Satavahanas Administrative system | శాతవాహనుల పరిపాలనా వ్యవస్థ
రాజ్య పాలనలో రాజుకు సహకరించడానికి రాజోద్యోగులు ఉండేవారు.శాతవాహనుల కాలం నాటి కొందరు ముఖ్యమైన అధికారులు. రాజామాత్యులు – రాజు సమక్షంలో పనిచేస్తూ రాజుకు సలహా ఇచ్చేవారు
మహామాత్రులు – ప్రత్యేక కార్యనిర్వహణ కోసం నియమించిన మంత్రులు
భాండాగారికుడు – వస్తు సంచయనాన్ని భద్రపరిచే అధికారి
హిరణ్యకుడు – ద్రవ్యపరమైన ఆదాయాన్ని భద్రపరిచేవాడు
మహాసేనాపతి – సైన్య వ్యవహారాధికారి
లేఖకుడు – రాజపత్రాలు, శాసనాలను రచిస్తూ రాజుకు ఆంతరంగిక కార్యదర్శిగా ఉండేవాడు.
నిబంధకారులు – రాజాజ్ఞలను, రాజ్యవ్యవహారాలను పత్రాల్లో రాసి భద్రపరిచేవారు
దూతకులు – గూఢచారులు
మహాతరక – రాజు అంగరక్షకుడు
మహామాత్రులు – బౌద్ధభిక్షువుల బాధ్యతలను చూసేవారు
శాతవాహన సామ్రాజ్యం కే్రందీకృతమైన బలమైన రాచరికం కాదు. అందులో అనేక సామంత రాజ్యాలుండేవి. సామంత రాజ్యాలు తప్ప మిగిలిన శాతవాహన సామ్రాజ్యం అనేక రాష్ర్టాలుగా విభజించి ఉండేది. రాష్ర్టాలను ఆహారాలు లేక విషయాలు అని పిలిచేవారు. ఒక్కో ఆహారంలో ఒక ప్రధాన నగరం, అనేక గ్రామాలు ఉండేవి. శాతవాహన శాసనాల్లో గోవర్ధనాహారం, సోపారాహారం, సాతవాహనాహారం అనే పేర్లు కనిపిస్తున్నాయి. ఈ ఆహారాల పాలకులను అమాత్యులనేవారు. అమాత్యులకు వంశపారంపర్యపు హక్కు లేదు. తరచుగా వారిని బదిలీ చేస్తుండేవారు.
నగరాలను నిగమాలనేవారు. వీటి పాలక సంస్థలను నిగమ సభలనేవారు. భట్టిప్రోలు శాసనంలో ఇటువంటి నిగమసభ ప్రస్తావన ఉంది. గహపతులనే కులపెద్దలు నిగమసభలో సభ్యులుగా ఉండేవారు. తెలంగాణలో కోటిలింగాల, ధూళికట్ట, ఏలేశ్వరం, కొండాపూర్, ఏపీలో ధాన్యకటకం, విజయపురి, మహారాష్ట్రలో గోవర్ధన, సోపార, ప్రతిష్ఠానపురం, కర్ణాటకలో బ్రహ్మగిరి ఆనాటి ముఖ్యమైన నగరాలు.
రాజు ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రాంతాన్ని రాజు కంభేట అనేవారు. మైసూరులో చుటు వంశీయులు, కొల్లాపూర్‌లో కుర, విజయపురిలో ఇక్ష్వాక, మహారాష్ట్రలో మహారథులు మొదలైనవారు సామంత రాజులుగా ఉండేవారు. సామంత రాజులతో శాతవాహనులకు వివాహ సంబంధాలుండేవి. అయితే శాతవాహనులు చివరికాలంలో రాజ్య రక్షణ కోసం, సరిహద్దు ప్రాంతాలను సేనాపతుల ఆధీనంలో ఉంచేవారు. వీరే క్రమంగా భూస్వాములుగా అవతరించారు.
గ్రామ పాలనా వ్యవస్థ
ఆహారం తరువాత పాలనా విభాగం గ్రామం. గ్రామ పాలనా బాధ్యతను చూసే అధికారిని గ్రామిక (గామిక) లేదా గుమిక (గౌల్మిక) అనేవారు. హీరహడగళ్లి శాసనంలో, గాథాసప్తశతిలో ఈ గుమికల ప్రస్తావన ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ గ్రామపెద్దలు ఒక్క గ్రామానికే కాక అనేక గ్రామాలపై ఆధిపత్యాన్ని కలిగి ఉండేవారు. సాధారణంగా సైనికాధికారులనే గ్రామాధికారులుగా నియమించేవారు. పన్నులను వసూలు చేయడం, శాంతిభద్రతలను కాపాడటం ఇతని ముఖ్య విధులు.
గ్రామాధికారి పదవి వంశపారంపర్యంగా సంక్రమించేది. అయితే వంశపారంపర్యంగా పదవులను పొందడంవల్ల గ్రామాధికారులు రాజకీయంగా బలపడటానికి అవకాశం ఉండేది. ఇది క్రమంగా భూస్వామ్య వ్యవస్థకు దారితీసింది.
గ్రామంలోని ప్రజలు వెట్టి చేయాల్సి వచ్చేది. స్త్రీలు చేసే రకరకాల వెట్టి గురించి వాత్సాయనుడు తన కామసూత్రలో పేర్కొన్నాడు.
సైనిక వ్యవస్థ
శాతవాహనులు తరచుగా సాగించిన దిగ్విజయ యాత్రలను బట్టి వారికి పెద్ద సైనిక బలం ఉన్నట్లు తెలుస్తుంది. సమకాలిక ఖారవేలుని హాథిగుంఫా శాసనంవల్ల ఆ కాలంలో రథ, గజ, తురగ, పదాతి దళాలతో కూడిన చతురంగ బలం ఉన్నట్లు తెలుస్తుంది.
అమరావతి శిల్పాలను బట్టి నాటి యుద్ధతంత్రం ఊహించవచ్చు. సర్వసైన్యాధ్యక్షుడిగా మహాసేనాపతి ఉండేవాడు. కానీ తరచుగా రాజులే స్వయంగా సైన్యాలను నడిపేవారు.
శాతవాహన శాసనాల్లో కటకం, స్కంధవారం అనే పదాలు ఉన్నాయి. స్కంధవారం అనేది తాత్కాలిక సైనిక శిబిరం (మిలటరీ క్యాంప్), కటకం అనేది సైనిక శిబిరం (కంటోన్మెంట్)గా తెలుస్తుంది. ప్రతి ఆహారంలో సైన్యాన్ని పోషించేవారు.
శాతవాహనుల పరిపాలనలో సైనిక వర్గాలు ప్రధాన పాత్రను వహించాయి. 9 రథాలు, 9 ఏనుగులు, 25 గుర్రాలు, 45 మంది కాల్బలాన్ని కలిగిన సైనిక పటాలాధికారిని గౌల్మికుడు (గ్రామాధికారి) అనేవారు. రాజ్య రక్షణలో కోటలకు ప్రాధాన్యం ఉండేది. పట్టణాల చుట్టూ కోటలను నిర్మించేవారు. కోటిలింగాల, ధూళికట్టలో కోటలు, బురుజులు, సింహద్వారాలు బయల్పడ్డాయి. యుద్ధ సమయాల్లో సాధారణంగా పౌరజనాన్ని బాధించేవారు కాదు. కానీ కొన్ని సమయాల్లో విజేతలు క్రూరంగా ప్రవర్తించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఖారవేలుడు పిధుండ నగరాన్ని గాడిదలచేత దున్నించి నేలమట్టం చేయడం ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.
ఆర్థిక వ్యవస్థ
రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం భూమిశిస్తు. అయితే రాజ్యంలోని వ్యవసాయ భూమి అంతటికీ రాజు సొంతదారు కాదు. రాజక్షేత్రం (రాజకంభేట) మాత్రమే ఆ రాజు సొంతం. రాజక్షేత్రానికి వెలుపల భూమిని దానం చేయాల్సి వచ్చినప్పుడు రాజు ఆ భూమిని సొంతదారు నుంచి కొని దానం చేసేవారు. దీనివల్ల రైతులకు భూమిపై హక్కు ఉండేదని తెలుస్తుంది.
పంటలో 1/6వ వంతు శిస్తు ఉండేది. పంటలో రాజు భాగాన్ని రాజ భాగం లేక దేయమేయం అని పిలిచేవారు. భూమి పన్నులేగాక రహదార్లపై సుంకాలు, గనులు, రేవులు, బాటలు, వృత్తులపై పన్ను విధించేవారు. వృత్తులపై కరుకర అనే పేరుగల పన్నును విధించేవారు. ప్రజలు పన్నులను ధన, ధాన్య రూపంలో చెల్లించేవారు. బ్రాహ్మణులు, సన్యాసులు అన్ని పన్నుల నుంచి మినహాయింపు పొందారు. బ్రాహ్మణులు, బౌద్ధభిక్షవులకు భూదానాలు చేయడం భారతదేశ చరిత్రలోనే మొదటిసారి శాతవాహనుల నుంచి ప్రారంభమైంది. ఈ విధంగా దానం చేసిన మొదటి చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి ధర్మాన్ని, న్యాయాన్ని అనుసరించే పన్నులు విధించేవాడని నాసిక్ శాసనం వల్ల తెలుస్తుంది.
వ్యవసాయం
నాటి ప్రజలకు వ్యవసాయం ప్రధాన జీవనాధారం. నాటి దాన శాసనాల్లో ఎక్కువగా గోవులు, భూములు, గ్రామాలు దానం చేసినట్లు చెప్పడంవల్ల వ్యవసాయానికి గల ప్రాధాన్యం తెలుస్తుంది.
వరి, గోధుమ, జొన్న, సజ్జ, రాగి, కంది, పెసర, నువ్వులు, ఆముదాలు, కొబ్బరి, పత్తి, చెరకు, జనుము వంటి పంటలను రైతులు పండించేవారు. కాల్వలు, ఆనకట్టలు ఉన్నప్పటికీ వ్యవసాయానికి బావులే ప్రధాన నీటి సరఫరా ఆధారాలు. కాల్వలు, బావుల నుంచి నీళ్లు తోడటానికి ఉదక యంత్రాలు వాడేవారు. దీన్నే పర్షియాచక్రం అంటారు. దీనికి బకెట్లను ఒక దండగా చక్రానికి అమర్చి జంతువులతో నడిపించేవారు. ఈ ఉదక యంత్రాలను నడిపేవారు శ్రేణిగా ఏర్పడినట్లు శాసనాలవల్ల తెలుస్తుంది. పశువుల సాయంతో వ్యవసాయం జరిగేది. పశుపోషణపట్ల ప్రజలు శ్రద్ధ వహించేవారు. మొదటి శాతకర్ణి 43,102 గోవులను, 27,000 గుర్రాలను దానం చేసినట్లు తెలుస్తుంది.
శాతవాహన చరిత్ర ఆధారాలు
శాతవాహనుల కాలానికి చెందిన 34 శాసనాలు దొరికాయి. వాటిలో నాసిక్, నానాఘాట్, కన్హేరి, కార్లేగుహ, మ్యాకదోని, అమరావతి, హాథిగుంఫా ముఖ్యమైనవి.
ఈ శాసనాల్లో మొదటిది శాతవాహన రెండో రాజైన కృష్ణుడు నాసిక్‌లో బౌద్ధ భిక్షవుల కోసం గుహను తొలిపించి దానిని వారికి దానంచేసి ఆ గుహలో శాసనం వేయించాడు.
రెండోది నాగానిక (మొదటి శాతకర్ణి భార్య) వేయించిన నానాఘాట్ శాసనం. ఇందులో శ్రీముఖుని, మొదటి శాతకర్ణి ప్రతిమలను వేయించింది. కానీ వీరిద్దరి మధ్య పరిపాలించిన కృష్ణుని ప్రతిమ వేయించలేదు. నాసిక్ శాసనం ద్వారా శ్రీముఖుని తరువాత కృష్ణుడు పరిపాలించినట్లు తెలుస్తుంది.
గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలు, ఆ కాలంనాటి దక్షిణ దేశ పరిస్థితులను తెలుపుతుంది.
రుద్రదాముని జునాగఢ్ శాసనం ద్వారా మలి శాతవాహనులు రుద్రదాముని చేతిలో ఓడి మహారాష్ట్ర ప్రాంతాన్ని కోల్పోయినట్లు తెలుస్తుంది.
శాతవాహనులు రాగి, సీసం, తగరం, వెండి లోహాలతో అనేక పరిమాణాల్లో నాణేలను ము ద్రించారు. ఈ నాణేలను కర్షాపణం, పథకం, ప్రతీక, సువర్ణం అనే పేర్లతో పిలిచేవారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు