బింబ ప్రతిబింబాల బైనాక్యులర్ విజన్!
మానవ శరీరంలో జ్ఞానాంగాలు ప్రధానమైన అవయవాలు. కన్ను, ముక్కు, నాలుక, చెవులు, చర్మం జ్ఞానాంగాలు. వీటన్నింటినీ మెదడు నియంత్రిస్తుంది. వీటిలో ఏది సరిగా పనిచేయకున్నా లోపం ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో వీటి పనితీరు నిర్మాణంపై ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో జ్ఞానాంగాల్లోని కన్ను, ముక్కు నిర్మాణం, పనిచేసే విధానం గురించి తెలుసుకుందాం..
జ్ఞానేంద్రియాలు (SENSE ORGANS)
– పరిసరాల నుంచి మనకు జ్ఞానాన్ని అందించే శరీరంలోని అవయవాలను జ్ఞానేంద్రియాలు అంటారు.
– జ్ఞానేంద్రియాలు మన శరీరంలో భాగాలు మాత్రమే కాదు. అవి మనమంటే ఏంటో నిర్వచిస్తాయి.
-జ్ఞానేంద్రియాలన్నింటి కన్నా స్పర్శా జ్ఞానం చాలా ముఖ్యమైనదని చెప్పినవారు- ప్లేటో, అరిస్టాటిల్
-జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నింటికీ కేంద్రం మెదడు.
– మానవ శరీరంలో కళ్లు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం అనే 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి.
-జ్ఞానేంద్రియాలు జ్ఞాన గ్రాహకాలను కలిగి ఉంటాయి. ప్రతి గ్రాహకం ప్రత్యేకమైన ప్రేరణలకు సూక్ష్మ గ్రాహ్యతను (Sensiti vity) కలిగి ఉంటుంది.
కన్ను- నిర్మాణం
-కన్ను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్తాల్మామాలజీ అంటారు.
-కన్నులో కంటి రెప్పలు, కనురెప్ప రోమాలు, కనుబొమ్మలు, అశ్రుగ్రంథులు ఉంటాయి.
– కంటి ముందు భాగాన్ని కంటిపొర కప్పి ఉంటుంది.
-కంటిలో మూడు ముఖ్యమైన పొరలుంటాయి. అవి
1.దృఢస్తరం
– దళసరిగా, గట్టిగా తంతుయుతంగా, స్థితిస్థాపకత లేకుండా తెలుపురంగులో బయటవైపు ఉండే పొర. ఇది ఉబ్బి శుక్లపటలంను ఏర్పరుస్తుంది. దీని చివరి భాగం దృక్ నాడీతో కలిసి ఉంటుంది.
2. రక్తపటలం
-నలుపు రంగులో ఉండి అనేక రక్తనాళాలను కలిగి ఉంటుంది. తారక భాగాన్ని తప్ప కంటి అన్ని భాగాలను ఇది ఆవరించి ఉంటుంది.
-కంటి మధ్యలో ఉన్న చిన్న గుండ్రటి ప్రదేశం తారక. తారక చుట్టూ రక్తపటలం నుంచి ఏర్పడిన భాగమే కంటిపాప. దీనిలో కిరణాకార వర్తులాకార కండరాలుంటాయి. తారకకు వెనుక ద్వికుంభాకారంలో ఉండే కటకం ఉంటుంది.
కనుపాప: ఇది శుక్లపటలం కింద ఉంటుంది. కనుపాప మధ్యలో గుండ్రంగా ఉండే రంధ్రాన్ని తారక అంటారు. చీకటిలో కనుపాప వ్యాకోచిస్తుంది. అందువల్ల తారక పెద్దదై ఎక్కువ కాంతి కంటిలోకి ప్రవేశిస్తుంది. కాంతి తీక్షణంగా ఉన్నప్పుడు కనుపాప సంకోచించడం వల్ల తారక చిన్నదౌతుంది. అందువల్ల తక్కువ కాంతిలోకి వెళుతుంది.
-ఆధార్ లాంటి గుర్తింపు కార్డులు ఇచ్చేటప్పుడు కంటిలోని కనుపాపను ఫొటో తీసుకుంటారు. ఎవరి కనుపాప వారికే ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే వేలిముద్రల మాదిరిగానే వాటిని కూడా గుర్తింపు కోసం ఉపయోగిస్తారు.
-కంటి గుడ్డు లోపలి భాగాన్ని నేత్రోదక కక్ష్య , కచావత్ కక్ష్య అనే రెండు భాగాలుగా కటకం విడగొడుతుంది. నేత్రోదక కక్ష్య నీరు వంటి ద్రవంతో నిండి ఉంటుంది. కచావత్ కక్ష్య జెల్లీ వంటి ద్రవంతో నిండి ఉంటుంది.
3. నేత్ర పటలం
-దీనిలో దండ కణాలు, శంకు కణాలు ఉంటాయి. అలాగే దృష్టి జ్ఞానంలేని అంధచుక్క, మంచి దృష్టి జానాన్ని కలిగిన పసుపు పచ్చ చుక్క దీనిలో ఉంటాయి. పచ్చ చుక్కనే మేక్యులా లేదా ఫోలియా అంటారు.
దండ కణాలు
-రొడాప్సిన్ లేత వర్ణద్రవ్యాన్ని కలిగి ఉండి సుమారు 125 మిలియన్లు ఉంటాయి.
-ఇవి అతితక్కువ కాంతిలో అంటే చీకటిలో వస్తువుల్ని చూడగలవు. కానీ వివిధ రంగులకు సంబంధించిన నిశితమైన తేడాలను మాత్రం గుర్తించలేవు.
శంకు కణాలు
– ఇవి దాదాపు 7 మిలియన్లుంటాయి. రంగుల్లో స్వల్ప ప్రత్యేకతల్ని కూడా చూడగలిగే లక్షణం శంకు కణాల్లో ఉంటుంది.
-ఇవి అయొడాప్సిన్ అనే వర్ణ పదార్థాన్ని కలిగి నీలం, ఎరుపు, పసుపు పచ్చ వంటి రంగుల్నే కాకుండా వాటి కలయిక వల్ల ఏర్పడే రంగులను కూడా గుర్తిస్తాయి.
-ఇవి ఫోలియా అనే భాగంలో ఉండి దృష్టి స్పష్టంగా ఉండేలా చూస్తాయి.
– కంటి లోపల ప్రతిబింబం ఏర్పడే భాగం నేత్రపటలం. దీనిలో శంకువులు అధికంగా ఉండే భాగాన్ని పచ్చ చుక్క అంటారు.
-నేత్రపటలంలో కాంతి గ్రాహకాలు లేని అంధకారంగా ఉండే ప్రాంతాన్ని అంధచుక్క అంటారు. దండ, శంకు కణాలు ఉండవు.
కన్ను పనిచేసే విధానం
-కన్ను కాంతిని సేకరించి కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి కంటిలో వెనుకభాగాన ఉండే నేత్ర పటలంపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబంలో ఎడమ, కుడి గానూ తలకిందులుగానూ ఉంటుంది. ఈ తలకిందులైన ప్రతిబింబాన్ని మెదడులోని జ్ఞానకేంద్రాల్లో సక్రమంగా ఏర్పరచడానికి మార్గం ఏర్పరుచుకుంటుంది. అందువల్ల జ్ఞానేంద్రియాల నుంచి వచ్చే సమాచారం చాలా వరకు మెదడులో సరైన దిశలోకి మార్చబడుతుంది. రెండు కళ్లు సేకరించిన రెండు దృశ్యాలను కలిపి మెదడు ఒక త్రిమితీయ పటంగా తయారుచేస్తుంది. రెండు కళ్లలో ఒక వస్తువును చూడటాన్ని బైనాక్యులర్ విజన్ అంటారు.
హ్రస్వ దృష్టి (మయోపియా)
– దీనిలో నేత్రపటలానికి ముందుగా ప్రతిబింబం ఏర్పడుతుంది. దూరంగా ఉండే వస్తువులు వీరికి సరిగా కనిపించవు.
దీర్ఘ దృష్టి/దూర దృష్టి
– దీనిలో నేత్రపటలానికి వెనుక ప్రతిబింబాలు ఏర్పడతాయి. వీరికి దగ్గరగా ఉండే వస్తువులు కనిపించవు.
కన్ను- ఆసక్తికర అంశాలు
-కనుగుడ్డులో మనకు 1/6 వంతు మాత్రమే కనిపిస్తుంది.
-కనుగుడ్డు కదల్చడానికి తోడ్పడే కండరాల సంఖ్య – 6
– ప్రతిబింబం ఏర్పడటానికి పట్టే సమయం -0.1 సెకన్లు
– కన్ను గుర్తించే రంగుల సంఖ్య -16
-కనుగుడ్లు దానం చేసే వ్యక్తుల నుంచి వారు మరణించిన తర్వాత 6-8 గంటల్లో కార్నియాను సేకరిస్తారు.
– కనురెప్పలు ఉండని జంతువులు – చేపలు, పాములు
– కన్నీటిని స్రవించే గ్రంథులు – అశ్రు గ్రంథులు
-కంటి శుక్లం (కేటరాక్ట్), ఎస్టిగ్మాటిజమ్, వర్ణాంధత్వం, కండ్ల కలక, జిరాఫ్తాల్మియా, గ్లకోమా, రేచీకటి, ట్రకోమా అనేవి సాధారణంగా కంటికి వచ్చే వ్యాధులు.
ముక్కు- నిర్మాణం
-ముక్కు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రైనాలజీ అంటారు.
– బాహ్యంగా కనిపించే ముక్కు నాసికా రంధ్రాలను కలిగి ఉంటుంది. ఇవి నాసికా కుహరంలోకి తెరుచుకుంటాయి.
-నాసికా విభాజకం నాసికా కుహరాన్ని రెండుగా విభజిస్తుంది.
-నాసికా గోడలు శ్లేష్మస్తరం, చిన్న వెంట్రుకలను కలిగి ఉంటాయి. శ్లేష్మస్తరంలో ఘ్రాణ గ్రాహకాలు ఉంటాయి.
ఘ్రాణశక్తి (Smel Sensation)
– జీవశాస్త్ర పరంగా వాసన అనేది ముక్కులో ఉండే రసాయన సంఘటనలతో ప్రారంభమవుతుంది.
-ముక్కులోని నాడీకణాలు మాత్రమే బాహ్య ప్రపంచంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి.
-ముక్కులోని గ్రాహక కణాలు ప్రేరణలను నాడీ సంకేతాలుగా మార్చి మెదడు కింది భాగంలో ఉండే ఘ్రాణ కేంద్రాలకు చేరవేస్తాయి. అక్కడ ఘ్రాణ జ్ఞాన (వాసన) ప్రక్రియ జరిగి మెదడులోకి, ఇతర భాగాలకు చేరుతుంది.
-ఇతర జ్ఞానాంగాల్లా నాడీ వ్యవస్థ, అంతఃస్రావ వ్యవస్థను సమన్వయపరిచే మెదడులోని హైపోథలామస్ ద్వారా వాసన సంకేతాలు ప్రసారం చెందవు.
-ముక్కు కుహరంలో ఉండే వెంట్రుకలు, మ్యూకస్.. దుమ్ము, సూక్ష్మక్రిములు ఇంకా అవసరం లేని ఇతర పదార్థాలను ముక్కు ద్వారా శరీరంలోకి చేరకుండా కాపాడతాయి.
-ముక్కుపైన వెంట్రుక మార్పు చెంది కొమ్ముగా మార్చుకున్న జీవి- రైనోసీరస్ (ఖడ్గమృగం)
– ఘ్రాణ గ్రాహకాలు పాములు, కుక్కలు, ఎలుకల్లో చాలా ఎక్కువగా ఉంటాయి.
– పాములు, కుక్కల్లో వాసన గ్రహించే జాకబ్సన్ నిర్మాణం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది.
-కుక్కల్లో ఘ్రాణ గ్రాహకాలు మానవుడి కన్నా 40 రెట్లు ఎక్కువ. అందువల్ల భూకంపాలను గుర్తించడంలో, నేరస్థులను పట్టుకోవడంలో ఉపయోగపడతాయి.
ప్రాక్టీస్ బిట్స్
1. కన్నీటిలో ఉండే ఎంజైమ్?
1) టైలిన్ 2) సీబం
3) లైసోజైమ్ 4) పెప్సిన్
2. తక్కువ కాంతిలో చూడటానికి తోడ్పడేవి?
1) రెటీనా 2) కోరాయిడ్
3) దండాలు 4) శంకువులు
3. వర్ణ దృశ్యాలను చూడటానికి ఉపయోగపడేవి?
1) దండాలు 2) రెటీనా
3) శంకువులు 4) కంటిపాప
4. శుక్లం వచ్చినప్పుడు కంటిలో దెబ్బతినేది ఏది?
1) కటకం 2) తారక
3) రెటీనా 4) ఐరిస్
5. దేహాన్ని సమతాస్థితిలో ఉంచే జ్ఞానేంద్రియం ఏది?
1) కన్ను 2) చెవి
3) ముక్కు 4) నాలుక
6. దేహ ఉష్ణోగ్రతను నియంత్రించేవి?
1) గుండె 2) చర్మస్రావ గ్రంథులు
3) హర్డీరియన్ గ్రంథులు
4) స్వేద గ్రంథులు
7. మయోపిక్ వ్యక్తి చూడలేనివి?
1) దూరంగా ఉండే వస్తువులు
2) సమీపంలోని వస్తువులు
3) రంగులు 4) ప్రకాశవంతమైన కాంతి
8. అయొడాప్సిన్ ఏ నిర్మాణాల్లో ఉంటుంది?
1) దండాలు 2) శంకువులు
3) స్ల్కీరా 4) కంటి కటకం
9. మానవుడి కంటిలో ఉండే కటకం ఏది?
1) పుటాకార కటకం
2) కుంభాకార కటకం
3) ద్విపుటాకార కటకం
4) బల్లపరుపు కటకం
సమాధానాలు
1. 3 2. 3 3. 3 4. 1 5. 2 6. 4 7. 1 8. 2 9. 2
ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి
రంగారెడ్డి జిల్లా
9000674747
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు