కేంద్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ (2019 -20 )
2019-20 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో దేశ రక్షణరంగానికి కేంద్రం మునుపెన్నడూ లేని విధంగా భారీగా నిధులు కేటాయించింది. దేశ రక్షణకు రూ.3.05 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.20 వేల కోట్లు అధికం. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రక్షణరంగానికి రూ.2.85 లక్షల కోట్లు కేటాయించారు.
డిజిటల్ ఇండియా
దేశవ్యాప్తంగా ఒక లక్ష గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా మార్చటానికి కేంద్రప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు జాతీయ కృత్రిమ మేధో కేంద్రాన్ని ప్రారంభించనుంది. 12 లక్షల మంది పని చేస్తున్న మూడు లక్షలకుపైగా కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీలు) దేశప్రజలకు పలు రకాల డిజిటల్ సేవలను అందిస్తున్నాయని, వీటివల్ల గ్రామా ల్లో కూడా డిజిటల్ మౌలిక వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి అత్యాధునిక టెక్నాలజీల నుంచి లభించే ప్రయోజనాలను అందిపుచ్చుకోవటానికి జాతీయ కృత్రిమమేధస్సు కార్యక్రమానికి ప్రభు త్వం రూపకల్పన చేయనున్నది. వివిధ నైపుణ్య రంగాల సమన్వయంతో ఏర్పాటయ్యే జాతీయ ఏఐ కేంద్రం దీనికి చోదకశక్తిలా పని చేయనున్నది. జాతీ య ఏఐ పోర్టల్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమం కింద సెల్‌ఫోన్ లేదా సెల్‌ఫోన్ విడిభాగాల కంపెనీల సంఖ్య 2 నుంచి 268కి పెరిగింది.
పర్యావరణం ప్రధానం
కేంద్ర ప్రభుత్వం తన మధ్యంతర బడ్జెట్లో పర్యావరణానికి రూ.3,111.20 కోట్లు కేటాయించింది. 2018-19 బడ్జెట్లో ఈ రంగానికి రూ.2,586.67 కోట్లు కేటాయించగా ఈ ఆర్థిక సంవత్సరంలో 20 శాతం నిధులు పెంచారు. పులుల సంరక్షణకు ఉద్దేశించిన టైగర్ ప్రాజెక్టు కోసం రూ.350 కోట్లు, ఏనుగు ల సంరక్షణ కోసం ప్రాజెక్టు ఎలిఫెంట్‌కు రూ.30 కోట్లు కేటాయించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు రూ.100 కోట్లు కేటాయించారు. అయితే కాలుష్యం తగ్గింపు చర్యల కోసం ఉద్దేశించిన నిధుల్లో 50 శాతం కోత విధించారు. గత ఏడాది రూ.20 కోట్లు కేటాయించగా, ఈసారి అది రూ.10 కోట్లకు తగ్గింది. జంతు సంరక్షణ బోర్డు (ఏడబ్ల్యూబీ)కు రూ.12 కోట్లు, జాతీయ హరిత భారత కమిషన్‌కు రూ.240 కోట్లు కేటాయించారు.
విద్య
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో విద్యారంగానికి ప్రభుత్వం రూ.93,847.64 కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోల్చితే పదిశాతం ఎక్కువ. కానీ మొత్తం బడ్జెట్లో విద్యకు కేటాయిస్తున్న ది గత ఏడాదితో పోల్చితే తక్కువ. రూ.93,847.64 కోట్ల విద్యారంగ బడ్జెట్లో అత్యధికంగా పాఠశాల విద్యకు రూ.56,386.63 కోట్లు, ఉన్నతవిద్యకు రూ. 37,464.01 కోట్లు కేటాయించారు. గతేడాది విద్యారంగానికి రూ.85,010 కోట్లు కేటాయించగా.. ఈసారి దానిని రూ.8,837 కోట్లకు పెంచారు. కొత్తగా విద్యావ్యవస్థలో మౌలికవసతుల పునరుత్తేజితం కోసం రైజ్-2022 పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనికోసం వచ్చే నాలుగేండ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చుచేయాలని ప్రతిపాదించారు. పరిశోధక విద్యాసంస్థలకు రూ.608.87 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఈ కేటాయింపులు రూ.350.23 కోట్లు. అలాగే రెండు ఎస్పీఏ (స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్)లను ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి ప్రకటించారు. దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో స్వయంప్రతిపత్తితో నడిచే 18 ఎస్పీఏలను ఏర్పాటుచేస్తారు. గతేడాదితో పోల్చితే ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, యూజీసీ వంటి సంస్థలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. ఐఐఎంల బడ్జెట్ రూ.1,036 కోట్ల నుంచి రూ.415.41 కోట్లకు, ఐఐటీలకు రూ.6,326 కోట్ల నుంచి రూ.6,223.02 కోట్లకు, యూజీసికి రూ.4,722.75 కోట్ల నుంచి రూ.4,600.66 కోట్లకు, ఏఐసీటీఈకి రూ.485 కోట్ల నుంచి రూ.466 కోట్లకు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్, రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)కు రూ.689 కోట్ల నుంచి రూ.660 కోట్లకు తగ్గింది
సంచార జాతుల గుర్తింపునకు కమిటీ
దేశంలో ఇప్పటికీ వర్గీకరణకు నోచుకోని సంచార జాతులు, పాక్షిక సంచార జాతులు, డీనోటిఫైడ్ తరగతుల వారిని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నది. 2019-20 తాత్కాలిక బడ్జెట్లో ఈ విషయాన్ని కేంద్రం ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల్లో ఎస్సీల సంక్షేమం కోసం రూ.56,619 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.62,474 కోట్లకు పెంచారు. 2019-20 బడ్జెట్లో ఈ మొత్తాన్ని 35.6 శాతం పెంచి రూ.76,801 కోట్లుగా ప్రతిపాదించారు. 2018-19 బడ్జెట్లో ఎస్టీల సంక్షేమానికి రూ.39,135 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్ అంచనాల్లో 28 శాతం పెంచి రూ.50,086 కోట్లుగా ప్రతిపాదించారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు..
2019-20 కేంద్ర తాత్కాలిక బడ్జెట్లో తెలంగాణలోని సింగరేణికి పెట్టుబడి కింద రూ. 1,850కోట్లు కేటాయించారు. గిరిజన వర్సిటీకి రూ.4 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌కు రూ.80 కోట్లు కేటాయించారు. రైల్వేల్లో భద్రాచలం-సత్తుపల్లి కొత్త రైల్వే మార్గానికి రూ.405 కోట్లు, మనోహరాబాద్-కొత్తపల్లి లైన్‌కు రూ.200 కోట్లు ప్రకటించారు. కాజీపేట-బల్హార్షా మూడోలైన్‌కు రూ.265 కోట్లు, సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులకు రూ.200 కోట్ల బడ్జెట్ ఇచ్చారు.
ఈశాన్యానికి 21 శాతం అధికం
మధ్యంతర బడ్జెట్లో ఈశాన్య రాష్ర్టాలకు భరోసా కలిగించేలా చర్యలు చేపట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల కన్నా ఈ సారి 21శాతం అధికంగా రూ.58,166 కోట్ల నిధులు కేటాయించారు. ఈ ప్రాంతంలో అమలులో ఉన్న కొన్ని ప్రధాన పథకాలకు బడ్జెట్ కేటాయించారు. నార్త్ఈస్ట్రన్ కౌన్సిల్ పథకాలకు రూ.580 కోట్లు, ఈశాన్య రాష్ర్టాలు, సిక్కిం రాష్ర్టానికి సెంట్రల్ పూల్ ఆఫ్ రిసోర్సెస్ కింద రూ.931 కోట్లు, ఇతర రాయితీ కింద చెల్లింపులకు రూ.974 కోట్లు, పారిశ్రామిక యూనిట్లకు సెంట్రల్, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ తిరిగి చెల్లింపులకు రూ.1,700 కోట్ల నిధులు కేటాయించారు.
మహిళా శిశు సంక్షేమం
కేంద్ర ప్రభుత్వం తన మధ్యంతర బడ్జెట్లో మహిళ, శిశు సంక్షేమానికి పెద్దపీట వేసింది. రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రసూతి ప్రయోజనాలు, శిశు సంరక్షణ సేవల కోసం 20 శాతం పెరుగుదలతో రూ.29,000 కోట్లు కేటాయించింది. గత ఏడాది ఈ విభాగానికి రూ.24,758 కోట్ల నిధులు అందించారు. ప్రసూతి ప్రయోజనం కోసం ప్రారంభించిన ప్రధానమంత్రి మాతృవందన యోజన (పీఎంఎంవీవై) కార్యక్రమానికి గతంలో రూ.1,200 కోట్లు కేటాయించగా దానిని ప్రస్తుత బడ్జెట్లో రూ.2,500 కోట్లకు పెంచారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఈ కార్యక్రమం కింద ఒక్కొక్కరికీ రూ.6,000 అందిస్తారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రోగ్రాంకు రూ.1,500 కోట్లు కేటాయించారు. గతంలో ఈ కార్యక్రమానికి రూ.925 కోట్లు కేటాయించారు. బేటీ పడావో-బేటీ బచావో కార్యక్రమానికి గత బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించగా ప్రస్తుతం రూ.290 కోట్లు ఇచ్చారు. జాతీయ న్యూట్రిషన్ మిషన్‌కు రూ.3,400 కోట్లు కేటాయించారు. మహిళా శక్తి కేంద్రాలకు నిధులను రూ.115 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెంచారు. నేషనల్ క్రెచ్ స్కీంకు రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ పథకం కింద రూ.165 కోట్లు ఇచ్చారు. మహిళా రక్షణ పథకం ఉజ్వలకు రూ.30 కోట్లు కేటాయించారు. వితంతువుల గృహనిర్మాణ సహాయ నిధులను రూ.8 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెంచారు.
ఆరోగ్యమే మహాభాగ్యం
ఆరోగ్య రంగానికి 2019-20 బడ్జెట్లో రూ.61,398 కోట్లు కేటాయించారు. 2018-19 వార్షిక బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.52,800 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి 16 శాతం నిధులను పెంచింది. ఈ మొత్తంలో ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేవై) బీమా పథకానికి రూ.6,400 కోట్లు కేటాయించారు. ప్రధాని నరేంద్రమోదీ 2018 సెప్టెంబర్ 23న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున దేశ వ్యాప్తంగా 10 కోట్లకుపైగా పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుకు జాతీయ పట్టణ ఆరోగ్య పథకం కింద రూ.250 కోట్లు, జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం కింద 1,350.01 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద దాదాపు 1.5 లక్షల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలను 2022 నాటికి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా మారుస్తారు.
జాతీయ ఆరోగ్య పథకానికి (ఎన్హెచ్ఎం) గత బడ్జెట్లో రూ.30,129.61 కోట్లు కేటాయించగా ఈసారి రూ.31,745 కోట్లకు పెంచారు. ఎన్హెచ్ఎం పరిధిలోని రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్ఎస్బీవై) పథకానికి రూ.1,844 కోట్లు కుదించి కేవలం రూ.156 కోట్లు మాత్రమే కేటాయించింది. ఎయిడ్స్, లైంగిక వ్యాధుల (ఎస్టీడీ) నియంత్రణ పథకానికి గత బడ్జెట్లో రూ.2,100 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో అదనంగా మరో రూ.400 కోట్లు కేటాయించింది. అలాగే ఎయిమ్స్‌కు కేటాయింపులను రూ.3,018 కోట్ల నుంచి రూ.3,599.65 కోట్లకు, వృద్ధుల ఆరోగ్య సంరక్షణ పథకానికి రూ.80 కోట్ల నుంచి రూ.105 కోట్లకు పెంచారు. మానసిక వికలాంగుల ఆరోగ్య సంరక్షణ పథకానికి నిధులు రూ.50 కోట్ల నుంచి రూ.40 కోట్లకు తగ్గించారు. నర్సింగ్ సేవల మెరుగుదలకు రూ.64 కోట్లు, ఫార్మసీ స్కూళ్లు, కాలేజీల ఉన్నతీకరణకు రూ.5 కోట్లు, జిల్లా దవాఖానలు, రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు (పోస్టు గ్రాడ్యుయేట్ సీట్లు), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థల ఉన్నతీకరణకు రూ.800 కోట్లు, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.2 వేలకోట్లు, రాష్ర్టాల్లో ప్రభుత్వ పారామెడికల్ సైన్సెస్ సంస్థలు, పారామెడికల్ కళాశాలల ఏర్పాటుకు రూ.20 కోట్లు కేటాయించారు.
గృహ భద్రతకు ప్రాధాన్యం
హోంశాఖకు తొలిసారి బడ్జెట్ కేటాయింపులు లక్ష కోట్ల రూపాయలు దాటాయి. గత బడ్జెట్లో ఈ శాఖకు రూ.99,034 కోట్లు కేటాయించగా 2019-20 బడ్జెట్లో రూ.1,03,927 కోట్లు కేటాయించింది. ఇవి గతంకంటే 4.9 శాతం ఎక్కువ. దేశ రాజధానిలో శాంతి, భద్రతలను పరిరక్షించే ఢిల్లీ పోలీసు విభాగానికి రూ.7,496.91 కోట్లు కేటాయిచిన మోదీ ప్రభుత్వం.. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.2,000 కోట్లు కేటాయించింది. సీఆర్పీఎఫ్కు రూ.23,742.04 కోట్లు (గత బడ్జెట్లో రూ.22,646.63 కోట్లు), ఇండో-పాక్, ఇండో-బంగ్లా సరిహద్దులను పరిరక్షించే సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్కు) రూ.19,647.59 కోట్లు (గత బడ్జెట్లో రూ.18,585.96 కోట్లు) కేటాయించింది. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ సహా కేంద్ర సాయుధ బలగాల్లోని ఐటీబీపీ (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్), సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్), ఎస్సెస్బీ (సశస్త్ర సీమా బల్), అస్సాం రైఫిల్స్, ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్)కి కలిపి గత బడ్జెట్లో రూ.67,779.75 కోట్లు కేటాయించగా ఈసారి రూ.71,618.70 కోట్లకు పెంచింది.
ఇంటెలిజెన్స్ బ్యూరోకు రూ.2,056.05 కోట్ల నుంచి రూ.2,198.35 కోట్లకు, వీవీఐపీలకు రక్షణ కల్పించే ఎస్పీజీకి రూ.411.68 కోట్ల నుంచి రూ.530.75 కోట్లకు నిధులు పెంచింది. పోలీసులకు సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధితోపాటు బ్యారక్‌లు, క్వార్టర్ల నిర్మాణం, వాహనాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొనుగోలు కోసం రూ.5,117 కోట్లు, పోలీసు బలగాల ఆధునీకరణకు రూ.3,378 కోట్లు, సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పన, పర్యవేక్షణకు రూ.2,000 కోట్లు, మహిళల రక్షణ, సాధికారత పథకానికి రూ.1,330 కోట్లు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి పథకానికి రూ.825 కోట్లు, జమ్మూ-కశ్మీర్ శరణార్థుల సహాయ, పునరావాస కార్యక్రమానికి రూ.809 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ల కోసం రూ.953 కోట్లు, మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన నిర్భయ నిధికి రూ.50 కోట్లు, జాతీయ విపత్తు సహాయ నిధికి రూ.10,000 కోట్లు, జనగణన, సర్వే కోసం రూ.541.33 కోట్లు, జమ్మూ-కశ్మీర్లో ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం రూ.50 కోట్లు, హిందీ భాషా ప్రచార కార్యక్రమానికి రూ.78.09 కోట్లు, రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం రూ.4,895.81 కోట్లు కేటాయించింది. కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్, నికోబార్ దీవులకు రూ.4,817.48 కోట్లు, చండీగఢ్‌కు రూ.4,291.70 కోట్లు, దాద్రానగర్ హవేలీకి రూ.1,177.99 కోట్లు, డామన్,డయ్యూకు రూ.821.4 కోట్లు, లక్షద్వీప్‌కు రూ.1,276.74 కోట్లు కేటాయించింది.
రైల్వేలు.. మౌళికాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: రైల్వేల మొత్తం మూలధన వ్యయం రూ.1,58,658 కోట్లుకాగా 2019-20 బడ్జెట్లో రూ.64,587 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద గ్రామీణ రోడ్ల నిర్మాణం మూడింతలు పెరిగినట్లు మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. మొత్తం 17.84 లక్షల ఆవాసాలకుగాను 15.80 లక్షల ఆవాసాలను పక్కారోడ్లతో అనుసంధానించామని, మిగతావాటిని అనుసంధానించే ప్రక్రియ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. 2014- 18 మధ్యకాలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.53 కోట్ల ఇండ్లను నిర్మించినట్లు తెలిపారు.
సామాజిక న్యాయం, సాధికారత
వెనుకబడిన వర్గాలు, దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేసే సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు 2019-20 బడ్జెట్లో నిధులు 0.6 శాతం పెరిగాయి. గత బడ్జెట్లో ఈ శాఖకు రూ.7,750 కోట్లు కేటాయించగా ఈసారి రూ.7,800 కోట్లకు పెంచారు. ఈ నిధుల్లో దివ్యాంగుల సాధికారత కోసం 7 శాతం పెంచారు. గత బడ్జెట్లో వారికి రూ.1,070 కోట్లు కేటాయించగా, ఈసారి 1,144.90 కోట్లు ఇచ్చారు. ఎస్సీ, బీసీ, సఫాయి కర్మచారీలతోపాటు మొత్తం ఐదు జాతీయ కమిషన్లకు రూ.39.87 కోట్లు కేటాయించారు. ఎస్సీలు, బీసీలు, ఈబీసీలకు నేషనల్ ఫెలోషిప్ కింద ఇచ్చే కేంద్ర స్కాలర్షిప్లు, ఎస్సీలు, ఓబీసీలకిచ్చే ప్రవాస భారతీయ స్కాలర్‌షిప్‌ల నిధులకు భారీగా కోత విధించారు. వీటి కోసం గత బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో దానిని రూ.390.50 కోట్లకు తగ్గించింది.
5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
రానున్న ఐదేండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని 2019-20 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఆ తదుపరి ఎనిమిదేండ్లలో ఇది 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకొనే అవకాశం ఉందని తెలిపింది. 2013-14లో ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో నిలిచిన భారత్ ఇప్పుడు 6వ స్థానానికి చేరుకున్నదని మంత్రి పీయూష్‌గోయల్ తెలిపారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు