ఆవశ్యకమైన అనర్థం – బాష్పోత్సేకం
కిరణజన్యసంయోగ క్రియను ప్రభావితం చేసే కారకాలు
కాంతి: ఇది ముఖ్యమైన కారకం. కిరణజన్యసంయోగ క్రియకు ఉపయోగపడే కాంతి దృశ్యమాన కాంతి (Visible light). కాంతి ఎక్కువ అయితే కిరణజన్యసంయోగ క్రియ ఎక్కువ అవుతుంది.
-కిరణజన్యసంయోగ క్రియ ఎరుపు కాంతిలో, ఆ తర్వాత నీలి కాంతిలో ఎక్కువ జరుగుతుంది. ఆకుపచ్చ కాంతిలో ఈ క్రియా రేటు సున్నాగా ఉంటుంది. కారణం ఆకుపచ్చ కాంతి పత్రంపై పడి పరావర్తనం చెందుతుంది.
పత్రహరితం: ముదిరిన పత్రాల కంటే లేత పత్రాల్లో కిరణజన్యసంయోగ క్రియ ఎక్కువ జరుగుతుంది.
నీరు: కిరణజన్యసంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలకు అవసరం.
ఉష్ణోగ్రత: కిరణజన్యసంయోగ క్రియకు అత్యంత అనుకూల ఉష్ణోగ్రత 10-400C. ఉష్ణోగ్రత ఎక్కువైతే కిరణజన్యసంయోగ క్రియ ఎక్కువ జరుగుతుంది. 450C ఉష్ణోగ్రత దాటితే ఆగిపోతుంది.
కార్బన్ డై ఆక్సైడ్: వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ గాఢత చాలా తక్కువగా (0.03 నుంచి 0.04 శాతం) ఉంటుంది. కార్బన్ డై ఆక్సైడ్ గాఢత 0.05 శాతం వరకు పెరిగితే కార్బన్ డై ఆక్సైడ్ స్థాపన రేటు పెరుగుతుంది. అంతకంటే ఎక్కువ గాఢత స్థాయి ఎక్కువ కాలం కొనసాగితే కిరణజన్యసంయోగ క్రియకు హానికరం.
ఆక్సిజన్: ఇది కిరణజన్యసంయోగ క్రియకు అవసరం లేదు.
పత్రరంధ్రాలు: పత్రరంధ్రాల సంఖ్య ఎక్కువగా ఉంటే కిరణజన్యసంయోగ క్రియా రేటు ఎక్కువగా ఉంటుంది.
అంత్య ఉత్పన్నాలు: కిరణజన్యసంయోగ క్రియ ఫలితంగా ఏర్పడ్డ అంత్య ఉత్పన్నాలు ఒకవేళ వివిధ భాగాలకు రవాణా చెందకుండా అక్కడే గుమిగూడితే కిరణజన్యసంయోగ క్రియ సమర్థంగా జరుగక ఉత్పన్నాలు ఏర్పడవు. దీన్నే ఫీడ్ బ్యాక్ నిరోధం అంటారు.
వర్ణద్రవ్యాలు (Pigments)
l కిరణజన్యసంయోగ క్రియకు తోడ్పడే వర్ణద్రవ్యాలు మూడు. అవి..
ఎ. క్లోరోఫిల్ (పత్రహరితం)
బి. కెరోటినాయిడ్స్
సి. పైకోబిలిన్స్
ఎ. క్లోరోఫిల్స్ (పత్రహరితం)
-ఇది పత్రాల ఆకుపచ్చ రంగుకు కారణం.
ఇవి వివిధ రకాలుగా ఉంటాయి. వాటిలో ప్రధానమైనవి క్లోరోఫిల్-ఎ, క్లోరోఫిల్-బి.
– క్లోరోఫిల్-ఎ నీలి ఆకుపచ్చరంగులో ఉంటుంది. ఇది అన్ని రకాల ఆకుపచ్చ మొక్కల్లో ఉంటుంది. దీన్ని సార్వత్రిక పత్రహరితం అంటారు.
– క్లోరోఫిల్-బి పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది అన్ని ఆవృతబీజ మొక్కల్లో, క్లోరోఫైసీ అనే శైవల తరగతుల్లో ఉంటుంది.
– క్లోరోఫిల్ నిర్మాణం టెన్నిస్ బ్యాట్‌ను పోలి ఉంటుంది. ఈ అణువు మధ్య భాగంలో Mg అనే మూలకం ఉంటుంది.
బి. కెరోటినాయిడ్స్
– కెరోటినాయిడ్స్ నారింజ, పసుపు రంగుకు కారణం.
-ఇవి రెండు రకాలుగా ఉంటాయి. అవి.. కెరోటిన్స్, జాంథోఫిల్స్.
1. కెరోటిన్లు
-ఇవి ఎరుపు నారింజ రంగులో ఉంటాయి.
-టమాటాకు ఎరుపురంగు లైకోపీన్ వల్ల కలుగుతుంది.
– క్యారెట్‌కు ఆరెంజ్ రంగు బీటా కెరోటిన్ వల్ల కలుగుతుంది.
2. జాంథోఫిల్లు
-ఇవి పసుపు రంగులో ఉంటాయి.
– వీటివల్లనే గుడ్డుసొన పసుపు రంగులో ఉంటుంది.
సి. పైకోబిలిన్స్
-ఇవి నీలిఆకుపచ్చ శైవలాల్లో ఉంటాయి.
-ఇవి ఊదా, ఎరుపు రంగులో ఉంటాయి.
కిరణజన్యసంయోగ క్రియ – ఇతర అంశాలు
– సాయంత్రం వేళల్లో మొక్కల్లో శ్వాసక్రియ, కిరణజన్యసంయోగ క్రియ రెండు సమానంగా జరుగుతాయి.
– కిరణజన్యసంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించే ప్రయోగం – హైడ్రిల్లా ప్రయోగం.
– కిరణజన్యసంయోగ క్రియకు కాంతి అవసరం అని తెలిపే ప్రయోగం – నల్లకాగితం ప్రయోగం/లైట్ స్క్రీన్ ప్రయోగం.
– కిరణజన్యసంయోగ క్రియకు కార్బన్ డై ఆక్సైడ్ అవసరం అని తెలిపే ప్రయోగం – ఆకు సగభాగ ప్రయోగం.
-కిరణజన్యసంయోగ క్రియకు క్లోరోఫిల్ అవసరమని తెలిపే ప్రయోగం – క్రొటాన్ పత్ర ప్రయోగం.
– ఆక్సిజన్‌ను కనుగొన్నది జోసఫ్ ప్రిస్టే (1774) కాగా, నామకరణం చేసినది లెవోయిజర్ (1775).
-కాంతి సమక్షంలో మొక్కలు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని చెప్పిన శాస్త్రవేత్త – జాన్ ఇంజిన్ హౌజ్ (1779).
l క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చని ఆకులు అని అర్థం.
బాష్పోత్సేకం (Transpiration)
-మొక్కలు గ్రహించిన నీటిలో 95-98 శాతాన్ని వాయుగత భాగాల ద్వారా వాతావరణంలోకి ఆవిరి రూపంలో కోల్పోయే ప్రక్రియను బాష్పోత్సేకం అంటారు.
-వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి, తేమ తక్కువగా ఉన్నప్పుడు బాష్పోత్సేకం ఎక్కువగా జరుగుతుంది.
ద్రవాభిసరణం (Osmosis)
– నీరు తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతలోకి అర్ధపారగమ్య త్వచం ద్వారా వెళ్లడాన్ని ద్రవాభిసరణం అంటారు. అర్ధపారగమ్య త్వచం అంటే.. ఉల్లిపొర, కోడిగుడ్డు పొర, చేపలు, కప్పల మూత్రాశయం, జీవ కణాల త్వచాలు (ప్లాస్మా త్వచాలు).
– ద్రవాభిసరణాన్ని నిరూపించే ప్రయోగాలు – థిసిల్ గరాటు ప్రయోగం, బంగాళదుంప ప్రయోగం.
-ద్రవాభిసరణం ఒక భౌతిక క్రియ. దీనికి ఎలాంటి బాహ్యశక్తి అవసరం ఉండదు.
ద్రవాభిసరణ ప్రాముఖ్యత
– కణాలు, కణాలకు మధ్య నీటి రవాణాకు తోడ్పడుతుంది.
– పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడంలో ద్రవాభిసరణం తోడ్పడుతుంది.
– మొక్కలు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడానికి తోడ్పడుతుంది.
-పచ్చళ్లకు ఉప్పు కలపడంవల్ల సూక్ష్మజీవుల నుంచి కాపాడుకోవడంలో ద్రవాభిసరణం తోడ్పడుతుంది.
– మొక్కల్లో లవణాలు, నీరు కదలికలకు ద్రవాభిసరణం తోడ్పడుతుంది.
-మానవ దేహానికి కావాల్సిన లవణాలు, నీటి పునఃశోషణకు ద్రవాభిసరణం తోడ్పడుతుంది.
-రక్తం వడపోతకు ద్రవాభిసరణం తోడ్పడుతుంది.
– చేపలు చర్మం, మొప్పల ద్వారా నీటిని శోషించుకోవడం, గొంతు మంట నుంచి ఉపశమనానికి ఉప్పునీటిని పుక్కిలించడం, ఎక్కువసేపు చేతులను నీళ్లలో ఉంచితే
చేతివేళ్లపై మడతలు ఏర్పడటం ద్రవాభిసరణకు ఉదాహరణలు.
విసరణం (Diffusion)
– అణువులు లేదా అయాన్లు ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతలోకి వెళ్లడాన్ని విసరణం అంటారు.
విసరణం ప్రాముఖ్యత
-l పరిమళ ద్రవ్యాలు (Perfumes)/ధూపం కరలు (Incense Sticks)/సెంటు సీసాలోని వాయువుల వాసన అధిక గాఢత నుంచి అల్ప గాఢతగల గది మొత్తం విస్తరించడం.
– సోడా/కూల్ డ్రింక్స్ బాటిల్ తెరవగానే CO…2 గాలిలోకి వ్యాపించడం.
– కిరణజన్యసంయోగ క్రియలో వాయువుల మార్పిడి (ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్).
– అమీబాలో శ్వాసక్రియ విసరణం ద్వారా జరుగుతుంది.
-సిగరెట్ పొగ గాలిలోకి వ్యాపించడం.
-పత్రాలలోని ఆక్సిజన్ వాతావరణంలోని గాలిలో కలువడం.
బిందుస్రావం (Guttation)
– కొన్ని మొక్కల పత్రాల చివరలో జలరంధ్రాలు (Hydrothodes) ఉంటాయి. ఈ జలరంధ్రాల ద్వారా వీటిని బిందువుల రూపంలో కోల్పోవడాన్ని బిందుస్రావం అంటారు.
-ఎక్కువగా బిందుస్రావం ట్రోపియోలం మొక్కలో చూడవచ్చు.
– కొన్ని గడ్డిజాతి మొక్కల్లో ఉదయం పూట బిందు స్రావాన్ని గమనించవచ్చు.
నిపానం (Imbibition)
– ఘన పదార్థాలు నీటిని అధిశోషించుకుని విస్తారంగా ఘన పరిమాణంలో వృద్ధి చెందడాన్ని నిపానం అంటారు.
-విత్తనాలు నీటిని పీల్చుకుని మొలకెత్తడం.
-ప్రొటీన్లకు కార్బోహైడ్రేట్ల కంటే ఎక్కువగా నీటిని పీల్చుకునే సామర్థ్యం ఉంటుంది. దీని మూలంగానే ప్రొటీన్ సమృద్ధిగా ఉండే బఠానీ గింజలు కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండే బియ్యపు గింజల కంటే ఎక్కువగా ఉబ్బుతాయి.
ద్రవోద్గమం (Transportation)
-ద్రవోద్గమాన్ని వివరించడానికి డిక్సన్ అనే శాస్త్రవేత్త తలతన్యత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
-మొక్క వేర్లు పీల్చుకున్న నీరు దారువు ద్వారా మొక్క పైభాగాలకు లాగబడే/రవాణా చేయబడే ప్రక్రియను ద్రవోద్గమం అంటారు.
-బాష్పోత్సేకం కారణంగా పత్రంలోని నీటిని ఆవిరి రూపంలో కోల్పోవడంవల్ల నీటి శక్మం తగ్గుతుంది. ఫలితంగా వేర్ల ద్వారా నీరు పత్రంలోని నీటి లోటుని భర్తీ చేయడానికి పైకి లాగబడుతుంది. దీనికి అసంజన (ఆకర్షణ బలాలు), సంసంజన (గట్టి బలాలు) తోడ్పడుతాయి.
– పత్రరంధ్రాలు పత్రం మొత్తం అమరి ఉంటాయి. పత్రం పై భాగం కంటే కింది భాగంలో పత్ర రంధ్రాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పత్రరంధ్రాల ద్వారా నీరు బాష్పోత్సేకం చెందుతుంది.
-బాష్పోత్సేకం పగటి సమయంలో ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత ఎక్కువగా జరుగుతుంది.
– ఎడారి మొక్కలకు (బ్రహ్మజెముడు, నాగజెముడు మొదలైన వాటికి) నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి భాష్పోత్సేకాన్ని నిరోధించుకోవడానికి పత్రాలను కంటకాలుగా మార్చుకోవడం గానీ, పత్రాలను రాల్చడంగానీ చేస్తాయి.
-ఎండాకాలానికి ముందు, శీతాకాలం తర్వాత మొక్కలు పత్రాలను రాల్చడానికి గల ప్రధాన కారణం భాష్పోత్సేకాన్ని నిర్మూలించడం.
– బాష్పోత్సేకం పత్రరంధ్రాల ద్వారా 80-95 శాతం, ముదిరిన కాండాలపై ఉండే వాయురంధ్రాల (Lenticles) ద్వారా 1-2 శాతం, కాండాన్ని, పత్రాన్ని కప్పి ఉండే అవభాసిని (Cuticle) ద్వారా 5-10 శాతం జరుగుతుంది.
-బాష్పోత్సేకాన్ని ఫినైల్ మెర్క్యూరిక్ ఎసిటేట్ (PMA), ప్లాస్టిక్ ఎమల్షన్లు, సిలికాన్ నూనెలు, మైనం నిరోధిస్తాయి.
బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేసే కారకాలు
– కాంతి సమక్షంలో పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి.
-ఉష్ణోగ్రత పెరిగితే బాష్పోత్సేకం పెరుగుతుంది.
– నీటి లభ్యత పెరిగినా బాష్పోత్సేకం పెరుగుతుంది.
– ఆర్థత పెరిగినా బాష్పోత్సేకం తగ్గుతుంది.
– గాలివేగం పెరిగితే బాష్పోత్సేకం తగ్గుతుంది.
-పత్రంపై మందమైన అవభాసిని, కేశాలు, ఇతర నిర్మాణాలు బాష్పోత్సేకాన్ని నియంత్రిస్తాయి.
– పత్రరంధ్రాల సంఖ్య పెరిగితే బాష్పోత్సేకం పెరుగుతుంది.
-వేరు, ప్రకాండ నిష్పత్తి పెరిగితే బాష్పోత్సేకం పెరుగుతుంది.
బాష్పోత్సేకం లాభాలు
-మొక్కల్లో నిష్క్రియా పద్ధతిలో నీరు, ఖనిజ లవణాల శోషణ జరుగుతుంది.
– దీని మూలంగా నీరు, ఖనిజ లవణాలు పైకి లాగబడే ప్రక్రియ అయిన ద్రవోద్గమం జరుగుతుంది.
-దీని మూలంగా మొక్క ఉష్ణోగ్రత నియంత్రించబడి ఉపరితలం చల్లబడుతుంది.
-దీని ఫలితంగానే భూమిపైన వర్షాలు పడుతున్నాయి.
బాష్పోత్సేకం నష్టాలు
– దీని ఫలితంగా ఎండాకాలంలో మొక్కలు వాలిపోయి దిగుబడి తగ్గుతుంది.
-బాష్పోత్సేకం ఎక్కువగా జరుగడంవల్ల పత్రరంధ్రాలు మూసుకుని కిరణజన్యసంయోగ క్రియ నిరోధించబడుతుంది.
గమనిక: పై లాభనష్టాలను బట్టి బాష్పోత్సేకాన్ని ఆవశ్యకమైన అనర్థంగా పరిగణించిన శాస్త్రవేత్త – కర్టిస్.
బాష్పోత్సేకం – ఇతర అంశాలు
-దీన్ని కొలిచే పరికరం – ఫొటోమీటర్/ట్రాన్సిపిరోమీటర్.
-బాష్పోత్సేకాన్ని నిరూపించే ప్రయోగాలు – గంటజాడి ప్రయోగం, కోబాల్ట్ క్లోరైడ్ ప్రయోగం.
– ఒక మొక్కజొన్న మొక్క వారానికి 15 లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోకి పంపుతుంది.
– ఒక పెద్ద మామిడి చెట్టు వసంతకాలంలో రోజుకు సుమారుగా 750 నుంచి 3500 లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా బయటకు పంపుతుంది.
డాక్టర్ మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్, నల్లగొండ
9989535675
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు