిస్తుంది.
1852 భూసేకరణ చట్టం
మద్రాస్‌కు సంబంధించి భూసేకరణ కోసం Act of xx 1852ను ప్రారంభించారు. ఇది Presidency of fort st. georgeకు వర్తించే చట్టం. ఇందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, లక్ష దీవులున్నాయి.
1857 భూసేకరణ చట్టం
మొత్తం బ్రిటిష్ ఇండియాకు సంబంధించే విధంగా భూసేకరణ చట్టాన్ని 1857లో తీసుకొచ్చారు. అంతకుముందు ఉన్న చట్టాన్ని రద్దు చేశారు. 1857 భూసేకరణ చట్టాన్ని 1861 Act II గా, 1861 Act II చట్టాన్ని 1863 Act XXII గా, చివరికి 1870 Act X గా సవరణ చేశారు.
1870 భూసేకరణ చట్టం
నష్టపరిహారం నచ్చకపోయినా, చట్టం నచ్చకపోయినా భూయజమానులు సివిల్ కోర్టుకు వెళ్లే అవకాశాన్ని ఈ చట్టం ద్వారా కల్పించారు. దీంతో కొంత వరకు Eminent Domain ప్రాధాన్యం తగ్గినట్లు గమనించాలి. జిల్లా కలెక్టర్ భూయజమానుల మధ్య ఒప్పందం కుదరనప్పుడు సివిల్ కోర్టుకు వెళ్లే అధికారాన్ని ఈ చట్టం ఇస్తుంది.
-1824 – మొదటి భూసేకరణ చట్టం
-1857 – దేశం మొత్తానికి వర్తించే భూసేకరణ చట్టం
-1870 – సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం కల్పించిన భూసేకరణ చట్టం
1894 భూసేకరణ చట్టం
హైదరాబాద్, మైసూర్, ట్రావెన్కోర్ కాకుండా మిగిలిన ప్రాంతాలకు వర్తించేవిధంగా 1894లో నూతన చట్టాన్ని (Act of 1894ను) తీసుకొచ్చారు. దీన్నే RajLawగా పేర్కొంటారు. ఈ RajLaw 2013లో పూర్తిగా రద్దయింది. 1894 చట్టం పాకిస్థాన్‌లో కూడా అమల్లో ఉన్నది. ఈ చట్టం స్పష్టమైన భూయజమానులకు న్యాయబద్ధంగా నష్టపరిహారం ఇవ్వకుండా అడ్డుకుంటుంది. 1947 తర్వాత కూడా అంటే 2013 వరకు ఈ చట్టాన్ని పాటించారు. 1894 చట్టంతో భూయజమానులకు నష్టం జరిగింది. ముఖ్యంగా మార్కెట్ విలువకు సమానంగా నష్ట పరిహారం ఇచ్చిన సందర్భాలు లేవు. మార్కెట్ విలువలో కొద్ది మొత్తం (Fraction of the total value) నష్టపరిహారంగా ఇచ్చేవారు. ఈ చట్ట ప్రకారం ప్రజోపయోగం కోసం ప్రభుత్వం ఎవరినుంచైనా అంటే పేదవారి నుంచైనా, ధనికుల నుంచైనా, గ్రామాల నుంచైనా, పట్టణాల నుంచైనా, వ్యక్తులనుంచైనా, సంస్థల నుంచైనా భూమిని సేకరించే అధికారం ఉంటుంది.
1894 చట్టం ప్రకారం సేకరించాలనుకున్న భూమిని ప్రభుత్వం చట్టం ప్రకారం రెండు వార్తా పత్రికల్లో పేర్కొంటుంది. అందులో ఒకటి స్థానిక భాషలో ఉంటుంది. సందేహాలు కలిగినవారు 30 రోజుల్లో జిల్లా కలెక్టర్‌కు సందేహాన్ని తెలియజేస్తే కలెక్టర్ ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తారు. ప్రభుత్వం నష్టపరిహారంలో మార్పులు చేయవచ్చు. ఒకవేళ భూయజమానికి ఒప్పందం నచ్చకపోతే కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ ప్రజోపయోగం దృష్ట్యా , అత్యవసరం దృష్ట్యా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడిన సందర్భాలే ఉన్నాయి. 1894 భూసేకరణ చట్టంలో జిల్లా కలెక్టర్‌కు విశేష అధికారాలుంటాయి. నష్ట పరిహారాన్ని నిర్ణయించే అధికారాలను కూడా ఆయనే కలిగి ఉండేవాడు. క్షణాల్లో నోటీస్ ద్వారా ఏ కుటుంబాన్నైనా స్థానభ్రంశానికి గురిచేయగలడు. ఈ చట్టంవల్ల రైతులు చాలా సందర్భాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రైతులు తమకు తెలియకుండానే తమ భూముల ఆక్రమణ జరిగిపోయిందని పేర్కొన్న సందర్భాలెన్నో ఉన్నాయి.
ఒకటో దశ
కావాల్సిన భూమిని సేకరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ విషయాన్ని రెండు పేపర్లలో వేస్తారు. అందులో ఒకటి స్థానిక భాషా పత్రిక. నోటిఫికేషన్లు ఇచ్చే పేపర్లు రెండూ స్థానిక పేపర్లు అయి ఉండాలి. అదేవిధంగా అధికారిక గెజిట్‌లో కూడా ముద్రిస్తారు.
రెండో దశ
నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరికైనా అభ్యంతరం ఉన్నైట్లెతే 30 రోజుల్లో కలెక్టర్‌కు తమ అభ్యంతరాన్ని తెలియజేయాలి. దీన్ని U/S 4(1)లో పేర్కొన్నారు.
మూడో దశ
అభ్యంతరాలను కలెక్టర్ అందుకోగానే సరైన పరిశీలన చేసి ప్రభుత్వానికి పంపిస్తారు.
నాలుగో దశ
కలెక్టర్ నుంచి వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలించి నష్టపరిహారంలో ఏదైనా మార్పులు చేయవచ్చు. అయితే భూమి సేకరణ అనేది ప్రజోపయోగం కోసం కాబట్టి ఆ విషయంలో మార్పు ఉండదు.
ఐదో దశ
ప్రభుత్వం కలెక్టర్ నుంచి పొందిన అభ్యంతరాలను నివృత్తి చేస్తూ డిక్లరేషన్ ఇస్తుంది. ఈ డిక్లరేషన్‌ను నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలో మళ్లీ రెండు స్థానిక పత్రికల్లో ముద్రిస్తారు. Gazetteలో కూడా ప్రకటిస్తారు.
ఆరో దశ
డిక్లరేషన్ పేపర్ ప్రకటించిన తర్వాత ఎవరికైనా నష్టపరిహారంపై అభ్యంతరం ఉంటే కలెక్టర్‌కు తెలియజేయవచ్చు. ఈ విషయాన్ని పబ్లిక్ నోటీస్ ద్వారా ప్రకటిస్తారు.
ఏడో దశ
హైదరాబాద్, మైసూర్, ట్రావెన్కోర్లకు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో డిక్లరేషన్ ఇచ్చిన రెండు నెలల్లో నష్టపరిహారం మంజూరవుతుంది. అంటే నోటిఫికేషన్‌కు డిక్లరేషన్‌కు 12 నెలల సమయం ఉంటే, డిక్లరేషన్‌కు నష్టపరిహారానికి రెండు నెలల వ్యవధి ఉంటుంది.
ఎనిమిదో దశ
నష్టపరిహారం ఇచ్చిన తర్వాత కలెక్టర్ భూమిని స్వాధీనం చేసుకుంటారు. అంటే భూమిని స్వాధీనం చేసుకోవడానికి మొత్తం 14 నెలల సమయం పడుతుందని 1894 LAA పేర్కొంది.
తొమ్మిదో దశ
కలెక్టర్ తరపున నష్టపరిహారం డిపాజిట్ చెయ్యకపోతే మొదటి ఏడాది సాలీన 9 శాతం, తర్వాత ఏడాదిలో సాలీన 15 శాతం వడ్డీ మంజూరవుతుంది.
పదో దశ
ఒకవేళ నష్టపరిహారం నచ్చకపోతే జిల్లా కోర్టును ఆశ్రయించవచ్చు. జిల్లా కోర్టు నష్టపరిహారాన్ని నిర్ణయిస్తుంది. కానీ గతంలో ఉన్న నష్టపరిహారం కంటే తక్కువ నిర్ణయించదు. నష్టపరిహారాన్ని 30 శాతం అదనంగా మార్కెట్ విలువకు చేర్చవచ్చు. అదేవిధంగా అదనంగా 12 శాతం కూడా చేర్చవచ్చు. ఈ 12 శాతం అదనపు నష్టపరిహారం నోటిఫికేషన్ నుంచి భూమిని కలెక్టర్ పొందేవరకు లేదా కలెక్టర్ నష్టపరిహారం ఇచ్చే వరకు వర్తిస్తుంది.
1894 భూసేకరణ చట్టంలో ఇబ్బందులు
నష్టపరిహారం ఎంత ఇవ్వాలనే ఒక పద్ధతిని ఎక్కడా పేర్కొనలేదు. Local bodies అయితే కోర్టుకు వెళ్లే అధికారం కూడా లేదు. ఒకవేళ అత్యవసరమని భావిస్తే ఎలాంటి పద్ధతి లేకుండా కలెక్టర్ భూమిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కానీ అత్యవసరం అనే దానికి సరైన అర్థాన్ని మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. అంటే కలెక్టర్ ప్రతి విషయాన్ని అత్యవసరంగా భావించి క్షణాల్లో భూములను లాక్కొనే అవకాశం ఈ చట్టం కల్పించింది. అందుకే దీన్ని Raj lawగా పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం బాధితులకు భూమి విలువలో కొద్ది మొత్తం మాత్రమే నష్టపరిహారంగా ఇచ్చినట్లు సమాచారం. నష్టపరిహారం చెల్లించడంలో విపరీతమైన కాలయాపన కారణంగా ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు.
1894 భూసేకరణ చట్టం -1947 అనంతరం
1947 తర్వాత కూడా ఎన్నో లొసుగులున్న 1894 LAAను కొనసాగించారు. ఈ చట్టాన్ని 2013 వరకు అమలు చేశారు. దీన్ని సమూలంగా మార్చి భూసేకరణలో కొత్త అధ్యయాన్ని ప్రారంభిస్తూ 2013లో Land Acquisition Rehabilitation and Resettlement (LARR) పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దీనికి జైరాం రమేష్ అభినందనీయులు.
భూసేకరణ చట్టం – హైదరాబాద్, మైసూర్, ట్రావెన్కోర్
ఈ మూడు ప్రాంతాలకు 1894-1947 మధ్యలో సొంత భూసేకరణ చట్టాలు ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాలు తప్ప మొత్తం భారతదేశం 1894-1947 మధ్య 1894 LAA ను పాటించినట్లు గమనించాలి.
1934 జమ్ముకశ్మీర్ భూసేకరణ చట్టం
1934లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకంగా భూసేకరణ చట్టాన్ని తయారుచేశారు. దీన్ని State Land Acquisition Act (SLAA)గా పిలుస్తారు. 1900 నుంచి అందుబాటులో ఉన్న భూసేకరణ చట్టం 1934లో రద్దయింది.
భూసేకరణ చట్టం 2013
1947 నుంచి 2013 వరకు బ్రిటిష్ చట్టం అంటే Raj Lawను మాత్రమే పాటించడం వల్ల స్థానభ్రంశ సమస్యలు తలెత్తాయి. దీంతో 2013కు ముందున్న భూసేకరణ చట్టాలు అన్నింటిని 2013 చట్టంలో కలిపివేశారు. అవి: 1962, 1967, 1984, 2007, 2011 భూసేకరణ చట్టాలు.
Raj చట్టంతో స్థానభ్రంశానికి గురైన ప్రజలు ఇబ్బందుల పాలయ్యారని భావించి, న్యాయం చేసేందుకు ఒక సమగ్ర చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని Land Acquisition Rehabilitation and Resettlement Act (LARR)గా పిలుస్తారు. సేకరణ ఆలస్యమవుతుందనే విమర్శ ఉన్న ఈ చట్టం మిగిలిన అన్ని చట్టాల కంటే ఎక్కువ పేరు కలిగి ఉన్నది. ఈ చట్టానికి సంబంధించిన బిల్లును 2011, సెప్టెంబర్ 7న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2013 ఆగస్టు 29న లోక్‌సభ ఆమోదించగా, 2013 సెప్టెంబర్ 4న రాజ్యసభ ఆమోదించింది. చివరకు రాష్ట్రపతి 2013 సెప్టెంబర్ 27న సంతకం చేశారు. 2014 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.
–బలవంతపు భూసేకరణలేని చట్టం – 2013: 1894 చట్టం పూర్తిగా బలవంతపు చట్టం. దీని ప్రకారం కలెక్టర్ అధికంగా అధికారాలు కలిగి ఉండి అతడు అనుకుంటే క్షణాల్లో కుటుంబాలను ఖాళీ చేయించగలడు. కానీ అలాంటి పరిస్థితి 2013 చట్టంలో లేదు. 2013 చట్టంలో కలెక్టర్ ప్రేక్షకుడి పాత్ర మాత్రమే కలిగి ఉంటాడు.
–రక్షణగల భూసేకరణ చట్టం – 2013: ఈ చట్టం భూములు కోల్పోయిన వారికి పూర్తి రక్షణ ఇస్తుంది. ఇలాంటి రక్షణ 1894 చట్టంలో కనిపించదు. 2013 చట్టం స్థానభ్రంశం చెందేవారి అనుమానాలను నివృత్తి చేయడానికి అనేక సందర్భాల్లో సమావేశాలు నిర్వహిస్తుంది.
–పునరావాసంగల భూసేకరణ చట్టం – 2013: ఈ చట్టంలో పునరావాస చర్యలు 100 శాతం పేర్కొనబడ్డాయి. ఇలాంటి చర్యలు మనకు 1894 భూసేకరణ చట్టంలో కనిపించవు. 1894 చట్టంలో కలెక్టర్ బలవంతుడిగా ఉండి స్థానభ్రంశ ప్రజల హక్కులను అణిచివేసే ధోరణి కలిగి ఉండేవారు.
–సంతృప్తికర నష్ట పరిహారంగల చట్టం – 2013: ఈ చట్టంలో నష్టపరిహార నిర్ణయం న్యాయబద్ధంగా జరిగింది. ఇలాంటి నిర్ణయం 1894 చట్టంలో కనిపించదు. కలెక్టర్, కోర్టులు ప్రజోపయోగం లేదా అత్యవసరం పేరుతో ఎంతోకొంత నష్ట పరిహారం మాత్రమే ఇచ్చేవి.
–అత్యవసర అంశానికి అర్థం చెప్పిన చట్టం – 2013: 1894 భూసేకరణ చట్టం అత్యవసరం పేరుతో భూసేకరణకు అవకాశం కల్పించింది. ఐతే అత్యవసరానికి చెప్పలేకపోయింది. దీన్ని వల్ల ప్రతి అంశాన్ని అత్యవసరంగా భావించే అవకాశం ఉండేది. 2013 భూసేకరణ చట్టంలో మాత్రం పార్లమెంటు ఆమోదించిన అంశమే అత్యవసరమని పేర్కొన్నారు. సాధారణంగా రక్షణ దృష్ట్యా దీన్ని ఉపయోగిస్తారు.
–భూమి రికార్డులను పరిశీలించే చట్టం – 2013: 2013 చట్టం ప్రకారం ఎవరూ నష్టపోకుండా స్థానభ్రంశానికి గురైన ప్రజల భూములను కలెక్టర్ రెండు నెలల వ్యవధిలో పరిశీలన చేస్తాడు. భూమి విలువకు గ్రామాల్లో 4 రెట్లు, పట్టణాల్లో 2 రెట్లు నష్టపరిహారం ఇస్తారు. కాబట్టి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రజా ఉపయోగానికి పనికి వస్తాయా లేదా అని కూడా తెలుసుకోవడానికి సర్వే నిర్వహిస్తారు.
-అనేక సమావేశాలు కలిగి ఉన్న చట్టం – 2013: ఈ భూసేకరణ చట్టం ప్రకారం సేకరణ ప్రక్రియ పూర్తయ్యేసరికి దాదాపు మూడుసార్లు సమావేశాలు నిర్వహించి స్థానభ్రంశ ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ అవకాశం పాత చట్టం కల్పించలేదు. అంటే 1894లో ఏకపక్ష నిర్ణయం ఉండేది.
–సమ్మతిని ఆదరించిన చట్టం – 2013: భూములు కోల్పోయే వారికి సేకరణ ప్రక్రియలో పూర్తి స్వేచ్ఛ కల్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (PPP) ప్రాజెక్టుల విషయంలో తప్పకుండా 70 శాతం ప్రజలు తమ సమ్మతిని తెల్పాలి. ప్రైవేట్ ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తే 80 శాతం ప్రజలు ఒప్పుకోవాలి. అంటే మెజార్టీ ప్రజలు ఒప్పుకుంటేనే భూసేకరణ సాధ్యమవుతుంది. భారత భూభాగంపై ప్రభుత్వానికి కాకుండా ప్రజలకే హక్కుందని ఈ చట్టం తెలియజేస్తుంది. అంటే Eminent Domain పదం ప్రాధాన్యం కోల్పోయింది. ఒకరికి న్యాయం చేయడానికి మరొకరికి అన్యాయం చేయవద్దన్న Wilfredo Prieto ఆశయం నెరవేరింది.
–సాంఘిక ప్రభావ అంచనాగల చట్టం – 2013: 1894 చట్టంలో సాంఘిక ప్రభావ అంచనా (SIA = Social Impact Assessment) కు అవకాశం లేదు. కానీ 2013 చట్టం మాత్రం భూసేకరణపై సమాజ ప్రభావాన్ని అంచనా వేస్తుంది. అంటే భూసేకరణతో భూములను కోల్పోయేవారికి నష్టం, అదేవిధంగా ప్రాజెక్టుల స్థాపనతో కలిగే లబ్ధి. Simpleగా cost benefit analysis జరుగుతుందని గమనించాలి. SIA నిర్వహణలో గ్రామస్థాయిలో పంచాయతీలు, పట్టణ స్థాయిలో మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ పాల్గొంటుంది. ఇలాంటి సమావేశం (Public hearing) వల్ల లాభనష్టాలను సమర్థమంతంగా అంచనా వేయవచ్చు. ఈ సమావేశంతో భూములు కోల్పోయే వారికి ప్రజోపయోగంపై ఒక అవగాహన వస్తుంది. అవసరమని భావిస్తే వారు తమ భూములను కష్టమైనా సంతోషంగా ఇవ్వడానికి ఒప్పుకుంటారు. ఇలాంటి అవకాశం Raj Act 1894లో లేదు.
–పర్యావరణ ప్రభావ అంచనా కల్గిన చట్టం – 2013: ఈ చట్టంలో సమాజ ప్రభావ అంచనా (SIA)తో పాటు, పర్యావరణ ప్రభావ అంచనా (Environment Impact Assessment) ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అంటే SIA ద్వారా ప్రస్తుత సమాజం, EIA ద్వారా ప్రస్తుత, భవిష్యత్తు సమాజం పొందే లాభనష్టాలను కూడా చర్చిస్తుంది.
-నిపుణుల సంఘాన్ని కలిగి ఉన్న చట్టం – 2013: ప్రాజెక్టుల వల్ల కలిగే లాభనష్టాలను SIA అంచనా వేస్తుంది. 6 నెలల వ్యవధిలో SIA అంచనా పూర్తికాగానే దానిపై అధ్యయనం కోసం నిపుణుల సంఘం వేస్తారు. ఈ నిపుణుల సంఘంలో ఇద్దరు పునరావాసంపై అవగాహన కల్గిన నిపుణులు, ఇద్దరు అనధికార సాంఘిక శాస్త్రవేత్తలు. ఒక సాంకేతిక నిపుణుడు, ఇద్దరిని గ్రామమైతే పంచాయతీ నుంచి, పట్టణమైతే మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తీసుకుంటారు.
–ప్రజోపయోగ చట్టం – 2013: ప్రజా ఉపయోగానికి ఈ చట్టం సరైన అవగాహన కల్పించింది. నౌకాయానం, మిలిటరీ, విమానయానం, Department of Economic Affairs పేర్కొన్న అవస్థాపన సెక్షన్‌ను ఇందులో పేర్కొన్నారు. అయితే ప్రైవేటు దవాఖానా, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రైవేటు హాస్టళ్లను మినహాయించారు. వ్యవసాయపరమైన ఆహార ప్రక్రియ, గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, వ్యవసాయ అనుబంధ అంశాలు , ముఖ్యంగా డెయిరీ, చేపలు, మాంసం మొదలైన వాటిని కూడా ప్రజోపయోగంగా పేర్కొన్నారు. అదేవిధంగా జాతీయ ఉత్పాదక విధానం (NMP)లోని NIMZ అంటే జాతీయ పెట్టుబడి ఉత్పాదక మండలాలు, పారిశ్రామిక కారిడార్లను కూడా ప్రజోపయోగంగా పేర్కొన్నారు.
నీటి సంరక్షణ చర్యలు, నీటి సాగు చర్యలు, పారిశుద్ధ్యంను కూడా ఇందులో కలిపారు. గనులను కూడా చేర్చారు. ప్రభుత్వ పరిపాలన, ప్రభుత్వ విద్యాసంస్థలు, పరిశోధనను కూడా ప్రజోపయోగంగా పేర్కొన్నారు. క్రీడలు, ఆరోగ్యం, పర్యాటక, రవాణా మొదలైన వాటిని కూడా ప్రజోపయోగంగా పేర్కొన్నారు. స్థానభ్రంశం చెందిన ప్రజల కోసం చేపట్టిన ప్రాజెక్టులు, పేదల ఇండ్ల నిర్మాణాన్ని కూడా ప్రజోపయోగం కింద చేర్చారు. గ్రామాభివృద్ధి, పట్టణాభివృద్ధిని కూడా ప్రజోపయోగంగా పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ప్రజోపయోగం కిందకే వస్తుంది.
–బహుళ పంట భూమి – 2013 చట్టం: ఆహార భద్రత దృష్ట్యా సారవంతమైన భూములను సేకరించరు. ఒకవేళ తప్పనిసరి అనుకున్నప్పుడు ఎంతైతే సారవంతమైన బహుళ పంట భూమిని సేకరిస్తున్నారో.. అంతే మొత్తం నూతనంగా వ్యవసాయానికి సాగులోకి తీసుకురాగల్గిన భూమిని అభివృద్ధి చేయాలి. అంటే 1947కు ముందున్న సారవంత భూములను వ్యవసాయేతర అవసరాలకు ఇవ్వరాదన్న చట్టాన్ని పరోక్షంగా అమలుచేసినట్లయింది. కాబట్టి ఈ చట్టం సారవంత భూమి పరిమాణాన్ని తగ్గించకుండా జాగ్రత్త పడిందని గమనించాలి.
–ప్రిలిమినరీ నోటిఫికేషన్ – 2013 చట్టం: సేకరణలో భాగంగా సాంఘిక ప్రభావ అంచనా, నిపుణుల సంఘం పరిశీలన పూర్తయిన తర్వాత అంశాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఒక నోటిఫికేషన్ ఇస్తారు. దీన్నే Premilinary Notification అంటారు.
రెండు స్థానిక దిన పత్రికల్లో విషయాన్ని ప్రకటిస్తారు. ఈ రెండు పేపర్లలో ఒకటి స్థానిక భాషదై ఉండాలి. అదేవిధంగా వెబ్సైట్లో, తహసీల్, జిల్లా ఆఫీసులలో ప్రకటిస్తారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ తర్వాత కలెక్టర్ భూమి రికార్డులను పరిశీలన చేస్తాడు. ఎందుకంటే కొన్ని భూములు ప్రజోపయోగానికి సరిపోకపోవచ్చు.
–సందేహాల నివృత్తి – 2013 చట్టం: ప్రిలిమినరీ నోటిఫికేషన్ తర్వాత సందేహాలు ఉన్నవారు కలెక్టర్‌కు తమ సమస్యలను చెప్పవచ్చు. ఆ సందేహాలను కలెక్టర్ విని తన రిపోర్టును ప్రభుత్వానికి పంపిస్తాడు. అయితే సందేహాలు ఉన్నవారు ప్రిలిమినరీ నోటిఫికేషన్ తర్వాత 60 రోజుల్లో కలెక్టర్‌కు తమ సందేహాలు ఇవ్వాలని చట్టం పేర్కొంది. అంటే కలెక్టర్ ఈ ప్రక్రియలో ఒక Observer గా మాత్రమే ఉంటాడు. అంతేకాని 1894 చట్టంలోలాగా నియంతగా ప్రవర్తించే అవకాశం లేదు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు