చంపారన్ సత్రాగ్రహం ముఖ్యోద్దేశ్యం ఏంటి?
19వ శతాబ్దంలో ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్యావిధానం భారతీయుల మనస్సులను వికసింపజేసి, యథార్థానికి నాటి ప్రపంచ పోకడలను సన్నిహితంగా తీసుకొచ్చింది. కొంతకాలం వరకు భారతీయులు పాశ్చాత్య విద్యతోపాటు ఫ్రాన్స్‌లో వెల్లివిరిసిన హేతువాద ప్రభావాల్లో ఉండిపోయారు. నాటి భారతీయ పునరుజ్జీవనోద్యమం నిజమైందని, కాన్స్టాంటినోపుల్ నగర పతనం తర్వాత ఐరోపాలో జరిగిన విప్లవాత్మకమైన ఉద్యమం కంటే తీవ్రమైందని, విస్తృతమైనదని సర్ జాదునాథ్ సర్కార్ అభిప్రాయపడ్డారు.
-మత సంస్కరణ అనేది హిందువులకు కొత్తకాదు. భారతదేశ చరిత్ర పరిశీలిస్తే వేదకాలం నుంచి హిందూమతం సంస్కరణలకు లోనైనట్లు మనకు తెలుసు. వేదమతం నుంచి ఉపనిషత్తుల మతాలకు, బౌద్ధ, జైన మతాలకు మార్పులు గమనించడమైంది. తర్వాత కాలంలో ఇస్లాం మత ప్రభావం వల్ల హిందూ మతంలో జ్ఞాన, కర్మ మార్గాల స్థానంలో అందరికీ సులభమార్గమైన భక్తిమార్గం ద్వారా మోక్షాన్ని పాందవచ్చనే భావన కలిగి మధ్యయుగ శతాబ్దాల్లో చైతన్యుడు, వల్లభాచార్యుడు, కబీర్, తుకారాం, గురునానక్, రాందాస్ వంటి భక్తులు ప్రచారం చేశారు.
-19వ శతాబ్దంలో క్రైస్తవ మతవ్యాప్తిని అరికట్టడం కోసం, తమ మతస్తులకు మతంపై విశ్వాసం సన్నగిల్లకుండా ఉండటం కోసం హిందూమత సంస్కరణోద్యమానికి పూనుకున్నారు. సూక్ష్మంగా పరిశీలిస్తే పునరుజ్జీవనోద్యమానికి ప్రాచీన భారతీయ సాహిత్య అధ్యయనం, ఆంగ్ల విద్య, సాహిత్య ప్రభావం, జాతీయతా భావాలు, భారత సంస్కృతిని అణచివేయడానికి విదేశీయులు పాటించిన విధానాలు ముఖ్య కారణంగా కనిపిస్తాయి. ఇందులో భాగంగా పాశ్చాత్య భావాలను అలవర్చుకోవడం, వితంతు పునర్వివాహం, కులాంతర వివాహాలు, స్త్రీ విద్య తదితర డిమాండ్ల మూలంగా, సాంఘిక ధోరణులు వాటంతటవే ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రాజా రామ్మోహన్రాయ్ (1772-1833)
-1772లో బెంగాల్‌లోని రాధానగర్‌లో రాజా రామ్మోహన్రాయ్ జన్మించాడు.
-రాజారామ్మోహన్రాయ్ను భారతదేశంలో మొదటి మోడ్రన్ మ్యాన్‌గా కీర్తిస్తారు.
-సాంఘిక, మత, రాజకీయ ఉద్యమాలకు నాంది పలికాడు. ఈయనను భారతదేశ సంఘ సంస్కరణ పితగా పేర్కొంటారు.
-ఈయన ఐరోపా ఉదారభావం వల్ల ప్రభావితుడయ్యాడు.
-వివిధ గ్రంథాల్లో వాస్తవంగా ఏం చెప్పారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో పర్షియన్, అరబిక్, సంస్కృతం, ఇంగ్లిష్, ఫ్రెంచి, లాటిన్, గ్రీకు, హిబ్రూ భాషలను నేర్చుకున్నాడు.
-ఈయన ఏకేశ్వరోపాసనను నమ్మాడు. విగ్రహారాధనను వ్యతిరేకించాడు. ఈ నేపథ్యంలో 1803లో పర్షియన్ భాషలో తువఫత్ ఉల్ మొహావుద్దీన్ లేదా A GIFT TO MONOTHEISTS అనే గ్రంథం రాశాడు.
-మత అంశాల్లో హేతుబద్ధతకు, మానవ పరిశీలనా శక్తికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పాడు.
-1815లో హిందూమతంలోని సాంఘిక చెడులను తొలిగించడానికి ఆత్మీయ సభను కలకత్తాలో ఏర్పాటు చేశాడు. ఇదే 1828లో బ్రహ్మ సమాజంగా మారింది.
-క్రైస్తవ మతంలో హేతుబద్ధత లేని అంశాలను విమర్శిస్తూ 1820లో THE PRECEPTS OF JESUS, THE GUIDE TO PEACE AND HAPPINESS అనే గ్రంథాలు రాశాడు.
-క్రైస్తవ మిషనరీల విమర్శలకు వ్యతిరేకంగా వేదాంత తత్వంలోని గొప్పతనాన్ని బలపరిచాడు.
-ఈయన 1829లో సతీసహగమన చట్టం తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
-ఆధునిక విద్యావిధానం ఇంగ్లిష్ మాధ్యమం ద్వారా అందాలని పోరాడాడు. ఈ నేపథ్యంలో మెకాలే బిల్లు వచ్చింది.
-భారతదేశంలో రాజకీయ ఆలోచనలను చేసిన మొదటి వ్యక్తి రాజా రామ్మోహన్రాయ్ ప్రజలకు సంబంధించిన అంశాలపై పాలనలో మార్పు రావాలని, ప్రజా ఆందోళనను నిర్వహించిన మొదటి వ్యక్తి.
బ్రహ్మ సమాజం (1828)
-హిందూ మతంలోని పవిత్రతను కాపాడాలని, ఏకేశ్వరోపాసనను పెంచాలనే లక్ష్యంతో 1828లో బ్రహ్మ సమాజాన్ని కలకత్తాలో స్థాపించాడు.
-బ్రహ్మ సమాజం సభ్యులు ఒకే దైవాన్ని నమ్మారు. రామ్మోహన్రాయ్ వర్ణవ్యవస్థను, ఛాందస బ్రాహ్మణుల క్రౌర్యాన్ని, కర్మకాండను, విగ్రహారాధనను ఖండించాడు.
-హిందూ మతంలోని లోపాలను తొలిగించి, వేదాలను, ఉపనిషత్తులను ఆధారంగా చేసుకుని, ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించాలనేదే బ్రహ్మసమాజం ప్రధాన ఆశయం.
-ఈయన నాయకత్వంలో బ్రహ్మ సమాజం సతీసహగమనాన్ని, బాల్య వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించింది.
-బ్రహ్మసమాజం అనుసరించిన ముఖ్య సిద్ధాంతం ఏకేశ్వరోపాసన. ఇది విశ్వమానవ సౌభ్రాతృత్వ సిద్ధాంతాన్ని ఎలుగెత్తి చాటింది. అన్ని మతాలను, మత గ్రంథాలను గౌరవించాలని ఉపదేశించింది.
-కానీ, ఏ మత గ్రంథాన్ని ప్రామాణికంగా స్వీకరించలేదు. బ్రహ్మసమాజాన్ని సాంఘిక మత సంస్కరణోద్యమంగా వర్ణించవచ్చు.
-రాజా రామ్మోన్రాయ్ తన భావాలను ప్రచారం చేయడానికి సంవాద కౌముది, మిరాత్ ఉల్ అక్బర్ అనే పత్రికలను స్థాపించాడు.
-ఈయనకు చివరి మొగల్ చక్రవర్తుల్లో ఒకరైన రెండో అక్బర్ రాజా అనే బిరుదును 1830లో ఇచ్చాడు.
-1833లో రాజా రామ్మోహన్రాయ్ రెండో అక్బర్ పెన్షన్ కోసం బ్రిటన్ కోర్టులో వాదిస్తూ బ్రిస్టల్ నగరంలో మృతిచెందాడు.
-ఈయన మరణానంతరం విశేషానుభవజ్ఞులు, సంస్కారవంతులైన ఇతని అనుచరులు దేవేంద్రనాథ్‌ఠాగూర్, కేశవ చంద్రసేన్లు బ్రహ్మ సమాజం బాధ్యతలను భుజానికెత్తుకున్నారు.
రైతు ఉద్యమాలు
రామోసి విప్లవం:
ఈ ఉద్యమాన్ని మహారాష్ట్రలో వాసుదేవ్ బలవంత్ పాడ్కే ప్రారంభించాడు. రామోసీలు, లంగర్లు అనే కింది కులాల వారిని చైతన్యపరిచి 1879లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ తిరుగుబాట్లు చేయించాడు.
బిజోల ఉద్యమం:
ప్రభుత్వం నిరంతరం పెంచుతున్న పన్నులను చెల్లించకూడదని 1905లో రాజస్థాన్‌లోని మేవార్ ప్రాంతంలో బిజోల రైతులు ఈ ఉద్యమాన్ని చేపట్టారు. దీనికి విజయ్‌సింగ్ పాతిక్, సాధు సీతారాందాస్, మాణిక్‌లాల్ వర్మ నాయకత్వం వహించారు.
చంపారన్ సత్యాగ్రహం:
బీహార్‌లోని చంపారన్‌లో 1860 నుంచి తీన్ కథియా విధానాన్ని బ్రిటిష్‌వారు అమలుపరిచారు. 3/20 వంతు నీలిమందును పండించాలని రైతులపై ఒత్తిడి చేయడంతోపాటు ఆ పంటను తక్కువ ధరకు కొనేవారు. 1900లో సింథటిక్ డై నుంచి పోటీ రావడంతో బ్రిటిష్ వ్యాపారులు మరింత తక్కువకు నీలిమందును విక్రయించాలని రైతులను అనేక బాధలు పెట్టారు. ఈ నేపథ్యంలో 1916 లక్నో కాంగ్రెస్ సమావేశంలో రాజ్‌కుమార్ శుక్ల మహాత్మాగాంధీని కలుసుకుని ఉద్యమం చేపట్టాలని కోరారు. 1917లో గాంధీ, బాబు రాజేంద్రప్రసాద్ (బీహార్ గాంధీ), నారాయణ సింహ, జేబీ కృపలాని తదితరులతో కలిసి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం పెంచిన పన్నులను (షారాబేసి) తగ్గించడానికి అంగీకరించింది.
ఖేడా లేదా ఖైరా సత్యాగ్రహం:
గుజరాత్‌లోని ఖేరా ప్రాంతంలో పంటలు సరిగా పండకపోయినా పన్నులు చెల్లించాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో 1917లో మోహన్‌లాల్ పాండ్య ఉద్యమం చేపట్టారు. ఆ తర్వాత ఈ ఉద్యమాన్ని మహాత్మాగాంధీ, వల్లభాయ్ పటేల్, మహాదేశ్ దేశాయ్ చేపట్టి ప్రభుత్వానికి విన్నవించి సానుకూల ఫలితాలు సాధించారు.
బర్దోలి సత్యాగ్రహం (1928):
ఉద్యమ నాయకుడు వల్లభాయ్‌పటేల్. అయితే, ఉద్యమ సన్నద్ధతను కళ్యాణ్‌జీ మెహతా, కునవర్దీ మెహతా అనే యువకులు చేశారు. గుజరాత్‌లోని బర్దోలిలో స్థానిక ప్రభుత్వం 22 శాతం భూమి పన్నులు పెంచడంతో ఉద్యమం చేపట్టారు. బొంబాయి రాష్ట్ర ప్రభుత్వం మాక్స్వెల్ బ్రూన్ఫీల్డ్ అధ్యక్షతన విచారణ కమిటీ వేయగా, నిజానిజాలు నిర్ధారించి పన్నును తగ్గించారు.
మోప్లా ఉద్యమం:
కేరళలో ముస్లిం రైతులు కౌలుదారి హక్కుల కోసం 1920లో ఉద్యమం చేపట్టారు. ఖిలాఫత్ ఉద్యమం వీరిని ఉత్తేజపరిచింది. బ్రిటిష్ ప్రభుత్వం ముఖ్య నాయకులను అరెస్టు చేయడంతో ప్రజలు హింసకు పాల్పడ్డారు. ఈ ఉద్యమానికి మహ్మద్ హాజి, అలీ ముసలియార్ నాయకత్వం వహించారు. వ్యవసాయ తిరుగుబాటు కాస్తా మతం రంగు పులుముకుంది. భూస్వాములు హిందూ అగ్రవర్ణాలైన నంబూద్రిలు, నాయర్లు అనే బ్రాహ్మణులు. దీంతో వీరిపై దాడులు జరిగాయి. ఈ తిరుగుబాటును బ్రిటిష్ వారు అణచివేశారు. ఈ సమయంలో బ్లాక్ హోల్ పోడనుర్ సంఘటన జరిగింది. రైల్వేవ్యాగన్లో 200 మంది తిరుగుబాటుదారులను బంధించడంతో గాలి ఆడక 66 మంది మృతిచెందారు.
బోర్సాద్ సత్యాగ్రహం:
పెంచిన పోల్ ట్యాక్స్(దొంగలను అణచివేసి, శాంతిభద్రతలు కాపాడుతున్నామని, కాబట్టి పన్నులను పెంచాలని గుజరాత్లో ప్రభుత్వం ఒత్తిడి చేసింది)కు వ్యతిరేకంగా సర్ధార్ వల్లభాయ్‌పటేల్ నాయకత్వాన 1923లో ఉద్యమం జరిగింది. ఈ పన్నును ప్రభుత్వం 1924లో ఎత్తివేసింది.
కిసాన్ సభ ఉద్యమం:
ఆల్ ఇండియా కిసాన్ సభను 1934లో లక్నోలో స్థాపించారు. ఈ సభకు అధ్యక్షులుగా స్వామి సహజానంద సరస్వతి, ప్రధాన కార్యదర్శిగా ఎన్జీరంగా వ్యవహరించారు. రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం దేశంలో మొదటిసారి రైతు శిక్షణా సంస్థ ఇండియన్ పీసెంట్స్ ఇన్స్టిట్యూట్ను ఎన్జీరంగా నిడబ్రోలులో ప్రారంభించాడు. బెంగాల్లో 1946లో జరిగిన రైతు ఉద్యమాన్ని తేబాగా ఉద్యమం అంటారు. ఈ ఉద్యమానికి సంబంధించి ఫ్లౌడ్ కమిషన్ వేసి నివారణ చర్యలు చేపట్టారు.
దేవేంద్రనాథ్ ఠాగూర్ (1817-1905)
-ఈయన రాజా రామ్మోహన్రాయ్ ఆలోచనలను, భావాలను వ్యాప్తి చేయడానికి తత్వబోధిని సభను 1839లో స్థాపించాడు. బెంగాలీ భాషలో తత్వబోధిని అనే పత్రికను ప్రారంభించాడు.
-ఈ పత్రికకు ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజేంద్రలాల్లు వ్యాసాలు రాసి పంపేవారు.
-బ్రహ్మసమాజం నిర్వహణలో దేవేంద్రనాథ్ ఠాగూర్‌కు, కేశవచంద్రసేన్కు విభేదాలు వచ్చాయి.
-కేశవచంద్రసేన్ కులం పోవాలని, మతపరంగా బ్రహ్మసమాజం హిందూ మతానికి దూరంగా ఉండాలని తెలిపాడు.
-దేవేంద్రనాథ్ ఠాగూర్ కులాన్ని పోగొట్టలేమని, అందులోని విచక్షణాయుత కాఠిన్యాన్ని తగ్గించేలా ప్రచారం చేయాలని, బ్రహ్మసమాజం హిందూమతంలో ఒక భాగంగా ఉండాలని తెలిపాడు.
-చివరి రోజుల్లో దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆధ్యాత్మిక, మత గ్రంథాల అధ్యయనంలో నిమగ్నమయ్యాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు