కలకత్తా చీకటి గది ఉదంతం ఎప్పుడు జరిగింది?
బెంగాల్ ఆక్రమణ
- మొఘల్ సామ్రాజ్యంలో అత్యంత ఐశ్వర్యమైనది, బ్రిటిష్ వారు ఆక్రమించిన తొలి రాష్ట్రం బెంగాల్. బెంగాల్లో ఫ్రెంచ్ వారి ప్రధాన స్థావరం చంద్రానగర్ కాగా బ్రిటిష్ వారి ప్రధాన స్థావరం కలకత్తా.
ముర్షిద్ కులీఖాన్
- క్రీ.శ. 1700లో ఔరంగజేబు కాలంలో ముర్షిద్ కులీఖాన్ బెంగాల్ ప్రాంతానికి గవర్నర్‌గా నియమితులయ్యాడు. 1720 నుంచి స్వతంత్రంగా పాలించినప్పటికీ, నామమాత్రంగా మొఘలుల ఆధిపత్యాన్ని అంగీకరించాడు. ఇతడు ఢాకాను రాజధానిగా చేసుకొని పాలన కొనసాగించాడు. ఇతడు ముర్షీదాబాద్ పట్టణాన్ని నిర్మించాడు. ఇతడికి ఆధునిక స్వాతంత్య్ర బెంగాల్ రాజ్య స్థాపకుడు అని పేరు.
అలీవర్ధిఖాన్ (1741-56)
- ఇతడు ముర్షిద్ కులీఖాన్ మనుమడు సర్ఫరాజ్ ఖాన్‌ను వధించి బెంగాల్ పాలకునిగా వ్యవహరించాడు. దక్షిణ భారతదేశంలో ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరుగుతున్న సమయంలో బెంగాల్ పాలకుడిగా ఉన్నాడు. ఇతడు 1756లో మరణించాడు.
సిరాజుద్దౌలా (1756-57)
- అలీవర్ధిఖాన్ మరణంతో అతడి మనుమడైన సిరాజుద్దౌలా బెంగాల్ సింహాసనం అధిష్ఠించాడు. ఇతడు బెంగాల్లో బ్రిటిష్ వారి ఉనికి సహించలేదు. ఇతడి పట్టాభిషేకాన్ని ఆంగ్లేయులు బహిష్కరించారు.
- సిరాజుద్దౌలా కలకత్తా పరిసర ప్రాంతాల్లో ఆంగ్ల, ఫ్రెంచ్ కంపెనీలు తమ వర్తక స్థావరాల రక్షణ కోసం కోటల నిర్మాణం చేపట్టరాదని ఆజ్ఞాపించాడు. సిరాజుద్దౌలా ఆజ్ఞానుసారం ఫ్రెంచ్ కంపెనీ కోట నిర్మాణాలు నిలిపివేసింది. కానీ ఇతడి ఆజ్ఞను ధిక్కరించి ఆంగ్లేయులు కోట నిర్మాణాలు కొనసాగించారు. దీంతో ఆగ్రహించిన సిరాజుద్దౌలా 1756లో ఆంగ్లేయుల వర్తక స్థావరాలైన కాశీంబజార్, కలకత్తాను ఆక్రమించాడు. దీంతో ఆంగ్లేయులు సిరాజుద్దౌలా సేనాని మీర్ జాఫర్‌ను చేరదీసి సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రోత్సహించారు. అంతేకాకుండా సిరాజుద్దౌలా శత్రువు అమీన్‌చంద్ అనే వ్యాపారికి ఫోర్ట్ విలియంలో ఆశ్రయమిచ్చారు.
చీకటి గది ఉదంతం
- ఇది 1756, జూన్ 20లో జరిగింది.
కలకత్తాను ఆక్రమించిన సిరాజుద్దౌలా అక్కడ పట్టుబడిన 146 మంది బ్రిటిష్
సైనికులను ఒక చీకటి గదిలో బంధించగా, అందులో 123 మంది మరణించారు. 23 మంది మాత్రమే బతికినట్లు హాల్వెల్ అనే బ్రిటిష్ సైనికుడు వెల్లడించాడు. దీన్నే
‘కలకత్తా చీకటి గది’ ఉదంతం అంటారు. - సిరాజుద్దౌలా కలకత్తా ఆక్రమణ తర్వాత కలకత్తాకు ‘అలీనగర్’ అని పేరుపెట్టి కలకత్తాకు మాణిక్‌చంద్ అనే పాలకుడిని నియమించాడు. ఆంగ్లేయ సేనాని రాబర్ట్ ైక్లెవ్ మాణిక్‌చంద్‌కు లంచం ఇచ్చి కలకత్తాను ఆక్రమించాడు. 1757లో సిరాజుద్దౌలా బ్రిటిష్ వారితో అలీనగర్ సంధి చేసుకున్నాడు. అలీనగర్ సంధిని ఉల్లంఘిస్తూ రాబర్ట్ ైక్లెవ్ ఫ్రెంచ్ వర్తక స్థావరం చంద్రానాగోర్ను ముట్టడించాడు. ఈ ముట్టడిలో ఓడిపోయిన ఫ్రెంచ్ వారికి సిరాజుద్దౌలా ఆశ్రయం ఇచ్చాడు.
ప్లాసీ యుద్ధం (1757, జూన్ 23)
- భారతదేశంలో బ్రిటిష్ అధికారానికి పునాది వేసిన యుద్ధం ఇది. కలకత్తా పునరాక్రమణ తర్వాత ైక్లెవ్ బెంగాల్లో ఆంగ్లేయుల స్థితిని బలోపేతం చేశాడు. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న సిరాజుద్దౌలాను తొలగించి అతని స్థానంలో ఒక కీలుబొమ్మను నిలబెట్టడానికి ైక్లెవ్ కుట్రపన్నాడు. బెంగాల్ నవాబ్ పదవిని ఆశిస్తున్న సిరాజ్ సేనాని మీర్జాఫర్తో, సిరాజ్ ఇతర శత్రువులతో కుమ్మక్కయ్యాడు. కుట్రలో కలకత్తాలో సిరాజ్ ప్రతినిధి మాణిక్‌చంద్, వర్తక ప్రముఖుడు అమీన్‌చంద్, బ్యాంకర్ జగత్‌సేఠ్, భూస్వామి రాయ్‌దుర్లభ్, సిరాజ్ సేనానుల్లో ఒకడైన ఖడింఖాన్లు భాగస్వాములు. ైక్లెవ్కు, కుట్రదారులకు మధ్య రహస్య ఒప్పందాన్ని కుదిర్చాడు అమీన్‌చంద్. అందుకు అమీన్చంద్కు 30 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది.
- రహస్య ఒప్పందాలు కుదిరాక ైక్లెవ్ సిరాజ్ అంగీకరించడానికి అవకాశమే లేని ప్రతిపాదనలు పెట్టాడు. సిరాజ్ వ్యతిరేకించటంతో యుద్ధం తప్పనిసరి అయింది. బెంగాల్ రాజధాని ముర్షీదాబాద్‌కు 30 కి.మీ. దూరంలో ఉన్న ప్లాసీ అనే చోట 1757, జూన్ 23న ఒక దొంగ యుద్ధం జరిగింది. కుట్రదారులైన మీర్ జాఫర్ రాయ్దుర్లభ్లు నాయకత్వం వహించిన సిరాజ్ సైన్యం అసలు యుద్ధంలోనే పాల్గొనలేదు. 29 మంది బ్రిటిష్ సైనికులు, దాదాపు 500 మంది బెంగాల్ సైనికులు మరణించారు. సిరాజుద్దౌలాను బంధించి వధించారు.
- కుట్రను అనుసరించి మీర్ జాఫర్ బెంగాల్ నవాబు అయ్యాడు. ప్రతిఫలంగా 24 పరగణాల భూమి కంపెనీకి లభించింది. ైక్లెవ్ 2,34,000 పౌన్లు, వాట్సన్ లక్ష పౌన్లు లంచం పొందారు. ఒప్పందం కుదిర్చిన అమీన్చంద్ను ైక్లెవ్ మోసం చేయడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. పన్నులు చెల్లించనవసరం లేకుండానే కంపెనీ వర్తకులు వ్యాపారం చేసుకునే అనుమతి పొందారు.
- ప్లాసీ యుద్ధానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. యుద్ధంలో స్థానిక పాలకుల బలహీనత, అసమర్థత బట్టబయలయ్యాయి. ప్లాసీ మొఘల్ సుబేదార్‌ను ఓడించిన కంపెనీ బెంగాల్‌పై ఆధిపత్యాన్ని, తద్వారా భారతదేశంపై సార్వభౌమత్వాన్ని సాధించింది. అందుకు అపారమైన బెంగాల్ సంపద వారికి ఉపయోగపడింది. 1758లో ైక్లెవ్ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యాడు. ైక్లెవ్ బెంగాల్లో డచ్ వారిని అంతమొందించాడు. 1760లో స్వదేశానికి వెళ్లిన ైక్లెవ్కు అపూర్వ సత్కారం లభించింది.
బక్సార్ యుద్ధం (1764, అక్టోబర్ 22)
- కంపెనీ మీర్జాఫర్ను, బెంగాల్‌ను దోచుకోవడం మానలేదు. కంపెనీ అధికారులకు ముట్టజెప్పిన బహుమతుల వల్ల బెంగాల్ ఖజానా నిండుకుంది. బొంబాయి, మద్రాస్ ఖర్చులు కూడా బెంగాలే భరించాల్సి వచ్చింది. కంపెనీ గొంతెమ్మ కోరికలను మీర్జాఫర్ తీర్చలేకపోయాడు. వాన్‌సిటార్ట్ బెంగాల్ గవర్నర్ కావడంతో మీర్జాఫర్ను తొలగించి అతని అల్లుడు మీర్ ఖాసింను నవాబును చేశారు. మీర్ ఖాసిం బర్దాన్, మిడ్నపూర్, చిట్టగాంగ్ జిల్లాలను కంపెనీకి అప్పగించాడు. 29 లక్షల రూపాయలను కంపెనీ అధికారులకు ముట్టజెప్పాడు.
- మీర్ ఖాసిం సమర్థుడు. పరిపాలనలో కంపెనీ జోక్యాన్ని సహించలేదు. పరిపాలనకు అవసరమైన ఆర్థిక, సైనిక వనరులను సమకూర్చుకోవడానికి ప్రయత్నించాడు. రెవెన్యూ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించదలిచాడు. ఆధునిక పద్ధతుల్లో సైన్యాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేశాడు. కంపెనీ వర్తకులు సాగిస్తున్న సొంత వ్యాపారాన్ని కొనసాగనివ్వలేదు. భారతీయ వర్తకులకు నష్టాన్ని తెస్తూ, కంపెనీ వర్తకులు అనుభవిస్తున్న ప్రత్యేక హక్కులను రద్దుచేశాడు. ఫలితంగా 1763లో మీర్ ఖాసింను తొలగించి మీర్జాఫర్ను మళ్లీ బెంగాల్ నవాబును చేశారు. ఎన్నో బహుమతులు కంపెనీ అధికారులకు దక్కాయి.
- ఉద్వాసనకు గురైన మీర్ ఖాసిం.. అయోధ్య నవాబు షుజా ఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలంల సహాయం అర్థించాడు. ఈ కూటమిని హెక్టార్ మన్రో నాయకత్వంలోని కంపెనీ సైన్యం బక్సార్ యుద్ధంలో ఓడించింది. మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలం బ్రిటిష్ వారితో అలహాబాద్ సంధి చేసుకున్నాడు. బక్సార్ యుద్ధ విజయంతో భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన స్థిరీకరించబడింది. 1765లో రాబర్ట్ ైక్లెవ్ బెంగాల్‌కు రెండోసారి గవర్నర్‌గా నియమితులైన తరువాత రెండో షా ఆలంతో అలహాబాద్ సంధి చేసుకున్నాడు.
- ఈ సంధి ప్రకారం.. అవధ్ నవాబుగా షుజా ఉద్దౌలా కొనసాగడానికి బ్రిటిష్ వారికి 50 లక్షల రూపాయలు ఇచ్చాడు. మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలం ఒరిస్సా, బెంగాల్, బీహార్లలో దివానీ హక్కులను ఆంగ్లేయులకు ధారాదత్తం చేశాడు. ద్వంద్వ పాలన ప్రకారం దివానీ పాలన (రెవెన్యూ) అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ వద్ద ఉంచుకొని, నిజామత్ (శాంతిభద్రతలు) అధికారం బెంగాల్ నవాబుకు ఇచ్చారు. బక్సార్ యుద్ధానంతరం బెంగాల్ నవాబుగా నజీమ్ ఉద్దౌలా నియమితులయ్యాడు. మూడో కర్ణాటక యుద్ధంలో ఉత్తర సర్కారులపై బ్రిటిష్ వారు సాధించుకున్న అధికారాన్ని మొఘల్ చక్రవర్తి గుర్తించాడు.
- బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ, పరిపాలనలో నవాబుకు సహకరించడానికి ఉపసుబేదార్ను నియమించే అధికారం కంపెనీకే ఉండటంతో బెంగాల్‌పై పూర్తి అధికారం కంపెనీకే సిద్ధించినట్లయింది. బెంగాల్ నవాబుకు అతని అధికారులకు బెంగాల్‌ను పరిపాలన చేసే బాధ్యత ఉంది. కానీ అందుకు కావల్సిన అధికారాలు లేవు. పన్నులు వసూలు చేసే అధికారం ఉన్నా కంపెనీకి పరిపాలన పట్ల బాధ్యత లేదు. ఫలితంగా ప్రజాసంక్షేమం ఘోరంగా నిర్లక్ష్యానికి గురైంది. 1770లో సంభవించిన క్షామం బెంగాల్లో లక్షలాది మందిని తుడిచిపెట్టింది. కంపెనీ వర్తకుల్లో అవినీతి ప్రబలింది. వారు సొంత వ్యాపారానికి పూనుకోవడంతో కంపెనీ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగింది. వర్తకుల జేబులు నిండాయి. కానీ ఈస్టిండియా కంపెనీ ఖజానా ఖాళీ అయింది.
- ఈ పరిస్థితుల్లో వ్యవస్తను చక్కబరచడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1773లో రెగ్యులేటింగ్ చట్టం చేసింది. బెంగాల్‌కు ఒక గవర్నర్ జనరల్, మద్రాస్, బొంబాయిలకు ఒక్కో గవర్నర్ నియమితులయ్యారు. మద్రాస్, బొంబాయి గవర్నర్లు బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనంలోకి వచ్చారు. దేశంలో కంపెనీ అధికారం, పరిపాలన బెంగాల్ కేంద్రంగా విస్తరించడం ఆరంభమయ్యాయి. 1773లో బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్‌గా వారెన్ హేస్టింగ్స్ నియమితులయ్యాడు. వారెన్ హేస్టింగ్స్ ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దుచేసి బెంగాల్‌ను పూర్తిగా స్వాధీనపర్చుకున్నాడు. మహారాష్ర్టులతో, మైసూరు పాలకుతో, రోహిల్లాలతో యుద్ధాలు చేసి కంపెనీ రాజ్యాన్ని విస్తృతపరిచాడు. పరిపాలనా వ్యవస్థలో అనేక మార్పులు ప్రవేశపెట్టాడు.
ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు
- మైసూర్ రాజ్య పాలకుడు యదురాయ వడయార్. విజయనగర సామ్రాజ్యంలో భాగం గా ఉన్న మైసూర్ రాజ్యం తళ్లికోట యుద్ధం (1565) తరువాత విజయనగర సామ్రాజ్యం బలహీనపడటంతో స్వాతంత్య్రం ప్రకటించుకుంది.
- కృష్ణరాజ వడయార్-3కు ఆధునిక స్వతంత్ర మైసూర్ రాజ్య స్థాపకుడిగా పేరు. మైసూర్ రాజ్యంలో వడయార్ల వంశ పాలనలో దేవరాజు సేనాధిపతిగా, నంజరాజు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించేవారు. కృష్ణరాజ వడయార్ నామమాత్రపు పాలకుడిగా ఉండేవాడు. అసలు అధికారం మాత్రం నంజరాజు, దేవరాజులే చెలాయించేవారు. కానీ 1761లో హైదర్ అలీ అనే అధికారి వడయార్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మైసూర్ రాష్ర్టాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
హైదర్ అలీ (1761-82)
- ఇతను ఆధునిక భారతదేశచరిత్రలో మైసూరుకు విశేష పేరుప్రఖ్యాతలు తెచ్చిన పాలకుడు. ఇతడు ప్రథమంగా మైసూర్ రాజ్యంలో ఒక సైనికుడిగా చేశాడు. తర్వాత ఇతని ప్రతిభతో దిండిగల్ ఫౌజ్దార్గా పదోన్నతి పొందాడు. ఇతను 1759లో మరాఠా దండయాత్రలను తిప్పికొట్టి ప్రతిఫలంగా మైసూర్ రాజ్యానికి సర్వసేనానిగా నియమితులయ్యాడు. 1761లో నంజరాజును హతమార్చి, కృష్ణరాజ వడయార్‌ను తొలగించి మైసూర్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఫ్రెంచ్ సహాయంతో దిండిగల్‌లో ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని స్థాపించి, ఫ్రెంచ్ వారి చేత మైసూర్ సైన్యానికి శిక్షణ ఇప్పించాడు.
- ఇతను తన రాజ్యాన్ని దక్షిణాన ఆర్కాట్ వరకు, ఉత్తరాన చంద్రగిరి వరకు విస్తరింపజేశాడు. హైదర్ అలీకి వ్యతిరేకంగా హైదరాబాద్ నిజాం సలాబత్ జంగ్‌తో బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ సంధి కుదుర్చుకున్నాడు. దీంతో ఆగ్రహించిన హైదర్ అలీ బ్రిటిష్ వారితో ఆంగ్లో మైసూర్ యుద్ధాల్లో తలపడ్డాడు.
మాదిరి ప్రశ్నలు
1. భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ ప్రత్యక్ష పాలన ఏర్పడిన తొలి రాష్ట్రం?
1) మైసూర్ 2) బెంగాల్
3) హైదరాబాద్ 4) అవధ్
2. ఆధునిక స్వతంత్ర బెంగాల్ రాజ్యస్థాపకుడు అని ఎవరికి పేరు?
1) ముర్షిద్ కులీఖాన్
1) అలీవర్ధిఖాన్ 3) సిరాజుద్దౌలా
4) మీర్ ఖాసిం
3. 1764లో జరిగిన బక్సార్ యుద్ధంలో మీర్ ఖాసింకు మద్దతుగా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడింది?
1) షుజా ఉద్దౌలా 2) రెండో షా ఆలం
3) సిరాజుద్దౌలా 4) 1, 2
4. కింది వాటిలో సరైనవి?
1) 1757, జూన్ 23న బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాకు కంపెనీకి మధ్య ప్లాసీ యుద్ధం జరిగింది
2) ఈ యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి హెక్టార్ మన్రో నాయకత్వం వహించాడు
3) 1 4) 1, 2
5. ప్లాసీ యుద్ధానంతరం బెంగాల్ నవాబుగా ఆంగ్లేయులు నియమించినది?
1) మీర్ ఖాసిం 2) మీర్ జాఫర్
3) అమాన్ చంద్ 4) రాయ్దుర్లభ
6. ఫ్రెంచ్ వారి సహాయంతో దిండిగల్‌లో ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని స్థాపించినది?
1) హైదర్ అలీ 2) టిప్పుసుల్తాన్
3) కృష్ణరాజ వడయార్
4) అలీవర్ధిఖాన్
సమాధానాలు
1-2, 2-1, 3-4, 4-3,
5-2, 6-1,
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,కోరుట్ల
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు