వైవిధ్యం ప్రకృతి సహజం
మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు, జంతువులు ఉంటాయి. రంగు, ఆకారం, పరిమాణం, ఇతర లక్షణాల్లో వేటికవి ప్రత్యేకంగా ఉంటాయి. ఒక జీవి విలువైనదని, మరొకటి విలువ లేనిదని చెప్పలేం. దేని ప్రాధాన్యత దానిదే. దీన్నే జీవ వైవిధ్యం అంటారు.
ప్రపంచంలో అనేక రకాల మొక్కలు, జంతువులు ఉన్నాయి. అవి పైకి ఒకేలా కనిపించినప్పటికీ వాటి మధ్య ఉన్న భేదాలు లేదా వైవిధ్యాలు జీవ వైవిధ్యానికి దారి తీస్తాయి. వైవిధ్యం ప్రకృతి అనుసరించే ఒక సహజమైన విధానం.
ప్రఖ్యాత ఆవరణ వ్యవస్థ శాస్త్రవేత్త ఈ.ఓ. విల్సన్ అభిప్రాయం ప్రకారం ప్రపంచం అంతటా సంవత్సరానికి 10,000 జాతులు లేదా రోజుకు 27 జాతులు అంతరించిపోతున్నాయి.
ప్రపంచ వన్య ప్రాణుల సమాఖ్య WWF (World Wild Life Federation)
అంతర్జాతీయ వన్య ప్రాణుల సంరక్షణ సంఘం IUWC (International Union For Wild life Conservation)
WWF, IUWC సంస్థలు అంతరించిపోతున్న లేదా అంతరించిన మొక్కలు, జంతువుల సమాచారాన్ని పుస్తక రూపంలో ప్రచురిస్తాయి. ఈ పుస్తకాన్ని రెడ్ డేటా బుక్ (Red Data Book) లేదా రెడ్ లిస్ట్ బుక్ (Red LIst Book) అంటారు.
రెడ్ డేటా బుక్ అంతరించిపోతున్న జాతి లేదా వర్గాలను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసే సూచికగా ఉపయోగపడుతుంది.
సౌత్ కొరియాలోని ‘జేజూ’లో జరిగిన అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘ సమావేశం (ZSL, IUCN) ప్రమాదం అంచున ఉన్న జీవుల జాబితా విడుదల చేసింది.
ఆపదలో ఉన్న జాతులు
బట్టమేక పక్షులు
దీన్ని ‘గ్రేట్ ఇండియన్ బస్టర్డ్’ అంటారు. ఇది కర్నూలులోని ‘పెల్లెందు’ పక్షుల సంరక్షణ కేంద్రంలో ఉంది.
రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నప్పటికీ వీటి సంఖ్య కేవలం 50 నుంచి 249 మాత్రమే ఉందని అంచనా.
గూటీ టారంటలా సాలీడు (నీలిరంగు సాలీడు)
దీని శాస్త్రీయ నామం-ఫిసిలోతెరియా మెటాలికా
ఇది ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కర్నూలు జిల్లాలోని నంద్యాల ప్రాంతంలో ఉంది.
దీన్ని ఆన్లైన్ ద్వారా అమెరికా, యూరప్ మార్కెట్లలో అమ్ముతున్నారు.
ప్రపంచ జీవవైవిధ్య సదస్సు-2012 ప్రకారం ప్రపంచంలో అంతరించిపోతున్న 100 జీవుల జాబితాలో తెలంగాణ ప్రాంతంలో కనిపించే రాబందు, పాలపిట్ట ఉన్నాయి.
రాబందు
దీని శాస్త్రీయ నామం- జివ్స్ ఇంటికస్, జివ్స్ టెన్యుస్రోస్ట్రిస్
ఇది ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం ముర్లిగూడ అడవుల్లో కనిపిస్తుంది.
పాలపిట్ట
దీని శాస్త్రీయ నామం-కొరాషియస్ బెంగాలెన్సిస్.
ఇది తెలంగాణ రాష్ట్ర పక్షి
ఆహారపు పంటల్లో కూడా గొప్ప వైవిధ్యం ఉంటుంది. ఒకప్పుడు భారతదేశంలో 50,000 రకాల వరి వంగడాలు సాగుబడిలో ఉండేవి. కానీ ఇప్పుడు మనం కేవలం 12 రకాల వంగడాలనే ఎక్కువగా వినియోగిస్తున్నాం.
మానవుడు దాదాపు 5,000 మొక్కల జాతులను తమ ప్రధాన ఆహారంగా ఉపయోగించేవారు. ఇప్పుడు 20 కన్నా తక్కువ జాతుల మొక్కలే ప్రపంచంలోని అధిక జనాభాకు ఆహారం ఉత్పత్తి చేస్తున్నాయి.
ఎండమిక్ జాతులు
కొన్ని జాతుల మొక్కలు, జంతువులు కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతాయి. ఇలా ఒక దేశం లేదా ఒక ప్రత్యేక ప్రాంతానికే పరిమితమైన వృక్ష, జంతు జాతులను ఎండమిక్ జాతులు అంటారు.
భారతదేశంలో అధిక సంఖ్యలో ఎండమిక్ జాతులు ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం ఎండమిక్ జాతులైన ఉభయచరాల్లో దాదాపు 62 శాతం, సరీసృపాల్లో 50 శాతం భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో ఉన్నాయి.
ఉదా: కంగారూ (ఆస్ట్రేలియా), కివి (న్యూజిలాండ్)
విదేశీ ఆక్రమణ జాతులు
విదేశాల నుంచి వచ్చి ఒక ప్రాంతంలో విస్తారంగా వ్యాపించి ఇక్కడ ఉండే సహజ ఆవాసాలను ఆక్రమిస్తూ జీవవైవిధ్యానికి భంగం కలిగించే జీవులను విదేశీ ఆక్రమణ జాతులు అంటారు. కొత్త వాతావరణానికి ఏవైనా కొన్ని జాతులు రవాణా అయితే అవి కూడా ఆ స్థలాన్ని ఆక్రమిస్తాయి.
అడవుల్లోని ‘స్పానిష్ ఫ్లాగ్’. చెరువులు, కాలువల్లో పెరిగే గుర్రపు డెక్క ఈవిధమైన ఆక్రమణకు ఉదాహరణ
హైదరాబాద్ లాంటి నగరాల్లో మన ప్రాంతానికి చెందని జాతి పావురాల ఆక్రమణ వల్ల స్థానికంగా ఉండే కాకుల సంఖ్య తగ్గింది.
నోట్: కాకులను సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు.
ప్రమాదంలో పులుల లోయ
పూర్వపు కరీంనగర్ జిల్లా రామగుండంలో 60-70 ఏళ్ల క్రితం దట్టమైన అడవులు ఉండేవి. ఇవి అనేక అడవి జంతువులకు నివాసంగా ఉండేవి. ఈ అడవులు మంచిర్యాల సరిహద్దు వరకు వ్యాపించి ఉండేవి. పులులు, చిరుత పులులు, జింకలు, హైనా, అడవి పందులు, ఎలుగుబంట్లు, నాగుపాములు, కొండ చిలువలు, ముళ్లపందులు, గుడ్లగూబలు, కుందేళ్లు, ఉడుములు, తేళ్లు, ఎడారి సాలీళ్లు, మొదలైన జంతువులు ఉండేవి. థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం, ఆ తరువాత వెలిసిన అనేక కర్మాగారాలు, క్వారీల వల్ల అడవులు నరికివేతకు గురయ్యాయి. వన్య ప్రాణులకు ఆవాసం లేకపోవడంతో చాలా జాతులు కనుమరుగయ్యాయి. అరుదైన జంతువులు అంతరించిపోయాయి. ఒకప్పుడు మంచిర్యాల ప్రాంతంలోని అడవిని ‘పులుల లోయ’ అని పిలిచేవారు. ఇప్పుడు మచ్చుకైనా ఒక్కపులి కూడా కనబడదు. ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం దెబ్బతింది.
అంతరించే ప్రమాదం ఉన్న మొక్కలు, జంతువులు
మొక్కలు : అడవి పువ్వులు (ఆర్కిడ్స్), గంధం చెట్టు, సైకస్, సర్పగంధి, కొన్ని ఔషధ మొక్కలు
జంతువులు : చిరుతపులి, సింహం, తోడేలు, ఎర్రనక్క, ఎర్రపాండా, పులి, ఎడారి పిల్లి, మొసలి, తాబేలు, కొండచిలువ, బట్టమేక పిట్ట, పెలికాన్, నెమలి, గ్రేట్ ఇండియన్ హార్స్బిల్, గోల్డన్ మంకీ, లయన్ టేల్డ్ మకాక్, సాలిగిరి లంగూర్, లారిస్
తెలంగాణలోని జాతీయ పార్కులు, జంతు సంరక్షణ కేంద్రాలు
1. కవ్వాల్ – మంచిర్యాల – చిరుతపులి, పులి, నెమలి, పాంథర్, బార్కింగ్ డీర్
2. ప్రాణహిత – మంచిర్యాల – పులి, పాంథర్, బ్లాక్ బక్, స్టాక్ హెరాన్స్
3. ఏటూరు నాగారం – ములుగు – పులి, బార్కింగ్ డీర్, వైల్డ్బోర్ నక్క, అడవి పిల్లి
4. పాకాల – వరంగల్ – టేకు, వెదురు, పులి, పాంథర్, సాల్గాయ్ హైనా, పక్షులు
5. కిన్నెరసాని – భద్రాద్రి కొత్తగూడెం – టేకు, పులి, అడవి నక్క, స్నాగ్బేర్, చింకారా, మార్ష్ మొసలి
6. టైగర్ ప్రాజెక్ట్ – కరీంనగర్ – టేకు, పులి, లంగూర్, సాంబర్, కొండచిలువ, చిరుత
7. అక్షర ఉజ్వల పార్కు – కరీంనగర్ – జింకలు
8. ఆమ్రాబాద్ – నాగర్‌కర్నూలు – పులి, సాంబర్
9. మహావీర్ హరిణ వనస్థలి – రంగారెడ్డి – జింకలు
10.పోచారం – మెదక్ – జింకలు, సాంబర్, చిరుత
11.శివరాం – మంచిర్యాల – జింకలు, పులి, చిరుత
జాతీయ పార్కులు-సంరక్షణ కేంద్రాలు
దేశంలోని అటవీ ప్రాంతాలను జాతీయ పార్కులుగా, జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుగా గుర్తించారు. వీటి ద్వారా వివిధ రకాల మొక్కలు, జంతువులను సంరక్షించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
టైగర్ ప్రాజెక్ట్
పిల్లి జాతికి చెందిన పులి మాంసాహార జంతువుల్లో ఎక్కువ ఆపదలో ఉన్న జంతువుగా మారింది.
ప్రపంచ పులుల జనాభాలో దాదాపు 60 శాతం పులులు భారతదేశంలోనే ఉన్నాయి.
కొన్ని సంవత్సరాలుగా పులలను వేటాడటం వల్ల 35 శాతం తగ్గాయి.
పులులు అంతరించిపోకుండా భారత ప్రభుత్వం 1972 సంవత్సరంలో టైగర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
పులలను సంరక్షించడం ద్వారా ఆవరణ వ్యవస్థలను కాపాడుకోవచ్చు. ప్రస్తుతానికి మన దేశంలో 27 పులి సంరక్షణ కేంద్రాలు 35,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి.
నోట్: టైగర్ ప్రాజెక్ట్ అంటే కేవలం పులులను సంరక్షించడమే కాకుండా వాటితో పాటు ఇతర మొక్కలు, జంతువులను కూడా సంరక్షించడం.
జాతీయ పార్కులు
జాతీయ పార్కులు అంటే విశాలమైన స్థలంలో వన్యజాతి జీవులను (ఉదా: సింహాలు, పులులు, ఖడ్గమృగాలు, మొదలైన వాటిని సహజమైన ఆవాసంలో సంరక్షించే ప్రదేశాలు.
ఈ ప్రాంతాల్లో మానవుల కార్యకలాపాలు అనుమతించరు. పశువులు గడ్డిమేయడం కూడా నిషేధం.
ఉదా: జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు- ఉత్తరాఖండ్.
సంరక్షణ కేంద్రాలు
సంరక్షణ కేంద్రం అంటే జాతులను సంరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రాంతం.
ఆయా జీవజాతుల ఆవాసాలపై ప్రభావం చూపకుండా ఉండే విధంగా మానవ చర్యలను పరిమితంగా అనుమతిస్తారు.
ఉదా: పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం-వరంగల్.
పాండాల సంరక్షణ
పాండా వంటి కొన్ని అంతరించిపోతున్న జంతువులను అడవుల నుంచి తీసుకొచ్చి జూలలో పెంచి తిరిగి అడవుల్లోకి వదిలిపెడతారు.
సంరక్షకులు పాండా మాదిరిగా ముసుగు ధరించి ఆహారం తినిపించి తర్వాత అడవిలోకి వదులుతారు.
వలస పక్షులు
శాశ్వత గూళ్లు లేని కొన్ని జాతుల పక్షులు గుంపులుగా ఏర్పడి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆహారం, నివాసం, ప్రత్యుత్పత్తి కోసం వెళతాయి. దీన్నే వలస అంటారు. ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు.
వర్షాకాలంలో అనేక జాతుల పక్షులు ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు, పులికాట్ సరస్సులకు వలస వస్తాయి.
శీతాకాల చలి తీవ్రత, ఆహార కొరతను తప్పించుకోవడానికి సైబీరియా కొంగలు రష్యాలోని సైబీరియా నుంచి భారతదేశానికి వలస వస్తాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు