సురక్షిత మనుగడతోనే మహమ్మారి అంతం!
- మానవ జీవితంలో అనేక వ్యాధులు ప్రబలుతాయి. కొన్ని రకాల వైరస్లు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రొటోజోవన్ల ద్వారా వ్యాధులు సంక్రమిస్తాయి. వీటిని మందుల ద్వారా, టీకాలు తీసుకోవడం ద్వారా నయం చేయవచ్చు. కానీ ఇంతవరకు మందు కనుగొనలేని వ్యాధి ఎయిడ్స్. దీనికి నివారణ ఒక్కటే మార్గం..గ్రామీణ స్థాయిలో నేటికీ చాలామందికి ఎయిడ్స్‌పై అవగాహన లేకపోవడంతో ఈ మహమ్మారి బారిన పడి చనిపోతున్నారు. అందరికీ ఎయిడ్స్‌పై అవగాహన అవసరం.
హెచ్ఐవీ వైరస్ వల్ల ఎయిడ్స్ వ్యాధి కలుగుతుంది. కులం, మతం, జాతి, రంగు, వయస్సు, లింగభేదం లేకుండా అందరికీ సోకుతుంది. UNAIDS, UNICEF, WHO అప్రమత్తమై ఈ వ్యాధి నివారణకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. ఇంతటి త్రీవమైన చర్యలు చేపట్టినప్పటికి AIDS వ్యాధి, HIV విస్తరణ మార్గాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల, అజాగ్రత్తతో కూడిన జీవన విధనం వల్ల వేగంగా విస్తరిస్తూనే ఉంది.
HIV
H =హ్యూమన్- మానవుని శరీరాన్ని ఆశ్రయించేది.
I=ఇమ్యునో డెఫిసియన్సీ- వ్యాధి నిరోధకత లోపాన్ని కలిగించేది.
V= వైరస్- స్వతహాగా కొత్త వైరస్‌లను సృష్టించలేదు. శరీరంలోని రోగనిరోధక శక్తిని పూర్తిగా నశింపజేస్తుంది. దానంతట అది ప్రత్యుత్పత్తి జరపలేదు. కానీ మానవ శరీర కణాల్లో ఆశ్రయం ఏర్పరుచుకొని ఆ జీవ కణ యంత్రాంగం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది.
AIDS
A= ఎక్వయిర్డ్ (ఆర్జితమైన)- తనలో లేకున్నా ఇతరుల నుంచి సోకడం వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్.
I=ఇమ్యూన్ (రోగనిరోధకత)- మానవ శరీరంలో సహజమైన వ్యాధి నిరోధక శక్తిని నశింపజేయడం ద్వారా వైరస్ తనదైన సంక్రామ్యతను పెంచుకుంటుంది.
D=డెఫిసియన్సీ- శరీరంలోని సహజమైన వ్యాధి నిరోధకత వల్ల వచ్చే అనేక రోగాలు, అవకాశవాద అంటువ్యాధుల సమూహం.S=సిండ్రోమ్
HIV నిర్మాణం
హెచ్ఐవీ ఒక సూక్ష్మజీవి. ఇది రిట్రో విరిడే కుటుంబంలో లెంటి వైరస్ తరగతికి చెందిన RNA వైరస్. ఈ వైరస్ ఉనికిని పారిస్‌లో 1983లో ల్యూక్ మాంటగ్నాయర్, 1984లో రాబర్ట్ గాలో అమెరికాలో విడివిడిగా కనుగొన్నారు. హెచ్ఐవీ మానవ శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను బలహీనపరిచి క్రమంగా ఎయిడ్స్ వ్యాధిని కలిగిస్తుంది. ఈ వైరస్ 120 నానోమీటర్ల పరిమాణంలో ఉండే సూక్ష్మజీవి. ఇది వికోసా హైడ్రల్ ఆకారంలో ఆవృతమై ఉంటుంది. ఇది లిపిడ్ పొరతో ఆవరించి ఉంటుంది. లోపల ప్రొటీన్ల సమూహం వైరస్ పెరగుదలకు, ప్రత్యుత్పత్తికి అవసరమైన రెండు జతల ఆర్ఎన్ఏ, వైరల్ ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్, ఇంటిగ్రేస్, ప్రొటియేజ్లను కలిగి ఉంటుంది. రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్ అనే ఎంజైమ్ కారణంగా ఇది ఆకారాలను మారుస్తూ ఉంటుంది. ఆకారం (జన్యురూపం) స్థిరంగా లేకపోవడం వల్ల ఇది మందులకు లొంగడంలేదు.
వ్యాప్తి దశలు
- హెచ్ఐవీ సోకిన తర్వాత వ్యాధి లక్షణాలు వ్యక్తమయ్యే దశలు నాలుగు.హెచ్ఐవీ సోకిన దశ
- వైరస్ సోకిన తర్వాత 2-6 వారాల్లో వ్యక్తిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఫ్లూ జ్వరం వంటి లక్షణాలు రెండు రోజుల వరకు కనిపించి 2-3 వారాల్లో కనిపించకుండా పోతాయి. వ్యక్తి రక్తంలో వైరస్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాని ప్రతిరక్షకాలు కనిపించవు. ఈ విధంగా ప్రతిరక్షకాలు కనిపించని దశని విండో పీరియడ్ అంటారు. ఈ దశలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి. కాని రక్త పరీక్షలో ప్రతిరక్షకాల ఉనికి తెలియదు.
- వ్యాధి చిహ్నాలు కనిపించని HIV+ దశ (పొదిగే కాలం)
- రక్తపరీక్షలో హెచ్ఐవీ పత్రిరక్షకాల ఉనికి తెలుస్తుంది. కాని వ్యాధి చిహ్నాలు కనిపించవు. ఈదశ సుమారు 3-5 సంవత్సరాలు ఉంటుంది.
వ్యాధి చిహ్నాలు కనిపించే HIV+ దశ - ఈ దశలో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా క్షీణించడం వల్ల వ్యక్తికి దీర్ఘకాలిక జ్వరం, నీళ్ల విరేచనాలు, చర్మ వ్యాధులు సోకుతాయి. ఈ దశ సుమారు 2-3 సంవత్సరాలు ఉంటుంది.
AIDS దశ
- హెచ్ఐవీ సోకిన వ్యక్తి దాదాపు 5-10 సంవత్సరాల తర్వాత ఎయిడ్స్ దశకు చేరకుంటాడు. రోగ నిరోధక వ్యవస్థ క్షీణించడం వల్ల శరీరం వ్యాధులను తట్టుకునే శక్తిని చాలావరకు కోల్పోతుంది. టీబీ, విడువని దగ్గు, జ్వరం, నెల వరకు నీళ్ల విరేచనాలు, చర్మంపై పొక్కులు నోటి పుండ్లు, లింఫ్ గ్రంథుల వాపు మొదలైన అవకాశవాద అంటురోగాలకు తోడుగా శరీరం బరువు 10 శాతం వరకు కోల్పోతారు.
సున్నిత భాగాల్లోనే వైరస్ ప్రభావం - హెచ్ఐవీ వైరస్ చాలా సరళమైంది. సున్నితమైన నిర్మాణాలను కలిగి ఉంటుంది. ఈ వైరస్ మానవ శరీరంలోని ద్రవాల్లో, స్రావాల్లో ముఖ్యంగా రక్తం, వీర్యం, యోని ద్రవాలు, తల్లిపాలల్లో మాత్రమే జీవించగలుగుతుంది. వీటి సాంద్రత రక్తంలో అధికంగానూ, వీర్యం, యోని ద్రవాలు, తల్లిపాలల్లో క్రమంగా సాంద్రత తగ్గుతూ ఉంటుంది. లాలాజలం, కన్నీరు, స్వేదం, మల మూత్రాల్లో వైరస్ సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వైరస్ వ్యాప్తి వీటి ద్వారానే జరుగుతుంది. మానవ శరీరం బయట ఇది కేవలం 15-30 సెకన్ల కాలం మాత్రమే జీవించగలుగుతుంది.
హెచ్ఐవీ వ్యాప్తి
- వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి 4 ప్రధాన మార్గాల ద్వారా వ్యాపిస్తుంది.
- లైంగిక సంబంధాలు: హెచ్ఐవీ వ్యాప్తికి అనుకూలించే మార్గం లైంగిక ప్రక్రియ. సురక్షితం కాని లైంగిక సంబంధాలు ప్రధాన మార్గాలు. ఇవి చాలా ఎక్కువగా, తొందరగా హెచ్ఐవీ వ్యాప్తికి అనుకూలతను కలిగి ఉంటాయి. STD (Sexual transmitted disease)లు కలిగి ఉన్న వ్యక్తుల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి అధికంగా జరిగే ప్రమాదం ఉంది.
- హెచ్ఐవీ సోకిన వ్యక్తుల రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం ద్వారా 100 శాతం వ్యాప్తి చెందుతుంది.
- హెచ్ఐవీ సోకిన తల్లి నుంచి గర్భంలోని పిల్లలకు, ప్రసవం ద్వారా శిశువులకు తల్లి పాల ద్వారా సోకే ప్రమాదం ఉంది.
- హైచ్ఐవీ సోకిన వ్యక్తులకు ఉపయోగించిన సిరంజీలు, సూదులు మొదలైన పరికరాలను శస్త్రచికిత్సా సాధనాలను, దంత చిక్సితా సాధనాలను స్టెరిలైజ్ చేయకుండా ఇతరులకు ఉపయోగించడం వల్ల వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.
నోట్: కలిసి భోజనం చేయడం, ముట్టుకోవడం, కౌగిలించుకోవడం, బుగ్గలపై ముద్దుపెట్టుకోవడం, కరచాలనం, మూత్రశాలలను ఒకరి తర్వాత ఒకరు వాడుకోవడం, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల వస్తువులు, దుస్తులు వాడటం, హెచ్ఐవీ సోకిన వారికి సేవ చేయడం, దోమలు, ఇతర కీటకాల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందదు.
హెచ్ఐవీ సంక్రామ్యతను గుర్తించే పరీక్షలు
హెచ్ఐవీ సోకిన వ్యక్తిలో ఐదేళ్ల వరకు బాహ్యంగా ఎటువంటి రోగ లక్షణాలు కనిపించవు. బాధితుడిని హెచ్ఐవీ సోకిన వ్యక్తిగా గుర్తించలేం. సాధారణ వ్యక్తిలాగే కనిపిస్తాడు. కేవలం రక్త పరీక్షల ద్వారా మాత్రమే హెచ్ఐవీ ఉనికిని తెలుసుకోవచ్చు. ఈ రక్త పరీక్షలు మూడు రకాలు.
- ఎలీసా పరీక్ష (Enzyme Linked Immuno Sorbent Assay)
- వెస్టన్ బ్లాట్ పరీక్ష (Western Blot Test )
- పీసీఆర్ పరీక్ష (Polimerase Chain Reaction)
శరీరంలోకి ఇతర జీవులు ప్రవేశించినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ వాటిని ఎదుర్కోవడానికి కొన్ని ప్రొటీన్లను ఆయుధాలుగా ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రొటీన్లను ప్రతిరక్షకాలు అంటారు. ఏదైనా హానికరమైన జీవి శరీరంలో ప్రవేశించిందని చెప్పడానికి ఈ ప్రతిరక్షకాల ఉనికే పరోక్ష సాక్ష్యం. హెచ్ఐవీ ప్రతిరక్షకాల ఉనికి శరీరంలో హెచ్ఐవీ ఉనికిని సూచిస్తుంది. రక్తంలో ప్రతిరక్షకాల ఉనికి కనిపిస్తే ఆ వ్యక్తిని హెచ్ఐవీ పాజిటివ్‌గా గుర్తిస్తారు.
నివారణ చర్యలు
- నైతిక విలువలు, ఆరోగ్యకరమైన అలవాట్లను కలిగిఉండి, క్రమశిక్షణ, ప్రాకృతిక ప్రవర్తనావళిని పాటించడం ఎయిడ్స్ నివారణకు ముఖ్య సూత్రాలు. భార్యాభర్తల మధ్య సంబంధం కేవలం లైంగిక బంధాల వల్లనే కలుగుతుందని భావించకూడదు. అలా భావిస్తే అది దెబ్బతినడమే కాకుండా అసాధారణ అనుబంధాలకు దారితీస్తుంది. సంతానోత్పత్తికి లైంగిక అనుబంధం అవసరమే అయినా అందుకు తగినట్లుగా చట్టపరంగా వివాహ వయస్సు వచ్చినప్పుడే పెళ్లి చేసుకోవాలి. ఆదర్శ వివాహానికి సరిపోయిన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలి. హెచ్ఐవీ వ్యాప్తి 91 శాతం లైంగిక సంబంధాల వల్లనే విస్తరిస్తోంది కాబట్టి సరైన జాగ్రత్తలు పాటించడం అవసరం. వివాహానంతరం జీవిత భాగస్వామితో మాత్రమే లైంగిక అనుబంధం కలిగిఉండాలి.
- హెచ్ఐవీ సోకిన గర్భిణులకు సరైన వైద్య సదుపాయం కల్పించాలి.
- హెచ్ఐవీ పరీక్ష చేసిన రక్తాన్ని మాత్రమే రక్త మార్పిడికి ఉపయోగించాలి.
- డిస్పోజబుల్, స్టెరిలైజ్డ్ సిరంజీలు, సూదులనే వాడాలి.
- STDలతో బాధపడే వ్యక్తి జీవిత భాగస్వామితో పాటు సత్వర చికిత్స చేయించుకోవాలి.
- ప్రతి సంవత్సరం రాష్ట్ర జనాభాలో పురుషుల్లో 1.07 శాతం, స్త్రీల్లో 0.73 శాతం మందికి హెచ్ఐవీ సోకుతుంది. ఇది ఇతర రాష్ట్రాల కన్నా తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా ఉంది. ఈ వ్యాధికి గురవుతున్న వారిలో ముఖ్యంగా 15-49 సంవత్సరాల వయో సమూహంలో 0.09 శాతం ఉండగా గర్భిణుల్లో 1.22 శాతం ఉన్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
- ప్రతి సంవత్సరం ప్రభుత్వం ART (Anti Retrovirul Theraphy) కేంద్రాల ద్వారా హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు వైద్య సదుపాయాలు కలుగజేస్తుంది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగాలు ఎయిడ్స్ నిర్మూలన కోసం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ASHA (Accredited Social Health Activist) , రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్ మొదలైన కార్యక్రమాల ద్వారా ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు, ప్రమాదాలు, నివారణ చర్యలు తెలియజేస్తున్నారు. ఈ వ్యాధిపై మరింత అవగాహన కల్పించేందుకు ఏటా డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్ జడ్పీహెచ్ఎస్ లింగంపల్లి రంగారెడ్డి జిల్లా 9000674747
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు