ఇన్సులిన్తో తగ్గుదల.. గ్లూకగాన్తో పెరుగుదల
-
మధుమేహ వ్యాధి (చక్కెర వ్యాధి)
మధుమేహ వ్యాధిని వైద్యపరిభాషలో ‘డయాబెటిస్ మెల్లిటస్’ అంటారు. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వుల జీవక్రియల లోపాలతో కూడిన సిండ్రోం. ఇది అంతఃస్రావక వ్యవస్థ లోపం వల్ల కలిగే సర్వసాధారణమైన రుగ్మత. దేహ కణాలకు గ్లూకోజ్ రవాణా కాకపోవడం వల్ల కణాల్లో గ్లూకోజ్ వినియోగం బాగా తగ్గుతుంది. దీంతో కొవ్వులు, ప్రొటీన్ల వినియోగం పెరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం 180 mg కన్నా ఎక్కువైతే మూత్రం ద్వారా గ్లూకోజ్ కోల్పోవడం (గ్లూకోసూరియా) జరుగుతుంది. మిశ్రమ గ్రంథి అయిన క్లోమంలోని లాంగర్హాన్స్ పుటికల్లోని ఆల్ఫా, బీటా కణాలు ఇన్సులిన్, గ్లూకగాన్ అనే హార్మోన్లను స్రవిస్తాయి. ఇన్సులిన్ రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తే గ్లూకగాన్ చక్కెర స్థాయిని పెంచుతుంది.
మెల్లిటస్ ముఖ్య లక్షణాలు మూడు. అవి..
పాలియూరియా: మూత్రపిండాల నీటి పునఃశోషణ సామర్థ్యం తగ్గడం వల్ల మూత్రం ఎక్కువగా తయారవుతుంది.
పాలిడిప్సియా: శరీరం నుంచి నీరు మూత్రం రూపంలో ఎక్కువగా బయటకు వెళ్లడం వల్ల నీటి శాతం తగ్గి అధిక దాహం కలుగుతుంది.
పాలిఫెజియా: మూత్రం ద్వారా గ్లూకోజ్, పోషకాలు ఎక్కువగా బయటకు వెళ్లడం వల్ల అధిక ఆకలి, అతిగా తినడం జరుగుతుంది.
డయాబెటిస్ మెల్లిటస్లో రెండు సాధారణ రకాలుంటాయి. అవి..
రకం-1 డయాబెటిస్: ఇన్సులిన్ స్రావం తక్కువగా ఉండటం వల్ల లేదా లోపించడం వల్ల టైప్ 1 డయాబెటిస్ కలుగుతుంది. దీన్ని ఇన్సులిన్ ఆధారిత డయాబెటిస్ మెల్లిటస్ (IDDM) అంటారు. ఎందుకంటే మరణం నుంచి కాపాడటానికి ఇన్సులిన్ ఇంజిక్షన్లు అవసరమవుతాయి. 30 ఏళ్లలోపు వయస్సుల గల వారిలో ఇది సర్వసాధారణంగా, ఆకస్మికంగా ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో దీన్ని ‘శాబక డయాబెటిస్’ (Juvenile Diabetes) అంటారు. ఈ వ్యాధిని అదుపులో ఉంచడానికి రోజువారీ ఇంజిక్షన్లు, ప్రణాళికబద్ధమైన ఆహారం, క్రమయుత వ్యాయామం, ప్రతిరోజు రక్తంలో చక్కెర స్థాయిని పరిరక్షించుకోవాలి.
రకం-2 డయాబెటిస్: దీన్ని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెల్లిటస్ (NIDDM) అంటారు. లక్ష్య కణజాలం ఇన్సులిన్కు తక్కువ సూక్ష్మగ్రాహకంగా ఉండటం వల్ల ఇది కలుగుతుంది. ఇది రకం-1 కన్నా ఎక్కువ సాధారణంగా ఉంటుంది. రకం-2 డయాబెటిస్ ప్రధానంగా స్థూలకాయుల్లో, వ్యాయామం చేయని వారిలో ఎక్కువగా సంభవిస్తుంది. దీన్ని కొన్నిసార్లు వయస్సులో ఆరంభమయ్యే లేదా ప్రౌఢ ఆరంభ డయాబెటిస్ గా వ్యవహరిస్తారు. దీని ప్రభావం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. అభివృద్ధి చెందడానికి కొన్ని సందర్భాల్లో చాలా ఏళ్లు పడుతుంది. రకం-2 డయాబెటిస్ ఉన్న చాలామందిలో ఆహార నియంత్రణ ద్వారా అదుపులోకి రాకుంటే ఇన్సులిన్ ఇంజిక్షన్లు అవసరమవుతాయి.
గర్భిణుల్లో వచ్చే మధుమేహాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు.
నోట్: డయాబెటిస్ వ్యాధి పట్ల అవగాహన పెంపొందించడానికి ఏటా నవంబర్ 14ను ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవంగా నిర్వహిస్తారు.
వ్యాధి లక్షణాలు
- అధిక మూత్ర విసర్జన, ఆకలి, దాహం వేయడం.
- మసక చూపు, కంటి చూపు మందగించడం.
- ఆకస్మికంగా బరువు పెరగడం లేదా తగ్గడం.
- చేతులు, కాళ్లకు స్పర్శ తెలియకపోవడం మొదలైన అపస్థితులు ఏర్పడటం.
రక్తపీడనం (బీపీ)
- రక్తాన్ని వల వంటి రక్తనాళాల ద్వారా ప్రవహింపజేయాలంటే చాలా ఎక్కువ ఒత్తిడి కావాలి. గుండెలోని జఠరికలు సంకోచించి అత్యధిక పీడనంతో రక్తాన్ని ధమనుల్లోకి పంపుతాయి. ఈ పీడనాన్నే రక్త పీడనం అంటారు. సాధారణంగా బీపీ అని పిలుస్తారు. డాక్టర్లు స్పిగ్మోమానోమీటర్ అనే పరికరంతో రక్తపీడనాన్ని కొలుస్తారు. రక్తపీడనం మన శరీరంలోని వివిధ భాగాల్లో వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ శరీరంలో నియమిత ప్రదేశంలో మాత్రమే రక్తపీడనాన్ని కొలిస్తే వేర్వేరు సమయాల్లో పీడనాన్ని సరిపోల్చడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల డాక్టర్లు మన దండచేయి (మోచేయి పైభాగం)లో ఉండే ధమనీ పీడనాన్ని మాత్రమే కొలుస్తారు.
- రక్తపీడనాన్ని అంచనా వేయడానికి డాక్టర్లు రెండు రీడింగులను నమోదు చేస్తారు. జఠరికలు అత్యంత ఎక్కువ పీడనంతో రక్తాన్ని ధమనుల్లోకి పంపినప్పుడు మొదటి రీడింగ్ తీస్తారు. ఇది ఆరోగ్యవంతమైన యువతలో 120mm పాదరస పీడనంగా ఉంటుంది. దీన్ని ‘సిస్టోలిక్ పీడనం’ అంటారు. జఠరికలు యథాస్థితికి చేరుతూ రక్తాన్ని నింపుకునే సమయంలో రెండో రీడింగ్ తీస్తారు. ఇది 800mm పాదరస పీడనానికి సమానంగా ఉంటుంది. దీన్ని ‘డయాస్టోలిక్ పీడనం’ అంటారు. సామాన్య రక్తపీడనం 120/80mmHg. రక్తపీడనం మనం చేసే పనినిబట్టి మారుతుంది. విశ్రాంతి, నడవడం, పరిగెత్తడం వంటి పనులు చేసేటప్పుడు రక్తపీడనం వేర్వేరుగా ఉంటుంది.
- విశ్రాంతి సమయంలో సాధారణ రక్తపీడనం (120/80) కంటే ఎక్కువ రక్తపీడనం ఉంటే ఆ వ్యక్తికి అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) ఉన్నట్లుగా భావిస్తారు. రక్తపోటు తక్కువగా ఉండటం లోబీపీ (హైపోటెన్షన్)కి దారితీస్తుంది.
హైపర్ టెన్షన్ లక్షణాలు
- విపరీతమైన తలనొప్పి.
- నిద్రలేమి, చూపు మసకబారడం.
- విపరీతమైన అలసట, చెవుల్లో రింగురింగుమని శబ్దాలు రావడం.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెదడ, తికమకపడటం.
- హైపర్ టెన్షన్ ప్రభావం ఎక్కువైనప్పుడు మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి, పక్షవాతం రావచ్చు.
- మూత్రపిండాలు, గుండె పనితీరు మందగించి ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చు.
- హైపోటెన్షన్ లక్షణాలు
- త్వరగా అలిసిపోవడం, ఎక్కువసేపు పనిచేయలేకపోవడం.
- తేలికపాటి తలనొప్పి, వికారం, మూర్ఛ.
- తల తిరగడం, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటం.
- చెమటలు పట్టడం, చేతులు, పాదాలు నల్లగా మారుతాయి.
నోట్: అధిక రక్తపోటు వల్ల కలిగే అనర్థాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించడానికి ఏటా మే 17న ప్రపంచ హైపర్టెన్షన్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
హీమోఫీలియా
హీమోఫీలియా వారసత్వంగా సంక్రమించే జన్యులోపం. ఇది రక్తం గడ్డకట్టడానికి, రక్తస్రావం కావడానికి అవసరమైన ప్రక్రియను, శరీర సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. ఈ వ్యాధిగ్రస్తుల శరీరానికి గాయమైన వెంటనే తేలికగా రక్తం కారడం, కీళ్లు లేదా మెదడు లోపలి రక్తస్రావం జరుగుతాయి. హీమోఫీలియా అనువంశికంగా జనకుల నుంచి సంతానానికి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి జన్యువు X క్రోమోజోమ్పై ఉంటుంది. కాబట్టి తల్లి వాహకంగా ఉంటుంది. దీనిలో రెండు రకాలున్నాయి. అవి హీమోఫీలియా-A, హీమోఫీలియా-B మొదటి రకం హీమోఫీలియా అత్యంత సాధారణమైంది. B రకం హీమోఫీలియా 20 శాతం మందిలో ఉంటుంది.
- లక్షణాలు
- గాయం, శస్త్రచికిత్స, దంత చికిత్స ద్వారా అధిక రక్తస్రావం.
- పెద్ద లేదా లోతైన గాయాలు.
- టీకా ద్వారా అసాధారణ రక్తస్రావం, కీళ్ల నొప్పి, వాపు.
- మూత్రం లేదా మలంలో రక్తం రావడం.
నోట్: ఈ వ్యాధిపై అవగాహన కల్పించడానికి ఏటా ఏప్రిల్ 17న ప్రపంచ హీమోఫీలియా నివారణ దినోత్సవం నిర్వహిస్తారు.
ప్రాక్టీస్ బిట్స్
1. కింది వాటిని జతపరచండి.
1. తలసేమియా డే ఎ. మే 8
2. హీమోఫీలియా డే బి. ఏప్రిల్ 17
3. ఎయిడ్స్ డే సి. డిసెంబర్ 1
4. హెపటైటిస్ డే డి. జూలై 28
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-డి, 3-సి, 4-ఎ
4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
2. ఏ ఎంజైమ్ కారణంగా హెచ్ఐవీ వైరస్ తన ఆకారాన్ని తరచూ మార్చుకుంటుంది?
1) వెకోసా హైడ్రల్ 2) ప్రొటియేజ్
3) రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్
4) హైలురోనిడేజ్
3. జనకుల నుంచి సంతతికి జన్యులోపం వల్ల సంక్రమించే వ్యాధి?
1) హీమోఫీలియా 2) తలసేమియా
3) సికిల్సెల్ ఎనిమియా
4) ల్యూకేమియా
4. ఏ హెపటైటిస్ రకానికి ఇంకా వ్యాక్సిన్ కనుగొనలేదు?
1) హెపటైటిస్-ఈ 2) హెపటైటిస్-ఎ
3) హెపటైటిస్-బి 4) హెపటైటిస్-సి
5. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే వంశపారంపర్య వ్యాధి ఏది?
1) హీమోఫీలియా 2) తలసేమియా
3) ఎయిడ్స్ 4) గనేరియా
6. హీమోఫీలియా వ్యాధిపై అవగాహన కల్పించడానికి ప్రపంచ హీమోఫీలియా నివారణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) మార్చి 17 2) ఏప్రిల్ 17
3) మే 17 4. జూన్ 17
7. అధిక రక్తపోటు వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించడానికి ఏ రోజున ప్రపంచ వ్యాప్తంగా హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు?
1) మార్చి 17 2) ఏప్రిల్ 17
3) మే 17 4) జూన్ 17
8. ఏ వ్యాధికారక జన్యువు జనకుల X క్రోమోజోమ్పై ఉంటుంది?
1) హీమోఫీలియా
2) సికిల్ సెల్ ఎనిమియా
3) వర్ణ అంధత్వం
4. ఏదీ కాదు
9. కింది వాటిలో హైపర్ టెన్షన్ లక్షణం కానిది?
1) నిద్రలేమి, చూపు మసకబారడం
2) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,
గుండెదడ, తికమకపడటం
3) విపరీతమైన తలనొప్పి
4) తెమడతో కూడిన దగ్గు
10. అధిక మూత్ర విసర్జన, ఆకలి ఎక్కువగా కావడం ఏ వ్యాధి లక్షణం?
1) మధుమేహం
2) హైపర్టెన్షన్
3) హీమోఫీలియా
4) హైపోథైరాయిడిజం
– ఏవీ సుధాకర్, స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్, లింగంపల్లి(మంచాల)
రంగారెడ్డి జిల్లా
sudha.avanchi@gmail.com
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు