కులం-ప్రాథమిక భావనలు అంటే..?
Caste అనే ఇంగ్లిష్ పదం Casta (కాస్టా) అనే స్పానిష్ పదం, Castus (కాస్టస్) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించిందని కేల్కర్ గుర్తించాడు.
-Casta అంటే వంశక్రమం (Leanage) లేదా జాతి (Race) అని స్పానిష్ భాషలో అర్థం ఉంది. అలాగే కాస్టస్ అంటే లాటిన్లో స్వచ్ఛత (Pure) అని అర్థం.
-కులం అనే పదాన్ని పోర్చుగీసువారు మొదటిసారిగా 17వ శతాబ్దంలో భారతీయ సమాజంలోని స్తరీకరణను గమనించి, దానిని Caste Systemగా పిలిచారు.
-ప్రపంచంలో ప్రతి సమాజం.. సమాజంలోని వివిధ ఉమ్మడి లక్షణాలుగల సమూహాలకు వేర్వేరు హోదా ఇస్తుంది. సంపద ఎక్కువగా ఉన్నవారికి ఎక్కువ, అలాగే నిరుపేదలకు ఒక రకమైన తక్కువ హోదాను ఇచ్చారు. ఇలా సమాజంలోని వివిధ సమూహాలను ఎక్కువ హోదా ఉన్న సమూహాలు, తక్కువ హోదా ఉన్న సమూహాలని నిలువుగా విభజించడాన్ని సమాజశాస్త్ర పరిభాషలో సామాజిక స్తరీకరణ అంటారు.
-ప్రపంచవ్యాప్తంగా సమాజ స్తరీకరణ ప్రధానంగా మూడు రూపాల్లో కనిపిస్తుంది.
1) ఎస్టేట్స్ (సంస్థానాలు)- యూరప్
2) సోషల్ క్లాస్ (సామాజిక వర్గాలు)- ప్రపంచం
3) క్యాస్ట్ (కులం)- భారతదేశం
-వీటితోపాటు జాతిపరమైన స్తరీకరణ అంటే తెల్లవాళ్లు, నల్లవాళ్లు అనే వర్ణరూప స్తరీకరణ కూడా కనిపిస్తుంది.
-దేశంలో సమాజం ఈ కులాల వ్యవస్థ ఆధారంగా స్తరీకరించబడింది. అంటే ఒక కులంగా వ్యవహరించే ప్రజలు, వారి వృత్తులు, జీవన విధానాలు ఉన్నతమైనవని వారికి అధిక సామాజిక హోదాను ఇవ్వడం, మరికొన్ని కుల సమూహాలను నీచమైనవని తక్కువస్థాయి సామాజిక హోదాను ఇవ్వడం, మధ్యస్థ కుల సమూహాలకు మధ్యస్థాయి హోదాను ఇవ్వడం భారతీయ సమాజంలోని అవలక్షణంగా చెప్పవచ్చు.
-ఇలా సమాజంలోని కొన్ని కుల సమూహాలకు తక్కువస్థాయి ఆపాదిస్తూ సామాజిక దురాచారాలను, అంటరానితనాన్ని, వారి వృత్తులను కించపరిచే సామాజిక రుగ్మతలు ఈ సామాజిక స్తరీకరణవల్ల ఉద్భవించాయి. ఇందుకు ప్రధాన కారణం వర్ణవ్యవస్థ. మనందరికి సమాన అవకాశాలు కల్పించకే కొందరు సామాజిక వనరులైన భూమి, విద్య లాంటి వాటికి దూరమై పేదరికం, సామాజిక అసమానతలకు బలవుతున్నారు.
-ఈ కులవ్యవస్థ భారత్లోనే జన్మించింది. అలాగే ఇది భారతదేశానికే పరిమితమైన ఒక సాంఘిక వ్యవస్థ లోపం.
-ప్రపంచంలో అన్ని సమాజాల్లో ప్రాథమిక సామాజిక సంస్థలు అంటే మానవుని జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే సంస్థలైన వివాహం, కుటుంబం, మతం లాంటివి కనపడుతున్నా దేశంలో అదనంగా కనిపించే ప్రాథమిక సామాజిక సంస్థ కులం.
-వివిధ రకాల విషయాల్లో అంటే అలవాట్లు, కట్టుబాట్లు, వృత్తుల వంటి విషయాల్లో అధిక సాధికారతగల సమూహాన్నే కులంగా భావించవచ్చు.
-కులం అనేది పుట్టుకతోనే వస్తుంది. అందుకే కూలే.. వర్గం కొంతవరకు వారసత్వం అయినప్పుడు దాన్ని కులం అనవచ్చని తెలిపాడు. ఇలా కులం అనేది హోదా అనే నిచ్చన మీద గతిశీలత ఏమాత్రం లేని స్తరీకరణగా చెప్పవచ్చు.
-సామాజిక గతిశీలత అంటే సమాజంలో ఒకవ్యక్తి తనకున్న హోదా నుంచి ఇతర హోదాను పొందడం. ఇక్కడ హోదా అంటే ఒక వ్యక్తిపట్ల సమాజం ప్రవర్తిస్తున్న తీరు.. అంటే ఆ వ్యక్తిని ప్రముఖంగా చూస్తుందా? మధ్యస్తంగా చూస్తుందా? లేదా తక్కువగా చూస్తుందా? అని భావించవచ్చు. ఈ సామాజిక హోదా అనే పదాన్ని మొదటగా సోర్కిన్ అనునతడు తన సామాజిక గతిశీలత అనే గ్రంథంలో ఉపయోగించాడు.
-X అనే వ్యక్తి కూలీ అనుకుందాం. అతడు కష్టపడి భూమి సంపాదించి వ్యవసాయదారుడిగా మారితే అది విషమ స్తరీయ గతిశీలత. అందువల్ల అతని ఆదాయం, సంపద, హోదా పెరుగుతుంది. అంటే సామాజిక స్థాయిలో అతను ఆరోహం చెందినట్లు.
-అలాగే అదే X అనే వ్యక్తి వ్యవసాయ కూలీ నుంచి పారిశ్రామిక కూలీగా మారితే అతని సంపద, ఆదాయం, హోదాలో మార్పు లేదు. కానీ అతని పనిలో మాత్రమే మార్పు ఉంది. దీన్ని సమస్తరీయ గతిశీలత అంటారు. ఇక్కడ ఆ వ్యక్తి సామాజికంగా ఉన్నత హోదాను పొందలేదు.
-దేశంలో కులవ్యవస్థ, కులవృత్తుల ప్రభావంవల్ల సామాజిక గతిశీలత అనేది దుర్లభంగా ఉండేది. కానీ ఆధునీకరణ, ఇతర జీవన ఉపాధులు లాంటివి ఈ విషయంలో మార్పులకు దోహదపడ్డాయి.
-కులాన్ని ఏఆర్ దేశాయ్ హిందూమతం ఉక్కు కవచంగా అభివర్ణించాడు.
-మదన్, మజుందార్లు కులాన్ని ఒక సంకుచిత సమూహంగా తెలిపారు.
-కులం శుచి, అశుచి అనే లక్షణం కలిగి ఉంటుంది.
లక్షణాలు
-క్రీబర్ అనే శాస్త్రజ్ఞుడు కులానికిగల లక్షణాలను కింది విధంగా వివరించాడు.
1. వారసత్వం: ఒక కులానికి చెందిన వారి సంతానం ఆ కులానికే చెందుతుంది. అంటే తల్లిదండ్రుల ద్వారా వారి వారసులకు చెందుతుంది. అంటే కులం పుట్టుకతోనే నిర్ణయించబడుతుంది.
2. అంతర్వివాహాలు: ఒక కులానికి చెందిన వ్యక్తి వివాహం అదే కులానికి చెందిన వ్యక్తితో జరుగాలనేది కులం లక్షణం, సంప్రదాయ వివాహ నియమం.
3. కులవృత్తులు: పారిశ్రామికీకరణ, ఆధునీకరణ జరుగకముందు ప్రతివ్యక్తి జీవనోపాధి నిమిత్తం తన పూర్వీకులు చేపట్టిన వృత్తులనే చేపట్టేవారు. ఇలా ప్రతి కులం తనకంటూ వృత్తులకు పరిమితమై ఆయా వృత్తుల్లో నైపుణ్యం సంపాదించుకుంది.
ఉదా: వడ్రంగి పని కంసాలి చేయలేడు. అలాగే కంసాలి పని కమ్మరి చేయలేడు. ఇలా వారివారి వృత్తుల, సేవల ప్రాముఖ్యతనుబట్టి వారికి సామాజిక హోదా వచ్చిఉండవచ్చుననే అభిప్రాయం ఉంది. ఇలా కులం సామాజిక స్థాయి ఆయా వృత్తులను బట్టి ఏర్పడింది.
4. ప్రతికులం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటిస్తుంది. అందుకే కొన్ని కులాలు శాఖాహార కులాలుగా, మరికొన్ని మాంసాహార కులాలుగా ఉన్నాయి. మంసాహార కులాల్లో కూడా భిన్నత్వం ఉండటం మనం గమనించవచ్చు.
5. దుస్తులు, వేషధారణ అనేవి కూడా కులాన్నిబట్టి మారుతాయి.
6. కుల సమూహాల మధ్య పవిత్రత అపవిత్రత, ఎక్కువ తక్కువ అనే భావనలు ఉంటాయి. ఒక కులంవారు వాడిన ఆహారాదులను ఇతరులు తీసుకోకపోవడం గమనించవచ్చు.
-కొన్ని కులాలకు మాత్రమే మతపరమైన కర్మకాండాలు నిర్వహించే నియమాలుంటాయి.
వర్ణాశ్రమ ధర్మాలు
-ప్రాథమికంగా వర్ణం అనేది రంగును సూచిస్తుంది. మొదట ఆర్యులు, దస్యులు అంటే తెల్లనివారు, నల్లనివారనే భావన ఉండేది. తర్వాత నాలుగు వర్ణాలు 1. బ్రాహ్మణ, 2. క్షత్రియ, 3. వైశ్య, 4. శూద్రులు అనే వ్యవస్థ ఏర్పడింది.
-వ్యక్తి తన జీవితాన్ని, వర్ణ వ్యవస్థలను కలిపి వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు.
-పురుషార్థాలు సామాజికం, సామూహికం అయితే వర్ణాశ్రమ ధర్మాలు ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఆచరించాలని చెబుతాయి. ఇలాంటి వర్ణాశ్రమ ధర్మాలు నాలుగు ఉన్నాయి. అవి.. 1. బ్రహ్మచర్యాశ్రమం 2. గృహస్థాశ్రమం 3. వానప్రస్థాశ్రమం 4. సన్యాసాశ్రమం.
-వ్యక్తి తల్లి గర్భం నుంచి జన్మించడం మొదటి జన్మ. దీక్షలు పూర్తిచేసి జ్ఞానం సంపాదిస్తే అది రెండో జన్మ అంటే ద్విజుడు అవుతాడు. అలా కావాలంటే క్రమశిక్షణతో కూడిన బ్రహ్మచర్యం అవసరం.
-శూద్రునిగా పుట్టిన ప్రతి వ్యక్తి తర్వాత ద్విజునిగా మారుతాడు. అలా 8వ ఏట బ్రాహ్మణుడు, 10వ ఏట క్షత్రియుడు, 12వ ఏట వైశ్యుడు ద్విజుడవుతాడు.
-బ్రహ్మచర్యం అనేది మొదట వర్ణాశ్రమ ధర్మం. ఇక్కడ వ్యక్తి గురువు సమక్షంలో అర్థం, కామంతో సంబంధం లేకుండా జ్ఞాన సముపార్జన లక్ష్యంగా విద్యను అభ్యసించాలి. తద్వారా మిగతా వర్ణాశ్రమ ధర్మాలకు సిద్ధంకావాలి.
-విద్యార్థి దశ అయిన బ్రహ్మచర్యం నుంచి వ్యక్తి రెండోదైన గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు. ఈ దశలో వివాహం చేసుకుని కుటుంబాన్ని ఏర్పర్చుకుంటాడు. 1. ధర్మాన్ని, 2. ప్రజ అంటే సంతానాన్ని, 3. కామం అంటే ఇంద్రియ వాంఛలను పూర్తి చేసుకోవాలనే లక్ష్యంగా జీవిస్తాడు. ఈ మూడింటిలో ధర్మానిదే మొదటి స్థానం కాగా, కామానిది అధమస్థానం.
-వివాహం వల్లే ప్రజ సాధ్యం. అందువల్ల వివాహం సామాజిక విధి, పంచమహా యజ్ఞాలు అయిన 1. బ్రహ్మయజ్ఞం, 2. దైవ, 3. భూత, 4. పితృ, 5. నర/అతిథి యజ్ఞాలు చేయాలంటే అతడు గృహస్థాశ్రమంలోనే ఉండాలి.
1. బ్రహ్మయజ్ఞం- వేద అధ్యయనం/జ్ఞానం
2. దైవ యజ్ఞం- దైవ కార్యాలు
3. పితృయజ్ఞం- శ్రాద్ధకర్మలు, పితృ తర్పణాలు, కర్మకాండలు
4. భూత యజ్ఞం- ప్రకృతి, జంతువులను ఆదరించండం
5. నర/అతిథి యజ్ఞం- అతిథి సంస్కారాలు చేయడం
-గృహస్థాశ్రమంలో మూడోది వానప్రస్థాశ్రమం. ఇక్కడ వ్యక్తి త్రిగుణం కనపరచడు. భార్యతో సహా అడవులకువెళ్లి నివాసం ఏర్పర్చుకుని హోమాలు చేస్తుండాలి. ఈ దశలో ఆత్మ నిగ్రహం, సౌభ్రాతృత్వం, దానం, దయ వంటి ఉన్నతమైన సుగుణాలను అలవర్చుకోవాలి.
-నాలుగోది సన్యాసాశ్రమం. ఈ దశలో వ్యక్తి ఇంటిపేరు, అతని పేరు వదిలివేస్తాడు. కుటుంబంతో, ప్రాపంచిక సుఖాలతో పూర్తిగా బంధాన్ని తెంచుకుని భిక్షాటన ద్వారా మితంగా తింటూ కోపం, రాగద్వేషాలు లేకుండా జీవనం కొనసాగించాలి.
-పైన తెలిపిన తాత్వికపరమైన, ధర్మపరమైన చింతనలతోపాటు హిందూ సామాజిక వ్యవస్థ ప్రత్యేకమైన సామాజిక విభజనను కలిగి ఉంది. అదే చాతుర్వర్ణవ్యవస్థ (Four Fold System of Society). అంటే సమాజాన్ని నాలుగు వర్ణాలుగా విభజించడం.
1. బ్రాహ్మణులు,
2. క్షత్రియులు
3. వైశ్యులు
4. శూద్రులు
-మను ధర్మశాస్త్రం ప్రకారం వర్ణం అనేది అతని పుట్టుకతో ఏర్పడుతుంది. ప్రజాపిత లేదా ఆది దేవుడు సృష్టికి కారణం. అతని తల లేదా నోటి భాగం నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు ఉద్భవించారని తెలుపుతుంది. ఈ వర్ణ వ్యవస్థే తర్వాతి కాలంలో కుల వ్యవస్థగా మారిందనే బలమైన వాదన ఉంది.
-తల నుంచి ఉద్భవించారు కావున బ్రాహ్మణులు జ్ఞానాన్ని సంపాదించాలని, బలమైన భుజాల నుంచి వచ్చిన క్షత్రియులు రాజ్యాన్ని రక్షించాలని, సమతాస్థితికి ఆధారమైన తొడల నుంచి ఉద్భవించిన వైశ్యులు సమాజం నిలబడేందుకు అవసరమైన వాణిజ్యం, వ్యవసాయం చేయాలని అలాగే దేహాంగాలకు అన్నింటికి తన ఆధారాన్ని ఇచ్చే పాదాల నుంచి ఉద్భవించిన శూద్రులు పై మూడు వర్ణాలకు సేవలను అందించాలని ఈ వర్ణవ్యవస్థ చెబుతుంది. సమకాలీన ప్రపంచంలో అత్యంత విమర్శలకు కూడా లోనైంది. సమాజంలో తీవ్ర అసమానతలకు, వివక్షతలకు కారణమైంది.
కులరూప సామాజిక స్తరీకరణ
-సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను నిమ్నం, ఉన్నతం, అధమం, మధ్యస్థం సమూహాలుగా హోదాలను ఆపాదిస్తూ సమాజాన్ని నిలువుగా అమర్చే విధానాన్నే స్తరీకరణం అంటారు. మానవ సమాజంలో స్తరీకరణ 1. వర్గం (Class) 2. సంస్థానం (Estate), 3. జాతి/వర్ణం (Race) లాంటి రూపాల్లో వ్యక్తమవుతుంది.
-హిందూ సామాజిక వ్యవస్థ ఫలితంగా దేశంలో సమాజం ఇలా కులాల రూపంతో స్తరీకరించబడింది. ఇలాంటి స్తరీకరణ ప్రపంచంలో మరెక్కడా లేదు. అందువల్ల కులం భారతీయ సామాజిక నిర్మాణంలో కన్పించే లక్షణం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు