Biology- DSC Special | పోషకాల రవాణా.. ప్రాణవాయువు ప్రసరణ
రవాణా వ్యవస్థ
ప్రసరణ : జీవులకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్, ద్రవ పదార్థాలను (వ్యర్థ పదార్థాలు) ఒకచోటు నుంచి మరొక చోటుకు రవాణా అవడాన్ని “ప్రసరణ” అంటారు.
- అమీబా, హైడ్రా వంటి ఏకకణ జీవుల్లో పదార్థాలు రవాణా జరిగే విధానం – విసరణ/వ్యాపనం (డిఫ్యూషన్)
విసరణ : అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు అణువులు (లేదా) పదార్థాలు రవాణా అవడాన్ని ‘విసరణ’ అంటారు.
ద్రవాభిసరణ : అర్ధ పారగమ్య త్వచం ద్వారా అల్ప గాఢత ద్రావణం నుంచి అధిక గాఢత ద్రావణంలోకి ద్రావణి విసరణ చెందే భౌతిక దృగ్విషయాన్ని ‘ద్రవాభిసరణ’ అంటారు.
ఉదా : మొక్కలు వేళ్ల ద్వారా నీటిని పీల్చుకోవడం - బహుకణ జీవుల్లో పదార్థాల రవాణా కోసం ఏర్పడే వ్యవస్థలు – రక్త ప్రసరణ వ్యవస్థ, శోషరస వ్యవస్థ
- బహుకణ జీవుల్లో పదార్థాలు 100 మీ దూరం వరకు ప్రయాణించవలసి ఉంటుంది.
- జీవ పదార్థంలో సుమారు 80 శాతం నీరు ఉంటుంది.
- ఆహారం ఆక్సీకరణానికి ‘ఆక్సిజన్’ అవసరం.
- హార్మోనులు రసాయన పదార్థాలు ఇవి శరీరం జరిపే చర్యలను అదుపుచేసి వాటిని సంధానపరుస్తాయి.“వినాళ గ్రంథాలు” వీటిని స్రవిస్తాయి.
- ఏకకణ జీవుల్లో పదార్థాల రవాణా జీవ పదార్థంలో “విసరణ” వల్ల కాని జీవ పదార్థం కదలికల వల్ల కాని జరుగుతుంది.
- పరిణామం ముందు దశల్లో బహుకణ జీవులు అవసరమైన పదార్థాల్లో చాలా వాటిని నీటిలో కరిగించుకొని, వాటిని రవాణా లేదా పంపు చేస్తాయి.
- పరిణామం తర్వాత దశల్లో పదార్థాల రవాణా కోసం రక్తం, శోషరసం వంటి ప్రత్యేక ద్రవాలను పెంపొందించుకున్నాయి.
- ప్రాథమిక జంతువుల్లో శరీర కండరాల సంకోచం, సడలికల వల్ల ఈ ద్రవాల ప్రసరణకు కావలసిన శక్తి లభిస్తుంది.
- జంతువుల శరీర పరిమాణం పెద్దదిగా అవటం, వాటి శరీర నిర్మాణం క్లిష్టంగా అవటం వల్ల ద్రవాలను పంపుచేసే ప్రత్యేకమైన అవయవాన్ని సంతరించుకొన్నాయి. దీన్ని “గుండె”అంటారు.
- రక్త ప్రసరణ వ్యవస్థలో “గుండె, రక్తనాళాలు, రక్తం” ఉంటాయి.
- బొద్దింక, గొల్లభామ వంటి కొన్ని జంతువుల్లో రక్తం “వర్ణరహితంగా” ఉంటుంది.
- వానపాము, కప్పలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో రక్తం “ఎర్రగా” ఉంటుంది.
- వానపాములో ఎర్రరక్త కణాలు లేవు. హిమోగ్లోబిన్ ప్లాస్మా ద్రవంలో కరిగి ఉంటుంది.
- కీటకాలు, మొలస్కా జీవుల్లో రక్తనాళాలు లేవు. ఈ జంతువుల్లో హృదయం శరీరంలో పెద్ద కాలువల్లా ఉండే ప్రదేశాల్లోకి రక్తాన్ని పంపు చేస్తుంది. వీటిని “కోటరాలు” అంటారు. ఈ విధమైన రక్త ప్రసరణ వ్యవస్థను “స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ” అంటారు.
- చాలా జంతువుల్లో రక్త నాళాలుంటాయి. హృదయం రక్తాన్ని వీటిలోకి పంపు చేస్తుంది. ఈ విధమైన రక్త ప్రసరణ వ్యవస్థను “బంధిత రక్త ప్రసరణ” వ్యవస్థ అంటారు.
- బొద్దింక హృదయంలో ‘13’ గదులున్నాయి. మానవుని హృదయంలో ‘4’ గదులే ఉన్నాయి.
మానవ హృదయం బాహ్య లక్షణాలు
- హృదయం ఉరఃకుహరం మధ్యలో కొంచెం ఎడమ పక్కకు ఉంటుంది.
- ఇది “హృదయ కండరం”తో నిర్మితమై “త్రిభుజాకారం”గా ఉంటుంది.
- హృదయం చుట్టూ, రెండు పొరలు గల “హృదయావరణం”ఉంటుంది. ఈ రెండు త్వచాల మధ్య ఉండే కుహరాన్ని “హృదయావరణ కుహరం” అంటారు. దీనిలో “హృదయావరణ ద్రవం” ఉంటుంది.
- హృదయావరణ ద్రవం హృదయాన్ని షాకుల నుంచి, దెబ్బల నుంచి రక్షిస్తుంది.
- హృదయం నాలుగు గదులను కలిగి ఉంటుంది. పై రెండు గదులను “కర్ణికలు” అంటారు. కింది రెండు గదులను
“జఠరికలు”అంటారు. - హృదయానికి రక్తాన్ని తీసుకొచ్చే అతి పెద్ద సిరలను “మహాసిరలు” లేక “బృహత్సిరలు” అంటారు.
- హృదయాన్నుంచి రక్తాన్ని తీసుకొనిపోయే అతిపెద్ద ధమనులను “మహాధమనులు” అంటారు.
- ఇవి శరీర భాగాల నుంచి హృదయానికి రక్తాన్ని తీసుకొచ్చే రక్తనాళాలు.
- ఒక జత హృదయ ధమనులు, ఆమ్లజని సహిత రక్తాన్ని హృదయ కండరానికి తీసుకొనిపోతాయి.
- వయసు మీరే కొద్ది కొంత మందిలో హృదయ ధమనుల్లో రక్త ప్రసరణకు అవరోధం ఏర్పడి హృదయ కండర కణాలకు ఆమ్లజని సహిత రక్తం అందక హృదయం పని చెయ్యదు. దీన్ని “గుండెపోటు”అంటారు.
మానవ హృదయం అంతర్నిర్మాణం
- కుడి, ఎడమ కర్ణికలు నిలువుగా ఉండే “కర్ణికాంతర విభాజకం” ద్వారా వేరు చేయబడ్డాయి.
- కుడి, ఎడమ జఠరికలు “జఠరికాంతర విభాజకం” వల్ల వేరు చేయబడ్డాయి.
- జఠరికల కుడ్యం, కర్ణికల కుడ్యం కంటే మందంగా కండరయుతంగా ఉంటుంది.
- జఠరికల్లో ఎడమ జఠరిక కుడ్యం, కుడి జఠరిక కంటే మందంగా ఉంటుంది. ఎందుకంటే ఎడమ జఠరిక, శరీరంలో దూరంగా ఉండే భాగాలకు (చేతి, కాలి వేళ్లు) రక్తాన్ని పంపు చెయ్యాలి.
- కర్ణికలను, జఠరికలను వేరు చేస్తూ అడ్డంగా ఉండే “కర్ణికా జఠరికా విభాజకం” ఉంటుంది. రెండు రంధ్రాలను “కర్ణికా జఠరికా రంధ్రాలు” అంటారు.
- హృదయంలోని కవాటాలు, రక్తాన్ని ఏక మార్గంలో ప్రసరింపచేస్తాయి. ఈ కవాటాలను వాటి స్థానంలో ఉంచే బంధన కణజాల తంతువులు ఉన్నాయి. వీటిని “స్నాయ రజ్జువులు” అంటారు.
మానవ హృదయం – పనిచేసే విధానం
- హృదయ కండరం సంకోచం చెందినప్పుడు రక్తం పంపు అవుతుంది. హృదయ కండరం సడలిక చెందినప్పుడు హృదయం రక్తంతో నిండుతుంది.
- హృదయం సంకోచ సడలికలు దానిలో ఉన్న హృదయ కండరం వల్ల జరుగుతుంది.
- హృదయం నిమిషానికి 70-80 సార్లు సంకోచ సడలికలు జరుపుతుంది.
- ఒక సంకోచం, ఒక సడలికను కలిపి “హృదయ స్పందన” అంటారు.
- సంకోచ దశను “సిస్టోల్” అని సడలే దశను “డయాస్టోల్” అని అంటారు.
హృదయ స్పందనలో మూడు దశలు ఉన్నాయి.
1. రెండు కర్ణికలు ఒకేసారి సంకోచం చెంది రక్తాన్ని జఠరికలోకి పంపుతాయి. (కర్ణికల సిస్టోల్)
2. రెండు జఠరికలు ఒకేసారి సంకోచం చెంది రక్తాన్ని రక్తనాళాల్లోకి పంపు చేస్తాయి. (జఠరిక సిస్టోల్) ఈ సమయంలో కర్ణికల సడలిక మొదలవుతుంది.
3. కర్ణికలు, జఠరికలు సడలుతాయి. (జఠరిక డయాస్టోల్). - రక్తం ప్రవహించే మార్గాన్ని “ప్రసరణ వలయం” అంటారు.
- రెండు వలయాల్లో రక్తాన్ని పంపు చేసే హృదయాన్ని “ద్వివలయ ప్రసరణ హృదయం” అంటారు.
- వ్యక్తుల వయస్సును బట్టి హృదయ స్పందన రేటు మారుతుంది. పెద్ద వారితో పోలిస్తే ఒకటి రెండు సంవత్సరాల పిల్లల్లో హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉంటుంది.
- వ్యాయామ సమయంలో, జ్వరంలో, కోపం, ఆవేదన వంటి ఉద్రేక సమయాల్లో హృదయ స్పందన రేటు అధికంగా ఉంటుంది.
రక్త పీడనం
- రక్తనాళాల్లో ఏ పీడనంలో రక్తం ప్రవహిస్తుందో దాన్ని “రక్తపీడనం” అంటారు. (సామాన్యంగా బి.పి.అంటారు)
- ధమనులతో పోలిస్తే సిరల్లో రక్త పీడనం ఎక్కువ.
- వైద్యులు రక్త పీడనాన్ని “స్ఫిగ్మో మానోమీటర్” అనే పరికరంతో కొలుస్తారు.
- రక్త పీడనాన్ని 120/80 గా వ్యవహరిస్తారు. ఇది సామాన్య రక్త పీడనం. పై సంఖ్య (120) “సిస్టోలిక్ పీడనాన్ని” తెలియజేస్తుంది. కింది సంఖ్య (80) “డయాస్టోలిక్ పీడనాన్ని” తెలియజేస్తుంది.
- జఠరికలు సంకోచం చెందినప్పుడు రక్తం ధమనుల్లోకి పంపు అవడం వల్ల రక్త పీడనం ఎక్కువ అవుతుంది. ధమనుల్లో అధికమయ్యే రక్తపీడనాన్ని “సిస్టోలిక్ పీడనం” అంటారు.
- డయాస్టోల్ సమయంలో హృదయం నుంచి రక్తం పంపు చేయదు. రక్తనాళాలు వాటి యధాస్థితికి చేరి రక్తపీడనాన్ని తక్కువ స్థాయిలో ఉంచుతాయి. దీన్ని “డయాస్టోలిక్ పీడనం”అంటారు.
1. అసంతృప్త కొవ్వు ఆమ్లాలకు సంబంధించి సరైనది?
ఎ. ఇవి మన శరీరంలో ఉత్పత్తి కావు. కాబట్టి బయటి నుంచి ఆహారంగా తీసుకోవాలి
బి. ఇవి రక్త ప్రసరణ సాఫీగా జరిగేటట్లు చేస్తాయి
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
2. జతపరచండి.
కొవ్వు ఆమ్లం వనరు
1. లినోలిక్, ఎ. వేరుశనగ
లినోలినిక్ ఆమ్లం
2. అరాఖిడినిక్ ఆమ్లం బి. ద్రాక్షరసం
3. కాప్రిక్ ఆమ్లం సి. జాపత్రి
4. మిరిస్టిక్ ఆమ్లం డి. పత్తి
5. ఎసిటిక్ ఆమ్లం ఇ. కొబ్బరి
1) 1-ఎ, 2-సి, 3-డి, 4-ఇ, 5-బి
2) 1-డి, 2-ఎ, 3-ఇ, 4-సి, 5-బి
3) 1-ఎ, 2-డి, 3-సి, 4-ఇ, 5-బి
4) 1-డి, 2-ఇ, 3-ఎ, 4-సి, 5-బి
3. కింది వాటిలో సరైనది?
ఎ. NPK మూలకాలు నేలలో సాధారణంగా లభించవు కాని మొక్కల పెరుగుదలకు అవసరం అందువల్ల వీటిని నిర్మాణాత్మక మూలకాలు అంటారు
బి. CHO మూలకాలతో జీవి ఏర్పాటవుతుంది కాబట్టి వీటిని ప్రధాన మూలకాలు అంటారు
1) రెండూ సరైనవి 2) బి సరైనది
3) ఎ సరైనది 4) ఏదీకాదు
4. రైబోజోమ్ల్లో 2 ఉప ప్రమాణాలు కలవడానికి తోడ్పడే మూలకం?
1) Ca 2) Fe 3) Mg 4) Na
5. కిందివాటిలో సరైనది?
ఎ. గ్లూకోజ్‌ను నిత్యజీవితంలో వాడడం వల్ల టేబుల్ షుగర్ అంటారు
బి. ఆవుపాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణం లాక్టోజ్
1) ఎ, బి 2) ఎ
3) బి 4) ఏదీకాదు
6. కింది ఏ మూలక లోపం వల్ల మొక్కల్లో క్లోరోసిస్ వ్యాధి కలుగుతుంది?
1) P 2) N 3) S 4) పైవన్నీ
7. జతపరచండి.
మూలకం లోపం వల్ల కలిగే
వ్యాధులు
1. Fe ఎ. హైపోకలీమియా
2. K బి. హైపోనట్రీమియా
3. Na సి. ఎనిమియా
4. I డి. ఆస్టియోమలేషియా
5. Ca ఇ. గాయిటర్
1) 1-డి, 2-ఎ, 3-బి, 4-ఇ, 5-సి
2) 1-సి, 2-ఎ, 3-బి, 4-ఇ, 5-డి
3) 1-డి, 2-బి, 3-ఎ, 4-ఇ, 5-డి
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-ఇ, 5-డి
8. కింది ఏ మూలకం, విటమిన్లు వరుసగా పుష్పాల్లో వంధ్యత్వం, ఎముకల్లో పెలుసుతనానికి కారణమవుతాయి?
1) Mo, Vit-A 2) Mn, Vit-D
3) Zn, Vit-C 4) Cu, Vit-D
9. హార్ట్ రాట్ వ్యాధి ఏ మూలకం లోపం వల్ల కలుగుతుంది?
1) B 2) Cu 3) Mo 4) Mn
10. DNA తయారీకి తోడ్పడే విటమిన్?
1) రైబోఫ్లోవిన్ 2) నియాసిన్
3) ఫోలిక్ ఆమ్లం 4) పెరిడాక్సిన్
11. బీరులో లభించే విటమిన్?
1) నియాసిన్ 2) బి6
3) బి12 4) పైవన్నీ
12. పుట్టగొడుగులు ఏ విటమిన్‌కు వనరులు?
1) D 2) B 3) A 4) K
13. సర్జరీ సమయంలో పేషెంట్‌కు ఇచ్చే విటమిన్?
1) రైబోఫ్లోవిన్ 2) సి
3) ఎ 4) కె
14. గర్భిణుల్లో ఎక్కువగా దేనిలోపం
కనిపిస్తుంది?
1) రైబోఫ్లోవిన్ 2) నియాసిన్
3) ఫోలిక్ ఆమ్లం 4) పైరిడాక్సిన్
15. టోన్డ్ మిల్క్‌లో కొవ్వును ఎంతశాతం నుంచి ఎంతశాతానికి తగ్గిస్తారు?
1) 8 శాతం నుంచి 3 శాతానికి
2) 10 శాతం నుంచి 3 శాతానికి
3) 12 శాతం నుంచి 6 శాతానికి
4) 10 శాతం నుంచి 3 శాతానికి
సమాధానాలు
1. 3 2. 2 3. 4 4. 3
5. 4 6. 4 7. 2 8. 2
9. 1 10. 2 11. 3 12. 4
13. 2 14. 4 15. 3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు