Amendment Act | 74వ రాజ్యాంగ సవరణ చట్టం
ఒక ప్రదేశాన్ని నగరంగా గుర్తించాలంటే..ఆ ప్రాంత జనాభా 5000లకు తక్కువ కాకుండా ఉండాలి. ప్రదేశ జనసాంద్రత చ.కి.మీ.కు 400 కానీ, అంతకంటే ఎక్కువగాని ఉండాలి. 75 శాతం మంది పురుషులు వ్యవసాయేతర వృత్తుల్లో ఉండాలి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతమై ఉండాలి.
-ఇది 1993 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
-రాజీవ్గాంధీ ప్రభుత్వం పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించే నగరపాలక బిల్లును 1989, ఆగస్టులో 65వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టింది.
-65వ సవరణ బిల్లు లోక్సభ పరిశీలనలో ఉండగానే సభ రద్దుతో బిల్లు కూడా రద్దయింది.
-1990లో వీపీ సింగ్ ప్రభుత్వం ఈ బిల్లును సవరించి పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని భావించినప్పటికీ ప్రభుత్వం పడిపోవడంతో సాధ్యంకాలేదు.
-పీవీ నర్సింహారావు ప్రభుత్వం 65వ సవరణ బిల్లును పునరుద్ధరించి అనేక మార్పులతో 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పార్లమెంటులో 1991, సెప్టెంబర్ 16న లోక్సభలో ప్రవేశపెట్టింది.1992లో 74వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది.74వ సవరణ ద్వారా రాజ్యాంగంలో 12వ షెడ్యూల్ను చేర్చారు.
-దేశంలోని సగానికంటే ఎక్కువ రాష్ర్టాలు బిల్లును ఆమోదించాయి. రాష్ర్టపతి ఆమోదించిన తర్వాత 1993, జూన్ 1న ఈ చట్టం అమల్లోకి వచ్చింది.
-ఈ సవరణ చట్టం రాజ్యాంగంలో 9(ఎ) అనే నూతన భాగాన్ని ఏర్పాటు చేసి 243(పి) నుంచి 243(జడ్జి) వరకు మొత్తం 18 నిబంధనలు నగరపాలక సంస్థలను గురించి పేర్కొంటాయి.
ప్రకరణ 243(పి)
1. పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, మెట్రోపాలిటన్ ప్రాంతం అనే పదాలకు సంబంధించి సరైన అర్థ వివరణ కాని లేదా నిర్వచనం, అందుకు సంబంధించిన నోటిఫికేషన్ను గవర్నర్ జారీ చేస్తారు.
ఎ) కమిటీ అంటే 243(ఎస్) ప్రకరణ ప్రకారం ఏర్పాటైనది.
బి) జిల్లా అంటే రాష్ట్రంలోని జిల్లా అని అర్థం.
సి) మెట్రోపాలిటన్ అంటే 10 లక్షలు లేక అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతం.
డి) మున్సిపల్ ప్రాంతం అంటే గవర్నర్ ద్వారా నోటిఫై అయిన మున్సిపాలిటీ ప్రాదేశిక ప్రాంతం.
ఇ) మున్సిపాలిటీ అంటే 243(క్యూ) ప్రకరణ ప్రకారం ఏర్పాటైన స్థానిక స్వపరిపాలనా సంస్థ
ఎఫ్) పంచాయతీ అంటే 243(బి) ప్రకరణ ప్రకారం పంచాయతీగా ఏర్పాటైన ప్రాంతం.
జి) జనాభా అంటే జనాభా గణన జరిగి ప్రచురించిన జాబితాలోని జనాభా అని అర్థం.
243(క్యూ): మున్సిపాలిటీల ఏర్పాటు
1. ఈ చట్టం 3 రకాల పట్టణ ప్రభుత్వాలకు వీలు కల్పిస్తున్నది. (జనాభా 5000లకు తక్కువ కారాదు, 20,000లకు మించకూడదు)
2. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణప్రాంతంగా పరివర్తన చెందుతున్న ప్రాంతాన్ని నగర పంచాయతీగా గుర్తిస్తారు.
3. చిన్నచిన్న పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కౌన్సిల్ను ఏర్పాటు చేస్తారు.
4. పెద్ద పట్టణాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి.
5. ఒక ప్రాంతం పరివర్తన చెందుతున్న ప్రాంతం అని, చిన్న పట్టణం, పెద్ద పట్టణం గురించి గవర్నర్ సరైన అర్థ విరవణ ఇస్తారు.
243(ఆర్): మున్సిపాలిటీల నిర్మాణం
1. మున్సిపాలిటీల్లో, అన్ని స్థాయిల సభ్యులు పౌరుల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నిక కావాలి.
2. మున్సిపాలిటీల్లోని సభ్యుల కూర్పు, అధ్యక్షుల ఎన్నికల విధానానికి సంబంధించి రాష్ర్ట శాసన నిర్మాణ శాఖ తగిన చట్టాలను రూపొందిస్తుంది.
3. నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో అధ్యక్షులు రాష్ర్ట శాసన నిర్మాణ శాఖ నిర్ణయించిన మేరకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎన్నికవుతారు.
4. మున్సిపాలిటీల్లోని పరిపాలన నిర్వహణలో అనుభవం ఉన్నవారు ప్రభుత్వం ద్వారా నామినేట్ అవుతారు. (వీరికి ఓటుహక్కు ఉండదు)
5. సంబంధిత మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏరియాకు ప్రాతినిథ్యం వహించే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు హోదారీత్యా సభ్యులుగా కొనసాగుతారు.
243(ఎస్): వార్డు కమిటీల ఏర్పాటు
1. 3 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వార్డులను కలిపి వార్డు కమిటీగా ఏర్పాటు చేయవచ్చు.
2. వార్డు కమిటీలకు సంబంధించి శాసన నిర్మాణశాఖ చట్టాలను రూపొందించవచ్చు.
3. ఒక వార్డుకు వార్డు కమిటీ ఏర్పడినప్పుడు ఆ వార్డు ప్రతినిధి ఆ కమిటీకి అధ్యక్షుడిగా నియమితులు కావాలి.
4. రెండు లేదా అంతకంటే ఎక్కువ వార్డులకు వార్డు కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఆ వార్డు ప్రతినిధులు తమలోని ఒకరిని వార్డు కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకుంటారు.
5. కార్పొరేషన్లలో కనీసం 50 వార్డులకు తక్కువ కారాదు. గరిష్టంగా 100కి మించరాదు.
ప్రకరణ 243(టి): సీట్ల రిజర్వేషన్
1. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలి.
2. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన స్థానాల్లో ఆ కేటగిరీ మహిళలకే 1/3వ వంతు స్థానాలను రిజర్వ్ చేయాలి.
3. మొత్తం స్థానాల్లో కనీసం 1/3వ వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలి.
4. మున్సిపాలిటీ అధ్యక్షుల్లో కొన్నింటిని ఎస్సీ, ఎస్టీ మహిళలకు కేటాయించే విధంగా రాష్ర్ట శాసన నిర్మాణశాఖ చట్టాన్ని రూపొందించాలి.
5. పై రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో కేటాయించాలి.
6. బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడానికి సంబంధించి, ఆ రాష్ర్ట శాసన నిర్మాణశాఖ అధికారాన్ని కలిగి ఉంటుంది.
-తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఇటీవల జరగిన మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం స్థానాలు మహిళలకు రిజర్వు చేశారు.
-దేశంలో ప్రస్తుతం 15 రాష్ర్టాల్లో మహిళలకు 50 శాతం స్థానాలు రిజర్వు చేశారు.
ప్రకరణ 243(యు): కాలపరిమితి
1. ఈ చట్టాన్ని అనుసరించి అన్ని స్థాయిల్లోనూ సభ్యులు, అధ్యక్షుల కాలపరిమితి ఐదేండ్లు.
2. ఒకవేళ ఐదేండ్లలోపు ఒక వ్యవస్థ రద్దయితే 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి.
3. ఒకవేళ 6 నెలలే పదవీకాలం ఉంటే ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు.
ప్రకరణ 243(వి): సభ్యత్వానికి అనర్హతలు
1. పంచాయతీరాజ్ వ్యవస్థలోని అన్ని స్థాయిల్లోనూ అధ్యక్షులు, సభ్యులు వారి అర్హతలు, అనర్హతలను నిర్ణయించే అధికారం రాష్ర్ట శాసన నిర్మాణ శాఖకు ఉంటుంది.
2. పార్లమెంటు, శాసనసభలకు పోటీచేచే అభ్యర్థులకు వర్తించే అర్హతలు, అనర్హతలు స్థానిక సంస్థలకు వర్తిస్తాయి.
3. స్థానిక సంస్థలకు పోటీచేయడానికి 21 ఏండ్లు ఉండాలి.
4. ఆ సంస్థ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి.
5. 1995 నుంచి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నవారు పోటీకి అనర్హులు.
243(డబ్ల్యూ):అధికారాలు, హక్కులు, బాధ్యతలు
1 12వ షెడ్యూల్లో పట్టణ ప్రభుత్వాలకు సంబంధించిన 18 అధికారాలు, విధుల గురించి పేర్కొన్నారు. మొత్తం 18 అంశాల్లో 11 అంశాలు తప్పనిసరికాగా, 7 అంశాలు ఐచ్ఛికాంశాలు అవి.. 1. పట్టణ ప్రణాళిక 2. భూవాడకం నియంత్రణ, భవన నిర్మాణం 3. సామాజిక ఆర్థిక ప్రణాళికలు 4. రోడ్లు వంతెనలు 5. నీటి సరఫరా 6. ప్రజారోగ్యం-పారిశుద్ధ్యం 7. అగ్నిమాపక సేవలు 8. పట్టణ అడవులు, పర్యావరణ సంరక్షణలు 9. బలహీనవర్గాల సంక్షేమం (శారీరక, మానసిక వికలాంగుల సంక్షేమం) 10. మురికివాడల అభివృద్ధి 11. పట్టణ పేదరిక నిర్మూలన 12. హక్కులు, ఆటస్థలాల వంటి పట్టణ సౌకర్యాల కల్పన 13. విద్యా సాంస్కృతిక అభివృద్ధి 14. శ్మశాన వాటికలు 15. కబేళాలపై నియంత్రణ 16. జనన, మరణాల రిజిస్ట్రేషన్ 17. ప్రజాసౌకర్యాలు 18. జంతువుల సంరక్షణ.
ప్రకరణ 243(ఎక్స్): పన్నులు – నిధులు
1. కొన్ని అంశాలకు సంబంధించి పన్నులు విధించి వసూలు చేసే అధికారాన్ని శాసన నిర్మాణ శాఖ మున్సిపాలిటీలకు అందిస్తుంది.
2. రాష్ర్టప్రభుత్వం విధించి వసూలు చేసిన కొన్ని పన్నులను మున్సిపాలిటీలకు జమ చేయవచ్చు.
3. రాష్ర్ట ప్రభుత్వం అందించే కొన్ని సహాయక గ్రాంటులు
4. మున్సిపాలిటీలకు సంబంధించి నిధులను నిల్వచేసేందుకు, ఆ సొమ్మును ఖర్చు చేసేందుకు ఒక ప్రత్యేక నిధిని రాష్ర్టశాసన నిర్మాణశాఖ ఏర్పాటు చేయవచ్చు.
మున్సిపాలిటీల ఆదాయమార్గాలు
-మున్సిపల్ సంస్థ తమ మొత్తం ఆదాయంలో 2/3వ వంతు స్థానిక పన్నుల ద్వారా పొందుతాయి. అవి.. ఆక్ట్రాయ్, ఆస్తి పన్ను, వృత్తి పన్ను, వినోదపు పన్ను, మార్కెట్ పన్ను, నీటి పన్ను, ప్రకటనలపై పన్ను, టోల్ ట్యాక్స్ మొదలైనవి.
-దేశంలో మొత్తం స్థానిక సంస్థల పన్ను ఆదాయం 1/4వ వంతు ఆక్ట్రాయ్ ద్వారా సమకూరుతుంది.
-సరిహద్దులను మూసివేసి చెక్పోస్టులను ఏర్పాటు చేసి ఈ పన్నును వసూలు చేస్తాయి.
ఒక ప్రదేశాన్ని నగరంగా గుర్తించాలంటే..
1.ఆ ప్రాంత జనాభా 5000లకు తక్కువ కాకుండా ఉండాలి.
2. ప్రదేశ జనసాంద్రత చ.కి.మీ.కు 400 కానీ, అంతకంటే ఎక్కువగాని ఉండాలి.
3. 75 శాతం మంది పురుషులు వ్యవసాయేతర వృత్తుల్లో ఉండాలి.
4. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతమై ఉండాలి.
5. సాయుధ దళాలు నివాసం ఉండే ఒక కంటోన్మెంట్ ప్రాంతమైనా అయి ఉండాలి.
6. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని నగర జనాభా 37.71 కోట్లు. అంటే ఇది దేశ జనాభాలో 31.16 శాతానికి సమానం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు