General Science Biology | శరీరానికి ఆకారం.. అవయవాల నిర్మాణం
ఒకే నిర్మాణం కలిగి, ఒకే విధిని నిర్వర్తించే కణ సమూహాన్ని కణజాలం అంటారు. ఒకే కణజాలంలోని కణాలన్నీ ఒకే కణం నుంచి ఏర్పడతాయి. మొక్కల కణజాలానికి జంతువుల కణజాలానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మొక్కలు, జంతువుల భాగాలు, విధులను బట్టి కణజాలాల నిర్మాణం ఉంటుంది. నిర్మాణం, విధుల ఆధారంగా వాటిని విభజించారు.
కణజాలాలు
జంతు కణజాలం
- జంతు కణజాలాలు ప్రధానంగా నాలుగు రకాలు. అవి.. ఉపకళా కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడీ కణజాలం.
ఉపకళా కణజాలం
- ఇది దేహం వెలుపలి తలాన్ని, అవయవాల వెలుపలి, లోపలి తలాన్ని కప్పి ఉంచే పొర.
- ఇది చర్మాన్ని (శరీర బాహ్య తలాన్ని) కప్పి ఉంచుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ భాగాలైన నోరు, ఆహార వాహిక, జీర్ణాశయం, పేగు, ఊపిరితిత్తులను (అంతర అవయవాలు) కూడా చుట్టి ఉంటుంది.
- నఖాలు, రోమాలు, కొమ్ము వంటి నిర్మాణాలను తయారు చేస్తుంది. గ్రంథుల రూపంలో అనేక రకాలైన రసాయనాలను స్రవిస్తుంది.
- ఉపకళలో ఉన్న కణాలు దగ్గరగా, కణాంతర సిమెంట్ పదార్థంతో అమర్చబడి ఉంటాయి.
- ఉపకళా కణాలు ఒకే వరుసలో లేదా అనేక వరుసల్లో ఉండవచ్చు.
సంయోజక కణజాలం
- ఇది వివిధ కణజాలాలను, అంగాలను కలిపి ఉంచే కణజాలం.
- ఇది శరీర రక్షణలో శరీర కణాలను తిరిగి ఏర్పరచడంలో కొవ్వు పదార్థాలను నిల్వ చేయడంలో తోడ్పడుతుంది.
- శరీరంలో అనేక రకాల సంయోజక కణజాలాలున్నాయి. అవి..
ఏరియోలార్ కణజాలం: ఇది కణజాలాలను కలిపి ఉంచి అంతర్భాగాలను వాటి స్థానాల్లో స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది. ఇందులో ఫైబ్రోబ్లాస్ట్లు ముఖ్యమైన నిర్మాణాలు. ఇవి దెబ్బతిన్న ఇతర కణజాలాలను బాగు చేస్తాయి.
మృదులాస్థి: ఇది ఎముకలు కలిసేచోట, పర్శుకల (పక్కటెముకలు) చివర, నాసికాగ్రం, చెవిడొప్ప, వాయునాళంలోనూ ఉంటుంది. అనేక సకశేరుక జీవుల పిండదశలో ఎముకలుండవు. వీటిలో మృదు కణజాలం మాత్రమే ఉంటుంది.
ఎముక: ఇది కాల్షియం పాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్‌లతో ఏర్పడుతుంది. ఈ లవణాలను ఆస్టియోసైట్ కణాలు స్రవిస్తాయి. ఈ కణాలు అస్థిమజ్జలో ఉంటాయి.
లిగమెంట్ (సంధి బంధనం): ఇది ఎముకలను సంధి తలాలను కలిపి ఉంచుతుంది. దీని తంతువులు కొల్లాజన్ ప్రొటీన్‌తో చేయబడి ఉంటాయి.
స్నాయుబంధనం: ఇది కండరాలను ఎముకతో కలిపే సంధి తలాల్లో జాయింట్లలో ఉంటుంది.
ఎడిపోజ్ లేదా కొవ్వు కణజాలం: ఇది కొవ్వు పదార్థాన్ని నిల్వ చేసే సంయోజక కణజాలం. ఈ కణజాలం చర్మం కింద మూత్రపిండాల చుట్టూ అస్థిమజ్జలోనూ ఉంటుంది. శరీరానికి కావలసిన శక్తిని సమకూర్చడానికి ఇది సహాయపడుతుంది. చర్మానికి దిగువ ఉండే ఎడిపోజ్ కణజాలం శరీరం నుంచి వేడి బయటకు పోకుండా కాపాడుతుంది.
రక్తం: ఇది ద్రవరూపంలో ఉన్న సంయోజక కణజాలం. రక్తంలో వివిధ రకాలైన కణాలు ఉన్నాయి. ఇవి ప్లాస్మాలో స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటాయి. రక్త స్కందనానికి అవసరమైన అనేక కారకాలు కూడా ప్లాస్మాలో ఉంటాయి. రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, రక్త ఫలకికలు అనే మూడు రకాల కణాలుంటాయి.
కండర కణజాలం
- కండర కణాలు సంకోచ శక్తిని కలిగి కదలికలకు కావలసిన శక్తిని ఉత్పత్తి చేస్తాయి.
- ప్రతి కండరం ఒక నాడిని కలిగి ఉంటుంది. ఈ నాడి అనేక శాఖలుగా విభజించి ప్రతి కండర కణంతోనూ సంబంధాన్ని కలిగి ఉంటుంది.
- కండరాలు మూడు రకాలు అవి..
- రేఖిత కండరాలు
- వీటిని అస్థి కండర కణజాలాలు అని కూడా అంటారు.
- ఇవి అస్థిపంజరంలోని ఎముకలకు అతికి ఉండి, కదలికలకు కారణమవుతాయి.
- ఈ కండరాల కదలికలు మన ఆధీనంలో ఉంటాయి. కాబట్టి వీటిని నియంత్రిత కండరాలు అంటారు.
- ఈ కండరం పొడవుగా, అనేక అడ్డు చారలు కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని రేఖిత కండరమని పిలుస్తారు.
- ఈ రకమైన కండరాలు చేతులు, కాళ్లు, భుజాల్లో ఉంటాయి.
అరేఖిత కండరాలు - వీటిలో అడ్డు చారలుండవు. అందుచేత వీటిని అరేఖిత కండరం లేదా నునుపు కండరం అంటారు.
- ఈ కండరాల సంకోచ సడలికలు మన ఆధీనంలో ఉండవు.
- అందువల్ల వీటిని అనియంత్రిత కండరాలు అంటారు.
- ఈ రకమైన కండరాలు రక్తనాళాలు, ఆహార వాహిక, మూత్రాశయ నాళాల్లో ఉంటాయి.
హృదయ కండరం - ఈ రకమైన కండరం సకశేరుకాల గుండెకు మాత్రమే పరిమితమై ఉంటుంది.
- ఇది రేఖిత కండరాల లాగా మందపు పట్టీలతో, అరేఖిత కండరాల లాగా అనియంత్రితంగా ఉంటుంది.
- దీని వల్ల హృదయ కండరం రేఖిత, అరేఖిత కండరాలకు మధ్యస్థంగా ఉంటుంది.
నాడీ కణజాలం - నాడీ కణాలు సమాచారాన్ని గ్రహించి, విశ్లేషించడానికి ప్రత్యేకించిన కణాలు.
- ఈ కణాలు కూడా అవసరానికి తగ్గ ప్రచోదనాలను ఉత్పత్తి చేసి, వాటిని శరీర అంతర, బాహ్య అవయవాలకు పంపిస్తాయి.
- నాడీ మండలంలో రెండు రకాల కణాలున్నాయి.
- అవి నాడీ కణాలు, ఆధార కణాలు.
- నాడీ కణాలు అతి పొడవైన కణాలు.
- ఇవి జిరాఫీ వంటి జంతువుల్లో మీటర్ కంటే పొడవుగా ఉంటాయి.
మొక్కల కణజాలాలు
- మొక్కల కణజాలాలను రెండు రకాలుగా విభజించారు. అవి సరళ కణజాలం, సంక్లిష్ట కణజాలం.
- మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం, దృఢ కణజాలం మొదలైనవి సరళ కణజాలాలు.
- దారువు, పోషక కణజాలాలు సంక్లిష్ట కణజాలాలు.
- సరళ కణజాలాలు ఒకేరకమైన కణాలను కలిగి ఉంటాయి.
- సంక్లిష్ట కణజాలాల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల కణాలుంటాయి.
మృదు కణజాలం
- మొక్కల ప్రాథమిక నిర్మాణాలైన కాండాలు, పత్రాలు, పుష్పాలు మొదలైనవి మృదుకణ నిర్మితాలు.
- ఇవి గుండ్రంగా గాని, చతురస్రాకారంగా గాని బహు భుజాకారంగా గాని ఉంటాయి.
- మృదు కణజాలంలో చాలా రకాలుంటాయి.
క్లోరెంఖైమా: ఇవి పత్రాల్లో ఉంటాయి.
వీటిలో హరిత రేణువులు ఉంటాయి.
ఏరెంఖైమా: ఈ కణాల మధ్యలో వాయు
గదులుంటాయి. నీటి మీద తేలే మొక్కల్లో ఈ కణాలుంటాయి.
నిల్వ కణజాలం: ఇవి ఆహార పదార్థాలను
నిల్వ చేసే కణాలు. ఇటువంటి కణాలు దుంప కాండాలు, కొమ్ముల్లో ఉంటాయి.
నీటిని నిల్వ చేసే కణజాలం: ఈ కణాలు ఎడారి మొక్కల్లో ఉండి నీటిని నిల్వ చేస్తాయి.
స్థూలకోణ కణజాలం - ఈ కణజాలం గుల్మాలు (చిన్న మొక్కలు), పొదల్లో ఎక్కువగా ఉంటాయి.
- మొక్కలకు యాంత్రిక బలాన్ని, ఆధారాన్ని ఇస్తాయి.
ధృడ కణజాలం
- ఈ కణజాలంలోని కణాలు పొట్టిగా, చతురస్రంగా లేదా పొడవుగా నారల వలె మొనదేలి ఉంటాయి.
- ఇది నిర్జీవ కణజాలం, కణాలు గట్టిగా ఉంటాయి.
- ఈ కణాలు విత్తన కవచం, నారల్లో ఉంటాయి.
- వీటి కణ కవచాల్లో లిగ్నిన్ ఉంటుంది.
దారువు - ఈ కణజాలంలో సజీవ, నిర్జీవ కణాలుంటాయి.
- దారువు ప్రసరణ కణజాలం. ఇది నీటిని లవణాలను వేర్ల నుంచి ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది.
- దారువులో మూడు రకాల నిర్జీవ కణాలుంటాయి. అవి నారలు, దారు కణాలు, దారు నాళాలు.
- దారు మృదు కణజాలం దారువులోని సజీవ కణజాలం.
- దారువు కణ కవచాలు లిగ్నిన్‌తో నిర్మితమై ఉంటాయి.
పోషక కణజాలం - దీన్ని బాస్ట్ లేదా లెప్టోమ్ అని కూడా అంటారు.
- దీనిలో ఐదు రకాల కణాలుంటాయి. అవి. చాలనీ నాళాలు, చాలనీ కణాలు, సహ కణాలు, పోషక కణజాల నారలు.
- పత్రాల్లో తయారైన ఆహార పదార్థాలు పోషక కణజాలం ద్వారా మొక్కల్లోని మిగతా భాగాలకు సరఫరా అవుతాయి.
Previous article
IIIT Hyderabad | ఆర్ట్స్ విద్యార్థులకూ.. ఐఐఐటీలో ప్రవేశాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు